వాన చినుకులు వానా కాలం...నాకెందుకో ఎండాకాలం కన్నా వానా కాలం అంటేనే ఇష్టం అని చెప్పడం కన్నా ప్రాణం అనుకోవచ్చు ... నిండుగా కమ్ముకున్న నల్లటి మబ్బులు...ఎక్కడో మేమున్నామంటూ అలజడి చేసే ఉరుములు...ఆడపిల్ల పెదాల మీద నవ్వులా మెరిసి వెళ్ళిపోయే మెరుపులు...తేమ తో నిండి తాకి పోయే చల్లటి గాలి...చిన్నగా మొదలై నేలను తాకే వాన చినుకులు...కమ్మటి మట్టి వాసన... వాన ఒక్కోచోట ఒక్కోలా కనిపిస్తుంది... చిన్నప్పుడు మా ఇంట్లో తాటాకుల పందిట్లో కూర్చుని చూస్తుంటే , ఆ చూరు లోంచి కారుతూ నా కాళ్ళు తడుపుతూ...మా ఇంటి ముందున్న పూల మొక్కలని పలకరిస్తూ..కొబ్బరి ఆకుల్లోంచి పడుతూ ఉంటె పిల్లలందరం ఒకే దుప్పట్లో కూర్చుని రేడియో లో పాటలు వింటూ... నాన్న తో కలిసి పొలం వెళ్ళినప్పుడు స్వర్ణ వారి కుంట కాదా ఎద్దులని మేత కి విప్పి మర్రి చెట్టు కింద కూర్చుంటే.... ముత్యాల వానలా కనిపిస్తుంది...చుట్టూ మైదానం...కంటి కనిపించినంత దూరం తెల్లని పూల వాన....హోరు మంటూ గాలి...ఊగిపోతుండే పెద్ద పెద్ద చెట్లు...కాసేపటికే వాన వెలిసి మబ్బుల్లోంచి నవ్వుతు వచ్చే సూరీడు..నెల మీదకి వంగిన అందాల హరివిల్లు....కింద అంత మెత్తటి బురద, కాలు పెడితే జారిపోతూ...చిన్న కాలువలు కట్టి సాగిపోయే వాన నీళ్ళు... ఓ రోజేమో బడికి వెళ్దామని బస్సు కోసం ఎదురు చూస్తుంటే నిన్న కురిసిన వానకి చప్టాలో చిక్కుకుపోయిన బస్సు...ఈ రోజు మీకు బడి లేదు లే అంటే...లేదు మేం వెళ్ళాల్సిందే అంటూ పిల్లలంతా కల్సి సన్నటి చినుకుల్లో నడుచుకుంటూ సింగరాయకొండ వెళ్తుంటే..చాప్ట దగ్గర పక్కన ఉన్న నెల్ల కుంటలో విచ్చుకున్న తెల్లటి తామరలు...మాకు కావాలంటే మాకు కావాలనే అమ్మాయిలు... ఇంటర్ లో చేరాక ఎప్పడు ఇంటి కి దూరం గ ఉండని నేను ఇంటి మీద బెంగ తో కూర్చుని ఉంటె వచ్చి పలకరించే వాన చినుకులు.... ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ లో ఆఫీసు కి బయల్దేరగానే విరుచుకుపడే వాన.... సంతోష పడటం మానేసి లాప్టాప్ ని దాచుకోడానికి పడే తపన , ట్రాఫ్ఫిక్ తిప్పలు, ప్రవాహం ల వచ్చే మురుగు నీళ్ళు....అప్పుడపుడు తిట్టుకునే ఉంటా...కాని వాన కదా, పాపం దాని కోసం నేను చూస్తుంట అని వచ్చి పలకరించి పోతు ఉంటుంది...వాన మార లేదు , నేనే మారాను.... కాని వాన ఎప్పుడు అద్భుతమే....

ఎవరినైనా నీకు ఏం చేయడం ఇష్ఠం అంటే వానలో బజ్జీలు తినడం, వానలో తడవడం ఇలా చెప్తారు కదా. మీరు చెప్పండి మీకేం ఇష్టమో. అనుకుంటూ ఉండండి మనసులో ఈ లోగా నా ఇష్టాలు చెప్తా. చెప్పనా? తెలీదు పట్నం లో పెరిగిన వాళ్ళ కి ఏ ప్రపంచం తెలుసో. నాకు మాత్రం పల్లెటూరే ప్రపంచం. అక్కడ ప్రతి దానికి ప్రాణం ఉన్నట్టు తోస్తుంది. ప్రతిదీ నాతో ఊసులడుతున్నట్టుంటుంది. మా ఇల్లు, ఇంటి ముంది ఉన్న చెక్క బండి, దానికి కట్టేసిన బర్రె దూడ, మా చింత చెట్లు, నా పాత సైకిలు, మా పెరట్లో మందారం పూలు ఇలా చెప్తూ ఉంటే ఎన్ని పేజీలు రాసిన చాలవు. మా ఇల్లు చాలా పెద్దది. వెనుక ఆకు కూరలు ముందు పూల మొక్కలు నాటడానికి చోటు. వెనుకేమో బెండ లు, పొట్ల కాయలు, గోంగూర, పెద్ద చిక్కుడు, సొర కాయ ఇంకా కొన్ని ఆకు కూరలు వేసేది అమ్మ. అదే బుజ్జి (నా చెల్లి ) ఆడుకునే చోటు. ఇంటి ముందు తాటి ఆకుల పందిరి. ఎండాకాలం వస్తే చాలా చల్లగా ఉండేది. ఇంకా చాలా పూల మొక్కలు. ఎవరికి దొరికినవి వాళ్ళు తెచ్చి నాటేసే వాళ్ళం. నేనైతే నాచు పూలు ఇంకా ఏవో ఆకుల చెట్లు ఉండేవి అవి స్కూల్ లో ఉంటే తెచ్చే వాడిని. అమ్మ ఏమో బంతి, చామంతి పూలు తెచ్చి నాటేదీ. నాన్న వంతు గా రెండు కొబ్బరి చెట్లు నాటాడు. సాయంత్రం అయే సరికి అన్నం తింటూ ఆరు బయట కూర్చునే వాళ్ళం. చీకట్లు మూసిరే వేళకి ఆకాశమంతా మినుకు మంటు చుక్కలు వాలిపోయేవి. నులక మంచాల మీద పడుకొని పైకి చూస్తూ చాలా కథలు చెప్పుకునే వాళ్ళం. చాలా చుక్కలు కనిపించేవి, ఎన్ని అంటే అలా చేత్తో తుడిచి ఒడిలో పోసుకోవాలనిపించేన్ని. అపుడపుడు తెగ తిరిగే చుక్కలు కనిపించేవి, ఒకటి కనిపించగానే ఇంకో దానికోసం వెతికే వాళ్ళం. తప్పకుండా దానికి ఎదురుగా వెళ్లే చుక్క ఉండేది. అలా వెతకడం లో ఏదో ఆనందం ఉండేది.


 ఇక వెన్నెల రోజులు. మా ఇంటి ఎదురుగా ఉన్న బడి లో ఓ నాలుగు జామయిల్ చెట్లు ఉండేవి. అవి నాకు హంస ఆకారం లో కన్పించేవి. అందులోంచి చంద్రుడు వచ్చేసే వాడు. అలా వచ్చి మా కొబ్బరాకుల్లో దాక్కుని వెన్నేలని అందులోంచి జార విడిచే వాడు. కొబ్బారాకుల గలగలల లోంచి వెండి వెన్నెల జాలు వారెది. అలా చూస్తూ నిద్రాపోయే వాళ్ళం. ఆ మొక్కలకి పాదులు తవ్వడం, నీళ్ళు పెట్టడం నాకు బుజ్జికి అప్ప చెప్పే వాళ్ళు. మా అమ్మ చేత మంచి అనిపించుకోవాలని తెగ కష్టపడి చేసే వాళ్ళం. నా చెట్టు బాగా కాసిందోచ్ అనుకుంటూ పడే మురిపేం భలే ఉండేది. కాని బాల్యం నచ్చని వారు ఎవ్వరు ఉండరేమో. అది పల్లెటూరి లో ఐనా పట్నం ఐనా. పల్లెటూరి బాల్యం ప్రకృతి తో ముడి పడి ఉంటె , పట్నపు బాల్యం నాగరికత మరియు ఆధునికత కలగలిపి ఉంటుంది. కాని పట్నం లో బాల్యం telescope లో నక్షత్రాలు చూస్తే , పల్లెటూరి పిల్ల వాడికి వేగు చుక్క తెల వారుతుందని చెప్తుంది. ఇక్కడ ప్రకృతి తో బంధం, అక్కడ కృత్రిమమైన అనుభవం . కాని ఇప్పటి తరం పల్లెటూరి పసితనాన్ని చంపేస్తుంది. ఆటలు లేవు, ఎండా కలం సెలవులు లేవు, ఉన్నా అమ్మమ్మ గారి ఊరికి వెళ్లి ఆడుకునే ఆటలు లేవు. extra కోచింగులు, భవిష్యత్తుని గురించి భయాలు, చినపుడే కళ్ళ జోళ్ళు. ఇవన్ని అందరికి తెల్సినవే. ఇప్పటి అమ్మ నాన్నలు తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఇప్పటి బాల్యాన్ని చంపేస్తున్నారు. బాల్యం అంటే ఇలా కథ లా చెప్పుకునేది కాదేమో.

