వినోద్ ది మా పక్క ఊరే.నాకన్నా రెండేళ్ళు జూనియర్. మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. వేరే ప్రాజెక్ట్. కాఫీ మెషిన్ దగ్గర కాఫెటేరియా లో కనబడితే కబుర్లు చెప్పుకుంటాం. "ఏంటి భయ్యా, వీళ్ళ గోల. తోముతున్నారు మరీ. ఫ్లాట్ కొన్నావటగా . పార్టీ  ఎప్పుడు?". నేను నవ్వాను."నవ్వితే కుదరదు, పెళ్లి రోజు కూడా ఇలానే తప్పించుకున్నావ్. నిన్ను కాదులే వదినని అడుగుతా" అన్నాడు. "ఓ రోజు చూద్దాం. ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వగానే". "నువ్వు మర్చిపోయినా  నేను మర్చిపోను. ఉంటా భయ్యా, మళ్ళీ మా లీడ్ వెతుక్కుంటా వస్తాడు.బై" అని వెళ్ళిపోయాడు. కొత్త ఇల్లు, నిజమే. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను?  కాఫీ మెషిన్ లో పెట్టిన కప్ నిండింది. కప్ తీసుకొని, నా కేబిన్ వైపు కదిలా. చుట్టూ చూస్తే నాలా చాలా మంది, మెషిన్ కి అతుక్కుపోయి నిర్జీవమైన యంత్రాల్లా పని చేస్తున్నారు. ఓ నవ్వు నవ్వుకొని, నా కేబిన్ లోకి వెళ్లాను. టీం మీటింగ్ ఉంది. ఇక నా పనిలో దిగిపోయా.

సాయత్రం 6 కి బయల్దేరాల్సిన నేను 8.30 కి బయలుదేరా. ఇంటికి వచ్చేసరికి 10 ఐంది. మధు వచ్చేసరికి 12 అవుతుంది. తనది UK షిఫ్ట్. ఇంట్లో అంతా శుభ్రంగా, అన్నీ సర్ది పెట్టి ఉన్నాయి. ఎంత ఓపికా, మనసు నవ్వింది. అలానే కూలబడ్డాను.మగత గా ఉంది.అమ్మ, అమ్మ కి కాల్ చేయాలి. రింగ్ చేసాను, ఎత్తలేదు. నిద్రపోయి ఉంటారేమో. మళ్ళీ చేయలేదు. కాసేపటికి అమ్మ నుంచి ఫోన్ "ఏ నాన్నా లేట్ అయిందా, తిన్నావా. అమ్మాయి ఇంకా రాలేదా?". "మా, నేను బావున్నాను. మధు ఇంకా రాలేదు. షిఫ్ట్ మారింది కదా. లేట్ అవుద్ది. నాన్న ఏం చేస్తున్నాడు? నీకు ఎలా ఉంది?". "మేం బావున్నాం రా. ఏం ఆలోచనలు పెట్టుకోకు.ఊరికి రావడానికి వీలౌతుందా? చూడాలని ఉంది"."నాకూ రావాలనే ఉంది మా. తనకి కూడా లీవ్ దొరకాలి." "సరే రా. వీలు చూసుకొని వచ్చి వెళ్ళండి." "అలాగే అమ్మ". మనసు నిండా ఏవో మాటలు, గొంతు నొక్కేసినట్టుంది. ఫోన్ ఇంకా డిస్కనెక్ట్ కాలేదు."మా","వంశీ, ఆలస్యమైంది రా. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉండనా"."అలాగేనమ్మా". డిస్కనెక్ట్ అయింది. మనసంతా వెలితిగా ఐంది. ఎన్ని కబుర్లు చెప్పే వాడిని అమ్మకి. రోజు ఎదో ఎడ తెగని మాటలు.వంట మొదలు పెట్టి తినిందాకా అలా సాగుతూనే ఉండేవి. నాన్న  ఉడుక్కునే వాడు, "ఏరా? ఏం మాట్లాడుకుంటారు మీరు." అని. "నీకెందుకు అన్నీ" అని మా అమ్మ ఓ విసురు విసిరేది. నాన్న పెదాల మీద చిరునవ్వు.

మా ఇల్లు.పెద్ద పెంకుటిల్లు, ముందో పందిరి, వెనకాల కూరగాయలు పండించుకోడానికి అనువైన స్థలం. ఇంటిముందు చాలా ఖాళీ స్థలం.రక రకాల మొక్కలు. రెండు కొబ్బరి చెట్లు. నీళ్ళ తొట్టి. ఆ తలపే హాయిగా ఉంది. ఎలా జరిగింది నా చిన్నతనం? నేను చెల్లి, అమ్మా నాన్న. మా ఇల్లు. అమ్మ, నాన్న ఎంత గుట్టుగా నెట్టుకొచ్చారు కాపురాన్ని? ఫలానా శ్రీనివాసరావు, ప్రభావతమ్మ అంటే ఎంత మంచి పేరు. మనసు తెలికపడటం మొదలు పెట్టింది.

మా ఊరు, మేము ఆడుకున్న చోటు, మా పొలం, ఎద్దులు, అమ్మ వాళ్ళ ఊరు. నాన్న గుర్తొచ్చాడు. ఎంత బావుంటాడు నాన్న? ఎంత మంచి కబుర్లు చెప్తాడు? తీరిక దొరికితే ఇద్దరం ఎంత బాగా మాట్లాడుకుంటాం. ఆయన ఆడిన ఆటలు, చేసిన అల్లరి, పడ్డ ఇబ్బందులు, ప్రకృతి గురించి... నాన్నలా, నాన్న అలా ఉండటం నాకే దక్కిన అదృష్టం ఏమో. ఆయనకి వచ్చిన ప్రతి పని నాకు నేర్పే వారు. అమ్మ.. నేనే అమ్మ ప్రపంచం. నాకు ఊహ తెల్సినప్పటి నుంచి అమ్మ ఎక్కడకి వెళ్ళినా నేను తోడు వెళ్ళే వాడిని. అలా అమ్మతో నడిచేప్పుడు నాకు నేనే ఓ రక్షకుడిలా ఫీల్ అయ్యవాడిని. నాన్న తిట్టే వాడు, వీడిని వంట గదిలో కూడా నీకు తోడుగా ఉంచుకో, అమ్మాయిలా అవుతాడు అని. నీకు కుళ్ళు అనేది అమ్మ.ఎక్కడ మంచి చొక్కా కనపడ్డా ఇది మా వాడికి ఎంత బావుంటుందో అని మురిసిపోయేది, ఎలా అయినా దాన్ని తెచ్చేది. మంచి అమ్మాయి కనిపిస్తే ఇలాటి పిల్లని తీసుకురావాలి వాడికి అని ఆశపడేది. ఎన్ని చేసినా తిరిగి అడిగేది చిన్న కోరికలే. అమ్మకి నాతో పాటు బైక్ మీద రావడం చాల ఇష్టం, నా కబుర్లు. నా కొడుకు అని చెప్పడం లో ఎంతో ఆనందం.

ప్రపంచాలు ఏలకపోయినా, వాళ్ళ కి ఏ నాడు మాట తీసుకురాలేదు. ఇద్దరం ఉన్నంతలో జాగ్రత్తగానే చదివాం. స్థిరపడ్డాం. ఏరి కోరి మధు ని కోడలు గా తెచ్చుకుంది. మధు కూడా మాలాటి కుటుంబం వచ్చిన అమ్మాయే. తను కూడా ఓ MNC లో జాబు చేస్తుంది. ఉద్యోగం రాగానే పెళ్లి ఏంటి, సెటిల్ కాకుండా అని ఎవరైనా అంటే. సెటిల్ అవడం అంటే వయసైపోయాక ఓ పది లక్షలు చేతిలో పెట్టుకొని  పెళ్లి చేసుకోవడమా? ఎ వయసులో ముచ్చట ఆ వయసులోనే అన్న అమ్మా నాన్నలని చూసి "మా అమ్మ నాన్నలు కదా " అని మురిసిపోయా. నాకు జాబు వచ్చిన రెండేళ్ళకి పెళ్లైంది.పెళ్ళైన ఓ సంవత్సరం తరువాత ఇద్దరం కలసి ఓ ఫ్లాట్ కొన్నాం. చాలా సంతోష పడ్డాను. మా నాన్న లా నేను కూడా ఓ ఇల్లు కొనాలని నా కల. అప్పటి వాళ్ళలా ఇప్పుడు ఇల్లు కొనలేకపోయినా ఓ ఫ్లాట్ కొనగాలిగాను.

