ప్రత్యేక హోదా

by 10:32 PM 0 comments

తురుష్కుల దండయాత్రలకి పూర్వం భారత దేశం సంపద పరంగా
, సంప్రదాయాల పరంగా, కుటుంబ వ్యవస్థ పరంగా, రాజ్యాల పరంగా ఎంతో బలంగా ఉండేది.దండయాత్రలకి వచ్చిన తురుష్కులకి ఒక చిన్న రాజుని ఓడించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నించినా బలం తో వీళ్ళని ఓడించడం కష్టమని తెల్సుకున్న వీళ్ళు, బలహీనతల మీద దృష్టి సారించారు.దేశమంతా హిందువులున్నా మా దేవుడు గొప్పోడంటే మా దేవుడు గొప్పోడని కొట్టుకునే అలవాటు ఉందని కనుక్కున్నారు. తోటి రాజులకి పడదని తెల్సుకున్నారు.ఒక్కో రాజు దగ్గరకి వెళ్లి వాళ్ళ సాయం తో తోటి రాజుల్ని ఓడించారు. దానికి ఈ రాజుల ఈర్ష్య సహాయపడింది. ఈ రాజులేమి రాజులుగా ఊరేగలేదు, ఆ తురుష్కుల సామంతులై కప్పం కట్టి ఊడిగం చేసారు.బ్రిటిషు వారి కాలంలో కూడా ఇదే తంతు కొనసాగింది. “మనం నాశనం అయిపోయిన పర్లేదు కాని అవతల వాడు మాత్రం బాగుపడకూడదు” ఈ ఆలోచన రాజులను సామంతులను చేస్తే జనాల జీవితాల్ని హీనంగా చేసింది.భారత దేశంలో భారతీయులు ఉండరని నానుడి. రాష్ట్రాల వారిగా,ప్రాంతాల వారిగా, కులమతాల వారిగా విడిపోయి బ్రతుకుతున్నారు. నేను భారతీయుడిని అని దేశం దాటితే గాని గుర్తురాని భారతీయులం మనం.అందులో ఉత్తర భారతం, దక్షిణ భారతం ఇలా విడదీయబడ్డ దేశం. అందులో ఈ తేడా రాజకీయాల్లో గట్టిగా కనపడుతుంది. దక్షిణాది నుంచి వచ్చి పెద్ద పదవుల్ని అలంకరించిన వారిని వేళ్ళ మీద చూడచ్చు. ఇది చిన్న చూపా, అవకాశం లేదా? దక్షిణాది వారు ఉపయోగించుకోవడానికి మాత్రమే పనికి వస్తారా?అసలు విషయానికి వస్తాను. బిజెపి అప్రతిహతంగా సాగుతున్న ఈ విజయ యాత్ర ను చూసి నేను కూడా సంతోషపడ్డాను,దేశం ఒక గాడిన పడుతుందని. కానీ పన్ను లు కట్టే వాళ్ళని చెరుకు మిషన్ లో పెట్టి పిండినట్టు పిండి ఎంత రాబట్టాలో అంత రాబట్టాలి అనే ఆలోచనని ఇష్టం లేకున్నా భరిస్తూ సాగుతున్న ఎందరో మధ్య తరగతి జనాల్లో ఒకడిగా దొడ్డి దారిన సంపాదించిన వాడికి శిక్ష పడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అప్పుడు ఎంత నష్టం జరిగింది? ఎలా విభజించారు లాంటి పెద్ద విషయాల్లోకి వెళ్ళనుగానీ రాష్ట్రం నష్టపోయిందని మాత్రం ఎవరిని అడిగినా చెప్తారు.మరి అభివృద్ధి ఎలా? పవన్ కళ్యాణ్ తెలుగు దేశానికీ అనుకూలంగా ప్రచారం వలనో, ఇలాంటి పరిస్థితి లో బాబు లాంటి అనుభవజ్ఞుల వలన రాష్ట్రం బాగుపడుతుందనో, జగన్ లాంటి యువకుడిని(అనుభవ లేమి కారణం కావచ్చు) కాదని బాబు కి ఓటేశారు జనాలు.