 మా అమ్మ మెచ్చుకోలు కోసం నేను నా చెల్లి పోటి పడే వాళ్ళం అని చెప్పా కదా. పొద్దున్నే నిద్ర లేవడం తప్పించు కోడం కోసం కూడా పోటి పడే వాళ్ళం. అమ్మ పొద్దునే లేచేది. నాన్న మంచి నీళ్ళ కోసం స్వర్ణ వారి కుంట (ఈ నీళ్ళంటే నాకు చాల ఇష్టం ) కి కావడి వేసుకొని వెళ్తే, అమ్మ మమ్మల్ని లేపుతూనే ఇంటి ముందు ఊడ్చి కళ్ళాపు జల్లి ,ముగ్గు పెట్టేది. ఆ రోజు మాకు ఇష్టమైన పనులు ఏమి ఉన్నాయో గుర్తు చేసేది. అప్పుడు ఎక్కడ లేని ఓపిక తో లేచే వాళ్ళం. నేనేమో పొయ్యీ ముట్టిస్తే ,బుజ్జి నా పక్కన కూర్చునేది. కాసేపు వెచ్చగా కూర్చునే వాళ్ళం.దూరం గా సాయి బాబా గుడిలో పెట్టిన "చందన చర్చిత " మంద్రం గా వినిపిస్తూ ఉంటుంది. నాకు బాగా కోపం వచ్చేది , వీళ్ళకి ఈ పాట తప్ప వేరేది దొరకదా అని . కాని ఆ పాట ఇప్పటికి ఆ జ్ఞాపకాల సువసనల్ని చల్లుతూనే ఉంది. ఆ పాట అయిపోగానే వెంకటేశ్వర స్వామి గుడిలో "కౌసల్య సుప్రజా రామ " అంటూ మాతో పటు ఆ నల్లవాడిని లేపేస్తారు. పొయ్యి బాగా మండటం మొదలు కాగానే చెరో పని అప్ప చెప్పేది అమ్మ.నేనేమో బర్రెల దగ్గర పేడకల్లు తీసి అక్కడ శుభ్రం గా చేసి వాటికీ నీళ్ళు పెట్టి కొట్టం దగ్గర కట్టేసి మేత వేసి రావాలి.నాన్నేమో నీళ్ళు తెచ్చి మేత తేవటానికి వెళ్తాడు. అమ్మ, బుజ్జి వంట చేస్తారు. వంట అయిపోగానే ఆ పొయ్యి మీదనే నీళ్ళు పెట్టేది. దానితోనే మా స్నానాలు. అందరం కూర్చుని రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి,పప్పు, గడ్డ పెరుగు వేసుకొని తిని రెడీ అయ్యి (రేకు పలకలు\ పుస్తకాలు తీసుకుని ) ఇంటి ముందున్న బడి కి వెళ్ళిపోయే వాళ్ళం.


 మా బడిలో మాష్టార్ల(పంతుళ్ళు) పేర్లు చెప్తా వినండి.హెడ్ మాష్టారు సుబ్బరామయ్య పంతులు ,తెలుగు పంతులు కలికివాయి అయ్యవారు,సైన్సుకేమో చీరాల అయ్యవారు, సోషల్ కేమో టంగుటూరు మేష్టారు, ఇంగ్లీష్ కి కెజియా మేడం. వీళ్ళ అసలు పేర్లు మాకెవరికి తెలీవు. వీళ్ళే నాకు 7 th వరకు ఉన్నారు. మేము అంటే నేను బుజ్జి ఇంకా కొందరు పిల్లలు కల్సి రామయ్య పంతులు దగ్గర కి tuition కి వెళ్ళే వాళ్ళం. మా బడి మొదలయేప్పుడు రెండు గంటలు కొడతారు. రెండవ గంట కొట్టేసరికి అందరం ప్రార్ధనకి నిలబడాలి. లేకపోతే మోకాళ్ళ దండ , గోడ కుర్చీ , ఒంటి కాలి మీద నుంచోడం లాటి శిక్ష(punishment) లు ఉండేవి. అందరం కల్సి వందేమాతరం, మా తెలుగు తల్లికి, వీర గంధము తెచ్చి నారము, జనగమణ పాడేసి ఎవరి క్లాసు కి వెళ్ళే వాళ్ళం. మాకు వంటేలు గంట (interval)ఓ గంట సేపు ఉండేది.ఈ లోగ చెమటలు కక్కేట్టు ఆడుకొని మురికి గా వచ్చే వాళ్ళం.మళ్లీ మధ్యాహ్నం బెల్లు కొట్టే వాళ్ళు 12.30 కి. మళ్ళి 2 గంటలకి స్కూల్, 4 కల్లా అయిపోయేది. స్కూల్ అవగానే డ్రిల్లు, ఆటలు, ఎక్కాలు, జై హింద్ చెప్పగానే ఓఓఒ అంటూ ఇంటికి. చూసారా ఇక్కడ హోం వర్క్స్ లేవు, assignments లేవు. అయిన సరే మా టీచర్స్ ని తిట్టుకునే వాళ్ళం. మాకు ఇష్టం టంగుటూరి అయ్యవారు.అయన అస్సలు కొట్టేవారు కాదు.ఆయనకి పిల్లలు లేకపోడమే కారణం కావచ్చు. మా బడి లో ఎవరైనా మాష్టారు రాకపోతే పెద్ద తరగతి లో ఉన్న బాగా చదివే పిల్లల్ని కింది తరగతులకి లీడర్ గా పంపేవాళ్ళు, గొడవ చేయకుండా చూడ్డానికి. అది చాలా బాగుండేది. ఇంటికి రాగానే స్నానం చేసి ఇల్లు ఉడ్చటం, బర్రెకి మేత వేయడం లాటి పనులు చేసి tuition కి వెళ్ళే వాళ్ళం.అక్కడ విజయ లక్ష్మి ఉండేది. తను నా తరగతే, ఇంకా మా పంతులు గారి మనుమరాలు కూడా ( తన గురించి ఎపుడైనా చెప్తాలే ). tuition 7 కి అయ్యాక ఇంటికి వచ్చి ఆరు బయట వెన్నెల్లో వేడి వేడి అన్నం తిని కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయేవాళ్ళం

ఇంకొక దెయ్యం.....నేను బెంగుళూరు లో ఉజ్జోగం చేస్తూ ఉండగా ఇందిరా నగర్ దగ్గర లక్ష్మి పురం లో ఓ ఫ్లాట్ లో ఉండేవాళ్ళం. నేను, బక్క వేమన విక్రాంత్ అలియాస్ రాజ, శశి, ఫైర్ స్టార్ బాబు...ఇందులో నేను రెగ్యులర్ వంట వాడిని, బాబు కూరగాయలు కోసి ఇవ్వడం, పచారి సామాన్లు తేవడం. రాజ, శశి వారాంతపు వంట వాళ్ళు అంటే బిర్యాని, బగార రైస్, పచ్చిపులుసు, గుడ్డు కూర, కోడి కూర ఇలాటి స్పెసల్ తో సితగ్గొట్టేవాళ్ళు...ఇలా తిని ఒళ్ళు పెంచుతున్న తరుణం లో ఓ రోజు కరెంటు పోయి పూడిసింది...కారిడార్ లో తలుపులు బార్లా తెరిచి గాలికి కూర్చుని ఆ చీకట్లో నోరు ఊరుకోక దెయ్యాల్లా తిరుగుతున్నాం అన్నా...రాజ గొంతు సవరించుకున్నాడు...నీకు కస్తూరి సత్యన్నారాయణ తెలీద..strange అనగానే ఫైర్ స్టార్ బాబు కిందకి దూకబోయాడు...ఓరి బాబో నువ్వాగేహే అని ఏంటి కథ అన్నాను... ఇక రాజ మొదలెట్టాడు...నేను ఇంజనీరింగ్ సతికి MBA కోసం ఢిల్లీ దగ్గర లో ఓ కాలేజి లో చేరాను.... ఆ కాలేజి సిటీ కి బాగా దూరం గ ఉండేది....అంటే పల్లెటూర్ల దగ్గర గా...అక్కడ బాగ స్ట్రిక్ట్....కాలేజి హాస్టల్ చుట్టూ కంచే వేసి ఉండేది....ఎవర్ని బయటకి వేల్లనిచ్చే వాళ్ళు కాదు...చీకటి అయితే చాలు స్మశానం ల ఉండేది....అది మే ౧౮ వ తారీకు.ఎప్పుడు అర్ధ రాత్రి దాకా సినిమా కబుర్ల తో కళ కళ లది పోయే హాస్టల్ అంతా సాయంత్రం 6 కాగానే తలుపులు మూసేసి అందరు ఆంజనేయ దండకం చదుకోసాగారు... మనదసలె నెల్లూరు ఏందో సంగతి కనుక్కుందామని పక్కనే ముసుగులో ఉన్న ఓ అబ్బియ్య ని కదిలించా..వాడు కెవ్వు మని అరిచి "యో ఏందియా " అన్నాడు. నా మొహం మీద లైట్ వేసుకొని " ఏందీ సంగతి " అన్నాను...యో నీకు దండం పెడతా, గెట్టిగా అరవమాక,"వాడు" వచ్చి మన తలుపు కొడితే సచ్చిపోతాం" అన్నాడు....ఇక నాకు ఆగలా, లేచి బాసిపట్లు వేసుకొని కూర్చుని చెప్పు ఏందా కథ అన్నా? వాడు అప్పటికే తడిచిపోయి ఉన్నాడు, చెప్తావా తలుపు తీయమంటావా అన్నా? సన్నగా వణుకుతున్న గొంతు తో "వాడి " గురించి చెప్పడం మొదలు పెట్టాడు..."మన హాస్టల్ చుట్టూ చాల నేల బావులు ఉన్నాయి. సెకండ్ షో సినిమాకి వెళ్ళీ వాళ్ళు ఆ ఈశాన్యం మూల ఉన్న సందులోంచి దూరి బయటకి వెళ్తారు.. ఆ చీకట్లో జాగ్రత్తగా వెళ్ళకపోతే ఆ నేల బావిలో పడిపోవడం ఖాయం.ఒక రోజు రాత్రి మన నెల్లూరు అబ్బాయి కొంతమంది స్నేహితులతో కలిసి సెకండ్ షో సినిమాకి బయల్దేరాడు. వాడు అప్పుడే చేరాడు ఈ హాస్టల్ లో...ఆ రోజు వాడి పుట్టిన రోజు...ఆ నేల బావులు దాటాలి అంటే దానికో పద్ధతి ఉంది...చేతి నిండా రాళ్ళూ , ఒక కర్ర తీసుకొని నేల ని తడుముకుంటూ రాళ్ళూ వేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్ళాలి...పాపం ఆ కుర్రాడికి అది తెలీదు..అల గుడ్డిగా వెళ్లి ఆ నేల బావి లో పడి చనిపోయాడు... అ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజు ప్రతి తలుపు కొట్టి హృదయ విదారకం గా ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు...." గట్టిగ తలుపు చప్పుడైంది...ఆఆ ఆ ఆ అని భయంకరమైన ఏడుపు ....నాకు చెమటలు పట్టేసి దుప్పట్లో దూరి ప్రభువు ని తలచుకుంటూ" అని మా వైపు చూసాడు... వెంటనే నేను "గాజులోళ్ళ పిల్ల మేం గాజులోళ్ళం కాదా" అని హృదయ విదారకం అరుస్తూ వంట చేసుకోడానికి వెళ్ళిపోయా...ఫైర్ స్టార్ బాబు మాత్రం బిగుసుకొని పోయి ఉన్నాడు...అప్పుడప్పుడు ఇలా రాజ ని కదిలిస్తే అదిరి బెదిరి పోయే కథలు చెప్పవాడు....ఏమంటారు ఇంతకి...