జీవితం అంతా సాఫీగానే సాగిపోతున్నా, ఎదో తెలియని వెలితి. మనుషులు ఏరి? ఎదో అబధ్రతా భావం, కొరత. కాలమనే ప్రవాహం లో పడి కొట్టుకుపోతున్నట్టు,  మనసుకి స్పందన కరువైనట్టు... గుండె నిండా దిగులు గూడు కట్టుకొని మొహమ్మీద చిరునవ్వుని అతికించుకు తిరుగుతున్నట్టు.. దేనికోసమీ పరుగు? ఒక నెల పాటు స్థిమితం గా ఉండగలమా? ఎదో హడావిడి? కమ్యూనికేషన్ పెరిగే కొద్ది మనుషులు, మనసుల మధ్య దూరం పెరిగిపోతుంది.

నేను పెరిగిన వాతావరణం నా ఆలోచనలకి కారణమా? స్వచ్చమైన గాలి లేదు, నీరు లేదు,పలకరింపు లేదు.ఇప్పుడు కష్టపడుతున్నాం, కానీ శారీరక కష్టం లేదు. విపరీతమైన పని వత్తిడి. ఆలోచనలు. ఏం కావాలి బ్రతకడానికి? ఎందుకీ పాకులాట? నెలంతా పరిగెత్తి సంపాదించింది నెలాఖరుకి ఖర్చు అవుతుంది. బురద తో నింపిన చీకటి గదిలో బంధించినట్టు ఊపిరి సలపడం లేదు.

నా చిన్నప్పుడు చాల కష్టపడ్డాం అయినా ఇష్టం గా ఉండేది. అమ్మ నాన్న పొలం వెళ్తే నేను గొడ్లకాడ పేడకళ్ళు ఎత్తి, శుభ్రం చేసి, గొడ్లను కడిగి, నీళ్ళు పెట్టి, మేత వేసి ఇంటికి వచ్చే సరికి ఇందు వంట చేసేది. చిన్న పిల్ల గా  ఉన్నపటి నుంచే పని చేసింది ఇందు. అంత అయ్యాక అమ్మ వచ్చి నా పిల్లలూ బంగారం అంటే తెగ మురిసి పోయేవాళ్ళం. మా నాన్న మాకోసం ఎదోటి తెచ్చే వాడు. జామకాయలో, తేగలో, ఈతకాయలు, పండు దోసకాయలు ఏదోటి. అదే మాకు సంతోషం. చీకటి వేళ ఆరు బయట వెన్నెల్లో నులక మంచాల మీద పడుకొని చుక్కలు లెక్కపెట్టిన రోజులు. తలచుకుంటే మనసు తేలిపోతుంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆదమరచి నిద్రపోయేరోజు ఎప్పుడు వస్తుంది?

నిజమే ఈ వయసులో కాకుండా ఇంకెప్పుడు కష్టపడతాం? కానీ ఆ ప్రయత్నం లో  నన్ను నేను కోల్పోకూడదు, కోల్పోతున్న భావన. నాలో ఉండే పసితనం చచ్చిపోతున్నట్టు ఉంది. మాటలే మరచిపోతున్నా.ఉదయం ఆఫీస్ కి  వెళ్ళడం,పని, రావడం, నిద్ర.వారంతం లో ఏదైనా పని ఉంటె చేసుకోవడం. ఒంట్లో ఎదో నిస్సత్తువ. నేనేనా చిన్నప్పుడు అన్ని పనులు చేసింది? శరీరం లో కొన్ని భాగాలు పని చెయ్యడం మరచిపోతున్న భావన....దేనికోసమో ఎదురుచూపు. నేను పెరిగిన వాతావరణం నన్ను రమ్మని పిలుస్తుంది. నిజమే బ్రతకాలంటే ఎలా అయినా బ్రతకచ్చు. కాకపోతే అది ఎలా అని నిర్ణయించుకోవాల్సింది నేనే. నాకు ఊర్లో బ్రతకాలని ఇష్టం. అమ్మా నాన్న తో,నేను,మధు, నా పిల్లలూ, అత్త మావయ్య, పిన్ని బాబాయ్, తమ్ముళ్ళు..... ఇవన్నీ రేపు నా పిల్లలకి ఇవ్వాలి.

ఓ రకంగా నేను అదృష్టవంతుడిని. మా అమ్మానాన్న అంటారు "అంతలా జీవితాన్ని వదిలి పాకులాడాల్సిన పని లేదు, ఉన్న దానిలో సంతోషంగా బ్రతకచ్చు" అని.ఇప్పుడు  చాల మందిని  చూస్తున్నా, పిల్లలని కన్నది సంపాదించడానికే అన్నట్టు, "ఏం చేసావ్ మాకు" అని అడుగుతున్నారు. ఇంకా ఇబ్బంది పడే అంశం ఎంటటే, ఆడపిల్లల్ని కూడా ఇలానే అడుగుతున్నారు.
 ఒకటి నిజం, మా అమ్మానాన్న నాకు ఇచ్చిన భరోసా రేపు నా పిల్లలకి కూడా ఇవ్వాలి....

తలుపు చప్పుడైంది, మధు. టైం చూస్తే 12.30."ఏంటి ఇంకా తినలేదా?", "లేదు మధు, ఏంటి ఇంత లేట్?". "కాబ్, లేట్ ఐంది". "ఫ్రెష్ అయి రా, తిందాం "....

మర్నాడు, అమ్మ ఫోన్ నా దగ్గరకి వస్తున్నా అని. ఏదో సంతోషం, ఇంకా ఎదో దిగులు, కొంత ఎదురుచూపు......




Without emotion, man would be nothing
but a biological computer. Love, joy,
sorrow, fear, apprehension, anger,
satisfaction, and discontent provide
the meaning of human existence.
Arnold M. Ludwig---1980



మొదటి భాగం http://aakaasavaani.blogspot.in/

"నీకేమ్మా? కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారుగా. నాలుగు చేతుల సంపాదన" అని పొరుగింటి ఆమె అంటుంటే, మనసులో కలుక్కు మంది ప్రభావతమ్మ కి. నిజమే సంపాదనకేం లోటు లేదు. మంచి ఇల్లు, ఓ పదెకరాల పొలం. మంచి ఉద్యోగాల్లో ఉన్న పిల్లలు,అన్నిట్లో తోడూ ఉండే భర్త. ఏం కావాలి ఇక? కానీ సంతోషమే లేదు. ఒక్కొటిగా గుర్తుకు రావడం మొదలు పెట్టాయి అన్నీ.

తనను బావ కి ఇచ్చి పెళ్లి చేసారు. పెద్ద కలిగిన కుటుంబాలు కాకపోయినా, తానంటే బావ కి ఇష్టం.ఇద్దరు పిల్లలు(వంశీ, ఇందు) పుట్టారు. ఉన్న పొలం లోనే పనులు చేసుకుంటూ రోజులు గడచిపోతున్నప్పుడు, వేరు పోవాల్సివచ్చింది. ఏమి తోడూ రాలేదు. ఆయన, నేను, పిల్లలూ. ఓ పాత పెంకుటిల్లు, అందులో మాతో పాటు ఇంకా రెండు కుటుంబాలు.
పందికొక్కులు తొవ్విన బోరియలతో నిండిన ఇల్లు. చేతికి వచ్చిన  పోలంతోనే మళ్ళీ జీవితం మొదలైంది. నిరాశపడ్డా పిల్లల్ని చూసుకుంటే కడుపు  నిండేది. ఇద్దరం కలసి కష్టపడ్డాం. ముందు ఇల్లు కొనుక్కున్నాం. ఓ ఏడాది కొంచెం డబ్బులు చూశాం. దానితో పొలం కొన్నాం. పిల్లలు ఎదుగుతున్నారు. మా ఇద్దరి మనసులో ఒకటే ఆలోచన "పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి". రేయింబవళ్ళు పని. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. పిల్లలు కూడా బాగా చదువుకునే వాళ్ళు. కొన్ని ఒడి దుడుకులు ఎదురైనా ఓ స్థాయికి వచ్చాం. ముందు ఇందుకి పెళ్లి చేసాం. మా తాహతుకు తగ్గ సంబంధం.