ప్రత్యెక హోదా మీద 4 ఏళ్ళ పాటు నాన్చి ఇప్పుడు కుదరదని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారు కేంద్రం వాళ్ళు. కడుపు మండిపోతుంది మాములు జనాలకి.విభజన జరిగేప్పుడు, ఇంత మంది MP లు ఉండి ఏం చేస్తున్నారు? ఒక్కరన్నా గట్టిగా మాట్లాడండి అంటే.మేమెందుకు మాట్లాడాలి అని కాంగ్రేసు వాళ్ళు, వాళ్ళు మాట్లాడకపోతే మాదెం పోయిందని తెలుగు దేశం వాళ్ళు ఎవరు మాట్లాడకుండా విభజన జరిగాక ఎంతో గొప్పగా నటించి ఆశ్చర్యాన్ని బాధని వెలిబుచ్చారు.ఇపుడు కూడా అదే జరుగుతుంది. మోసం చేయడం మాములే, తెలుగు వాళ్ళకి మోసపోవడం మాములే.మీరు (MP లు) బిజెపి వాళ్ళ లా మాట్లాడతారు,తెలుగుదేశం వాళ్ళలా మాట్లాడతారు, వైఎస్సార్ సిపి లా మాట్లాడతారు. అందరు కల్సి తెలుగు వాళ్ళమని మర్చిపోయి చచ్చారు. కల్సి మాట్లాడండి. మేము తెలుగు వాళ్ళం, మా వాళ్ళు నష్టపోతున్నారు. ఒక సారి మనం మేం అని వినాలని ఉంది.మా బిజెపి చాలా చేసింది, మా తెలుగు దేశం వల్లే రాష్ట్రం ఇలా ఐన ఉంది. ఏం చేయలన్నా పదవి లో ఉండాలని వై ఎస్సార్ సిపి.... పవన్ కళ్యాణ్ వచ్చి ప్రశ్నలు వేస్తాడు. ఒక మంచి పని చేయాలంటే ఆయనకి 4 ఏళ్ళు పట్టింది.మీదేం పోదు. ఈ పార్టీలో కాకపోతే ఆ పార్టీలో, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా. జనాలకి వాళ్ళ కడుపు మంట వినే వాడే కరువయ్యాడు. మీ డ్రామాలు ఆపండి. ఏమైనా చేయగలిగితే చేయండి లేదా మాకు ధైర్యం లేదు. మా బతుకులింతే అని వదిలేయండి. మిమ్మల్ని చూసి తెలుగు వాళ్ళంతా ఇదే రకం అని దేశం అనుకుంటుంది.మాకంటూ ఒక రాజధాని లేదు. హైదరాబాద్ లో ఉద్యమం జరుగుతున్నప్పుడు “సిగ్గులేదంట్రా, ఎన్ని రోజులుంటారు” అన్న మాటలు విని, చెన్నై కో బెంగళూరు కో ఉద్యోగాలకోసం వలస వెళ్ళిన జనాలు ఎప్పటికైనా మాకంటూ ఒక రాజధాని అందులో ఉద్యోగాలు రాకపోవా అని ఎదురు చూస్తున్న జనాలని చూడండి.జిల్లాకో మంచి ఆసుపత్రి లేక ప్రతి దానికి విజయవాడ కి పరిగెత్తుతున్న జనాలని చూడండి.అయినా తప్పు లేదులే ఇపుడు మీరు ముగ్గురు విడిపోయారు, మీతో పాటు జనాలని కూడా కులాల ప్రాతిపదిక మీద విడదీస్తారు. మాకు సిగ్గులేదు. అసలు విషయం వదిలేసి కుక్కల్లా కొట్టుకొని మళ్ళీ ఇదే బతుకు బతికేస్తాం. విడిపోవడం మాకలవాటు. విడగొట్టడం మీకలవాటు. ఎన్ని తరాలు మారినా మేం నేర్చుకోం. #జైతెలుగోడా


0 comments:

Post a Comment