దెయ్యం...తెలుగోడికి తెలుగు తెలీకపోయినా పర్లేదు కాని దెయ్యం తెలియక పోతే మాత్రం వాడు తెలుగోడే కాదు...ఇప్పుడు వీటి గురించి జనాలు పెద్దగా ఆలోచించడం లేదు అనుకుంట...అంటే ఫారన్ నుంచి ఘోస్ట్ లు, జాంబి లు వచ్చి ఇక్కడ ఆక్రమించేశాయి....ఇక్కడ దెయ్యలకి ఒక ఫార్మటు ఉంటుంది, అంటే డ్రెస్ కోడ్. తెల్ల చీర, విర బోసుకున్న జుట్టు (బాగా పొడుగ్గా ఉంటుంది లే), వెనక పొగ, దూరం గ నక్కల ఊళలు, బాక్గ్రౌండ్ లో మంచి పాట.... అందరికి ఇదే దయ్యం కనిపిస్త ఉంటాది...కొందరికి అయితే చచ్చిపోయిన వాళ్ళ చుట్టాలో, స్నేహితులో వచ్చి పలకరించి పోతా ఉంటారు.... దీని మీద సాన సినిమాలు వచ్చి ఉండాయి.దీని మీద ఆటలు కూడా ఆడతా ఉంటారు.అదే ఒక బోర్డు మీద కాయిన్ పెట్టి ఇద్దరు దాని మీద చెయ్యి పెట్టి ఎవుర్ని ఐన తలచుకుంటే వాళ్ళ ఆత్మ వచ్చేస్తుంది....ఇక్కడ ఆత్మ వేరు దెయ్యం వేరు...ఆత్మలు ఆఫ్ లైన్ లో దెయ్యాలు ఆన్ లైన్ లోను ఉంటాయి.. ..అంతే కాకుండా చాల మంది చూసి కూడా ఉన్నారు..బహుశా మీలో కూడా ఉండి ఉండచ్చు... నేను బాగా చిన్నప్పుడు కరంటు వైరు పట్టుకొని ఆసుపత్రి లో చేరితే బలం కోసం టానిక్ ఇచ్చాడు శివరామ రెడ్డి డాట్రు...అది తాగించడానికి మా నాయనమ్మ మా ఇంటి ఎదురుగ గుబురుగా పెరిగిన చింత చెట్ల ని చూపించి తాగకపోతే దానిమీద నుంచి దయ్యం వచ్చి పట్టుకుపోద్ది అని చెప్పేది, ఆ గోల పడ లేక ఓ రోజు రాత్రి సీసా మొత్తం తాగేసా, రుచి బాగుండటం తో అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళ టానిక్ లు కూడా స్వాహ (కథ పక్క దారి పడుతుంది). ఆ తరువాత రవణప్ప గారి కలర్ టీవీ లో చూసిన దెయ్యం సినిమా(భానుచందర్ ఉంటాడు, ఒక గుహలో నిధి, దయ్యం ఉన్న పెట్ట ఉంటుంది, ఎవడో దాన్ని ఓపెన్ చేస్తాడు, అది అందరిని చంపుతూ ఉంటుంది) తో మొదలు... కొన్ని రోజులు భయపెట్టింది... ఇక ఆ తరువాత చాల సినిమాలు వచ్చాయి..కొన్ని చేతులు అడ్డం పెట్టుకొని చూడ్డం, ఆ తరువాత మానెయ్యడం జరిగింది..ఇపుడైతే భయం తగ్గింది అనే కంటే అటు వైపు ఆలోచించడం తగ్గింది... 


 ఓ సారి పదో తరగతి లో ఉన్నప్పుడు స్కూల్ లో బస్సు వెళ్ళిపోయింది. ఇక అందరం కలిసి ట్రాక్టర్ ఎక్కి బయల్దేరాం ఊరికి. మా ఊరు వెళ్ళాలి అంటే మద్యలో ఇంకో ఊరు వస్తుంది. ఆ ఊరు దాటాక ఓ పెద్ద చెరువు, ఆ చెరువు కట్ట చివర మలుపులో ఓ పక్కకి ఒరిగి నాలుగు అడుగులు పొడుగున్న ఉన్న రెండవ నెంబరు మెయిలు రాయి. ఇక ట్రాక్టర్ లో వెళ్తూ ఉంటె మాతో మా ఊరి దూదేకుల సాయిబు కూడా వచ్చాడు. ఆ మైలు రాయి దగ్గరకి వచ్చేసరికి మమ్మల్ని ఓ ప్రశ్న వేసాడు" మీకు ఈ రాయి గురించి తెల్సా" అప్పుడు రాత్రి పది అయింది. మేమంతా స్లో మోషన్ లో తిరిగాం, ఆయన పిచ్చి బచ్చాల్లారా అన్నట్టు చూసి "ఇది ఒక దెయ్యం " అన్నాడు. ఎక్కడో ఓ నక్క ఊళ వేసింది. మేమంతా అ రాయిని అలా చూస్తూ ఉన్నాం, అది మా వైపు తల ఊపుతూ చూస్తు ఉంది. ఇంకొంచెం లోపాలకి జరిగి "ఎం జరిగింది " అన్నాం. "ఓ సారి నేను మా చుట్టాల ఊరికి వెళ్లి సింగరాయకొండ వచ్చేసరికి ఆలస్యం ఐంది, ఆఖరి బస్సు వెళ్ళిపోయింది. అక్కడే ఒక సైకిల్ తీసుకొని బయల్దేరాను. బాగా చీకటి, అమావాస్య అనుకుంట (మాకు చలి బుట్టటం మొదలైంది). కన్ను పొడిస్తే కానరాని చీకటి, ఆకాశం నిండా నక్సత్రాలు, చల్ల గాలి, అక్కడక్కడా కావలి వాళ్ళు వేసుకున్న మంటలు మినుకుమంటున్నాయ్. దూరం నక్కల ఊళలు. అలవాటైన ప్రాణం కదా, చిన్నగా వెళ్తూ ఉన్నాను. ఆ చెరువు కట్ట దిగి రాగానే ఆ రాయి కనిపించింది.


 మాములుగానే తొక్కుతున్న, ఇంకొంచెం ముందుకు రాగానే మళ్ళి రాయి ఉంది. అదేంటబ్బ వెనక్కి పోయింది కదా అనుకుంటూ వెనక్కి తిరిగా..చిన్నగా ఆ రాయి పైకి లేచింది (అందరం దగ్గరకి జరిగాం )..... అది మైలు రాయి కాదు...పొగ మంచు లా ఉంది, గాల్లో తేలుతూ మెల్లగా నా వైపు రాసాగింది...నా కళ్ళల్లో వణుకు మొదలైంది, అప్పటి దాకా ఆడుతూ పడుతూ సైకిల్ తొక్కిన నేను తడబడటం మొదలు పెట్టాను, అది నాకు దగ్గరగా వచ్చింది, చూడబోతే ఆడ పిల్ల ఆకారం లో ఉంది. నా కాళ్ళలో సత్తువ తెచ్చుకొని సైకిల్ తొక్కడం మొదలు పెట్టాను...అది కూడా గాల్లో తేలుతూ నన్ను వెంబడించడం మొదలు పెట్టింది..నేను వేగం పెంచాను, అది నన్ను తరుముతూ ఉంది. ఇది గో ఈ చప్టా( చెరువు మలుపు దాటినా కాసేపటికి రెండు నీళ్ళ చప్తలు వస్తాయి) దగ్గర కి వచ్చేసరికి నాలో ఓపిక, ధైర్యం తగ్గిపోయాయి. ఇక దేవుడి ని తలచుకుంటూ తొక్కుతున్నాను, దూరం రామానాయుడి గారి పొలం కాదా నీళ్ళ ఇంజను శబ్దం వినిపించింది, నా మొర దేవుడు ఆలకించాడు. అక్కడ ఎవరో పొలానికి నీళ్ళు పెడుతున్నారు. నాక్కొంచెం ధైర్యం చిక్కింది. అది దానికి తెల్సిందో ఏమో దాని వేగం పెంచింది. ప్రాణం మీద ఆశ వదులుకొని సైకిల్ వదిలేసి పరిగెత్తడం మొదలు పెట్టా...అది అరుస్తూ వెంట పడింది. నా అదృష్టం నీళ్ళ ఇంజను దగ్గర ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. పరిగెత్తి పడిపోయా, నోట్లో మాట రాడం లా. గుండెల్లో మంట. భయం గా దాని వైపే చూస్తున్నా..అది అరిచి నా సైకిల్ మీద పడి తొక్కి కసిగా వెనక్కి వెళ్ళిపోయింది" అంటూ మా వైపు చూసాడు...అప్పటికే పుస్తకాల సంచుల్ని ఘాట్టిగా పట్టుకొని "ఎవడ్ర ఈ £%¬*&" ట్రాక్టర్ లో కి ఎక్కిచింది " అనుకునాము... ఆ రోజు నుంచి మొన్న రోడ్ వేసేప్పుడు ఆ మైలు రాయి తీసేసిన్దాక ఆ రాయి మమ్మల్ని తెల్లగా భయపెడుతూనే ఉంది....ఇంకా ఇలాటి అనుభవాలు చెప్పాలంటే బోలెడు..మీకు లేవా?

నేను నా ఆట బొమ్మలు....