ఇక అబ్బాయి కి చదువు ఐపోయి, ఉద్యోగం వచ్చింది. వాడికి మంచి పిల్లని చూడాలని మా ఉద్దేశ్యం. మంచి సంబంధం దొరికింది. అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది. ఓ మంచి ముహూర్తాన, ఘనంగా పెళ్లి జరిగింది.

నాకు వంశీ అంటే చాల ఇష్టం. ఒక్క రోజు వాడితో మాట్లాడకపోయినా ఎదో వెలితిగా ఉంటుంది. పెళ్ళికి ముందు రోజు ఫోన్ లో మాట్లాడే వాడు. కానీ పెళ్ళయ్యాక వాడి దగ్గర నుంచి ఫోన్ రావడం తగ్గిపోయింది. ఇప్పుడు పొలం పనులు లేవు. ఇంట్లో కూర్చోవడమే. మా వారేమో వ్యాపారం చూసుకునే వారు. ఎంత సేపు టీవీ చూడటం, నిద్ర పోవడం, వంట చేయడం ఇదే జీవితం ఐపోయింది. ఎదో ఖాళీ ఏర్పడింది. ఓ నిర్లిప్తత, స్తబ్దత. చూస్తుండగానే, మా ఊరిలో నా లాటి వాళ్ళు పెరగిపోయారు. అన్నీ డుప్లెక్స్ ఇళ్ళు.అందులో బిక్కు బిక్కు మంటూ ఇద్దరు ముసలివాళ్ళు. పల్లెటూరు మూగబోయింది. పెద్ద పండగ కూడా చిన్నబోయింది. పిల్లలే కనపడ్డం మానేసారు. స్మశానం లా అనిపిస్తుంది.

నాకు ఉన్న చిన్న ఆశ వంశీ ఫోన్. వాడి కల్మషం లేని మాటలు, మనసులో ఎంత బాధ ఉన్న ఇలా తీసేస్తాయి. నవ్విస్తాడు. కబుర్లు చెప్తాడు. వాడితో మాట్లాడిన ఆ పది నిముషాల్లోనే నా రోజు చూసుకునే దాన్ని. కానీ వాడీ మధ్య కాల్ చేయడం తగ్గించాడు. నా మనసులో దిగులు పెరుకుపోసాగింది. మా వారు సర్ది చెప్పేవారు. వంశీ కూడా ఫోన్ చేసి "సారీ అమ్మా, పనుల ఒత్తిడి. ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజి లో ఉంది. ప్రెజర్." ఎన్ని చెప్పినా వాడి మాటల్లో మెరుపు పోయింది. ఏదో దిగులు. అయ్యో నా బిడ్డ ఏమైందో వాడికి అని నా మనసులో బాధ. ఓ రోజు మా వారిని అడిగా, వాడి దగ్గరకి వెళ్దాం అని.... సరే అన్నారు. రేపే మా ప్రయాణం..... సంతోషం గా ఉంది.....

తరువాయి భాగం తరువాత .....
ఒకరికోసం ఒకరికి భగవంతుడి ఎంపిక.. ఒంటరి జీవితంలోకి వచ్చే తోడు.. కలల ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి జీవిత కాలపు భాగస్వామి.

కష్టసుఖాల మజిలీలో తోడు నీడా...
ఇద్దరుగా మొదలై, ఒకరుగా కలిసి జీవించే అద్భుతమైన మేళవింపే ఈ భార్యాభర్తలు...
ఆ నాటి వరకు కొత్తవారితో ఒక హద్దు ఏర్పరరుచుకు బ్రతికే మనిషికి ఓ అపరిచితుడితో జీవితకాలపు మజిలి. హద్దుల్లేని ఊసులు....
రెండు కుటుంబాల సంప్రదాయాలు, కట్టుబాట్లు కలిపి ఓ కుటుంబాన్ని, ఓ ప్రపంచాన్ని నిర్మించే సారధులు....
సంసార జీవితం మొదలయ్యాక కళ్ళతోనే మాటలడుకోగల మనసులు...
తాము నిర్మించుకున్న ప్రపంచంలో విచ్చలవిడితనానికి సాక్ష్యులు.....

నా కోసం ఎక్కడో ఎవరో పుట్టే ఉంటారని ఆశపడే మనసుకి, తనలో దాచుకోగల ఓ మనసు దొరికితే....



ఒకానొక కాలం లో, కనపడ్డ ప్రతి నోట్ బుక్ మీద నా డైరీ అని రాసి అందులో ఏది తోస్తే అది రాసే టైం లో.... ట్రియ్యుం ట్రియ్యుం ట్రియ్యుం ట్రియ్యుం  ఫ్లాష్ బ్యాక్ లోకి... అది 2001 సంవత్సరం.... హైదరాబాద్ లో అప్పుడే రూమ్ లో చేరిన కొత్తల్లో.. అంతకు ముందు 6 నెలల పాటు హాస్టల్ లో ఉండి, అప్పుడే రూమ్ లో చేరాం. 

నేను రాజు గాడు, సతీష్ అన్నఉండే వాళ్ళం. అప్పటికే నా డైరీ రాయడం మొదలై ఆరు నెలలు దాటింది. నా డైరీ అనబడే నోట్ బుక్ ని ఎక్కడా దాచి పెట్టను. అలా పుస్తకాల మధ్యలోనే పడి ఉంటుంది. 

 ఓ శుభముహార్తాన రాజు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. తరువాతి రోజు ఉదయం నేను బాత్ రూమ్ కి వెళ్లి వచ్చేసరికి, వాళ్ళ నాన్న నా స్టడీ చైర్ లో కూర్చుని ఉన్నారు. వాళ్ళ అమ్మ కింద కూర్చుని ఉన్నారు. రాజు గాడేమో వాళ్ళ నాన్న ముందు చేతులు కట్టుకొని నిలుచుని ఉన్నాడు. నా వైపు చంపేసేటట్టు చూస్తునాడు. తేడా గా ఉంది ఏదో. ఓ సారి వాళ్ళ నాన్న చేతిలో చూశా, అక్కడ క్షణం నిలబడలా నా కాళ్ళు. ఆయన చేతిలో నా డైరీ అనబడే నోట్ బుక్.

 అప్పటికే చాలా పేజిలు చదివేసినట్టున్నారు."వామ్మో నరేషుగా, ఇంకా చూస్తావేంది, పరిగెత్తు"...అని ఇన్నర్ వాయిస్. జంప్, వెళ్లి మా ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా. అక్కడే టిఫిన్. ఇది జరిగింది పొద్దున్న 6.30 కి. మా రాజు గాడు 9 దాటాక వచ్చాడు, ఏడుపు మొహం తో.



నేను నెమ్మదిగా అడిగా "ఏమైంది మామా". 
గయ్ మని లేచాడు. "రేయ్, అది డైరీ నా? ఎవడైనా డైరీ అంటే వాడి గురించి రాసుకుంటాడు. నువ్వేంట్రా, నా గురించి, మా అన్నాయ్ గురించి రాశావ్. మా నాన్న అమ్మ ఇద్దరు కల్సి బండ బూతులు తిట్టారు.మళ్ళీ నువ్వేమో మంచోడివా?" అని కాసేపు వాయించేసాడు.




అసలు సారంశం ఏంటయ్యా అంటే.

నా డైరీ లో ఏం రాసాను అంటే.. వినరా భారత వీర కుమారా విషయము చెబుతానూ... తందాన తాన. తరికిట ఝంతరి త.

రాజు గాడు, వాళ్ళన్న ఏమేం సినమాలు చూశారు. అందులో సెకండ్ షో లు ఎన్ని? వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్ళకుండా ఎలా ఉన్నాను? అప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి? 

