మనసు మాటలు 


ఏడ్చినప్పుడు కూడా ఒక్కో సారి బావుంటుంది,మనసు తేలికౌతుంది. ఏడుపు అనేది ఎలా అయినా రావచ్చు,బాధతోనో,సంతోషంతోనో,ఇష్టమైన వాళ్ళు గుర్తోచ్చో,చేసిన తప్పు వలన మనసులను పోగొట్టుకోనో,ఇలా కారణాలు రాసుకుంటూ పోతే ఈ ప్రపంచం లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎదురైన అనుభవాన్ని రాయాల్సి ఉంటుంది.
కాని ఏడ్చాక అందరి అనుభవం మాత్రం చెప్పగలను “మనసు తేలికౌతుంది”. తప్పు లేదు ఏడవచ్చు.ఏడుపు ఎప్పుడు గోల కాదు, మనసు మాట్లాడే మాటల్లో అదో మాట. మనసు నవ్వితే, అది మన కళ్ళలో కనిపిస్తుంది. మనసు ఏడిస్తే కన్నీరై కరుగుతుంది. చెప్పా కదా ఏడుపు ఎలా అయినా రావచ్చు అని. ఏడుపు ని ఆపద్దు.
జీవితం బావుంటుంది. అన్నీ ఉన్నపుడే బావుంటుంది. కష్టాలు,బాధలు,కన్నీళ్లు,నవ్వులు,స్నేహితులు,ప్రేమించే వాళ్ళు,ద్వేషించే వాళ్ళు. ఈ ప్రయాణం లో నువ్వు ఎంత మంది నీ సంపాదించుకున్నావ్? ఎంత సంపాదించావ్
అని కాదు అడిగింది. ఎంత మంది నీ, ఎన్ని మనసులుని. ఎంతో సంపాదిస్తే మంది మన దగ్గరకి వచ్చే రోజులివి.అవి పోతే వాళ్ళూ పోతారు. అందుకే మనుషులు,మనసుల్ని సంపాదించుకోవడం బావుంటుంది.
ఒక్కో సమయం లో ఒక్కోరు ముఖ్యం అనిపిస్తారు. వాళ్ళే జీవితం అనిపిస్తుంది.వాళ్ళు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం. అలా అనుకునేది అమ్మ కావచ్చు,నాన్నకావచ్చు, అమ్మాయి/అబ్బాయి కావచ్చు,స్నేహితులు కావచ్చు, పేరు పెట్టలేని బంధం కావచ్చు... కానీ కాలం గడిచే కొద్ది మనం మారుతూ ఉంటాం,మనసు కూడా మారుతుంది,ప్రాముఖ్యతలు మారతాయి. కొంత కాలం గడిచాక,తలుచుకొని నవ్వుకుంటాం,బాధపడతాం,సంతోషపడతాం. అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే/అలా అనకుండా ఉండాల్సిందే అనిపిస్తుంది. అలా చేయకూడదని మనమూ అనుకుంటాం,కానీ “ఏవో కారణాల” వాళ్ళ ఆ పని చేయం. దాని వల్ల మనసుకి దగ్గర గా ఉన్న మనసుని,మనుషుల్నిపోగొట్టుకుంటాం. ఆ పరిస్థితిలో అవతల వాళ్ళ మొహం ఎలా ఉన్నా, వాళ్ళు నోరు జారినా, అసలు మన మాట వినడం ఇష్టం లేకపోయినా, మనం చెప్పాలనుకున్న మాట చెప్పి రావచ్చు(మనం ఏమి నోరు జారకుండా ). అది చాలా కష్టం. ఈ కష్టాన్ని దాట లేక బంధాలు తెగిపోతున్నాయి. ఒక్క
చిన్న గట్టు దాటలేక మనసుల్ని పోగొట్టుకుంటున్నాం.ఇద్దరి లో ఎవరో ఒకరు భరించి మనసులోని మాట చెప్పగలిగితే అవతలి మనసు అప్పుడు కాకున్నా కొన్నాళ్ళకి అర్ధం చేసుకుంటుంది. అలా చేయలేకపోతే, భవిష్యత్తులో వచ్చే ఏడుపు బాధతో ఉంటుంది. ఆ మాట చెప్పగలిగితే మనుషులు దగ్గరగా లేకున్నా కన్నీళ్లు మనం ఏం తప్పు చేయలేదన్న సంతోషం తో వస్తాయి...ఇలా ఏడ్చేపుడు, కన్నీళ్ళు మనసుని తేలిక చేసేప్పుడు అనిపిస్తుంది ఏడుపు తప్పు కాదు అని. ఏడవడానికి ఆడో మగో అక్ఖర్లేదు, స్పందించే మనసుంటే చాలు. ఏడుపు ఆపుకొని/ఆపి మనసుని మాట్లాడకుండా చేయకండి...


మేము హైదరాబాద్ నుంచి బెంగుళూరు కి మారిపోతున్నాం.నేను ఇంటర్నెట్  తీసేయించి, గ్యాస్ ట్రాన్స్ఫర్ చేయించే పనుల్లో హడావిడిగా ఉన్నాను. క్షణం తీరిక లేదు. ఇల్లంతా ఖాళీగా ఉంది. సామాన్లన్నీ సర్ది పంపించేసా. చిన్న చిన్న మాటలు కూడా పెద్దగా వినపడుతున్నాయి. ఏంటో ఖాళీ చేస్తున్నాం అంటే అక్కడ క్షణం  ఉండ బుద్ధి కాదు. ఇప్పుడు ఉన్న ఇల్లు కడిగించడానికి పనమ్మాయిని పిలవమని మా ఆవిడకి చెప్పాను.సరే అంటూ "కళమ్మ చచ్చిపొయిందట" అంది. అంత నీరసం లోను నన్ను ఆ మాట ఉలిక్కిపడేలా చేసింది. "చచ్చిపోవడం ఏంటి?" అన్నాను. " అవును, చచ్చిపోయిందట" తన సమాధానం. 
"ఏమైందంట?" అన్నాను. "వాళ్ళాయన చంపేసాడట" అంది.. మనసు వికలమై పోయింది. 
కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాను. 
కళమ్మ మా ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో పని చేస్తూ ఉండేది. వాళ్ళ ఆయన్ని అక్కడ పనికి కుదిర్చింది, అది కూడా పేరుకే. ఆ పని కూడా తనే చేసేది. వాళ్ళకి ఒక 10 వ తరగతి చదివే పిల్లాడు. మాకు బాబు పుట్టాక వాడికి స్నానం చేయించడం కోసం,ఇంటి పని కోసం ఆమెని ఏడాది కింద రమ్మన్నాం. మనిషి నలుపు, కాలికి పట్టాలు, ముక్కు పుడక,మొహాన  రూపాయి బిళ్ళంత బొట్టు, కళ్ళలో నీళ్ళు దాచేసి పని చేసుకుంటూ పోతుండేది. చాలా కష్టపడేది. ఒకటే పరుగు. ఎపుడైనా రాకపోతే, "ఏమైందని" అడిగితే , "రాత్రి వాళ్ళాయన తాగొచ్చి కొట్టాడంట" అని సమాధానం. "తిన్నావా" అని అడిగితే లేదు అని చెప్పడానికి నామోషి పడేది. కనుక్కుని తిండి పెట్టేది మా ఆవిడ
 . 

కష్టం తనది, అయినా సరే మొగుడు ఐన పాపానికి తిండి పెడుతూ మరి కొట్టించుకోవాలా అనిపించేది నాకు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళెవరూ లేరా అడగడానికి. అన్నీ  అయ్యాయంట, పంచాయితీ పెట్టారంట. అప్పుడు బానే ఉంటా అంటాడట, మళ్ళీ మాములే. మరి 10 వ తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు కదా, వాడేం మాట్లాడడా అంటే, వాడికి భయం అంట. అడ్డం వస్తే వాడిని కూడా తంతాడట. ఒక నిట్టూర్పు. 
కొన్ని నెలలు పని చేసాక, ఓ వారం రాలేదు. ఓ రోజు ఉదయాన్నే వచ్చి పని చేసుకు పోతూఉంది. రాగానే బాబుకి స్నానం చేయించేది, వాడితో ఏదోటి మాట్లాడుతూ ఉండేది. మౌనంగా ఉంది. పనయ్యాక "అమ్మా నేను ఇంకా రావడం లేదు , మీకు ఇష్టమైతే వేరే అమ్మాయిని తీసుకువస్తాను" అని చెప్పింది. "ఏమైంది కళమ్మ" అంటే చేతి నిండా వాతలు చూపించింది. కళ్ళలోంచి నీళ్ళు దూకకుండా ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. "ఇక్కడ ఉండద్దు అంటున్నాడమ్మా,పిల్లోడిని కొట్టి ఊరికి తీసుకోపోయాడు, ఇక నాకు పోక తప్పదు" అని అంది. ఆ నెల జీతం,కొన్ని చీరలు తీసుకువచ్చి ఇచ్చింది మా ఆవిడ. తన మొఖం లో సంతోషం. ఇంకొంచెం ఇవ్వాల్సిందే అనిపించింది. 
మరుసటి రోజు కొత్త పనమ్మాయిని తెచ్చి ఇల్లు చూపించి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తరువాత అనుకుంటా, మా ఆవిడా అంది "కళమ్మ  మళ్ళీ వచ్చిందంట, ఇక్కడే పని చేసుకుంటూ ఉందంట. వాళ్ళ ఆయన  మాత్రం రాలేదంట" అని. 
తను ఎలా చనిపోయింది అంటే, మొగుడు వచ్చి మారిపోయాను అని నమ్మించి, ఇంటికి తీసుకు వెళ్లి మందు పెట్టాడంట. కోపం, కసి చెత్త నా@)@)(@) , ఏం పోయే కాలం వాడికి. 
ఇక్కడ బలం,బలహీనత గురించి మాట్లాడను, ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు ఆ బాధ్యత ని అలా నెరవేరుస్తూ ఏదో ఓ రోజు కనపడకుండా వెళ్ళిపోతారు.అప్పటి దాకా తనని గుర్తించని వాళ్ళు,తను మిగిల్చిన శూన్యం లో పడి పోతారు. ఆ లేమి ఏదో ఓ చీకటి రాత్రి తన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. 