నాకు  బాగా గుర్తుండి నేను వాడిన ఆడిన బొమ్మలు...బాగా చిన్నప్పుడు తిరుపతి తీసుకెళ్తే గుండ్లు కొట్టించి, తప్పి పోయిన మా బాబాయి కొడుకుని వెతుక్కొని ఓ బొమ్మల కొట్టు ముందు ఆపి "రేయ్ నీకే బొమ్మ కావాలో చెప్పరా" అని మా నాన్న  అంటే పెద్దగా ఉన్న ట్రాక్టర్ బొమ్మ చూపించా. ఎంత అంటే 125 చెప్పాడు ఆ కొట్టోడు. పదో పదోహెనో పెట్టి లైట్ వెలిగే కార్లు ఓ నాలుగు నాకు మా చెల్లికి మా బాబాయి కొడుకులకి కొన్నారు. అవి నేల మీద బరికి వదిలితే "బాయ్" మని అరుస్తూ లైట్ వెలుగుతూ తిరుగుతాయ్...అది నా  మొదటి బొమ్మ. ఆ తరువాత మా ఎంకయమ్మ(చిన్న అమ్మమ్మ) కొన్న మౌత్ ఆర్గాన్. అది తెచ్చుకుంటే తెల్సిన వాళ్ళు నొక్కేసి నా ముందే ఊదుకుంటా తిరుగుతూ ఉంటే పోన్లేరా వదిలేయ్ అంది మా అమ్మ. మా నాయనమ్మ యాత్రలకి పోయి నాకొక కుక్క బొమ్మ, అదే నొక్కుతా ఉంటె అరుస్తూ ముందుకి పోతూ ఉంటుంది. ఇంకా ఒక టెలిఫోన్. ఆ చివర ఈ చివర రెండు డబ్బాల్ల ఉండి మద్యలో పెద్ద పచ్చ వైరు, అవతల వాళ్ళు మాట్లాడతా ఉంటె ఇవతలి వాళ్ళు చెవి దగ్గర పెటుకొని ఇనాల.

అది కాక ఓ సారి మా ఊరి గొల్లోళ్ళ అబ్బాయి దగ్గర టక్కరి చేసి కాజేసిన జీపు బొమ్మ. పసుపు, నలుపు లో భలే  ఉండేది. తీసుకొని పెద్ద మెకానిక్ లా అన్ని విప్పా, మళ్ళి ఫిట్ చేయడం రాలా. 

ఓ సారి మా అమ్మ నాన్న కూడా యాత్రలకి పోయి ఓ పెద్ద బాగు, ఒక రబ్బరు బాలు పెద్దది తెచ్చారు. చాల జాగ్రత్త గా వాడుకోవాలన్నమాట. ఆ బాగులో దాదాపు నలుగురు వాడే పుస్తకాలు పడతాయి . ఐన సరే అదే ఏసుకొని పోయేవాడిని. ఓ సరి బడి అయ్యాక మా రమణయ్య సారు కాన్వెంట్ కి వెళ్ళా. పోతా పోతా బాలు కూడా తీసుకెళ్లా. వాళ్ళ పాప ఆడు కుంటుంది అని తీసుకొని దాన్ని ముళ్ళల్లో వేసి దాని గాలి పోగొట్టారు.ఇంటి కాడ మా నాన వీరబధ్రుడి అవతారం ఎత్తి  నన్ను సితగ్గొట్టాడు.

ఇక ఇవి కాక బంకమట్టి తో బొమ్మలు, గోళీలు అందులో సీసం గోళీలు, ఇనప గోళీలు, కుంకుడు కాయ గోళీలు, కోడీక టపాసులు అని  ఉండేవి, బిల్లం గోడి (అందులో చాల బిళ్ళలు కోడి లు ), బొంగరాలు, దానికి మా నాన్న ని అడిగి పేనించుకున్న  తాళ్ళు, ఓకులు (తెలీదా? అదే అగ్గి పెట్ల మీద కవర్లు చించుకొని అదో పెద్ద కలెక్షన్ ), ఎప్ప్డుడో దీపావళి కొన్న తుపాకీ ని దొంగ పోలీసు ఆటలో వాడే వాళ్ళం. ఇది కాక బచ్చాలాట. ఇది కాక బాణలాట.  మా దగ్గర రామ బాణం, వాన బాణం, మంట బాణం, పొగ బాణం ఇత్యాది బాణాలే కాకుండా గాండీవం లాటి విల్లు లు కూడా ఉండేవి. వాటితో మా ఊర్లో లిబియాలో ఉండి వచ్చిన  చిన్న  గాడి తలకి బొక్క పెట్టి, మా ట్రాక్టర్ రెడియటార్ కి బొక్క పెట్టి మళ్ళి మా నాన్న చేతిలో పూజ చేయించుకున్నా. అప్పుడప్పుడు గాలి పటాలు. మాకు క్రికెట్ తెల్సాలకి బాటు అనేది గగనం అందుకే టెంకాయ మట్టలతోటి, మంచం కోళ్ళ తోటి, బాలేమో కాయితాలన్నీ కలిపి పూరి కొస తో చుట్టిన గుండు. తిరణాలకి పోయినప్పుడు చేత్తో తిప్పుత ఉంటాం, మద్యలో తినేది ఉంటాది..దాన్ని తిప్పి తిప్పి మద్యలో దాన్ని తినేసే వాళ్ళం .  ఇంకా బూరలు, గ్లాసు ట్యూబ్ లో రంగు నీళ్ళు నింపి ఉంటాయి కదా అవి. ఇవి కాక రెండు కోడి పుంజులు ఉండే బొమ్మ ఒకటి ఉండేది. దాని మద్యలో ఒక చిన్న గిన్నె ఉంటాది. కింద ఒక ఇనప కొక్కెం ఉంటాది. నొక్కుతూ ఉంటె అవి ఆ గిన్నెలో గింజెలు పొడుస్తా ఉంటాయి. ప్లాస్టిక్ పాము, బల్లి. 

అది కాకుండా..తాటి కాయలతో చేసిన బండి, దాంట్లో కూడా రెండు చక్రాలు, ఆరు చక్రాలు..ఇంకా ఇనప గాను కి అదే మన చెక్క బండి చిన్న ఇరుసు ని తోసుకుంట పోడానికి ఒక కర్ర ముక్క కి చీల కొట్టి..ఇంకా టైరు పుల్ల , కర్ర ని కాళ్ళ మధ్యలో  వేసుకొని బస్సు అట...తాడు  ని కట్టి అందరం అందులో ఎక్కి బస్సు ఆట...

ఇంకేమున్నయబ్బా ? చెప్పండి  ఇంకేమున్నాయో? 



మనం పాటలు వింటూ ఉంటాం. కొన్ని ఆ క్షణం లో మరుగైపోతే, కొన్ని కాలాన్నే మరిపిస్తాయి. అవి అజరామరాలు. అవి ఎప్పుడు విన్నా మనసుకి ఏవో గుర్తు వస్తాయి. అప్పుడు జరిగిన సంఘటన, ఆ ప్రదేశం, అప్పటి స్నేహితులు ఇంకా చాలానే. సరదాగా అలా పాడుకుంటామే కానీ అది ఏ రాగమో తెల్సుకోవాలన్న కుతూహలం అందరికి ఉండదు. కానీ మనకి నచ్చిన పాట ఫలాన రాగమని తెలిస్తే ఆ ఆనందం వేరే ఉంటుంది. ఎవరికైనా కొన్ని రాగాలు మాత్రమే నచ్చుతాయని నా అభిప్రాయం.
సంగీతం పరిజ్ఞానం లేకపోయినా నచ్చిన రాగానికి తలూపేస్తాం. అరె, ఇది ఎవరు పాడారు? ఎవరు రాశారు? సంగీతం ఎవరు? ఇలా ఆలోచించే వారు ఉండకాపోరు. ఇవన్ని మనకి దొరుకుతాయి. కానీ రాగం ఏదో తెలిదు. అవసర౦ కూడా ఉండదు. కానీ నా కుతూహలం కొద్ది ఇక్కడ కొన్ని రాగాలు, ఆ రాగం లో ఆలపించిన పాటలు ఉంచుతున్నా. అవి అన్ని నాకు ఇలా వెతగ్గా దొరికినవే.
వివిధ రాగాలు అందులో పాటలు చూశాక, నాకు నచ్చిన రాగాలు అభేరి, యెమన్, సింధూ భైరవి మరియు తిలాంగ్ రాగాలు అనిపించింది. ఇంకా కొన్ని పాటలు నచ్చుతాయి. మరి మీకు నచ్చిన పాటలు ఏ రాగం లో ఉన్నాయో చూసుకోండి.
రాగాలు:
పాట                                                                        (చిత్రం ,గానం , సంగీతం)
1. సింధు భైరవి రాగం:
సన్నగ వీచే చల్లగాలికి.....                                                (గుండమ్మ కథ ,సుశీల , ఘంటసాల)
కరిగిపోయాను కర్పూర వీణల...                                          (మరణ మృదంగం, బాలు, సుశీల , ఇళయరాజా)
జయమ్ము నిశ్చయమ్ము రా...                                            (శభాష్ రాముడు, ఘంటసాల, సరోజినీ,ఘంటసాల )
ప్రేమ కోసమై వలలో పడెనే                                               (పాతాల భైరవి, వీ జె వర్మ,ఘంటసాల)

2. ఖర హర ప్రియ రాగం.
మేఘమా..  దేహమా  ..మెరవకే ఈ క్షణం                                 (మంచు పల్లకి, ఎస్ జానకి, రాజన్ - నాగేంద్ర)
సంగీత సాహిత్య సమలంకృుతే                                          ( స్వాతి కిరణం, జెసుదస్, కె.వి. మహాదేవన్)

౩. రాగ మలిక (ఒకటి కంటే ఎక్కువ రాగాలు ఉపయోగించే ప్రయోగం)
ఆకాశ వీధిలో ....                                                            (మల్లీశ్వరి, ఘంటసాల, భానుమతి, ఎస్. రాజేశ్వర రావు)
హాయి హాయి గా ఆమని సాగే...                                          (సువర్ణ సుందరి,ఘంటసాల, జిక్కి, ఆదినారాయణ రావు)
ముక్కోటి దేవతలు వక్కటైనారు....                                       ( బావ మారదలు, ఘంటసాల, పెండ్యాల)

4. మోహన రాగం.