రాజు గాడు 1800 పెట్టి టేప్ రికార్డర్ కొని ఇంట్లో 700 అని ఎలా చెప్పాడు? లాటి 

వాళ్ళ అన్న రోజు కి ఎన్ని సిగరెట్ పెట్టెలు కాల్చేవాడు...

రాజు గాడికి పక్కింట్లో ఉన్నమ్మాయి ఎలా బీట్ కొట్టేది... వీడు కిటికీ పట్టుకొని వేళ్ళాడుతూ ఆ అమ్మాయికి ఎలా రెస్పాన్స్ ఇచ్చేవాడు....

100 మిగల్చడానికి నేను దిలుసుఖనగర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ కి సైకిల్ మీద ఎలా  వెళ్లాను లాటి అద్భుతమైన విషయాలు పొందు పరిచాను....




అది తెల్సి వాళ్ళ నాన్న వాడిని నానా బూతులు అంట.


నాకు ఏం రాయాలో తెలీక ఏదోటి రాసుకుంటూ పోయా, అది మా వాడి నెత్తి మీదకి వచ్చింది. అప్పటి నుంచి డైరీ అంటే మా రాజు గాడు గాల్లోకి ఎగిరే వాడు....

ఆ తరువాత రాయడం మానలేదు గానీ, దాచడం నేర్చుకున్నా... తలచుకుంటే ఇప్పటికీ పొట్ట పగిలిపోతుంది...
ఇప్పటిలా ప్లే స్కూల్స్ లేనప్పుడు మాకు అంగన్వాడి అని ఉండేది. మా వాళ్ళు పొలం పనులకి వెళ్తూ, మమ్మల్ని అంగన్వాడి కి పంపే వాళ్ళు. అంగన్వాడి లో పాటలు, పద్యాలు చెప్పి తినడానికి పిండి కానీ వడియాలు కానీ పెట్టే వాళ్ళు. వడియాల్లో పసుపువి పెట్టే వాళ్ళు ముందు, బాగుండేవి. అవి మానేసి, పచ్చవి పెట్టడం మొదలుపెట్టారు. అవి అంత బావుండేది కాదు. అవి కూడా మానేసి పిండి పెట్టడం మొదలు పెట్టారు. అవి తెచ్చుకోవడం కోసం, మేము "మానిక" లు తీసుకెళ్ళే వాళ్ళం. పిండి పెట్టడం మొదలు పెట్టే సరికి మేము అక్కడ నుంచి బడి కి ప్రమోట్ అయ్యాం.


ఇప్పటి పిల్లల్లా బండెడు పుస్తకాలు లేవు. ఒక "రేకు పలక" ఉండేది. మట్టి పలకలు వారానికి ఒకటి పగిలి పోతు ఉండేది. మనకున్న స్తోమత కి అంత లేదు. అందుకే ఓ రేకు పలక కొని ఇచ్చే వాళ్ళు. కొన్న ఓ వారం రోజులు బాగానే ఉండేది, పైన రబ్బరు తో చుట్టి, పట్టుకోవడానికి హేండిల్ కూడా ఉండేది. ఒక మంచి రోజు చూసుకొని ఆ రబ్బరు తెంపి, పదునుగా ఉండే రేకు పలకని బయటకు తీసే వాళ్ళం. అది రాజమౌళి సినిమాలో ఆయుధంలాటిది మాకు. 

కొత్త పలక ఎవడైనా కొంటె ఆటలా పోటీలు జరిగేవి. పలకలతో కొట్టుకోవడం. ఎలా కొట్టిన మన పలకే గెలిచేది. అవతలోడి పలక రబ్బరు తెగేది. వాడు కూడా వచ్చి మన కమ్యూనిటీ లో చేరి పోయే వాడు. అలా అన్ని రబ్బరులు తెగి పోయాక, అలా వాటితోనే కొట్టుకునే వాళ్ళం. అలా పలకంతా నొక్కులు పడి పోయేది. ఇంకా అదే పలకతో జామ కాయలు కోసుకునే వాళ్ళం. కోపం వచ్చినప్పుడు అవతల వాడికి బొక్క పెట్టే వాళ్ళం. నానా రచ్చ చేయాగా అది తుప్పట్టి పోయేది. ఒక పక్క పెయింట్ లేచి పోయేది. అలానే రాసి రాసి ఇక ఇంట్లో వాళ్ళు చూడలేక మళ్ళీ ఓ కొత్త పలక కొనే వాళ్ళు. మళ్ళీ మొదలు. కొంత మంది ఉమ్ము వేసి తెగ తుడిచే వాళ్ళు. 

ఆ పలక మీద రాయడానికి నా దగ్గర మాములు నాపరాయి బలపాలే కాకుండా, పిండి బలపాలు, రంగు బలపాలు ఇలా రకరకాలు ఉండేవి. కొంత మనది వాటిని రాయడానికి, ఇంకొందరు తినడానికి, ఇంకా కొంత మంది ఔత్సాహికులు ముక్కులో పెట్టుకోడానికి, మరి కొందరు ఆడుకోడానికి వాడే వాళ్ళు.  ఎన్ని బలపాల ముక్కలు ఉన్నా కొత్త బలపం అందమే వేరు. అది మన చేతిలో క్షణం ఉండదు. వెంటనే ముక్కలు అయ్యేది.

చాలా రోజుల దాక అదే నాకు రఫ్ బుక్. 
పలక మీద మొదటి సారి అ ఆ లు నేర్చుకునేప్పుడు, వాటిని దిద్దరా అంటే దారం లా సన్నగా రాసి ఇచ్చిన అ ఆ లని దిద్ది దిద్ది చేంతాడు అంత లావు చేస్తే కానీ మేము చదివినట్టు అనుకునే వాళ్ళు కాదు అయ్యవార్లు. ఇక చూడండీ ఒకటే దిద్దడం.

మా ఇంట్లో ఇంకా ఎక్కడో ఉన్నాయి మట్టి పలకలు. జ్ఞాపకాలు మాత్రం నాతో ఉండి పోయాయి. పసితనం దానితోనే మొదలైంది.


నీళ్ళ మీద పెద్ద శబ్దం రావడంతో లోపల ఉన్న గణపతులందరూ తలెత్తి పైకి చూశారు .. "అబ్బో చాలా పెద్దగా ఉన్నాడు చోటు ఇవ్వండి" అని పక్కకి తప్పుకుంది P&T కాలనీ లో ఓ గల్లీ లో గణపతి... అందరు అలా కదిలే లోపే ఓ సారి ధబెల్ మని పడి మళ్ళీ నీళ్ళ పైకి చేరి చిన్నగా మునగడం మొదలెట్టాడు చైతన్యపురి గణపతి... ఓ మూల నుంచి చిన్న చిన్న గణపయ్యలంతా అలా చూస్తూ ఉన్నారు.. అవి మట్టివి కాకపోవడం వలన కరక్క చేతులు, తొండాలు విరిగిపోయి అలా పడి ఉన్నాయి... 

ఇంతలో పైన ఒకటే గలాటా మొదలైంది.. ఏమిటబ్బా అనుకుంటూ ఉంటె... పక్కనే సగం విరిగిన  సరూర్  నగర్ గణేష్ చెప్పాడు.. "ఏముంది... మనలో ఉన్న ఇనుము కోసం కాట్లాడుకుంటున్నారు. మట్టితో చేసి ఉంటె ఈ పాటికి నీటిలో కలిసి పోయి ఉండే వాళ్ళం కదా " అంటూ నిట్టూర్చాడు... 

బోలో గణేష్ మా రాజ్ కి ...జై ఐ ఐ ఐ ఐ అని అరుపులు ...