ఎవరికైనా ఏదైనా సాయం చేయాలనిపిస్తే ఎటువంటి ఆలోచన లేకుండా చేసేయాలి. మనతో,మనలో ఉన్న చాలా మంది నవ్వుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూఉంటారు. ఆ నవ్వే కళ్ళ వెనకున్న కష్టం మనకి తెలీకపోవచ్చు కానీ, మనం నవ్వుతూ పలకరించవచ్చు.. ఈ పని నువ్వు మాత్రమే బాగా చేయగలవని ఒక చిన్న మాట అనవచ్చు. అంతే... 


Image courtesy: NaheemRustum
మనం అందరం దాదాపు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే... చిన్నప్పుడు ఆ పొలాల్లో పడి పని చేసిన వాళ్ళమే.. మనకి అప్పుడు ఏమి తెలీదు, పని కొంచెం కష్టం అనిపించేది అంతే. ప్రతి సీజన్ లో పచ్చగా ఉండి పొలాలన్నీ ఏదో ఒక పంట తో ఓ కళ కళ లాడుతూ ఉండేవి. ఇంటి దగ్గర కూరగాయలు కొనడం కూడా తక్కువే. ఇంటి పెరట్లో అల్లుకున్న దొండ పాదులు,సొర పాదులు,కాకర పాదులు , పొట్ల పాదులు, ఆకు కూరలు. పొలాన్నున్చి తెచ్చుకునే పచ్చి మిరపకాయలు,టమాటో లు, గోంగూర. మన చేలో పండే కంది పప్పు , మినప్పప్పు,వేరు సెనగ. ఇవన్నీ మనం చూశాం.కానీ మన ముందు తరాన్నుంచి ఆ అనుభవాన్ని మాత్రం అందుకోలేక పోయాం.
మనకి నెల జీతం వస్తుంది కాబట్టి కొంచెం రేట్లు పెరిగినా కొనుక్కో గలుగుతున్నాం. కానీ పల్లెటూర్లలో ఈ వ్యవసాయాన్ని బతికించడానికి మన ముందు తరం ఇంకా పోరాడుతూ ఉంది. ఎవరికైనా ఒక వయసు వచ్చాక విశ్రాంతి అవసరం. మన తాతల నుంచి తండ్రులు అందిపుచ్చుకున్నారు. కాని వారి నుంచి అంది పుచ్చుకునే వారు లేకపోయారు. వయసు 60 వచ్చినా వాళ్ళే పొలం పని చేయాల్సిన పరిస్థితి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యవసాయం చచ్చిపోతుంది. కారణాలు చాలానే ఉన్నాయి.
1.ఆదాయం లేకపోవడం .
2.నష్టం వస్తే ఆదుకునే వాళ్ళు లేకపోవడం(5౦౦౦౦ పెట్టి కొన్న బైక్ ఇన్సురన్సు ఉంది కానీ ప్రజల కడుపు నింపే పంట కి లేదు)
3.ప్రకృతి లో మార్పులు.
4.కూలి ఖర్చులు పెరగడం , కూలి వాళ్ళు దొరక్కపోవడం.
5.పంట చేతికి వచ్చాక ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన కొనుగోళ్ళు లేకపోవడం. అప్పుడు తీర్చాల్సిన అప్పులు కోసం ఎంతో కొంత కి అమ్మి వాటికీ కట్టి ఖాళీగా ఉండటం. మళ్ళీ పంట కోసం అప్పు చేయడం. ఎందుకంటే వాళ్ళకి ఆ పని తప్ప ఇంకోటి రాదు. వెనక చేయి వేసి ఆసరా ఇచ్చే బిడ్డలు లేరు. ఇంత కష్టం చూసాక ఎ రైతు తన పిల్లల్ని వ్యవసాయం చేయమని చెప్పడు.
మనలో చాలా మందికి ఇవన్నీ తెలుసు. కాని మన జీవితపు పరుగులో పడి ఒక నిట్టూర్పు మాత్రం ఇవ్వగలుగుతున్నాం.
మనకి తెల్సు ఎంత మంది రైతులు బలవంతగా బతుకు ముగిస్తున్నారో. పరువు కోసం బ్రతకలేక ప్రాణాలు తీసుకునే ఒక రైతు విలువ పేపర్లో ఒక మూల  ఉండచ్చేమో కానీ ఆ నష్టం ఆ కుటుంబానికి ఎవరు తీర్చలేరు. వ్యవసాయం చేయడం అంటే పచ్చని పంట పొలాల్లో భుజం మీద కర్ర వేసుకొని ముందు వెళ్ళే ఎద్దుల వెంట కూని రాగాలు తీస్తూ నడవడం కాదు. ఎర్రటి ఎండలో శరీరం సహకరించించక పోయినా ఆ రోజు వెయ్యాల్సిన ఎరువు వెయ్యకపోతే మొక్కలు చచ్చిపోతాయని పాకులాడటం. ఇది పిల్లల కోసం తండ్రి పదే బాధ.
ఇదంతా ఎందుకు అంటే, నాదొక చిన్న ఆలోచన నచ్చితే ప్రయత్నిచండి.
మనం అందరం బియ్యాన్ని 25KG లు 1800 పెట్టి కొంటున్నాం. సగటున ముగ్గురు ఉన్న కుటుంబానికి ఏడాదికి 13 నుంచి 15 వరకు బియ్యం బస్తాలు అవసరం అవుతాయి. కూరగాయలకి,పప్పు ధాన్యాలకి అంతా కలిపి 20,000 దాక ఖర్చు అవుతుంది. అంటే బియ్యం తో కలిపి మొత్తం 40000  దాకా ఖర్చు అవుతుంది. మనలా కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఒక కంపెనీ లో 50 మంది కలిసి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరి కి వెళ్ళి అక్కడ ఉన్న రైతులకి పెట్టుబడి పెట్టి ఆ పంటని మనమే కొనుక్కుంటే కొన్ని కుటుంబాలని బ్రతికించిన వాళ్ళం అవుతాం... అప్పుడప్పుడు వెళ్తుంటే  మన పిల్లల కి కూడా ప్రకృతి తో పరిచయం అవుతుంది. వాళ్ళలో కూడా సాటి మనిషికి గౌరవంగా సాయం చేయచ్చు అన్న ఆలోచన వస్తుంది. వారంతం లో షాపింగ్ మాల్ కి వెళ్ళడం కన్నా పచ్చని పొలాల్లో తిరగడం మనసుకి,మనషికి రెంటికి మంచిదే....

ఇది నా ఆలోచన మాత్రమే నచ్చితే పంచుకోండి.... అందరికి షేర్ చేయండి, ఎవరో ఒకరు ఇంకో మంచి ఆలోచన వచ్చినా సంతోషమే ...