మాధురమీ సుధా గానం                                                ( బృందావనం,బాలు, జానకి, మాధవ పెద్ది సురేష్)
నిన్ను కోరి వర్ణం                                                         (ఘర్షణ, వాణి జయరాం, ఇళయరాజా)
5.  ఆభేరి  రాగం

రాగమాయి రావే                                                         ( జయభేరి, ఘంటసాల, పెండ్యాల)
ఓ నెల రాజా,వెన్నెల రాజా, నా వన్నెలన్ని చిన్నెలన్ని           (భట్టి విక్రమార్క, ఘంటసాల, సుశీల, పెండ్యాల)
చల్లాగరావేలా                                                            (ఆనందనిలయం, ఘంటసాల, లీల,ఎస్. రాజేశ్వర రావు)
అందమే ఆనందం                                                       (బ్రతుకు తెరువు,ఘంటసాల, సుబ్బరామన్, ఘంటసాల)
రావోయి చందమామ                                                   (మిస్సమ్మ, ఘంటసాల, లీల, ఎస్. రాజేశ్వర రావు)
నా కంటి పాపలో నిదుర పోరా                                       (వాగ్దానం, ఘంటసాల, సుశీల , పెండ్యాల)
నీలి మేఘాలలో                                                        (బావ మరదలు,ఘంటసాల, ఎస్. జానకి, పెండ్యాల)



6.  భూపాళ రాగం :
తొలి సంజే వేళలో                                                  ( సీత రాములు, బాలు, సుశీల, సత్యం)
7. కాపీ రాగం:
నా చెలి రోజావే                                                      ( రోజా, బాలు, ఎ.ర్.రెహ్మాన్)
వట పత్ర శాయి కి వరహాల లాలి                                 ( స్వాతి ముత్యం, సుశీల, ఇళయరాజా)
8.  బిళహరి రాగం:
ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు                                 ( ఈనాటి ఈ బంధమేనాటిదో, సుశీల, రాజేశ్వర రావు)
మాదీ స్వతంత్ర్య దేశం                                            ( ప్రవేటు రికార్డు, టంగుటూరి సూర్య కుమారి, రజని)
9. దర్బారీ కానడ రాగం:
నమో భూత నాధా                                              ( సత్య హరిశ్చంద్ర, ఘంటసాల, ఎస్. వరలక్ష్మి, ఘంటసాల)
శివ శంకరీ శివానంద లహరి                                   (జగదేక వీరుని కథ, ఘంటసాల, పెండ్యాల)
10. యెమన్ రాగం:
ఎవరివో నీవెవరివొ                                                ( పునర్జన్మ, సుశీల, ఎస్. రాజేశ్వర రావు)
పలకడలి లో శేష తల్పమున                                  ( చెంచు లక్ష్మి, సుశీల, ఎస్. రాజేశ్వర రావు)
11. తిలాంగ్ రాగం:
నా చందమామ                                                   ( పాండవ వనవాసం, ఘంటసాల, సుశీల, ఘంటసాల)
నీలకంధరా దేవా                                                 ( భూకైలాస్, ఘంటసాల, సుదర్శనం, గొవర్ధనమ్)
12. హిందోళ రాగం :
ఓం నమః శివాయా                                               ( సాగర సంగమం, జానకి, ఇళయరాజా )
మనసే అందాల బృందావనం                                   ( మంచి కుటుంబం, సుశీల, కోదండపాని)
కలనైనా నీ తలపె                                                ( శాంతినివాసం, లీల, ఘంటసాల )

పైన చెప్పిన పాటలు చూడగానే ఒక్కసారైనా మనసులో తలుచుకుని ఉంటాం. అందులో రచన, సంగీతం ముఖ్య పాత్ర పోషించాయి. పాటలు అర్ధవంతంగాను ఉంటాయి. ఎంతో మంది మహానుభావులు వాటికీ ప్రాణం పోశారు. నాకు నచ్చిన గాయకులు సుశీల, ఘంటసాల, రాజా మరియు బాలు గారు. వారిని చూస్తే దేవతలు మనుషులై వచ్చినట్టు ఉంటుంది.

ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతూ ఉంటె ఆ కళే వేరు...ఆ సందడి ఆ సంతోషం..ఎంత మంది అబ్బాయిలు ఉన్నా ఒక్క ఆడపిల్ల ఉంటె ఆ వాతావరణం చాలా బాగుంటుంది.... కాని ఎక్కువ మంది ఎందుకు అమ్మాయిలని కనడానికి సుముఖం గా లేరు?ఇలా అని నేను తీర్మానించడం లేదు..రోజు వారి మనం చూస్తున్న సంఘటనలు కోకొల్లలు.... కట్నం సమస్యా? పెంచడం సమస్యా


ఎక్కువ సందర్భాల్లో కట్నమే సమస్యగా మారుతుంది.... సరే కట్నం ఇచ్చి పెళ్లి చేసి నా ఆ తరువాతి ఆడంబరాలకి అయ్యే ఖర్చు చాలానే... అమ్మాయిని వద్దనుకోవడం వేరే, అబ్బాయే కావాలనుకోడంవేరే....
కట్నంఎందుకుఇవ్వాలి?
చేసుకోబోయే పిల్లవాడు ఆర్ధికం గా బలహీనం గ ఉండి...మీ దగ్గర అంతో ఇంతో డబ్బు ఉంటె వాళ్ళకి భవిష్యతు లో భరోసాగా ఉంటుందని ఇవ్వడం సమంజసమే.... చాలా మంది పిల్ల పిల్లాడు కలిసి సంతోషం గా కాపురం చేస్తూ ఉంటె అంత కన్నా కావాల్సింది ఏముందని అప్పు చేసి మరి ఇస్తున్నారు....ఇది ఆసరాగా చేసుకొని ఆడపిల్ల తల్లి తండ్రుల బలహీనత తో ఆడుకునే అబ్బాయిలు, వాళ్ల తల్లి తండ్రులు రోజు తగుల్తునే ఉన్నారు...మన ఇంట్లో ఆడ పిల్ల కాలు కంద కూడదు, మన ఇంటికి వచ్చే పిల్ల గానుగెద్దు లా పని చేయాలనీ కోరుకునే అత్తలైతే చెప్పనవసరం లేదు..వాళ్ళు అసలు ఆ పిల్లని ఆడపిల్లగానే పరిగణించరు....ఆశ్చర్యం గా వాళ్ళు ఒకింటికి కోడలి గానే వస్తారు, ఆమె కొడుక్కి ఆ కష్టాలన్నీ చెప్తుంది..మళ్ళి కోడళ్ళ దగ్గరకి వచేసరికి అత్త లా మారిపోతుంది....ఆడపిల్లల జీవితాలు కట్నాలకి బలి కావడం లో ఎక్కువపాత్రఅత్తలదేఅనినాఅభిప్రాయం...
అలా అని అత్తలంత చెడ్డ వాళ్లనడం లేదు....మంచి అత్తలు ఉన్నారు...ఈ సారి కోడళ్ళ వంతు...వచ్చి రాగానే కుటుంబం లో స్పర్ధలకి కారణమై (ఇక్కడ ఆ పిల్ల భర్త పాత్ర చాలా ముఖ్యం, అతగాడు అమ్మ నాన్నల్ని ఆలి ని ఎలా సమన్వయ పరిచాడు అన్నది అతి ప్రధానమైనది, భార్య ని సాకుగా చూపి బాధ్యతల నుంచి పరి పోయే పురుష పుంగవు లు కూడా లేకపోలేదు ) భర్త ని ఒంటరి ని చేసి తమతో తీసుకెళ్ళే వాళ్ళు(ఇక్కడ రెండు రకాలు, భర్తమంచికోరిచెయ్యడం,తమమంచికోసంచెయ్యడం.).
పై రెండు విషయల్లో మొదటి దే ఎకువగా సంభవిస్తున్న విషయం. మరి దీనికి ఆ అమ్మ నాన్నలు ఎలాటి నిర్ణయం తీసుకోవాలి? ఎలాటి పిల్లాడికిచ్చి పెళ్లి చేయాలి?
ముందు గ చూడాల్సింది ఈడు జోడు.... పిల్ల పిల్లాడు చూడటానికి ఎలా ఉన్నారు...వయస్సు తేడ ఎంత ఉందీ...
ఉద్యోగం,చదువు... అతని ఉద్యోగం, చదువు... ఎంత మేరకు అవి మీ పిల్లని పోషించ గలవు..అందులో నిజా నిజాలు ఎంత...
కుటుంబం... ఎలాటి కుటుంబం? మంచి చెడు తెల్సి ఉన్నా , మన పిల్ల దగ్గరకి వచ్చే సరికి మంచి కి అర్ధం మారవచ్చు...కాని తెల్సుకోవడం మంచిది...
ఇప్పుడు ఆస్తులు, వివరాలు...అంటే పెళ్లి చేయగానే వాటి మీద మనకి హక్కు రాదు, అవి వాళ్ళ ఆస్థి, కష్టం, స్వార్జితం...మీరు దీని కన్నా ముందు చూసినవి మీ కూతురు బాగా బ్రతకడానికి కావలసినవి...ఆస్థి అనేది ఒక భరోసా లాటిది...
                                   
మన వైపు నుంచి చెప్పాల్సింది, ఇవ్వాల్సింది....
నిజాయితి గ ఉండటం....మీ వివరాలని నిజాయితి గా చెప్పడం , ఇక భవిష్యతు లో మీరు పెట్ట బోయే లాంచనాల గురంచి ఖచ్చితం గా చెప్పడం..
భరోసా...ఇది ఆర్ధికం గా ఇచ్చేది కాదు...నైతిక బాధ్యత..ఏమి వచ్చిన మేమున్నామని ఇచ్చే భరోసా..అలా అని అత్తింటి వారిని అల్లరి చేసి మొగుడి చేత వీరు కాపరం పెట్టించమని చెప్పడం కాదు, ఎ కష్టం వచ్చినా మీకు మేమున్నామని బాసటగా నిలబడటం....
                               