చైతన్యపురి గణేష్ అడిగాడు"ఏవిటి ఇంకా బడంగ్ పెట్ పెద్దాయన రాలేదా?" అని. "లడ్డు వేలం అయితే  కానీ కదల్చరంట" అని ఓ మూల నుంచి సమాధానం. "రేయ్ చిన్నగా, దేవుడిని అని కూడా చూడకుండా ఏవిటా పగలకొట్టడం. ఈ మనుషులకి బొత్తిగా మనసు లేకుండా పోయింది. మీరే తాయారు చేస్తారు, మీరే కొంటారు, మీరే పూజ చేస్తారు, మీరే ఈ మురికి నీళ్ళలో పడేస్తారు, మీరే పగలకొడతారు. మళ్ళీ నన్ను దేవుడు అంటారు." అని మొరపెట్టుకుంటున్నాడు. ఇంతలో ఠపీ మని శబ్దం, పైన జై గణేశా అన్న అరుపు... "క్షమించాలి" అని ఓ మూలకి సర్దుకుంటున్న బుజ్జి గణపతి...." చూసుకోవద్దా, ఏంటా తొందర.. బొప్పి కట్టింది" అని నుదురు రుద్దుకుంటూ అది అడిగాడు చై.పు గణపతి.. "మీరేనా, నేను కూడా మీ కాలనీ నే, ఏమనుకోవద్దు..." అని కరగడం మొదలుపెట్టాడు బుజ్జి గణపతి. "కెవ్వు కేక నా సామిరంగా కెవ్వు కేక, చాయ్ చాయ్..ఏస్కో నా గుమ గుమ చాయ్...పగలైన నాకు ఓకే, రాత్రైతే డబల్ ఓకే" అని పాడుకుంటూ ఓ గణపతి మునుగుతూ ఉన్నాడు ... అప్పటికే సగం విరిగి లోపలకి చేరుకున్నాడు చై.పు గణపతి... చుట్టూ వేల గణపతులు... తొండాలు, చేతులు, తలలు విరిగి ముక్కలు ముక్కలు గా పడి ఉన్నారు.. మనసు చివుక్కుమంది...

మట్టితో చేసి, ప్రకృతి లోని మంచి మొక్కలని పత్రి గా పెట్టి పూజ అయ్యాక నీళ్ళలో కలిపితే నీళ్ళలో ఔషధ గుణాలు పెరుగుతాయని పెద్ద వాళ్ళు చెప్తే, మీ ఇష్టానికి ప్రవర్తించి ప్రకృతి ని నాశనం చేస్తున్నారు... మళ్ళీ దేవుడిని నిందిస్తున్నారు... మిమ్మల్ని దేవుడు కాదు మార్చాల్సింది.. మీరే... లేనప్పుడు ప్రకృతి కోపాన్ని చూడాల్సిందే... అంటూ నీటి  అడుక్కి చేరుకున్నాడు చైతన్యపురి గణపతి....

(పక్కనే ఉన్న చెరువులో గణేష్ నిమజ్జనం చూసి వచ్చిన ఊహ... తప్పులుంటే మన్నించాలి)
మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని, స్వాంతంత్ర్య సమరయోధులను నాయకులను చేశాము. అక్కడ కూడా అవకతవకలు జరిగాయి.

వెన్నుముక లా నిలిచిన గాంధీ కుటుంబం గాలికి కొట్టుకుపోతే, గాంధీ ని ఇంటి పేరు చేసుకొని నెహ్రు కుటుంబం రాచరిక వ్యవస్థ సాగిస్తూ వస్తుంది. ఇలా దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన  ఎందరో నాయకులు, వారి కుటుంబాలు  మరుగునపడిపోయి కుక్కమూతి పిందెలు అధికారాన్ని చేపడుతూవస్తున్నాయి. వాళ్ళే స్వాతంత్ర్యాన్ని తెచ్చినట్టు, వాళ్ళు లేకపోతే మనకు భవిష్యత్తు లేదన్నట్టు నమ్మబలుకుతున్నాయి. దానికోసం కులం,ప్రాంతం,వర్గం,ధనం,అధికారం,కుట్ర,కుతంత్రం అన్నిటినీ వాడి అధికారం లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో ప్రజల నిర్లక్ష్యం, అవగాహనా  లోపం, ఐకమత్యం లేకపోవడం, ప్రజలు,వారి జీవన విధానాల మద్య అంతరాలు సహాయం చేస్తున్నాయి.

ఎక్కడ విన్నాను అమెరికా లో ఉంటున్న ఒక భారతీయుడు, ఈ మధ్యనే భారత దేశం వెళ్లి వచ్చిన ఒక అమెరికా దేశస్థుడిని అడుగుతాడు, "ఎలా ఉంది మా దేశం " అని . "అద్భుతం, అంత బావున్నాయి కాని పేరుకే అది భారత దేశమైనా అక్కడ ఒక్క భారతీయుడిని కూడా చూడలేకపోయాను. ఎవరికీ వారు మేము తమిళులం, మలయాళీలం, కన్నడిగులం, తెలుగు వాళ్ళం (ఇందులో మళ్ళీ రకాలు ), గుజరాతీలం, బెంగాలీలం అంటారే తప్ప ఒక్కడన్నా భారతీయుడిని అని చెప్పుకోవడం లేదు." అని అన్నాడట.నిజమే కదా, ప్రాంతీయ భావన ను రాజకీయ పార్టీలు పెంచి  పోషిస్తున్నాయి. జాతీయ భావనను  పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి.  మహారాష్ట్ర వాళ్ళు, గోదావరి నది మీద  డాం కడుతున్నారట తెలుగు వాళ్ళు అన్యాయం అయిపోతారు. తమిళులకు కావేరి జలాలు అందడం లేదు. ఆంధ్రా ప్రాంతంలో ఉన్న గ్యాస్ అంత గుజరాత్ కి తరలిపోతుంది, లాటి విషయాలను ఎక్కువగా చూపించి వాళ్ళు వేరు మనం వేరు, మన వనరులను వాళ్ళు లాక్కుపోతున్నారు  అనే  భావన అందరిలో నాటుతున్నారు. అందరు మన వాళ్ళే, కూర్చుని పరిష్కరించుకోవాలి. అదే చినా నొ పాకిస్తాన్ ఓ చొరబడితే దానికి మాత్రం శాంతి చర్చలు.


ఆశ్చర్యంగా కేంద్రం లో కాంగ్రెస్ ఉంటుంది, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఉంటుంది. కాని ఆ చిచ్చు ని ఆరనివ్వదు.దానికో పరిష్కారం చూపదు. ఉదాసీనత చూపిస్తుంది. ఇక రాష్ట్రాల్లోనే చిచ్చు పెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్రులు,సీమ వాళ్ళు, తెలంగాణా వాళ్ళు అని రాజకీయ పబ్బం గడుపుకుంటూ అభివృద్ధి ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశంలో ఇలాటివే జరుగ్తున్నాయన్న భావన పెరుగుతున్నా మౌనం వహిస్తుంది. ఆ దేశం వెళ్ళకండి, అక్కడ మృగాళ్ళు ఉంటారు, అని దేశాలు ఘోషిస్తుంటే, "భారత దేశము నా మాతృ భూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను." అని ఎలుగెత్తి అరిచే మన భూమిలో పరాయి సంస్కృతితో పెరిగిన వాళ్ళే ఈ మృగాళ్ళు అని వాళ్లకు జ్ఞాపకం రాదు, అవసరం లేదు.

చైనా వాడు అక్కడెక్కడో ఒక ప్రాజెక్ట్ కడుతున్నాడట. దాని వల్ల మన దేశానికి నష్టం. మనం ఎం చేయాలి, దీనిపై ఎలా స్పందించాలి? మన భూభాగంలోకి అడుగు పెడితే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి? మన దేశం పై జరుగుతున్న టెర్రరిస్టు దాడులను ఎలా ఎదుర్కోవాలి లాటి అంశాలను ప్రజల్లో చర్చకు తెచ్చి ఇది మన దేశం, మనమంతా ఒక్కటే అన్న భావన పెంచాలి. అంతెందుకు రేపో మాపో చైనా మన సరిహద్దుల్లో సైన్యాన్ని మొహరించి, మన  మీదకు దండయాత్రకు వస్తుందంటే ఆ ఎవరో బోర్డర్ లో ఉండే వాళ్ళు కదా నష్టపోయేది అని ఊరుకోగలమా? ఎవడ్రా వాడు, మన దేశం మీదకి వచ్చే దమ్మున్న వాడు? మన సైన్యం ఎంత గొప్పది? రమ్మను చూసుకుందాం లాటి ఆలోచనలు మన మనసులల్లో ఉడుకుతుంటాయి. ఏ దేశం లో నైనా ఆ దేశ ప్రజలే ఉంటారు కాని, మన లాగ ప్రాంతాల ప్రజలు, భాషా ప్రజలు ఉండరు. మనల్ని అలా ఉండనివ్వడం లేదు.