ఇప్పటికి మూడు నెలలు దాటింది మా వాడు పుట్టి. 7 వ నెల నిండటానికి ఇంకో రెండు రోజులు ఉందనగా ఎ హడావిడి లేకుండా గమ్మున పుట్టేసాడు. 
మాకు తెలియంది ఏంటంటే, నొప్పులు ఎలా వస్తాయో తెలీకపోవడం. అవి కూడా మాములు నొప్పులని గమ్మున ఉండటం. ఎంత జాగ్రత్త పడ్డా కూడా నొప్పులు ఆపడానికి ఆస్కారం లేకుండా పుట్టేసాడు. సంతోషం ఏంటంటే మామూలు కాన్పు . 
డాక్టర్ అడిగింది, మీరేమైనా ప్లాన్ చేసుకున్నారా హాస్పిటల్ అని. అప్పటికి ఎ రకంగాను సిద్ధంగా లేని నేను "లేదు, మీ ఇష్టం" అనేసాను. దాని కన్నా ముందు మా డాక్టర్ బాగా భయపెట్టేసింది.  ఇంకా చెప్పాలంటే లీస్ట్ కేస్ లో ఎలా ఉంటుందో చెప్పారావిడ.  రాత్రి 10 గంటల ప్రాంతంలో డెలివరీ ఐంది. నాతోడు మా అత్త గారు, మా ఆంటీ ఉన్నారంతే. మా డాక్టరే ఏదో హాస్పిటల్ రెఫెర్ చేసారు. డెలివరీ రూం లోకి తీసుకెళ్ళక ముందు మా ఆవిడ ని బాగా ప్రిపేర్ చేశాను. నార్మల్ డెలివరీ కి ప్రయత్నించమని చెప్పాను. లోపలకి వెళ్ళినప్పటి నుంచి అంత గోల లో కూడా నా గుండె శబ్దం నాకే వినిపిస్తుంది. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, ఆ ఏడుపులో ఏ ఏడుపు మా వాడిదో తెలియడం లేదు. కొంచెం హడావిడి తరువాత డాక్టర్ వచ్చారు. బాబు అని చెప్పారు. ఏడుపు విన్పించింది. చిన్నగా ఉన్న వాడిని బయటకి తీసుకొచ్చారు బరువు చూడ్డానికి. అదే చూడ్డం. నాకు సంతోషం గా అరవాలనిపించలేదు గుండె నిండా ఉన్న బరువు ఆ అరుపుకి ఆస్కారం ఇవ్వలేదు.. 
ఈ లోగ అమ్బులన్స్ వచ్చింది. ఒక డాక్టర్,ఒక కంపౌన్దర్ వచ్చారు. బాబు ని ఓ టవల్ లో చుట్టి తీసుకు వెళ్తున్నారు. నేను వాడితో వాన్ లో ఎక్కాను. అదే దగ్గరగా చూడటం. చిన్న తల, అంత తలలోను పెద్ద కళ్ళు. బుజ్జి మూతి. వాడి ఏడుపు గురకలా ఉంది. నాకు గొంతు పూడుకుపోయింది. ఆ వాన్ లో ఉన్న ఆక్సిజన్ ట్యూబ్ ని వాడి ముక్కు దగ్గర పెట్టి హడివిడిగా తీసుకెళ్ళి ఇంక్యుబేటర్ రూం లో తీసుకెళ్ళారు. ఈ లోగ 10000 రూ అడ్వాన్సు కింద కట్టమన్నారు. డబ్బు కట్టి, మళ్ళీ మా ఆవిడ దగ్గరకి వచ్చి తనకి సర్ది చెప్పి, మా ఫ్రెండ్ ఒకమ్మాయిని తీసుకొచ్చి తనకి తోడు  ఉంచి మళ్ళీ బాబు దగ్గరకి వెళ్లాను. హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర వెయిటింగ్ చైర్ లో చాల మంది పడుకొని నిద్రపోతున్నారు. పడుకోడానికి చోటు లేదు. సెక్యూరిటీ పక్కన ఓ చైర్ వేసుకొని కూర్చున్నా. చుట్టూ చీకటి ఒంటరిని చేసింది. మనసు నిండా ఏవేవో ఆలోచనలు. అసలు ఇది నిజమేనా, భ్రమా ? నాకు నిజంగా బాబు పుట్టడా? ఈ మాట అనుకున్నపుడు సంతోషం. వీడెల ఉన్నాడో, ఎలా ఉంటాడో అనుకున్నప్పుడు బాధ,నీరసం. కాలం గడవటం లేదు. కష్టంగా తెల్లారింది. బాబు పుట్టాడని రాత్రి 11 కి అమ్మకి చెప్తే, ఏదో బస్ పట్టుకొని పొద్దున్న కల్లా వచ్చేసింది. ఉదయాన్నే 10 గంటలకే మా ఆవిడని డిశ్చార్జ్ చేసారు. 

హాస్పిటల్ లో చూస్తే 600 గ్రాములు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ తరపు వాళ్ళు నిశ్చంతగా ఉన్నారు. వాళ్ళని చూసాక ధైర్యం చిక్కింది. వారం లో ఇంటికెల్తారని కొందరు లేదు 2 నెలలైనా పట్టచ్చని కొందరు. కాలం  మీద భారం వేసా. మీ బాబు బాగున్నాడు శ్వాస తీసుకుంటున్నాడు. పర్లేదు రికవర్ అవుతాడని ఓ రోజు. లేదు ఆప్నియా ఉంది శ్వాస తీసుకోడం మర్చిపోతున్నాడని ఇంకో రోజు చెప్పి ఒకరోజు సీ పాప్ , ఒక రోజు వెంటిలేషన్ పెట్టారు. దానితో పాటు పసికిర్ల కి ఓ లైట్,ప్రతి రోజు ఓ బాగ్ నిండా మందులు. ఇలా ఓ వారం సాగింది. నాకు ఆ డాక్టర్స్ ఎ రకంగాను భరోసా ఇవ్వలేకపోయారు. ప్రతి రోజు ఏదో ఒక టెస్ట్ పేరు చెప్పి టెస్ట్ చేయించండం, రోజు తిరిగే సరికి డబ్బులు కట్టడం. నాకు ఆశ చచ్చిపోయింది. మా వాడు బరువు తగ్గుతున్నాడు. వంటి నిండా సూదులు. అడిగితే పిల్లలకి నొప్పి తెలీదు అంటున్నారు. ఏమో నా జీవితంలో అంత నొప్పి ఎప్పుడు భరించలేదు. 

నా స్నేహితుడు నాగరాజ్ సూచన మేరకు, రెయిన్బో హాస్పిటల్ లో 2nd opinion తీసుకుందామని రిపోర్ట్స్ అడిగితే ఒక రోజు జాగు చేసారు. గట్టిగా అడిగి తీసుకొని రెయిన్బో కి వెళ్లాను. అక్కడ చీఫ్ డాక్టర్ Dr .ఫ్రీతమ్ గారు చూసి అంతా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది కానీ ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు అని చెప్పారు. పై ప్రాణం పైనే పోవడం అంటే ఏంటో తెల్సింది. వెంటనే నాగేంద్రగారికి (రెయిన్బో మార్కెటింగ్ హెడ్,నాగరాజ్ పరిచయం చేసారు) అమ్బులన్సు పంపమని చెప్పి హాస్పిటల్ కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మార్చడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఏమైనా అయితే? 
అక్కడ ఇంక్యుబులటర్ రూం లో ఒక్క నర్స్ మాత్రమే ఉంది. మా వాడు ఉన్నట్టుండి గాలి తీసుకోవడం ఆపేస్తున్నాడు . మళ్లీ ఇంకో న్యూస్, ప్లేట్లేట్ కౌంట్ 30000 కి చేరింది, వెంటనే రక్తం తెచ్చుకోండి అని. పిచ్చి కోపం. ఎవరిమీద చూపించాలి. లేదు నేను హాస్పిటల్ మారుస్తున్నా అని చెప్పా. గంట వరకు ఒక్కడు కూడా రాలేదు.   నా కోపం పెరిగిపోతుంది. ఎప్పటికో ఒక డాక్టర్ వచ్చాడు. వెనకనే రెయిన్బో అమ్బులన్సు వచ్చింది అది కూడా అన్ని సౌకర్యాలతో. అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు.తీసుకెళ్ళేపుడు ఎం జరిగినా మేం బాధ్యులం కాదు అన్న నా సంతకం తో సహా. 
మా అమ్మ, నా భార్య ఇద్దరు అమ్బులన్సు లో నేనేమో ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని ముగించి బైక్ మీద. 
నాకు ఆ హాస్పిటల్ లో 1.5 లక్షలు ఖర్చు ఐంది వారానికి గాను. 

రెయిన్బో లో ఆఫీసు తరపున ఇచ్చిన హెల్త్ ఇన్సురన్స్ కవర్ ఐంది. వెళ్ళగానే బాబు ని ఇంటెన్సివ్ కేర్ లోకి నేను ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వెళ్లాం. లోపల కి వెళ్ళాక కొంచెం ధైర్యం చిక్కింది. అక్కడ అనుభవం ఉన్న నర్స్ లు ఉన్నారు. ఎప్పుడు అందుబాటులో ఉండే డాక్టర్స్. అక్కడకి వెళ్ళినప్పటి నుంచి ఆక్సిజన్ మాములుగానే తీసుకున్నాడు. సి పాప్ మెషిన్ కాని, వెంటిలేషన్ కాని అవసరం లేకుండా పోయింది. కాకుంటే పాత హాస్పిటల్ లో మా పక్కన ఉన్న బాబు కి ఉన్న infection , మా వాడికి వచ్చింది. infection ఉన్న పిల్లలని వేరుగా పెట్టాలి అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా పోయింది వాళ్ళకి. ఉదయానికల్లా బ్లడ్ ప్లేట్లేట్ కౌంట్ 50000 దాటింది. వాడు మాములుగా అయ్యాడు. 
వాడికి మొదటి సారి బట్టలు కొన్నాం ఇద్దరం. మొదటి సారి ఎత్తుకున్నాను. లోపల గూడు కట్టుకున్న బాధ,భయం ఆ స్పర్శ కి కరిగిపోయాయి. నేను నిద్ర లేకుండా పరిగెత్తగలనని, అలసట ని దాటి పని చేయగలనని తెల్సింది. Thanks to రమా ఆంటీ,నాగరాజ్ and నాగేంద్ర గారు. 


చాల మంది అన్నారు , అక్కడ బాగా డబ్బులు ఎక్కువండి అని. నిజమే పసి ప్రాణాన్ని కాపాడటం లో ఉన్న కష్టం తెలిస్తే అది అవును అనిపిస్తుంది. 