ఇవన్ని చేసి కూడా కష్ట పడుతున్న తల్లి తండ్రులు, ఆడపిల్లలు ఉన్నారు... మన ఖర్మ, దాని రాత అలా రాసి పెట్టి ఉందని బ్రతుకంత కుళ్ళి పోతున్న వాళ్ళు, ఎంత పెద్ద కష్టం వచ్చినా పరువు అనే ముసుగు వేసుకొని ఆడపిల్లల్ని తోడేళ్ళ గుంపు లాటి కొంపల్లో వదిలేస్తున్న వాళ్ళు....
కాని ఆడపిల్ల ని ఇచ్చేపుడు జాగ్రత్త పడండి... ఎందుకంటే వాళ్ళు 'ఆడ' పిల్ల లు కాదు, మన ఇంటి మహాలక్ష్ములు....
ఈ తరం ఎంత మారిన....ఆడ వాళ్ళు బరితెగిస్తున్నారని ఎన్ని వార్తలు వస్తున్న..ఆర్ధికం గా ఎంత ముందడుగు వేసినా...పెద్ద  పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా...
 ఆ లాలిత్యం, అమ్మ తనం, సహనం, ఓదార్పు ఇవన్ని ఇవ్వగలిగింది ఆడది మాత్రమే..ప్రకృతి కి ప్రతీక....చేతనైతే బంగారం లా చూసుకోండి , బాధపెట్టద్దు....అమ్మ,అక్క,చెల్లి వీళ్ళంతా ఎలానో ఆలి కూడా అలానే , అత్త అమ్మ అవుతుంది కోడల్ని కూతురిలా చూడగలిగితే...ఆడపడుచు స్నేహితురాలు అవుతుంది పట్టు విడుపులు వదిలేస్తే, కోడలు కూతురౌతుంది అత్త లో అమ్మని చూసుకో గలిగితే
చాలా మంది నా మీద కి యుద్ధానికి రావచ్చు... ఏమయ్యా మరి అబ్బాయిల కష్టాల గురించి చెప్పవే అని...ఎక్కువ జరుగుతున్నవి ఆడవాళ్ళ కి సంబంధించినవే...
ఇందులో చాలా అపోహ లు, సొంత అభిప్రాయాలూ, తప్పులు ఉండవచ్చు... నా ఉద్దేశ్యం మన కళ్ళ ముందు భద్రం గ పెరిగి, కొత్త చోటుకి వెళ్లి కష్టాలు పడుతున్న మన ఇంటి ఆడపిల్లల గురించి చెప్పడమే....


మన గమ్యం ఎటు వైపు

మనమెక్కడకి పోతున్నాం .....

చేతులారా మనకున్న వనరులని నాశనం చేసుకుంటూ...మన పరిధుల్ని కుదించుకుంటూ...పక్క వాళ్ళతో సంబంధాలను తగ్గించుకుంటూ...మనం గీసుకున్న గిరి లో ఒంటరి గా ఎందుకు మిగులుతున్నాం..

మన దేశం లో మన పెద్ద వాళ్ళు ఊహించి ఉండరు, మంచి నీళ్ళు కొనాల్సి వస్తుందని....

  మంచి నీళ్ళు ఎందుకు కొనాల్సి వస్తుంది? శుద్ధమైన నీరు దొరక్క..నీరు పరిశుద్ధంగా ఎందుకు లేదు? 

ఒకప్పుడు  మా ఊర్లో వ్యవసాయం కోసం తీసిన కుంటలే మంచి నీటికి ఆధారం..ఊర్లో అక్కడక్కడా గిలక బావులున్నా అవి తాగడానికి ఉపయోగించే వాళ్ళు కాదు...పాక్కనే పారుతున్న పాలేటికీ వెళ్లి నీళ్ళ చెలమల్లో తెచ్చుకునే వాళ్ళు.. కొన్నాళ్ళకి ఏటి నుంచి ఊర్లోకి పైపులు వేసి నీటిని సరఫరా చేయడం మొదలు పెట్టారు..అలా పోను పోను కుంటల వాడకం తగ్గిపోయింది.కావిళ్ళు మూలాన పడ్డాయి..ఏటి లో నీళ్ళు రుచి గా లేకపోవడం తో మళ్ళి కుంట కి వెళ్లారు, కానీ అలవాటు తప్పేసరికి తాగలేకపోయారు...ఇపుడు నీళ్ళ బబుల్స్ రాజ్యం చేస్తున్నాయి ... ఇంటికి తెచ్చివ్వడం, రుచి గ ఉండటం ఇలాటి చాల కారణాలు....దీని కన్నా ముందు వాటర్ బాటిల్స్ లో అమ్మడం మొదలెట్టారు...అవి ప్రైవేటు కంపెనీ లకి కట్టబెట్టి అందులో ప్రభుత్వానికి అతి తక్కువ లాభం తీసుకుంటూ ఎన్నో వనరుల్ని ధారా దత్తం చేసారు...దీని వాళ్ళ కొంత మంది వ్యక్తులు బాగుపడ్డారు..దీని వల్ల ప్రజలు సోమరులయ్యారు...

ఈ రోజు రైతు పరిస్థితి ఏంటి..మనకెందుకులే అనుకుంటున్నారా? 
నిన్న మార్కెట్ కి వెళ్తే బోర్డ్ మీద 16 రూపాయలున్న కూరగాయలని నిలువునా 20 కి అమ్ముతున్నారు..ఏంటిది అంటే కొంటె కొనండి లేకపోతే పొండి...అన్న సమాధానం.ఎవ్వరు ఏంటని అడగరు, ఒక వేళ ఎవరైనా అడిగితే వాడికి తోడుగా ఎవరు నిలవరు..ఇది కాకా హేళనగా చూసి 'బయల్దేరాడండి దేశాన్ని ఉద్దరించడానికి' అని ఓ మాట ని పోతారు...మనంత స్వార్ధపరులు, పిరికి వాళ్లు ఎక్కడ ఉండరేమో...

ఈ రోజు 32 రూపాయలు అమ్ముతున్న మిర్చి రైతు కు ఇచ్చేది మాత్రం 15 రూపాయలే....ఎం మిగులుతుంది..అసలెందుకు వ్యవసాయం చెయ్యలయ్యా? ఒక పని చేస్తే రైతులమే అన్ని పంచుకుంటాం, ఇంకెవరికి ఏమి అమ్మం...అంటే వస్తు మార్పిడి, వడ్లు ఇచ్చి పప్పు ధాన్యాలు...ఇలా చివరికి ఏదైనా పని కావాలన్న అంటే వైద్యుడు వైద్యం చేసిన ఇచ్చేది అదే...ఒకప్పుడు ఇలానే కదా జరిగేది....ఇప్పుడు అదే చేస్తాం అంటే..ఎం చేస్తారు మీరు ? పంది కొక్కుల్లా మేస్తున్న ఈ రాజకీయ నాయకులూ, దళారులు ఎం చేస్తారు? మా దగ్గర డబ్బులున్నాయి కావాలంటే బయట కొనుక్కుంటాం అంటారు .... న్యాయం గా అయితే రైతు కి ఎంత రావాలి..మనం ఎంత ఖర్చు పెడుతున్నాం..అది కనుక అంత రైతు కి వెళ్తే ఎంత సంతోష పడతాడో తెల్సా, ఈ పని మీ వల్ల కాదు వెళ్లి ఏదైనా ఉద్యోగాలు చేస్కొండి అని తన కన్నా బిడ్డలని దూర తీరాలకి పంపడు...కష్టపడతాడు...మంచి పంటని ఇస్తాడు ...ఈ నాడు వ్యవసాయం చేస్తున్న అంటే కనీసం పిల్లనిచ్చే వాడు కరువయ్యాడు...మరి రైతు అంత చులకన అయ్యాడు ..... ఇలా ఉంటె రైతు ఎందుకు వ్యవసాయం చేస్తాడు? అందరు కుల వృత్తులు వదిలేసి కంప్యూటర్ ఇంజనీర్ లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే తనకేం ఖర్మ..కాని రైతు కి పొలం తో విడదీయని బంధం ఉంటుంది, దాన్ని వదులుకోవడం చాల కష్టం, అందుకే ఇంకా పొలాల్లో పడి కష్టపడుతున్న వాళ్ళు చాల మందే ఉన్నారు... కూలికి మనుషులు దొరక్క బాబ్బాబు రమ్మని బ్రతిమలుకుంటూ..ఏమో చెప్పాలంటే ఈ టపా సరిపోదు....మరి రైతు ని ఇలా చేస్తుంది ఎవరు ? వ్యవసాయం ఇలా అయితే మన పరిస్థితి ఏంటి అని ఎవరికైనా పట్టిందా? చేతులారా మనమే చేసుకోడం లేదా? 

కోర్టు- ఈ మాట అంటే మనందరికీ చెమటలు పడతాయి...దాని చుట్టూ తిరగాలేమని, దూరం గ ఉండమని చెప్తారు...ఎందుకలా? ఎన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి? ఎందుకిన్ని వాయిదాలు పడుతున్నాయి? ౧౦౦ మంది దోషులైనా శిక్ష తప్పించు కోవచ్చు కాని ఒక్క నిర్దోషి కి  కూడా శిక్ష పడకూడదని చట్టం చెబుతుంది...ఇది నిజమా? అలా జరుగుతుందా? ఎంత మంది తప్పించుకోవడం లేదు? మరి ఎవరు బలౌతున్నారు? అస్సలు కేసు ని ఎందుకు వాయిదా వేస్తారు? అన్ని ఉన్న వాయిదా పడుతుంది...ఇలా అయితే ఎవడు భయపడతాడు? తప్పు చేయడానికి ఎవడైనా జంకుతాడ? మా పక్క ఊర్లో డబ్బులు తిన్న పోలీసు ఎస్ ఐ తప్పు చేసిన వాడికి వంత పాడి, నిర్దోషుల మీద FIR రాసి కోర్టు లో వేస్తే వాళ్ళు ఇప్పటికి తిరుగుతూనే ఉన్నారు, కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు....కసబ్, అఫ్జల్ గురు లాటి వాళ్ళు ప్రశాంతం గా ఉన్నారు? దేనికిదంతా ? బధ్రత  ఏది?

చదువులు...అన్ని ఆంగ్ల మాధ్యమం లోనే...తెలుగు చాలా మందికి రాదు ఈ మాట చాల మంది తల్లి తండ్రులు మురిసిపోతూ చెప్పుకుంటారు..ఈ పిల్లలే రేపు ఆ కన్న వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు..మేమింత చేస్తే అని అప్పుడు ఏడుస్తారు అది వేరే సంగతి...మరి ఈ చదువులు దేనికోసం, ఉద్యోగాల కోసమేనా? ఆకసం లో ఫీజులు...డొనేషన్ లు చిన్న నాటి నుంచే అమిత భారం వేస్తూ..ఆట పాట లకి దూరం గ ఉంచుతూ మర మనుషుల్లా తాయారు చేస్తున్నారు? దేని కోసం ఇదంతా ? 

ప్రచార మాధ్యమాలు-- టీవీ లు వార్త పత్రికలూ...ప్రత్యేకించి ఒకరిని బలపరుస్తూ అదే నిజమని జనాల్ని నమ్మిస్తూ నైతిక విలువలు, సామజిక స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు...ఇది ఒక బ్రతుకేనా...విలువలకి కట్టుబడి ఉన్న ఒక్క ఛానల్ ని చూపించండి...నేనైతే దూరదర్శన్  అంటాను...వీళ్ళంతా మనల్ని ఎటు వైపు నడిపిస్తున్నారు? దిగజారిపోయారు...సగం సమాజం ఇలా కావడానికి వీళ్ళు ముఖ్య కారణమని నేను నమ్ముతాను....