అసలు ఈ రాజకీయ నాయకులకు ఎం అర్హత ఉందని ఎన్నికల్లో నిలబడనివ్వాలి? దేశానికీ సేవ చేశారా? కాదంట , పదవి ఇస్తే చేస్తారంట? అది ఎవడైనా చేస్తాడు. ముందు మీకున్న అర్హత ఏంటి? వినండి పిచ్చి ఎక్కుద్ది మనకి. ఒకడు అంటాడు, ప్రజలు నేను రావాలని కోరుకుంటున్నారు అని? ఇంకోడు మా తాతలు, నాన్నలు చేసిన సంక్షేమ  పధకాలు జనాలకి ఇంకా అందాలంటే నేను రావాలి, లేకపోతే జనం చచ్చిపోరు. పాపం లక్షల్లో జీతాలుండే ఉద్యోగాలు మానేసి ప్రజా సేవ చెయ్యడానికి వస్తారు. ఇలా సంవత్సరాలుగా చేస్తున్నా, అదేంటో ఆశ్చర్యంగా పిచ్చి జనాలకి బాగుపడటం చేత కాక అలానే ఉన్నారు.. ఆ రాజకీయ కుటుంబం లోంచి పిల్లకాయలు వచ్చి ఉద్ధరిస్తునే ఉన్నారు.

కొందరైతే ఈ నాయకులని చూసి ఓటేయ్యడం మానేస్తున్నారు.

దేశానికీ రక్షణ కలిపించే త్రివిధ దళాల నాయకులని ఎలా ఎన్నుకుంటారు? వాళ్ళ సర్వీస్ చూసే కదా?( ఖర్మకి వాళ్ళు కూడా ఈ రాజకీయనాయకుల కిందే పని చేయాలి...). మరి నాయకులని ఎందుకు అలా ఎన్నుకోరూ? ఎన్నో సర్వీసుల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోతున్న ఆఫీసుర్లు ఉన్నారు.పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు.

రక రకాల సర్విసులున్నాయి.ప్రతి ప్రాంతంలో వివిధ అధికారులను నియమించి,  ఒక పదిహేనేళ్ళ సర్వీసు తరువాత కొందరు ఆఫీసుర్లను ఎన్నిక చేసి ప్రజల ముందుంచి "ఇదిగో ఈయన మీ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. ఇదిగో ఈయన చేసిన మంచిపనులు.ఈ సారి ఎలక్షన్లో వీళ్ళని మీ ప్రాంతపు MLA లు నిలబెడుతున్నాము... మీరే ఓటు వేసి గెలిపించుకోండి " అని చెప్తే. ఆ ఆఫీసర్ కి కులం తో పని లేదు, మందు, డబ్బు, కుట్ర , కుతంత్రం, ప్రాంతీయత, వర్గం వీటితో వేటితో సంబంధం లేదు. ఎలాటి మంచి పనులు చేశాడు అని మాత్రమే చూస్తారు. ఒక చదువుకున్నవాడు, ఆ ప్రాంతం కష్ట సుఖాల మీద, అవసరాల మీద  అనుభవం ఉన్న వాడు,  దేశానికీ సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో కష్టపడి చదివి ఈ శాఖలోకి వచ్చినవాడు మనకు నాయకుడౌతాడు.

ఈ రాజకీయ పార్టీల గోల ఉండదు. ప్రతోడు పార్టీ పెట్టడమే.

ఇక కష్టపడ్డ వాడికే ప్రతిఫలం. ఇక్కడ కుల ప్రాతిపదిక మీదనో, మత ప్రతి పదిక మీదనో ప్రజలు ప్రభుత్వ సహాయానికి అర్హులు కారు. ఆర్ధిక వెనుకబాటు తనం, సామజిక వెనుకబాటు తనం మాత్రమే అందుకు అర్హత.

దీనికి రాజకీయ నాయకులు ఒప్పుకోరు. ఒక రాజకీయనాయకుడు ఎన్నికైన ఒక సంవత్సరం తరువాత అవినీతి చేశాడని ఆరోపణలు వస్తే విచారణ పేరు మీద ఐదేళ్ళ పాటు వాడిని మనం భరించాలి. అంతే కాని వాణ్ని పీకి పారెయ్యరు. ఇటువంటి చట్టం తేవడానికి అందరి అభిప్రాయాలు కనుక్కోవాలంటూ కాలం వెళ్లబుచ్చుతారు. టెర్రరిష్టు లి దేశం లో చొరబడి ప్రాణాలు తీస్తున్నారు బాబో అంటే, ఆ సంఘటన జరిగినప్పుడు తీవ్రంగా ఖండిస్తారే తప్ప పోటా లాటి చట్టాలను అమలు చెయ్యరు. అదే "రాజకీయనాయకులంతా వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ బంధు జనాలని విమానంలో గాని రైలు లో గాని, బస్ (హీహీ అది అసాధ్యం కదా, ఎవడెక్కుతాడు(పల్లె వెలుగు బస్సుల్లో ఉంటుంది, reserved for MP/MLA ani ) ) లో గాని ఉచితంగా ప్రయాణించవచ్చు " అంటే ఆ బిల్లు ఏకగ్రీవంగా అమలౌతుంది.

ఇది పోవాలి, ఈ రాజకీయ నిరుద్యోగులు మన నాయకులైనంత కాలం , మనలో నిర్లక్ష్యం, స్వార్ధం గూడుక్కట్టుకున్నన్ని నాళ్ళు  భారత దేశంలో భారతీయుడిని పట్టుకోవడం దుస్సాధ్యం.
నాకు ఊహ తెలేసేనాటికి నాకు తెల్సిన కథ "పేదరాశి పెద్దమ్మ కథ".... చందమామ ని చూపించి అదుగోరా దానిమీద నీడ కనిపిస్తుందా? అక్కడ ఓ చెట్టు కింద కూర్చుని ఓ ముసలామె రాట్నం వడుకుతూ ఉంది..కనిపించిందా? అంటే ఆరుబయట మంచాల మీద పడుకొని చల్లగా కురుస్తున్న పండు వెన్నెల్లో ఆ ముసలామెతో ఆ నల్లని మచ్చలని పోల్చుకోడానికి ప్రయత్నించే వాళ్ళం...  నా ఊహ చంద్రమండలాన్ని తాకేది..

పున్నమి రాత్రి సినిమా చూసి ఒక్కడినే బయటకు వస్తే, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద దూరంగా పరిగెత్తుతున్న డ్రాకులా కనిపించి నన్ను రోడ్డు మీద పరుగులెట్టించింది.

బలానికిచ్చిన టానిక్ ని తాగకపోతే మా ఇంటి ఎదురుగా ఉండే చింత చెట్ల లోంచి ఎవడో చూస్తుంటాడు, వచ్చి ఎత్తుకుపోతాడు అని చెప్పే మా నాయనమ్మ... నాకా క్షణం ఆ చెట్ల గుబురులలో ఎవడో కూర్చుని ఉండేవాడు..చచ్చినట్టు తాగేవాడిని ... ఈ గోలా భరించలేక ఓ రాత్రి లేచి మొత్తం టానిక్, దానితో తాగించే తేనే కూడా తాగేసి గమ్మున పడుకున్నా....

మా తాతయ్య దగ్గర తెచ్చుకున్న పుస్తకాల్లో ప్రతి పాత్ర నా ఆలోచనల్లో రూపు దిద్దుకునేది... యశుపాలుడు, శిశుపాలుడు జారిపడ్డ లోయ... పడ్డం పడ్డం ఓ రాక్షసుడి తల మీద పడతారు... వాళ్ళకి దూరం గా ఎత్తుగా కనిపిస్తున్న కొండలు ...జరుతున్న జలపాతాలు... బయటి ప్రపంచం తెలీకుండా అక్కడ బ్రతుకుతున్న వివిధ జాతుల ప్రజలు.... నా తలలో చేరి గోల గోల చేసే వాళ్ళు....