ఇక్కడ అందరితో పంచుకోవల్సినవి కొన్ని ఉన్నాయి. 
1.గర్భవతులు అనవసరమైన ఆలోచనలు చేయకుండా పుట్టబోయే పిల్లలు బాగుంటారు అన్న ధృక్పదం తోనే ఉండాలి. ఇంటర్నెట్ లు, స్నేహితులు చాలా చెప్తారు. ఆ విషయాన్నంతా రంగరించి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డాక్టర్ చెప్పినట్టు చేస్తే చాలు. 
2. మంచి తిండి,నిద్ర, మంచి ఆలోచన మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. 
3. 6 వ నెల వచ్చే సరికి  మీ పొట్టలో ఉన్న పిల్లలతో మీరు మాట్లాడచ్చు. పొట్ట మీద చేతులు పెట్టి కబుర్లు చెప్పచ్చు. అప్పుడు కదలికలు తెలియడం మొదలు పెడతాయి. మీరు మీ పిల్లల్ని కదులుతున్నందుకు అభినందించండి(ఇదేదో ఇంగ్లీష్ సినిమా తెలుగు బ్బింగ్ ల ఉంది కానీ నిజం). మీకు ఆ కదలికలు తెలుస్తున్నాయని చెప్పండి. 
4. ప్రతి నెల జాగ్రత్త గ ఉండాలి. మీరు నవ్వుతూ  ఉంటె మీ పిల్లలూ  సంతోషంగా పుడతారు. 
5.ఒళ్ళు వంచి పని చేస్తే ప్రసవం సుఖంగా అవుద్దని పడి పడి పని చేయద్దు. జాగ్రత్తగా ఉండాలి. 
6. 7 వ నెల నుంచి ప్రసవానికి ఆస్కారం ఎక్కువ. ఎ మాత్రం తేడా అనిపించినా వెంటనే  హాస్పిటల్ కి వెళ్ళండి. 

ఇక ప్రిమేచ్చ్యుర్ బేబీ కి ,
మనకి ఎందుకు అవుద్దులే అని కాకుండా వివరాలు తెల్సి పెట్టుకోండి. దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్ వివరాలు తెల్సుకోండి. 
ప్రిమేచ్యుర్ పిల్లలకి ఊపిరి తిత్తులు,కళ్ళు సరిగా పెరిగి ఉండవు. దానికి సంబంధిచిన ఇబ్బందులు రావచ్చు. 
రక్త కణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. 

జాగ్రత్తగా ఉంటె చాలు. 

హైదరాబాద్ లో ఉంటె నేను రెయిన్బో హాస్పిటల్ ని రెఫెర్ చేస్తాను. 

పచ్చల లక్ష్మీనరేష్ (LakshmiNaresh)


చిన్న చిన్న మాటలే చిలికి చిలికి గాలి వాన అయి మనఃస్పర్ధలు వచ్చి గొడవ పడుతుంటారు భార్యాభర్తలు...
అవును నిజమేనోయ్, అరే నువ్వు చెప్పింది విన్నాక ఇదే బాగుంది, ఈ చీర/షర్ట్ చూసినప్పుడు కన్నా నువ్వు వేసుకున్నాక బాగుంది కదా ఇలా అనుకోవడం వినడం అరుదు....

భార్య అడుగుతుంది, “ఏవండీ(అండీ లు ఉన్నాయా అని అడక్కండి, అనుకుందాం కాసేపు) పొద్దున్నే గుడికి తీసుకెళ్ళరా?”, భర్త రాత్రంతా టీవీ చూస్తూ మేలుకొని “నాకు కుదరదు, ఇంకేపుడైనా వెళ్దాం” అంటాడు. భార్య బయటకి ఏమనకపోయినా రోజు వారీ ఇంటి పనులల్లో మార్పు వస్తుంది. అది కూరలో ఉప్పు కావచ్చు, తన చేతిలోంచి జారిపోయే కిందపడే పళ్ళేల శబ్ధం కావచ్చు.

ఇంకో సారి పండక్కి బట్టలు కొనడానికి పండగ వారం ఉందనగా ,షాపింగ్ కి వెళ్దాం అని మొదలు పెడతారు. అబ్బాయిలు తెమలరు కదా. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చి, ఆలస్యం అవడానికి ఎన్ని కారణాలు చెప్పొచ్చో అన్ని కారణాలు చెప్తారు. ఎప్పుడు ఆఫీస్ కి రాని బాస్ ఆ రోజే వస్తాడు, కొత్త ప్రాజెక్ట్ వస్తుంది,బైక్ పంచర్ హబ్బో అప్పుడు వినాలి బహానాలు అన్నీ. పండగ వచ్చేస్తుంది. అప్పుడు హడావిడిగా వెళ్ళి ఏదో చీర కొనుక్కొని వస్తే అది బావున్నా కూడా నచ్చదు. ఇంకా చూసి ఉంటే ఇంత కన్నా మంచి చీర దొరికి ఉండేదేమో అని ప్రాణం లాగుతూ ఉంటుంది. ఎదురుగా కాళ్ళు సోఫా లో బార్లా చాపుకొని ఊపుకుంటూ వాళ్ళ ఆఫీస్ లో ఫలానా అమ్మాయి కట్టుకొచ్చిన చీర కి ఆ అమ్మాయి వల్ల ఎంత అందం వచ్చిందో వర్ణిస్తూ ఉన్న భర్తని చూస్తే , అప్పుడు ఆ భార్య మనసులో మాటలు బయటకి వినపడితే ఇక ఎ అబ్బాయి ఇంకో సారి అలా చేయడేమో. అలా అడక్క ముందే “అరే పండగ వస్తుంది కదా, పద చీర కొనుక్కుందాం” అని అనమనండి. ఐదు వేలు ఖర్చు పెట్టె ఆడ వాళ్ళు మూడు వేలకే చీర కొంటారు. ముప్పై సార్లు మా ఆయన అడిగి మరీ కొనిచ్చాడు అని చెప్పుకుంటారు. అప్పుడు టీ లు , టిఫిన్ లు అబ్బాయిలు కూర్చున్న దగ్గరకే వస్తాయి విత్ స్మైల్. కానీ అనరు కదా. అబ్బాయిని బతిమాలుకోవాలి, ఓ పది సార్లు గుర్తు చేయాలి. ఎప్పుడైనా కొనిచ్చేదే, ముందే అడిగి మరీ కొనిద్దాం. పోయేదేముంది డ్యూడ్ వంటలు రుచిగా ఉంటాయి,ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.

“అస్సలు ఈ రోజు ఓ అమ్మాయి చేరింది ఆఫీస్ లో, అబ్బబ్బా ఏముంది అనుకున్నావ్.అసలు ఎలా ఇలా మైంటైన్ చేస్తారంటావ్?” అని ఓ పది సార్లు ఇంట్లో తిరుగుతూ గుర్తు తెచ్చుకొని ఆగి మరీ “అబ్బబ్బబ్బా” అని అంటూ ఉంటే ఓ భార్య బాధ వర్ణనాతీతం. దాని కన్నా “ఓ కొత్త అమ్మాయి చీర కట్టుకొచ్చింది, ఆ అమ్మాయి హైట్ కి ఆ చీర సరిపోలేదబ్బా, నీకైతే బావుండేది. అది కూడా లైట్ కనకాంబరం మీద వైట్ బోర్డర్.ఈ సారి వెతుకుదాం నీకు.” అని అంటే, చీర ఎప్పుడు కొంటారు అని అడగడం పక్కన ఉంచి వాళ్ళ మొహం చూడండి. అది అబద్ధం అని తెల్సినా కూడా ఓ నవ్వు దోబూచులాడుతూ ఉంటుంది. మనం అనం కదా. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం చెప్పాలి. బయట కళ్ళప్పగించి చూసేంత అందం ఉన్న లేదా అందంగా కన్పించేలా ఉన్న ఏ అమ్మాయీ 90 శాతం ఇంట్లో అలా ఉండకపోవచ్చు. ఒక పిచ్చి నైటీ వేసుకొని,జుట్టు ముడేసుకొని,తల గీక్కుంటూ,అప్పుడపుడు ముక్కు గెలుక్కుంటూ ఇంట్లో తిరుగుతూ ఉంటే మాములుగానే ఇంత కన్నా దారుణంగా ఉండే అమ్మాయిలు కూడా మేకప్ వేసుకొని వచ్చి  అబ్బాయిల కళ్ళకి హప్సరస ల్లా కనిపిస్తారు. “ఆ మాకు ఎక్కడ కుదురుద్ది, సింగారించుకొని కూర్చుంటే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు.” అంటారు చాల మంది అమ్మాయిలు. నిజమే కానీ, ఓ వారం ప్రయత్నించి చూడండి, తరువాత “ఏంటి నైటీ వేసుకున్నావ్, మొన్న ఆ చీర బావుంది కదా” అని అడక్కపోతే.

జీతం మొత్తం ఏం చేస్తున్నాడు? అని లోపల ఉన్నా కూడా అడక్కుండా ఎప్పుడో ఓ సారి భళ్ళున బయటపడి “అసలు ఇంట్లో ఏమౌతుందో మీకు తెల్సా? ఎన్ని ఖర్చులున్నాయో, ఏమేం కావాలో. నకదంతా తెలీదు. నాకు ఓ పది వేలు కావాలి” అని ఓ భార్య అంటే. ఖర్చుల పురాణం విప్పకుండా “అవును నిజమే, నా పనుల్లో పడి నేను మరచిపోతున్నా, నువ్వు ఎంత పడుతున్నావో తెలీదు. ఓ మాట ముందు చెప్పు నేను మనీ ఇస్తాను లేదా ఈ కార్డు నువ్వు వాడుకో ” అని చూడండి(దాని కన్నా ముందు ఇంట్లో అవసరాలు తెల్సుకొని చూసుకోవాలి). ఎంత మార్పు ఉంటుందో. అలా కాకుండా గొడవ పడితే ఒక రోజుని లేదా ఒక వారపు సంతోషాన్ని ఈ చిన్న గొడవ పెద్దదై తినేస్తుంది.