పర్యావరణం-- ఇది నానాటికి తీసి కట్టు అవుతుంది...కారణం మనమే...మనిషి స్వార్ధం ఇందుకు కారణం..అడవులు కూడా పూల కుండీలలో పెంచే రోజు వస్తుంది...

రాజకీయనాయకులు....మన దేశ రాజకీయ  నాయకుల  కంటే కసబ్ లాటి వాళ్ళు మేలు...కనీసం వాడొచ్చి ఈ రాజకీయ నాయకులని చంపినా పోయేది.వద్దులే జాలితో వాళ్ళ పెళ్ళాం పిల్లలు వస్తారు పాలించడానికి 

డబ్బున్న వాళ్ళు గాలి కొంటారు, నీరు కొంటారు దేన్నైనా కొనగలరు...మనం భవిష్యత్తులో పాకులాడబోయేవి  అన్ని గతం లో ఇప్పుడు ఉచితం గా ప్రకృతి ఇస్తున్నవే..అవే మనకి అవసరాలు...చేతులారా మనం నాశనం చేసుకొని రేపు వాటికి కోసం వెంపర్లాడ బోతున్నాం...ఆ రోజు నాకు చూడాలని లేదు...మన తరువాతి తరం మనం చేసిన తప్పు కి శిక్ష అనుభవించ బోతుంది....అప్పుడు వాళ్లకి కావాల్సింది ఆడి కార్లు, duplex ఇల్లు, బ్యాంకు బాలన్సు కాదు..పచ్చని నేల, శుబ్ర్హమైన గాలి, మంచి నీరు...ఒకటి నిజం మనల్ని అమ్మ నా బూతులు తిట్టుకుంటారు...కాని వాళ్లకి ఇవన్ని ఉన్నాయని తెలియక పోతే అదే ప్రపంచం అవుతుంది...

 దయచేసి మేలుకోండి..ఎవరో స్వార్ధం కోసం మనం, మన భావి తరాలు బలి కాక ముందే 



ఈ రాజకీయాలు ఎవరికోసం?


రాజకీయాలు మనకి కాదు అని మనం అనుకుంటూనే ఉన్నాం...మనకి మంచి జరగడం లేదని బాధ పడుతూనే ఉన్నాం. ఎక్కడో ఓ సామెత విన్నట్టు గుర్తు, మట్టి పనికైనా మన వాడిని పంపాలని. మరిప్పుడున్న రాజకీయ నాయకులూ ఎవరికేమి చేస్తున్నారు? మీరు గమనించారా? అందరు వాళ్ళు పదవుల్లో ఉండటానికి, వాళ్ళ తరువాతి వాళ్ళకి సరి ఐన దారిని ఏర్పరుస్తున్నారు. ఇంకా చాల అభియోగాలున్నాయ్..అవన్నీ మనకి బాగా తెల్సు.

ఇప్పుడున్న రాజకీయనాయకులలో ఎక్కువ మంది వ్యాపారస్తులు, రాజకియాన్నే వ్యాపారం గ చేసుకున్న వాళ్ళు, రౌడీ లు, గుండా లు, హంతకులు ఇలా నేర చరిత్ర కలిగిన వాళ్ళు, కుల ప్రాతి పదికన రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు....ఇలా.
వీళ్ళు ఎవ్వరికి మంచి చేయగలరు?

నష్టపోతున్నది ప్రజలు, తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న వాళ్ళు నిజంగా తమ ప్రతినిధులా? ఇక గత్యంతరం లేక ఎన్నుకున్న వాళ్ళు..అందునా 100 మంది ఉన్న నియోజక వర్గం లో 4 పార్టీ లు ఎన్నికలలో పాల్గొంటే, అందులో 40 మంది వోట్లు వేసే అర్హత ఉండదు(పిల్లలు, యువకులు ). ఇక మిగిలిన 60 లో 20 మంది వోట్లు వెయ్యరు. ఆ మిగిలిన 40 లో 4 పార్టీ లకి వోట్లు వేస్తే అందులో అత్యధికం గ వోట్లు వచ్చిన పార్టీ ఆ నియోజక వర్గం లోని 100 మంది ని పాలిస్తుంది. మహా అయితే ఆ పార్టీ కి 20 వోట్లు వస్తాయేమో. మరి ఆ పార్టీ కి అందరిని పాలించే హక్కు ఉందా?

ఎక్కడైనా సమస్యలు ఎవరికీ వస్తాయి? ప్రజలకి అనకండి. అది నిజమే , కాని అందులో కొన్ని వర్గాలు కనుక బాగుంటే ప్రజలు అందరు బాగుంటారనే నా ఉద్దేశ్యం.

 అందులో మొదట గా వచ్చేది రైతులు. ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసేది ముందు రైతులనే. ఎందుకంటే వాళ్ళలో ఐకమత్యం ఉండదు. మాకు ఇది కావాలని అడగరు. అడిగిన వాళ్ళని కాల్చిపడేసినా దిక్కు ఉండదు. ఎవడు అడుగుతాడు? అడగడానికి వాడిది నా  వర్గం కాదు కదా..నా కులం కాదు కదా..బడుగు రైతు ఉంటె ఎంత పోతే ఎంత...ఆశ్చర్యం గా వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువ వోట్లు వస్తాయి. కాని వాళ్ళ ని ముక్కల్లు గా చేసి...కుల,వర్గ,ప్రాంత ప్రాతిపదిక మీద విడగొడతారు. నేను ఖచ్చితం గా చెప్పగలను అత్యంత దగపడేది ,నష్టపోయేది రైతే. మరి రైతు సమస్యలని ఎవ్వరు తీరుస్తారు? చంద్రబాబు పద యాత్ర చేసినా, జగన్ ఓదార్పు చేసినా, నారాయణ, రాఘవులు పొలాల్లో పడి తిరిగినా  అది వోట్ల కోసమే. మరి ఎవరున్నారు? అడగడానికి? ఎవరో రైతు నాయకులట అప్పుడప్పుడు వినిపిస్తుంది నాకీమాట? ఎవరు వీళ్ళు ఎలా ఉంటారు? మరి రైతు సమస్య వినిపించడానికి ఒక రైతు అసెంబ్లీ కి వెళ్ళ లేడా?

చేతివృత్తుల వాళ్ళు..చేనేత కార్మికులను చూస్తూనే ఉన్నాం...మరి వీళ్ళ సమస్య వోట్ల కోసం వచినప్పుడో , ఎవరైనా చచ్చినప్పుడో తప్ప గుర్తుకు వస్తుందా ?  మరి వీళ్ళ బాధ చెప్పడానికి ఒకరు కావాలి..

ఉద్యోగులు (ప్రభుత్వ) . వీళ్ళు ఎలా ఐనా వాళ్ళ కోరికల్ని తీర్చుకోగాలరని నా నమ్మకం. వాళ్ళు స్వార్ధపరుల్లా ఉన్నంత కాలం దేశం , సమాజం బాగుపడదు.కాని వీళ్ళ అవసరాలు కూడా సకాలం లో తీరిస్తే, వీళ్ళని సరిగ్గా నడపగల,వినియోగించుకోగల  నాయకుడు ఉంటె  వీళ్ళు దేశాన్ని నిలబెట్టగలరు. వీళ్ళలో ఉపాద్యాయులు,డాక్టర్లు,పోలీసులు,న్యాయవాదులు ఇలా ఎంతో మంది ఉన్నారు.మరి  వీళ్ళ సమస్యలను వినిపించడానికి ఒక ప్రతినిధి అసెంబ్లీ కి వెళ్ళ లేడా? 

విద్యార్దులు, వీళ్ళకి వోటు హక్కే సరిగ్గా లేనప్పుడు అనకండి...దేశాన్ని సక్రమం గా నడపడానికి వీళ్ళు ప్రాణం లాంటి వారు. వీళ్ళకి సమస్యలు లేవా? ఉంటాయి. అవి తల్లి తండ్రులు , గురువులు చూస్తారు...కాని ప్రపంచాన్ని గురించి బాధ పడేది, ఆలోచించేది ఈ యువతే..మరి ఇలాటి యువత కి ప్రతినిధి గా ఒకరు అసెంబ్లీ కి వెళ్ళ లేరా?

వ్యాపారులు, ఉన్నదంతా వీళ్ళే కదా అనకండి. బాగు పడుతుంది బడా వ్యాపారులే తప్ప..చిన్న వాళ్ళు కాదు...ఈ రోజు వాల్ల్మర్ట్ లాంటి పెద్ద కంపెనీ లు వచ్చి చిల్లర దుకాణాలను మింగేస్తుంటే ఒకరైన కిక్కురుమనలేదే? మరి వాళ్ళ కోసం ఒకరు కావాలి గా?

ఇలా ఒక ప్రజా వర్గానికి ప్రతినిధి గా పంపబడిన వాళ్ళ పని తీరుని పరికించే హక్కు ప్రజలకు ఇవ్వండి..పని చెయ్యకపోతే, పక్కన పెట్టేస్తాం జాగ్రత్త అన్న హెచ్చరిక ఉంటె ఎవడైనా పని చెయ్యక చస్తాడా?
మరి అసెంబ్లీ నిండా ఉన్నది ఎవ్వరు?వీళ్ళు వాళ్ళ కోసం తప్ప ప్రజలకోసం కాదని రుజువులు అక్కరలేదు....చెప్పండి మీరు నిజంగా ప్రజల మేలు కోరే వారైతే (పిచ్చి ప్రశ్న కదా ), ప్రజల సమస్యలు తెల్సిన , తీర్చగల ప్రజల లోంచి వచ్చిన మనిషిని నిలిపి గెలిపించ గలరా?  వాళ్ళ కోసం చట్టాలను కాంగ్రెస్సు పార్టీ CM  ని మార్చినంత సులువుగా మార్చగలరు. ఉదాహరణకి అదేదో వాళ్ళ చుట్టాలని వాళ్ళతో పాటు ఉచితం గా ప్రయాణించవచ్చు అన్న చట్టాన్ని చిటికెలో ఆమోదింప చేసుకున్నారు. మరి మిగతావాటికి నిధులు ఉండవు కదా..
ఎన్నో వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి..నల్లగొండ లో శుబ్రమైన నీరు లేక దశాబ్దాల నుంచి అనారోగ్యం లో పడి కొట్టుకుంటుంటే, పక్కనే కృష్ణ నది ఉండి వాళ్ళు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎక్కడో హైదరాబాదు లో ఉన్న మినెరల్ వాటర్ ప్లాంట్ కి నీళ్ళు ఇవ్వడానికి కృష్ణ నుంచి పైపులు వేసి అతి తక్కువ ధరకి నీళ్ళు ఇస్తారా? మా పంట పొలాలని సెజ్ ల పేరు చెప్పి ఎవడికో  దోచి పెడతారా? అడిగితే చంపుతారా? కరువు ప్రాంతాలు..గిరిజన ప్రాంతాలలో వ్యాధులతో ప్రజలు చాచ్చిపోతుంటే ఎవరు పట్టించుకున్నారు? ఎవరికోసం ఈ రాజకీయం?
ప్రతి వర్గానికి కొందరు చొప్పున ప్రతినిధులుగా వెళ్ళగలిగినప్పుడే అన్ని వర్గాలవారికి( ఇక్కడ కులం కాదు,మతం కాదు,ప్రాంతం కాదు ) న్యాయం జరుగుతుంది. కాని దీన్ని ఎవ్వరు అమోదించరు. అక్కడ  కూడా మేమంటే మేమని   వీళ్ళలో గొడవలు వస్తాయేమో.  