ఇక చందమామ అలవాటు అయ్యాక.... చెప్పనవసరం లేదు...  ప్రతి ఆలోచనకో రూపం... రంగు రంగుల్లో బొమ్మలు ...  మెరిసిపోయే నగలు, వజ్రాలు,మణులు మాణిక్యాలు... ప్రతిది ఒక అద్భుతమే...  నా మెదడులో ఓ ప్రపంచం ఉండేది... ఇలా అలవాటయ్యాక నేనే కథలు చెప్పడం మొదలు పెట్టా పిల్లలకి....

ఇహ మధు బాబు గారి పుస్తకాలు అలవాటయ్యాక, ఆయన వర్ణించే తీరుకి ప్రతిది కళ్ళ ముందు కదిలేది....

ఊహ హద్దులు దాటితే నిజం దాన్ని చేరుకోలేకపోవచ్చు... ఏదైనా చేరుకోవాలంటే, ఒక హద్దు ఉండాలి కదా ..అదే ఊహ...

కొన్ని కథలు చదివాక అవి మన మనసుని తాకి అవి సినిమాలుగా వస్తే నచ్చకుండా ఉన్న సినిమాలు చాల.. మన ఊహ అంత అందంగా ఉండవు మరి....

ప్రకృతి ని దగ్గరగా చూడటం కూడా మన ఊహా శక్తి ని పెంచుతుంది అనిపిస్తుంది.... నాకు చిన్నప్పుడు బోలెడు అనుమానాలు వచ్చేవి.. అందులో ముఖ్యమైనది ...భూమిని తవ్వుకుంటూ పోతే ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు మనం ఎలా బయటకి వస్తాం? ఊడిపడిపోతామా? లేకా పైకి ఎక్కినట్టు వస్తామా? అసలు విమానం ఎలా ఎగురుద్ది? రేడియో లో మాటలు ఎలా వినిపిస్తాయి? ఇంకా ఛిన్నగా ఉన్నప్పుడు భూమి గుండ్రటి బాల్ ని సగానికి కొస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది... మనమంతా దాని మీద ఉంటాం... పైన ఆకాశం కప్పి ఉంటుంది ... సూర్యుడు చంద్రుడు వచ్చి వెళ్తుంటారు అని...

కాని ఈ తరానికి ఆ అవకాశం లేదేమో అనిపిస్తుంది... వాళ్ళ ఊహని కూడా కట్టడి చేస్తున్నారేమో... వాళ్ళకి ఎం ప్రపంచం తెలుస్తుంది? పాలు గేద పొదుగులోంచి వస్తాయని తెలియని చాల మంది పిల్లలు ఉన్నారు, అల వస్తున్నాయని తెలిస్తే తాగరు కూడా.....

ప్రకృతి పరిచయం తగ్గిపోతుంది... చిన్నపటి నుంచే టీవీ కి అంకితమవ్వడం (అమ్మ పిల్లలు టీవీ ముందు పడేస్తే గొడవ చెయ్యరు అనుకుంటే అక్కడే కూర్చోబెడుతుంది..ఇలా చాలా ఇల్లు ఉన్నాయి) వలన వాడికి చోటా భీమ లో అడవులు లేదా పోకిమన్ లాటి ఆలోచనలే తాకగలరు కాని ఊహ ప్రపంచాన్ని నిర్మించుకోలేరు.....

ఇది నిజమో కాదు తెలీదు...కాని కొందరిని చూసాకా అనిపించింది... కొందరిని చూశాను అంటే ఇప్పుడు 6-7 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళని , నన్ను అడిగారు "ఎందుకు నువ్వు నాన్నా అంటావు? daddy అని ఎందుకు అనవు అని..."  ...

కూచిపూడి లేదా ఏదైనా శాస్త్రీయ నృత్యం నేర్పిస్తే ఆలస్యమౌతుందని వేస్త్రెన్ పేరు చెప్పి సినిమా పాటలు నేర్పిస్తున్నవాళ్ళు లేకపోలేదు (ఇది అసందర్భం)...

ఇప్పటి వాళ్ళలో ఊహ శక్తీ మాత్రం తగ్గిపోతుందని అనిపించింది.... ఊహలోకం అనేది పసితనం లో మొదలై బాల్యం చివరికి ఒక స్థాయికి చేరుకొని ఆగిపోతుంది







....
ఊరి చివరన పొలాల పక్కన వున్న పశువుల కొట్టం లో సెనగ కట్టలన్నీ వేసున్నాయి. మొన్ననే మిషను కేసి అన్ని గోతాలకెత్తి కొట్టం లో వేశారు..నాన్నకి ట్రాక్టర్ పని ఉండటంతో, పని మీద మా ఊరికి వెళ్ళిన నేను కాపలా ఉంటా అని చెప్పాను... భోజనం చేసి చార్జింగ్ పెట్టిన టార్చి లైటు తీసుకొని 11 ఆ ప్రాంతంలో బయలుదేరాను.దాదాపుగా అందరు ఇళ్ళకు వెళ్ళిపోయారు. మంగయ్య కొట్టు కాడ జయమ్మ పొద్దున దోసలకి పిండి రుబ్బి అప్పుడే లైటు అర్పెస్తు,"ఎవరదీ" అన్నది..."నేను జయమ్మమ్మ పచ్చలోళ్ళ వెంకటనరసిమ్మ కొడుకుని" "ఏడకి ఈయాల", "కొట్టంకాడ సెనగలుంటే వెళ్తన్నాను, నాన్న పనుండి వెళ్ళాడు " "నీకెందుకయ్యా అలవాటు లేని పని" అంటూ ఉంటె నవ్వుకుంటూ నడక మొదలెట్టాను.కొట్టం ఊరికి బాగా దూరం..తూరుపీధి మీదగా వెళ్ళాలి...ఊరి మొగదాల్న ఉండే బడి పక్కన కట్టిన రచ్చబండ మీద ఎవరో కూర్చుని వున్నారు. అది దాటి కొంచెం దూరం వెళ్తే మా కొట్టం.. ఆ కూర్చున్న ఆకారం ఊరికే కూర్చో లేదు...చిన్నగా రోదన. గుండె వేగం పెరిగి నడక వేగం తగ్గింది...

 నా అదృష్టానికి బడి ముందు రోడ్డు మరి సన్నగా అవుతుంది. చచ్చినట్టు ఆ అరుగు పక్కగా నడవాల్సిందే. ఎహే, మనూళ్ళో, మన బడి కాడ అని సర్ది చెప్పుకుంటూ పిల్లిలా నడవసాగాను...ఆ అరుగు దగ్గరకు పోయే లోపే నిర్ధారణ అయింది అక్కడ కూర్చున్న ఆకారం ఓ ఆడ ఆకారం.దెయ్యమేమో? ఈ ఆలోచన దూరేసరికి మెదడు మొద్దుబారి పోయింది..వెనక్కి వెళ్ళిపోలేనంత దగ్గరకు వచ్చాను...ఆ ముసుగు ఆకారం నిజంగానే ఏడుస్తుంది.నేను ఏడవ తరగతి దాకా చదివిన బడి భయంకరంగా కనిపిస్తుంది..దాటి వెల్లిపోదాం అనుకునే లోగ, ఆ ఆకారం లేచి గట్టిగా అరిచింది... ఓరి దీనెమ్మ చంపేసింది అనుకోని ఎగిరి వెనక్కి దూకాను... ఏ మాత్రం జంకినా ప్రాణాలు గాల్లోకే.. అప్పుడు తట్టింది దూదేకలోళ్ళ పిచ్చి బీబీ (బీబీ బాగానే ఉండేది ఎందుకో పిచ్చి పట్టింది). "ఎం బీబా" అని గెట్టిగా కేకేసి, సర్దుకుని,భయంలోంచి వచ్చిన నవ్వుతో భయాన్ని కప్పేస్తూ, చుట్టూ ఎవరైనా చూశారేమో గమనిస్తూ హడావిడిగా కొట్టానికి చేరుకున్నాను.ఆ దడ మాత్రం తగ్గలా.. 