వాళ్ళ  అమ్మానాన్న(అత్తా మామ అనరేమో) వస్తే, మన అమ్మా నాన్న తో ఉండే తీరు కి వాళ్ళ అమ్మ నాన్నతో ఉండే తీరుకి ఉన్న తేడా తగ్గిస్తే ప్రేమలు  పెరుగుతాయి.నా స్నేహితుడి భార్య ప్రతి దసరా కి వాళ్ళ అత్త మామకి ఆడపడుచుకి బట్టలు పెడుతుంది. డబ్బులు వీడివే,ప్రయత్నం ఆమెది. అమ్మాయికి బట్టలంటే అబ్బాయి ఆలోచిస్తాడు కానీ అమ్మ వాళ్ళకి అదీ ఏడాదికి అంటే ఇక మీ ఇష్టం.
కొందరు అంటారు , అమ్మాయి తన జీతాన్ని “నా జీతం” అని ,అబ్బాయి జీతాన్ని “మన జీతం ” అని అంటుందని. పై వాటిలో బాగున్న వాటిని ఏరుకొని చేసి చూస్తూ “మన” అన్న మాట పదే పదే వినిపిస్తుంది, అనిపిస్తుంది.

ఇప్పటికి ఇంతే మళ్ళీ కలుద్దాం. 
గమనిక: ఎవరి మనోభావాలు దెబ్బ తిన్నా నేను బాద్యుడిని కాను, సరదాగా రాసింది మాత్రమే. 

నా "బాహుబలి"

ఇది రివ్యూ కాదు... 
ఇంట్లో కూర్చుని చిన్న పనిని నెల రోజులు వాయిదా వేసే బద్దకస్తులు, కనీసం కాగితం మీద ఒక మనిషి బొమ్మ సరిగ్గా గీయడం రాని వాళ్ళు కూడా రివ్యూ అని రాస్తున్న రోజులు.. 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు రాయచ్చు అంటే అది వారి విజ్ఞత కె వదిలేస్తున్నాను... 

ఇలానే ఆలోచిస్తూ పోతే మన సినిమాలో మార్పు రాదు....  నా పేరు ముకేష్ అని చావకముందు అతను చెప్పిన మాటల్ని సిగెరెట్ తాగుతూ అవహేళన చేసే బాపతు.. ఒకరి కష్టాన్ని గుర్తించకపోతే మానే,  హేళన చేయకూడదు.. సరే సినిమా చూసి 100 రూ పెట్టి మాట్లాడాడు అంటే అదో రకం.. చూడకుండా కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని చూస్తుంటే, ఇందుకే మన బతుకులు ఇలా గుర్తింపు లేకుండా పోతున్నాయి అనిపిస్తుంది... 


నేను చిన్నప్పుడు మా ఊర్లో "ఎర్రమందారం" షూటింగ్ జరిగింది. ఒక్కో సన్నివేశానికి ఎన్ని టేక్ లు తీసుకునే వాళ్ళో, ఎన్ని బ్రేక్ లు తీసుకునే వాళ్ళో చూస్తే నీరసం వచ్చేది. అలాటిది కొన్ని వేల మంది జూనియర్ నటులు, ఎంతో మంది పెద్ద నటులు వాళ్ళ కాల్షీట్లు, పెట్టుబడి,సమయం వీళ్ళందరినీ చూస్తూనే కథని సరిగ్గా నడపడం.. నిజంగా నీరసం వచ్చేస్తుందేమో ఒక టైం లో. ఈ విషయం లో రాజమౌళి గారి ఓపిక కి ఓ దండం.. ఎలా రా బాబూ అనిపించకమానదు.. 
సినిమా అంతా అద్భుతంగా ఉండదు. లోపాలు ఉంటాయి. అలాటప్పుడు భుజం తట్టి పర్లేదు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇవి మాములే, ఇంకా బాగా చేయగలవ్ అని బాసట గా నిలిస్తే ఇంకా బాగా చేస్తారు. 
ఇంకేం పని లేదన్నట్టు అవే ఎత్తి చూపిస్తూ పోతే , ఎస్ మీరు గొప్పే ఎలా కనుక్కునారు అంత పెద్ద తప్పుని? అని మనం అంతా చప్పట్లు కొట్టాల్సిందే.. 

చాల మంది అంటున్నారు మొదటి భాగం చాల నిదానంగా ఉందని. ఎం అర్ధమైంది? అసలు ఏ పాత్రని సరిగ్గా పరిచయం చేయలేదే? మనం కాసేపైన ఆ పాత్రతో ప్రయాణం చేసి , ఆ మనిషి మీద కోపమో/ప్రేమో/ద్వేషమో/జాలో పెంచుకోలేదే. పక్కా మూస సినిమాల ఒరవడిలో పడి  కొట్టుకు పోతున్న తెలుగు సినిమా ప్రేక్షకులకి ఇవేం అవసరం లేదనిపించింది. 
మీరనుకుంటున్న గొప్ప ఇంగ్లీష్ సినిమాలలో ప్రతి పాత్ర ని పరిచయం చేయడానికి టైం తీసుకుంటారు. వాళ్ళ నేపధ్యం,అలవాట్లు,ఆచారాలు అన్ని చెప్తారు. అప్పుడు కథలోకి తీసుకెళతారు. రాజమౌళి ప్రతి పాత్రని పరిగెత్తించాడు. ఆ పరుగు అందుకోవడం కష్టం. ఇలా తీసినా కూడా స్లో గ ఉందన్నారంటే, అలా తీసి ఉంటె సోది అని చులాగ్గా అనేసే వాళ్ళు. 

నా ఆలోచన కి ఈ పాత్రల పరిచయం తప్ప ఇక సినిమాలో ఎంచడానికి ఎం కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే బాహుబలి మొదటి బాగాన్ని రెండు భాగాలు గా తీయాల్సిందే అనిపించింది. 
ఆ జలపాతాలు,మబ్బులు దాటి ఎదిగిన కొండలు,కోనలు, ఒక రాజ్యం అంటే ఎలా ఉంటుంది? ఎంతో ఎత్తైన ప్రాకారాలు, కోట గోడలు,బురుజులు, కోట చుట్టూ కందకాలు, కోటలోపలి రాజ్యం, ఆ ఇళ్ళు ,గుడులు,దారులు, ఆకాశాన్నంటే భవనాలు,విగ్రహాలు అసలు మన వాళ్ళెవరైనా తీయగలరంటే ఊహించగలమా? మన ప్రభాస్, మన రానా , మన రమ్యకృష్ణ వీళ్ళంతా ఆ ప్రపంచంలో మన తెలుగులో మాట్లాడుతుంటే... అయినా మనకంటూ ఒక చరిత్ర లేదు మనకేమవసరం? ఎంత సేపు పక్కోడ్ని చూసి అః ఓహో అనకోవడం తప్ప మన అన్న వాడిని, మన తెలుగు వాడిని సెహభాష్ అన్ని ఒక్క మాట అని వెన్ను తడదామే అన్న ఆలోచనే లేదు... అందుకే ఇంకా తెలుగు సినిమా లో బూతు మాట కామెడీ ఐంది/ మన కన్నా పెద్ద వాళ్ళని వెటకారం చేయడం గొప్ప ఐంది/ చదువు చెప్పే గురువులు సన్నాసులు అయ్యారు... అయినా అవే మనకి ఇష్టం. 

కాపీ కొట్టాడు అంట? మీరు చదువుకున్న నాన్ డీటెయిల్ పుస్తకాల్లో కథలు మనవి కాదు, వేరే దేశాలవో, వేరే భాషవో కానీ చదివి ఆనందించాం. ప్రతి వారు చేసే పని వెనుక ఎవరో ఒకరి ఆలోచన/మాట ఆసరా ఉంటుంది. ఒక ప్రొగ్రమ్ రాసేప్పుడు ఎంత మంది గూగుల్ సాయం లేకుండా రాస్తున్నారు? సక్సెస్ ఐందా లేదా ? మనకి నచ్చిందా లేదా? 

ఇది ఎవరిని నొప్పించాలని కాదు, సగటు తెలుగు వాడిగా, సినిమా మీద ఉన్న ఇష్టం తో రాసింది... 
ఎక్కడ మొదలు పెట్టాలో తెలీడం లేదు కానీ, మన తెలుగు(తెలుగు అని ఎందుకు అన్నాను అంటే నాకు పర భాషా చిత్రాల మీద పట్టు తక్కువ) సినిమాలలో చమక్కులు ఈ పిట్ట మట్టి బుర్రకి అర్ధం కావు... 

ఈ మధ్య ఈ టీవీ లో వస్తున్న రాఘవెందర్రావు స్వర్ణోత్సవం లో ప్రోగ్రాం కి వచ్చిన పెద్ద మనుషులంతా సార్ అసలా ఆలోచన ఎట్టా వచ్చింది సార్, మీరు తోపు సర్, తురుము సర్ అంటా ఉంటె. అదేదో గొప్ప టెక్నిక్ కాబోలు అనుకున్నా.తీరా జూస్తే ఆయన పూలు, పళ్ళ తోనే కాకుండా వివిధ వస్తువులతో కూడా పాటలు ఎలా తీసాడో చెప్పి ఆనందంతో గుండెలు బాదుకుంటుంటే నా కళ్ళు చెమర్చాయి... పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ ని చూడ్డానికి మెట్ల మీద నుంచి కమెడియన్స్ అంత ఎలా దొర్లుకుంటూ వచ్చారో, అసలా సీన్ తీయడానికి ఆయన  పడ్డ తపన, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి టీవీ ముందు సాష్టాంగ పడ్డాను... 