ఏదో రాయాలనుకున్నా. అది అందరికి మంచి చేయలేకపోవచ్చు. కాని మాకేదో జరుగుతంది ఆశపడే వాళ్ళ కోసం ఎవరున్నారు? అది ఎవరౌతారు? ఒక రైతు, ఒక విద్యార్ధి, ఒక చిరు వ్యాపారి, ఒక చేనేత కార్మికుడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ని అసెంబ్లీ లో చూడగలమా?

కలే కాబోలు.. 


ఈ రోజు కొన్ని ఆసక్తి కరమైన సంఘటనలు జరిగాయి. నాకు మాత్రమే ఆసక్తి కలిగించాయి.

మొదటిది..
 శ్రీ రామరాజ్యం చిత్రం విడుదల సందర్భం గా ఎవరో రజక సంఘం నాయకుడట కోర్టు కి వెళ్ళాడు. ఎందుకో చెప్పనా..చాకలి తిప్పడి పాత్రని తొలిగించాలని, దాని వల్ల వారి మనో భావాలూ దెబ్బ తింటున్నాయట. 
 విచిత్రం గా ఉన్నా ఇది ప్రస్తుతానికి ట్రెండ్. ఏం చేసినా ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బ తింటున్నాయి ఈ మధ్య. రామాయణం లో వారధి కట్టే టపుడు , తన వంతు సహాయం చేసి ఉడుత చరిత్ర లో నిలిచిపోయింది. అందరు రామాయణం లో భాగస్వామ్యులు అయినందున ఆనంద పడ్డారే కాని, ఎవరు మనో భావాలు చూసుకోలేదు.ఇది పురాణం, కొంత మంది కి పుక్కిట పురాణం. కాని మన సంస్కృతిని , దేశాన్ని గౌరవించే వాళ్లకి ఇది మాత్రం మహా గ్రంధం. ఎన్ని సార్లు చదివినా, అందులో రావణుడు కూడా గొప్ప గానే కనిపిస్తాడు. ఒకప్పుడు ప్రతి ఒక్కరు వారి వృత్తులని గౌరవించేవారు. ప్రతి ఒక్కరికి పరస్పరం అవసరం ఉండేది. అందరు ఒకరి మీద ఒకరు ఆధార పడి బ్రతికేవాళ్ళు. కుల వివక్ష ఉండేది..దాని మీద చైతన్యం తీసుకురాకుండా దాన్ని రాజకీయం చెయ్యడం మాత్రం ఇప్పుడే మొదలయింది. ఇప్పుడు ఎవ్వరు కుల వృత్తులు చెయ్యడం లేదు. ఎంతో మంది చదువుకుంటూ మంచి ఉద్యోగాల్లో బ్రతుకుతున్నారు. ఐన సరే కాదేది కవిత కనర్హం అన్నట్టు....

రెండవది..

నేను ఈ రోజు కూరగాయల మార్కెట్ కి వెళ్లాను. మధ్యాహ్నం కావడం తో జనాలు పల్చగా ఉన్నారు. నాక్కవల్సినవి కొనుక్కుంటు, దోసకాయల దగ్గర ఆగాను. KG 10 రూపాయలు. ఇద్దరు దంపతులు వచ్చారు. ఆవిడ అడిగింది , అమ్మే వాడు కొలుస్తున్నాడు. ఈ లోగ ఆవిడ ఏరుతున్నట్టు ఒక కాయ తీసి ఆమె సంచిలోకి జార వేసింది. నేను ఆమెను చూస్తున్నాను. ఏమి జరగలేదన్నట్టు గా దోస కాయలు సంచిలో పోయించుకొని ఎంచక్కా వెళ్ళిపోయింది. నాకైతే చాల నవ్వు వచ్చింది.ఎవరన్న చూస్తే, అల్లరి చేస్తే , ఎంటమ్మ ఈ పని అని నిలదీస్తే? అంటే ఎప్పుడన్నా ఇలా చేయాలన్న సరదా అందరికి ఉంటుందేమో కదా. కాని ఇది మనతో మన పిల్లలు ఉండి చూస్తే తప్ప కుండ అది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. లేకుండా చేయమని కాదు, ఇలా చేస్తూ ఛి ఏంటి దేశం ఇలా అయిపోతుంది అనే ఎడవకుంటే చాలు. 

మూడవది 

the davenci code అనే సినిమాని తెలుగులోకి అనువదించారు. అదే చూస్తున్న. ఒక సన్నివేశం, హీరో ని ఒక పోలీసు ఒక మ్యుజియం లోకి తీసుకు వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక పిరమిడ్ ఉంటుంది. అది చూసి హీరో అంటాడు " ఇది పెద్ద కళంకం " అని. నేను దిగ్బ్రాంతి చెందాను (ఖంగారు పడకండి ఎవరి మృతికి కాదు ). అది కళాఖండం కదా ని ఓ సారి వెనక్కి వెళ్లి చూస్తే నిజమే "కళాఖండం కాస్తా కళంకం అయింది ". ఆ సినిమా ఇంగ్లీషు లో అర్ధం కాదని ,తెలుగులో చూద్దాం అనుకున్నందుకు తగిన శాస్తే జరిగింది. మనకి తెలుగు లో కొన్ని అక్షరాలూ తీసేశారు కదా , ఋ, లు (తీసేసిన  లు ),బండి ర , ఇలా. అలానే కొన్ని పదాలు కూడా చచ్చి పోయే రోజు దగ్గరలో ఉండి. దాని స్థానే ఇంగ్లీష్ పదాలు చేరిపోతున్నాయి. పచ్చి తెలుగు లో మాట్లాడుకుందాం అంటే మనకే సిగ్గు గా ఉంటుంది, ఏంటి పదాలు అని. కోపం వస్తుంది కదా, ప్రయతించి చూడండి. ఎందుకంటే మనం ఇప్పటి భాష కి అలవాటు పడిపోయాం.

నాలుగవది 
మనం రోడ్ టాక్సు ఎందుకు కడుతున్నాం? ఇలాటివి అడగద్దు. కట్టమంటున్నారు , కడుతున్నాం అంతే అంటారా!  అంతేలెండి.కట్టడం వరకే మన వంతు, అది ఎలా ఉపయోగపడుతుందో తెలీదు , అవసరం లేదు. బాగా ఇబ్బంది వస్తే (అంటే రోడ్లు బాగాలేకనో, ప్రభుత్వ సేవలు బాగాలేకనో) ఛి *(*()&(*&%&^%&@#$ అని నాలుగు బూతులు తిట్టుకొని జన జీవన స్రవంతి లో కల్సిపోతుంటాం. ESI  నుంచి బొరబండ మీదుగా HItech సిటీ కి వెళ్ళే దారి ఉందీ, అద్భుతం. దాన్ని రోడ్డు అనడం కంటే పేరు దొరకడం లేదు, మేరె ఏదో పెట్టేసుకోండి. ఈ రోడ్డు చూసాకే నాకు రోడ్ tax   గుర్తు వచ్చింది. అంత దారుణమైన రహదారి పల్లెటూర్లో కూడా చూడలేదు. నిత్యం కొన్ని వేల వాహనాలు తిరిగే దారి ఎలా ఉండాలి? అన్ని గుంటలే , కాదు గుంతల మద్యలో అక్కడక్కడ రోడ్డు ఉందీ. ఇరుకు దారి, దుమ్ము లేపుతూ RTC బస్సులు , లారీలు , ఆటో లు , క్యాబులు..బైక్ మీద పోతే వారం రోజుల్లో మీరు మీ బండి షెడ్డుకెళ్ళడం ఖాయం.
ఇది కాకుండా నగరమంతా ఎక్కడ పడితే అక్కడ ఆపే పోలీసులు, ట్రాఫ్ఫిక్ పోలీసులు. అన్ని అడుగుతారు. RC , license , insurance , pollution check . అస్సలు pollution   check ఎందుకో నాకు అర్ధమే కాదు. నన్ను ఆపి నాచేత చలాన్ కట్టించుకుంటూ ఉంటె నా ముందే ఎన్నో ధూమ శకటాలు నల్లటి పొగ వదులుతూ వెళ్తూ ఉంటాయి. ఏమిటిది అని అడిగితే ఎక్కడ ఇంకో వంద అంటారని వచ్చేయ్యడమే. మీకు తెల్సా ఈ  pollution check ఎందుకో? నాకు అనిపిస్తుంది , ఎవరికో డబ్బు కోసం ఏదో కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం మొదలుపెట్టిందే అని. ఎంత పొగ వచ్చే బండి కైనా , expire (కాలం చెల్లని ) కాని pollution check ఉంటె చాలు దర్జాగా తిరగచ్చు. ఈ రోడ్ల మీద మనకి మైలేజి రాదు, బండి పాడు అవుతుంది ఐన సరే వీళ్ళు రోడ్లను సరిగ్గా పట్టించుకోకుండా మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. సిగ్గు మాలిన బ్రతుకులు అనాలనిపిస్తుంది కదా...ఉద్యోగులది కాదు ప్రభుత్వానిది.