 చుట్టూ వెదురు కంపతో చేసిన తడికెలు.మధ్యలో పెద్ద వేప చెట్టు, గాలికి జుట్టు విరబోసుకున్నట్టు ఊగుతూ ఉంది.తూర్పున వేసున్న వరి గడ్డి వామి,ఓ పక్క గడ్డి పీకేయడం వల్ల మోకాళ్ళ మీద కూర్చున్న నల్లటి రాక్షసుడిలా వుంది. కొట్టంలో వేసి కట్టలన్నిటి మీద పరజా పట్ట కప్పి ఉంది. ఒద్దు మొర్రో అంటే వినకుండా ఒక ఆవుని కొనింది మా అమ్మ. అది చూడ్డానికి ఇంతే వుంటుంది కాని, అదంటే మా ఊర్లో బర్రెలన్నిటికి హడలంట.దానికి, పెద్ద బర్రె కి నీళ్ళు పెట్టి, మేతేసి వేపచెట్టు కింద నులక మంచం మీద పక్కేసుకొని కూర్చున్నా. పక్కనే లచ్చుపతియ్య గారి చేలో జామాయిలు కొట్టేసినట్టున్నారు,మూలన వున్న తుమ్మ చెట్టు భయంకరంగా ఉంది..అదంటే చిన్నప్పుడు కూడా భయమే.చెంబు కెళ్తే దాని దగ్గరకు మాత్రం వెళ్ళే వాళ్ళం కాదు... దానవతల కుమ్మర గుంట (ఇందులో పడి ఒకామ, చిన్న బాబు చనిపోయారు) గట్టున నాటిన సీమ సింత చెట్లు కొండ మీద రాక్షసుల్లాగా అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. లచ్చుపతియ గారి చేనుకి ఈ పక్క మేకలోళ్ళ రమేషోళ్ళ చేలో వేసిన చవకల్లోంచి "స్స్స్" చిన్న ఈల లాంటి గాలి శబ్దం.. పొద్దున్న పూట మాములుగా వున్న ప్రతిది చీకటయ్యే వేళకి భయపెడుతున్నాయి.ఇలాక్కాదని ఫోన్ తీసి పాటలు పెట్టాను.. "అరే ఏమైందీ" అంటూ ఇళయరాజా పాట గుండలవిసేలా ప్రతిధ్వనించింది. అనవసరంగా పడుకున్న వాటిని లేపిన ఫీలింగ్. చల్లటి గాలి, ఆకాశం నిండా చుక్కలు, కింద నులక మంచం..ఎహే భయడ్డం ఏందీ పడుకోక అనుకోని మేను వాల్చాను... దూరంగా బీబీ ఏడుస్తున్న చప్పుడు సోనీ హెడ్ ఫోన్స్ లో గిటార్ సౌండ్ లాగ నిదానంగా నా చెవులకి చేరుతుంది. దుప్పటి నిండుగా కప్పుకొని పడుకున్నా. ఆ గాలికి చిన్నగా నిద్ర పట్టింది.. నిద్రలో కూడా ఎదో పిచ్చి కల.

తడిక తీసిన శబ్దం. దుప్పట్లోంచి తల తిప్పి చూడాలన్నా ఒళ్ళు సహకరించడంలా... ఏదీ స్వాధీనంలో లేదు. చిన్నగా మంచం దగ్గరకి వస్తున్న అడుగుల శబ్దం..ఆంజనేయ దండకం గుర్తురావడంలా..మురళి పంపిన కథల్లో దెయ్యాలన్నీ చుట్టూ చేరిన ఫీలింగ్...ఆ టైములో ధైర్యం అనే పదం కూడా గుర్తు రావడంలా.. ఎం చేయాలి? ఆ అడుగుల చప్పుడు మంచం దగ్గరికి వచ్చి ఆగిపోయింది, నా జీవితం ఐపోయింది.. వచ్చి ఎవ్వరో మంచం మీద కూర్చున్నారు...
మళ్ళి ఓ హీరో పుట్టాడు...

షాడో....

కాళికాలయం లో వసంతుడు, బలదేవుడు....
ఆనంద జ్యోతి లో శ్రీధరుడు..
మచ్చలగుర్రం లో చంద్రుడు...
చతుర్నేత్రుడు లో మాధవుడు...
స్వర్ణ ఖడ్గం లో ప్రతాపుడు...
వెన్నెల మడుగు లో విజయుడు...

ఇప్పుడు  శివుడు....


మధు బాబు కథానాయకుడంటే ధీరో, నిర్లక్ష్యం నిండిన చూపులు, పెదాల మీద చెరగని  చిరునవ్వు. ఆపద లో ఉన్నవాళ్ళని  ఆదుకోడానికి  ప్రత్యక్షమౌతాడు, ప్రమదాలని లెక్క చెయ్యడు...


నాకు బాగా నచ్చేది ఆయన కథ చెప్పే విధానం.అందులో వాడే పేర్లు. అవి చదువుతూ ఉంటె అవి మన ఊహల్లో మెదులుతాయి. మనమే వాటికీ ఓ రూపాన్ని అపాదిస్తాము...


పై పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం షాడో తరువాత కాళికాలయం. మొత్తం మూడు భాగాలు... 


కాళికాలయం...కంకాళ లోయ..కళ్యాణ తిలకం....


ముందు ఈ రోజు నవ్య లో  ప్రారంభం ఐన 'శివుడు' గురించి చెప్తాను....


శివుడు అనే పదమూడేళ్ళ బాలుడు  ఓ అనాధ. వాడు సారంగుడు అనే ఓ  మండలాధీసుడి దగ్గర పెరుగుతూ ఉంటాడు...తనతో పాటు ఇంకో పది మంది అనాధల్ని(తల్లి తండ్రులు ఉండి ఆర్ధిక స్తోమత లేని వాళ్ళు  ) పెంచుతుంటాడు సారంగుడు..వాళ్ళకి విధ్యబుద్ధుల్ని నేర్పించి తన సంస్థానంలోనే వారి వారి ప్రావీణ్యాన్ని బట్టి కొలువు ఇస్తాడు...


ఓ రోజు కోట గోడల్ని ఆనుకోని ఉన్న మైదానం లో మిగతా పిల్లల్ని ల తో కలిసి ఆడుకుంటూ ఉన్న శివుడిని అమ్మ, నాన్న లేని వాడని తోటి వాళ్ళు హేళన చేస్తారు... కోపం తో ఒకడి మెడ పట్టుకొని బిగిస్తాడు (మధు బాబు గారిలా చెప్పడం రాదండి)...ఈ లోగ కాపలా ఉన్న భటులు రావడం..అక్కడ నుంచి పారిపోయి(పారిపోవడం అంటే చిరుత వేగం తో ), దగ్గరలో ఓ పండ్ల తోటలోకి వెళ్ళి మిగల మగ్గిన రెండు పండ్లని కోసి, గమనించిన ఆసామి నుంచి తప్పించుకొని పారిపోతాడు...కోట లోకి వెళ్దాం అనుకుంటుండగా దగ్గర లో ఉన్న ఓ పొదల నుంచి ఓ ఆడగొంతు  ఆర్తనాదం.... ఏదైతే అది అవుతుంది  అని వెనక్కి వెళ్ళి చూస్తే నది వడ్డున ఉన్న ఓ పడుచు నదిలో కొట్టుకు పోతున్న తన పసివాడి ని చూసి అరుస్తూ ఉంది..వెనకా ముందు చూడకుండా దూకేసాడు శివుడు..దూరం గా ఉన్న ప్రకీర్తి పర్వత సానువుల్లోంచి దూకుతున్న సువర్ణ నది ప్రవాహం ఉధృతం గా ఉంది(పేర్లు భలే ఉన్నాయి కదా? )...మొత్తానికి పిల్లవాడిని కాపాడతాడు శివుడు అలానే ఆ తోట కాపలా వాళ్ళకి పట్టుబడతాడు...


అక్కడ నుంచి సభలో కొలువుతీరి దోపిడీ ముఠా కి  శిక్షి విధిస్తున్న సారంగుడి ముందు ప్రవేస పెట్టబడ్డాడు ... శివుడు చేసిన మంచి పనిని మనసులోనే మెచ్చుకుంటూ గజశాలని ఊడ్చే శిక్షని విధించాడు....


ఇంకా కొంచెం ఉంది...నచ్చితే నవ్య కొని చదవండి....