నా బుర్ర కి అర్ధం కాని ఎన్నో గొప్ప గొప్ప చిక్కు ముడులు మన తెలుగు సినిమాల్లో కనిపిస్తాయి... 
నిన్ననే వచ్చిన పాడి పంటలు అనే సినిమాలో అంజలి దేవి కి కృష్ణ, చంద్రమోహన్ ఇద్దరు కొడుకులు.. ఆస్తులు తీసుకొని చంద్రమోహన్ రిచ్ అయి అమ్మని, అన్నని వదిలి చంద్రమోహన్ భార్య తో కలిసి తాగి దొర్లుతుంటే... ఓ ప్రమాదంలో ప్రాణాల మీదకి తెచ్చుకున్న అంజలీ దేవి  కృష్ణ ని పంపి కొడుకుని కడ సారి చూడాలి తీసుకు రమ్మంటుంది. కృష్ణ వెళ్లి కొన్ని బరువైన డైలాగులు చెప్పి రమ్మంటే వాడు రాడు. తిరిగొచ్చి "హమ్మా, రాలేదమ్మా, నేను దురదృష్ట వంతుడినమ్మా" అని ఇంకో నాలుగు డైలాగులు చెప్తాడు. అంజలీ దేవి ఇంకో రెండు డైలాగులు చెప్పి చచ్చిపోతుంది... ఇదంతా జరిగేలోగ హాస్పిటల్ కి తీసుకెళ్ళచ్చు కదా అనిపిస్తుంది... పిట్ట మెదడు... 

పాత సినిమాల్లో హీరోయిన్స్ నిండుగా ఉంటారు(బలంగా ఉంటారు(ఎవరి మనోభావాలు దెబ్బతిన కూడదని కోరుకుంటున్నా))... రేప్ సీన్స్ వస్తే ఊరంతా తిరిగి, డోర్ లు అన్ని తెరచుకొని బెడ్ రూమ్ కి వెళ్లి పడతారు.. సదరు రేపిస్ట్ వాళ్ళకంటే ఓ 10 కేజీ లు తక్కువ ఉండి , తాగి ఊగుతూ వీళ్ళు ఎలాగు బెడ్ రూమ్ కి వెళ్తారు కదా అన్నట్టు తాపీగా బెడ్ రూం కి వచ్చి రేప్ చేస్తాడు(రేప్ అనే పదాన్ని రికార్డ్స్ నుంచి తొలిగిస్తున్నాం అధ్యక్షా)... అదేదోవాళ్ళే వచ్చేప్పుడు తలుపులేసి రావచ్చు కదా.. సరే వాడో అర్భక ప్రాణి, గట్టిగా వకటేస్తే పడిపోతాడు.. పిట్ట మెదడు 

ఇపుడు ఫైటింగ్ కి వస్తే, వాడు ఒక్కడే ఉంటాడు, అదే వీరో. విలనీస్ ఓ 20 మంది ఉంటారు. అందరి కాడ తుపాకులు ఉంటాయి. అయన్ని కట్ట గట్టి ఆడ బెట్టి, ఒక్కొరుగా పోయి చెంప దెబ్బలు తిని సచ్చిపోతారు. చెంప దెబ్బకే గాల్లోకి ఎగిరి, రెండు పల్టీలు కొట్టి రగతం కక్కుకోని చస్తారు.ఇంకో చోట హీరో చేతిలో ఉన్న కర్రని కొట్టడానికి ట్రై చేస్తుంటారు.. బట్ వై వై వై అని పిట్ట మెదడు అరుస్తా ఉంటది. 

ఇక సొంత మేనమావ మోసానికి బలైన మేనల్లుడు వాళ్ళమ్మతో ఫారిన్ వచ్చినా కూడా ఆ మామ కూతురినే ప్రేమించి మారువేశాలేసుకొని (జస్ట్ ఓ మచ్చ) మామ ఆట కట్టిస్తాడు.. మళ్ళీ పిట్ట మెదడు. 

ఇక కవలల సినిమాల ఫార్ములా మార్చనే మార్చరు. ఒకడు అమాయకుడు, ఒకడు మాయగాడు. ప్లేసెస్ చేంజ్. ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్ ఫైట్.. మళ్ళీ పిట్ట మెదడు... 

ఒక రివెంజ్ తీసుకో దలచినఅమ్మాయి, ఎదురుగా అటు తిరిగి నిలుచున్నా ప్రతినాయకుడు, చేతిలో కత్తి.. ఒకటే వేటు తల తెగిపోడానికి... అలా ఎలా కుదురుద్ది... విలన్ ఓ అరా కిలోమీటర్ దూరం లో ఉండగా, దొంగల కోసం పోలీసులు సైరన్ వేసుకోచ్చినట్టు.. రేయ్ య్ య్ య్ య్ య్ య్ ... అని స్లో మోషన్ లో పరిగెత్తుకు వచ్చి వాడి చేతిలో సచ్చిపోతుంది... మళ్ళీ పిట్ట మెదడు... 

మొన్నెప్పుడో గిరి బాబు హీరో గా ఓ సినిమా దూరదర్శన్ లో వేసాడు... చూస్తున్నా చూస్తున్నా... దారినపోయే ముళ్ళకంపని వాటేసుకుంటారు. గిరిబాబు ఏదో నిధి కోసం వెళ్లి వాళ్ళ స్నేహితులతో పాటు నరమాంస భక్షకులకు చిక్కి వీరోచితంగా పోరాడి చచ్చిపోతాడు. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ తమ్ముడు మదాల రంగారావు అండ్ కో నిధి కోసం వెతికి ఓ పెద్ద నాగ విగ్రహంలో దాని జాడ కనుక్కొని , ఆ బొమ్మ పగలకొట్టి(పక్కన ఒకడు చెప్తూనే ఉంటాడు వద్దు సార్ , దేవుడు అని, పక్కన మెరుపులు.ఉరుములు) ఆ బొమ్మని రాయి అని తిట్టి ఆ వజ్రాలు తీసుకు పోతారు. పోతు పోతు అడవిలో దారి తప్పి ఓ నాగ దేవత గుడికి చేరుకుంటారు. ఆ రోజు నాగ దేవత కనిపిస్తుందని చెప్తేఉండి దాన్ని చూసి వెళ్దామని ఆగుతారు. చూసాక దాన్ని చంపాలనుకుంటారు. (నా పిట్ట మెదడు అరుస్తూ ఉంది, ఎందుకొచ్చిన గోల రా అని) అందరు చచ్చిపోతారు... నాకర్ధం కాలా అంత ఖర్చు పెట్టి ఎం తీద్దామనుకున్నారు  అని. 
ఇక పోలీస్ కథల కొస్తే నా సామీ రంగా పూనకం వచ్చేస్తుంది... పెళ్ళాం పిల్లలు చచిపోయినా సరే చట్టం రా , న్యాయం రా , ధర్మం రా, నాలుగో సింహం రా ... (ఈ మధ్య పోలీస్ పోలీస్ అని సినిమా చూసా బావుంది) 

ఇంకా నయం అప్పటి సినిమాల్లో ఏదో ఒక కథ ఉండేది, ఇప్పుడు హీరో ఉంటాడు. హీరో అని ఎలా తెలుసుద్ది అంటే పక్కన ఓ హీరోయిన్, మనోడు కొడితే విరిగిపోయే సుమోలు, పడిపోయే జనాలు... మద్ద్య మధ్యలో పాటలు... ఓ కమెడియన్ ... ఐపోయింది... 

ఎం తోచక ఇది రాసా... మనోభావాలు దెబ్బ తింటే నేను ఇక్కడ లేనోచ్.... 



ఎండాకాలం లో ఎండల కన్నా అపుడోచ్చే సెలవలు, ఆడే ఆటలు, తాటి ముంజలు, చల్లటి సాయంత్రాలు, ముఖ్యంగా మామిడి పళ్ళు, చింత కాయలు... 
చింతకాయల గురించి చెప్పాలి... 
మా ఇంటి ముందు బడి దగ్గర (ఇవి మొన్ననే కొట్టేసారు) ఓ ఐదు చింత చెట్లు. వీటి మీద ఓ సీజన్లో  రకరకాల పక్షులు వచ్చి వాలేవి. అక్కడే గూడు కట్టుకొని,పిల్లలు పెట్టేవి. ఎంత సందడి ఉండేదంటే. వాటితో పోటి పడి నిద్ర లేచినా అవి ఆ పాటికే లేచి తిండి కోసం వెళ్లిపోయేవి. చీకటి వేళకి గుంపులు గుంపులుగా బారులు తీరి ఆ ఎర్రటి ఆకాశంలో ఎగురుతూ ఉంటే  ఎంత అందంగా ఉండేదో.. అవి వరుస భలే మారేవి. 


ఇంకో ఐదు చింత చెట్లు మా కొట్టానికి పోయే దారిలో ఉండేవి.ఆ ఐదు చెట్లలో ఓకే చిన్న చెట్టు. అదొక్కటే ఎక్కగలిగే వాళ్ళం. పక్కనే నేల బావి, పొగాకు బ్యారన్లు. అదే మా ఆటస్థలం. 
ఎండాకాలం మొదలు కాకుండానే చింత చిగురు వచ్చేది. అదో రుచి.ఎక్కువ తింటే గొంతు పట్టేసేది.  మేము చెట్టు ఎక్కితే మేము తినేదానికన్నా ఊళ్ళో వాళ్ళకి కోసివ్వడం ఎక్కువ. ఆ చింత చిగురుని మేకల్లా మేసే వాళ్ళం. కొన్ని రోజులకి ఓపెన్ కాయలు వచ్చేవి, అంటే చిన్న చింతకాయలు. అవి భలే రుచిగా ఉండేవి. అవి ఇంకొచెం పెరిగినా తియ్యగానే ఉండేవి. 
కొన్ని రోజులకి పక్వానికి వచ్చేవి. వీటికి గిరాకీ ఎక్కువ, పచ్చళ్ళు పెట్టుకోవాలి కదా. మధ్యాన్నం దాకా గాడిదల్లా ఎండలో పడి ఆడి ఆకలేస్తే ఇంటికి వెళ్ళకుండా చింతకాయలు కోసి వాటిని రోట్లో వేసి ఉప్పేసి, కారం వేసి తొక్కుతూ ఉంటె నోట్లోంచి లాలాజలం కాలవలు కట్టి కారిపోతుండేది. 
చింతకాయలు ఇంకొంచెం పెరిగాక వాటిలో బల్లేలు (అంటే బాగా పెద్దవి) కొట్టుకొని (కోసే ఛాన్స్ ఎక్కడుంది, పూత దగ్గరనుంచి ఓపెన్ కాయలు ఇలా అందినవన్నీ కోసేసాం కదా), కొట్టడం అంటే అదో ఆర్టు. 
స్పెషలిస్ట్ లు ఉండే వాళ్ళు. రాళ్ళతో కొట్టేవాళ్ళు, కర్రలు విసిరే వాళ్ళు. అప్పుడపుడు అవి నెత్తిన పడి రక్త తర్పణాలు, అవి ఇంట్లో తెలీకుండా మేం మేనేజ్ చేయడాలు. కొట్టాక వాటిని పొగాకు బారన్లకు ఉండే పోయిలమీద కాల్చే వాళ్ళం. అవి బాగా ఉడికి బుస బుస మని పొంగాక అలా కాలే కాలే వాటిని తిండం ఓ రుచి. 
ఇది అయ్యాక దోర కాయలు... దొరకాయలు పైన ఉండే తొక్క అలా పట్టుకోగానే ఊడి  వస్తుంది. అవి అపుడే పులుపు నుంచి తీపికి మారుతాయి. ఇవి చాల బావుంటాయి. 
ఇక ఇప్పుడు క్లైమాక్స్. గుల్ల కాయలు. ఇవి ఉంటాయి యి యి యి యి ... ఇలా పట్టుకోగానే పలపల  లాడిపోతూ, లోపల బాగా మగ్గి,తియ్యగా.. తిని తీరాల్సిందే తప్ప చెప్పనలవి కాదు. 
ఇక కొసరు. లాలిపోప్ లు లేని రోజుల్లో. ఓ పుల్లకి చింతపండు గుచ్చి దాన్ని నోట్లో వేసి నానుస్తూ ఎర్రటి ఎండలో చెమటలు కక్కుతూ దొంగ పోలీసు ఆట అడతంటే ఉంటది నా సామీ రంగా... తిరుగులేదంతే... 


అది 2002  సంవత్సరం, చదువుకుంటూ ఇంటి వెనకే ఉన్న CD షాప్ లో అప్పుడప్పుడు సినిమా చూసే రోజుల్లో, అక్కడ ఉన్న రాక్ లో పైన ఓ మూలన దుమ్ముగోట్టుకుపోయి ఒక cd పెట్టి ఉంది. దాని మీద రాజులు కత్తులు పట్టుకొని నిలుచున్న మనుషులు చూసి ఇదేదో రాజుల సినిమా ల ఉందే అని తీసుకెళ్ళి చూసా.అందరూ ఏంట్రా బోరింగ్ గా ఉంది అన్నారు, నాకైతే ఇంకో ప్రపంచాన్ని చూసినట్టుంది. అప్పటికి ఇంకా ఇంగ్లీష్ తలకి ఎక్కలేదు. అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసాను, బావున్నాయనిపించింది.
మొదటి సారి “LORD OF THE RINGS” లో మొదటి భాగం “the fellowship of the ring” చూశాక ఓ అధ్బుతం అనిపించింది. ఓ పుస్తకం చదివాక అది మన అంచనాకి తగ్గట్టు ఉండదు, ఎందుకంటే మన ఊహా గొప్పగా ఉంటుంది. మొదటి సారి ఆ సినిమా నా ఊహా ని తృప్తి పరిచింది. ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూసాను, ప్రతి సారి ఎదో కొత్త విషయం తెల్సేది. అసలు ఇలా తీయోచ్చా ? ఆ లొకేషన్స్ ఏంటి? కాస్ట్యూమ్స్, ఒక కొత్త భాష, ఎన్నో పాత్రలు, అద్భుతమైన కట్టడాలు,ఆకాశాన్నంటే భవనాలు,విగ్రహాలు. బాగా నచ్చినది కథ. ఎక్కడో చిన్న ఊర్లో మొదలైన కథ ఎంతో మంది కలుపుకుంటూ ఎన్నో మలుపులు తిరుగుతూ అద్భుతాలను పరిచయం చేస్తు వెళ్తుంటే ఆ లోకంలో విహరించడం తప్ప ఎం చేయలకేపోయా.
అప్పటికి హాలీవుడ్ గురించి పెద్దగా తెలీదు. రింగ్ అని కనపడిన ప్రతి సినిమా వదలకుండా చూసే వాడిని. ఎన్ని CD షాప్ లు తిరిగానో.  కొన్ని రోజులకే మా షాప్ వాడే LOTR లో రెండవ భాగం “the two towers” తీసుకువచ్చాడు. అందులో పడి కొట్టుకుపోయాను. ఇంకో సంవత్సరానికి (నాకైతే ఆ ఒక సంవత్సరం రెండేళ్ళలా తోచింది. ) మూడవ భాగం “The return of the King” వచ్చింది. అది చూసి సంతోషంతో పాటు బాధ కూడా అనిపించింది. LOTR ఐపోయినందుకు. అందులో రాజులు , కోటలు, మాయలు , మంత్రాలు, రాక్షసులు, మాట్లాడే డ్రాగన్ లు , ఎన్నో జాతుల మనుషులు ప్రతిదీ అద్భుతం. చిన్నగా నడిచే కథ. ఓపిగ్గా చూస్తే నచ్చుతుది.
అప్పటి నుంచి పీటర్ జాక్సన్ మేనియా పట్టుకుంది. ఆయన తీసిన “కింగ్ కాంగ్” కూడా అలానే అద్భుతం లా చూసా.
మళ్ళీ పీటర్ జాక్సన్ “ది హాబిట్” అనే సినిమా మొదలు పెట్టాడని. మళ్ళీ మబ్బుల్లో తేలా. పదేళ్ళ తరువాత అంటే 2012 లో హాబిట్ సిరీస్ మొదలైంది. లార్డ్ అఫ్ ది రింగ్స్ కి ముందు ఎం జరిగిందో చెప్పడం కథ. మళ్ళీ ౩ భాగాలు.(  An Unexpected Journey (2012), The Desolation of Smaug (2013), and The Battle of the Five Armies (2014))...
ఈ రోజుతో మూడవ భాగం కూడా ఐపోయింది. ఈ రోజే చివరి భాగం చూసా. IMAX వాడిని అడుక్కొని అయినా మళ్ళీ మొత్తం ఆరుభాగాలు ఒకే రోజు అదే స్క్రీన్ మీద చూడాలని ఆశ.
ఇది రివ్యూ కాదు. స్వోత్కర్ష. ఇలా ఉంది అని చెప్పడానికి అది ఒక రోజులో తీసిన సినిమా నే కాదు. దాదాపు 12 ఏళ్ళ పాటు తీసిన సినిమా.
బలమైన చెడు మీద బలహీనమైన మంచి, ఆ మంచి చేయాలన్న కొందరి ప్రయత్నం ఎలా గెలిచింది అన్నదే కథ.
ప్రతి పాత్రకి ఒక కథ ఉంటుంది, ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ రోజు చాల బాధ అనిపించింది సినిమా ఐపోయినందుకు.

ప్రయాణం లో మొదటి భాగం,

http://aakaasavaani.blogspot.in/2014/06/blog-post.html


ఓ ప్రయాణం -2 


వంశీ ఉదయాన్నే ఆఫీసు కి  వెళ్ళే సరికి  చాలా మంది ఇంకా ఆఫీసు కే రాలేదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ ఏరియా లకి వెళ్ళిపోయారు. ఎవరో కొందరు  ఉన్నారు.  తనకి ఇచ్చిన రూం కి వెళ్లి కూర్చున్నాడు. ఎసి శబ్దం మెల్లగా వినిపిస్తుంది. సీట్లో వెనక్కి వాలి ఆలోచనల్లోకి జారుకున్నాడు.


వంశీ ఊరికి వచ్చాక చాలా మంది మొహాన్నే నవ్వారు. కొందరు మాత్రం మొహమాటానికి తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అన్నింటికీ తన నవ్వే సమాధానం ఐంది. మధు బాధగా ఉన్నా, వంశీ ఆలోచన సరైనదే అన్న భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. రోజు పరిగెట్టడం లేదు. ఒక ప్రశాంతత. ఉదయాన్నే నాన్నతో కలిసి పొలం వెళ్ళడం, ఏవైనా చిన్న చిన్న పనులుంటే చూసుకోవడం. ఆఫీసు కి తయారై నాన్న ని నర్సరీ దగ్గర వదిలి వెళ్ళిపోయేవాడు .


ఎలాగైనా నిలబడాలి. దేనికోసమైతే ఉద్యోగాన్ని వదిలి వచ్చాడో దాన్ని సాధించాలి. ముందు ఉద్యోగం లో స్థిరపడాలి. తన కింద పని చేసే వాళ్ళందరిని పిలిచి మాట్లాడడం మొదలు పెట్టాడు. చాల మందిలో పని చేయాలన్న ఆసక్తి లేదు. వచ్చి వెళ్తున్నారు అనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఈ జిల్లా నుంచే ఆశించిన ఫలితాలు రావడం లేదు. అందరి మాటల్లో తెల్సింది ఏవిటంటే రైతులు కూడా ఆసక్తి గా లేరని. పని ఏమిటంటే,రిలయన్సు వాళ్ళు రైతుల నుంచి కాయగూరలు కొంటారు. దాని కోసం లోన్,విత్తనాలు,ఎరువులు ఇస్తారు.వాళ్ళకి కావాల్సిన రీతిలో పండించాలి .పండించిన పంటలో నాణ్యత లేకపోతే తీసుకోరు. ఇది ప్రజల్లోకి వెళ్ళలేదు. కారణాలు, చాల మంది కౌలు రైతులు కావడం, కౌలు చాల ఎక్కువగా ఉండటం. వ్యవసాయం చేయాలన్న ఆసక్తి లేకపోవడం (ఆదాయం లేక). ప్రకృతి వైపరిత్యాలు, రియల్ ఎస్టేట్ ప్రభావంతో పొలాలు అమ్ముకోవడం, వ్యవసాయం చేసే వాళ్ళ నుంచి ఆ అనుభవాన్ని అందుకోవడానికి తరువాతి తరం సిద్ధంగా లేకపోవడం.  ఇలాటి చాలా కారణాలు.
 ఎక్కడ మొదలు పెట్టాలో అర్ధం కాలేదు వంశీ కి. వ్యవసాయం నామమాత్రంగానే జరుగుతుందని గ్రహించాడు. 10-20 ఏళ్ళలో ఎంత మార్పు అనిపించింది.
ముందు రైతులతో మాట్లాడాలి అనుకున్నాడు. కొన్ని ఊర్లు ఎంచుకొని వెళ్ళడం మొదలు పెట్టాడు. కొందరితో మాట్లాడాక తెల్సింది ఏంటంటే, ఇలా వచ్చి మాట్లాడుతుంటే "సూక్ష్మ రుణాలు" ఇచ్చే వాళ్ళు అనుకుంటున్నారు. కొందరేమో ఎంత లోన్ ఇస్తారు అంటున్నారు. రైతుల్లో సానుకూలత కనపడలేదు. ముందుగా తన స్నేహితుడిఆచారి వాళ్ళ ఊరిని ఎంచుకున్నాడు. అక్కడ దాదాపుగా వెయ్యి గడపలు ఉన్నాయి. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళే. అందరు మధ్య తరగతి వాళ్ళు. అందరికి నాలుగు లేదు ఐదు ఎకరాల కన్నా మించి లేదు పొలం.అందరువాణిజ్య పంటల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. పొగాకు, మిర్చి,శెనగలు లాటివి. ఆచారి సాయంతో ఇరవై మంది రైతులని పిలిచి మాట్లాడాడు. కూరగాయల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదని, దిగుబడి బాగా ఉంటె ఆదాయం గొప్పగా లేకున్నా నష్టం రాదనీ, అందరు సాంప్రదాయ వ్యసాయాన్ని పాటించాలని సూచించాడు. కొందరు ముభావంగా తల ఊపారు. వాళ్ళకి కూడా పెట్టుబడి లేకపోవడం, అప్పుల్లో ఉండటం లాటివి ఆ పనిని ఒప్పుకునేలా చేసాయి. మొత్తం ఎనభై ఎకరాలు. దాని కోసం అయ్యే పెట్టుబడి ని అంచనా వేసి మేనేజిమెంట్ కి వివరాలు పంపాడు. మానేజిమెంట్ నుంచి వచ్చిన సమాధానం చూసి ఆశ్చర్యపోయాడు వంశీ. ఆ జిల్లా నుంచి ఆశించిన ఫలితం రావడం లేదనీ, అక్కడ నుంచి తీసివెయ్యాలని అనుకుంటున్నామని, చివరి ప్రయత్నంగా చూస్తామని సమాధానమిచ్చారు. ఆశ్చర్యపడటం తన వంతైంది. మునిగిపోయే ఓడ లో ఉన్నానని అర్ధమైంది. ప్రయత్నలోపం ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.
నాన్నతో మాట్లాడి సాంప్రదాయ వ్యవసాయం గురించి వివరాలు తెల్సుకున్నాడు. ఆ ఊర్లో వాళ్ళ నాన్నకి తెల్సిన వాళ్ళు కూడా ఉండటం కూడా తన పని ముందుకు సాగడానికి దోహదపడింది. అక్కడ ఉన్న నీటి వసతిని అంటే బోర్లు,చెరువులు,కుంటలను పరీక్షించాడు.రైతులతో రోజు మాట్లాడడం, తనే జవాబుదారిగా ఉండటం, ఏదైనా సమస్య ఉంటె తనతో మాట్లాడమనడం, పెట్టుబడి అంటూ  ఇవ్వకుండా అవసరానికి విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం  లాంటి పనులు రైతుల్లో నమ్మకాన్ని పెంచాయి. ఉన్న కొద్ది పెట్టుబడి లో ఈ పనిలో గెలవాలని తపన పడుతున్నాడు వంశీ.
ఆఫీసు లో  వీకెండ్ ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉండేది, ఇపుడు శని, ఆది వారాలు కూడా అక్కడే గడుపుతునాడు.
ఓ రోజు ఇంటికి వచ్చే సరికి బాగా చీకటి పడింది. ఇంట్లో అందరు ఎదురు చూస్తున్నారు. తిన్నాక కూడా అదే ఆలోచన, ఇంకా ఎలా బాగా చేయోచో ఫోన్ లో సమాలోచనలు. కాసేపటికి అలికిడి కావడం తో తల తిప్పి చూసాడు వంశీ. తననే చూస్తు నిలబడి ఉంది మధు. తన కళ్ళలో వేయి ప్రశ్నలు. మధు ని కళ్ళతో పిలిచాడు వంశీ. ఆరుబయట నులక మంచం, కొబ్బరాకుల గలగలలు, దూరాన శివాలయం లో భజన పాటలు.దగ్గర గా కూర్చుంది మధు. "కోపంగా ఉందా" అడిగాడు వంశీ. తన కళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాయి," నువ్వు దూరంగా జరుగుతున్నట్టుంది" అంది.మధు భుజం చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకున్నాడు. "మనది కాని ప్రపంచానికి, నిన్ను అతిధి గా తీసుకు వచ్చి వదిలేసా కదా" మధు భుజం చుట్టూ ఉన్న చేయి తన ఇష్టాన్ని తెలుపుతూ ఉంది.  మధు కళ్ళు వర్షిస్తున్నాయి."నన్నిలా వదిలేసి వెళ్ళకు వంశీ" అంది మధు, "మరి నాతో పాటు వస్తావా?". మధు మొహం మీద చిరునవ్వు "నిజంగానా,తీసుకు వెళతావా?", "ఊ" అన్నాడు వంశీ. తన చేతుల్లో ఒదిగిపోయింది మధు.
మరుసటి రోజు తెల్లవారేసరికి వంటిట్లో పద్మావతమ్మ గారెలు చేస్తూ ఉంది. ఆ వాసన కి ఆకలి ఆవురావురుమంది వంశీ కి. "మా ఆకలి", "మొహం కడుక్కొని రారా" అంది పద్మావతమ్మ. "నాన్న ఏడి ?" "పొలం దాక పోయి వస్తా అన్నాడు". తొందరగా మొహం కడుక్కొని, నాన్న కోసం చూస్తున్నాడు వంశీ. "వస్తాడులేరా,నువ్వు తిను" , "రానీమ్మా ". మాటల్లోనే వచ్చాడు శ్రీనివాసరావు. అలా వంటింట్లోనే కూర్చుని గారెలు తింటూ ఉంటె "ఇంత తాపీగా తినగలమా" అనిపించింది వంశీ కి.
పొలం పనులు చక చకా సాగుతున్నాయి. ఎరువులు వేయడం,దున్నడం,విత్తడం జరిగిపోయాయి.వంగ మొక్కలు,బెండ,టమాటో,కాబేజీ,దోస కాయలు వేసారు. మధ్య మధ్యలో బంతి నార్లు.  పని మీద ఇష్టం ఉంది. తన చేతుల్లో దిద్దుకుంటున్న పని, మంచి గాలి. ఒళ్ళు అలసిపోయి ఇంటికి చేరి, తిని పడుకుంటే మంచి నిద్ర. మొక్కలు వచ్చేసాయి. పురుగు మందు కొట్టడం, కలుపు తీయడం. ఇదంతా కూలి వాళ్లతో సంబంధం లేకుండా అక్కడ ఉన్న 20 కుటుంబాలే చేసుకుంటున్నాయి. ఓ సందడి వాతావరణం. ముద్ద బంతి పూలు పండగ వాతావరణాన్ని తీసుకు వచ్చాయి. మధు అది చూసి మురిసిపోయింది.
మొదటి పంట వచ్చింది, కానీ అనుకున్నంత నాణ్యత లేదు. అందరు దిగాలు పడిపోయారు. వంశీ కి ఓ ఆలోచన వచ్చింది. కూరగాయలు తీసుకువెళ్ళడానికి లారీ ఉదయాన్నే వస్తుంది. ఈ లోగ కోసి వాటిలో మంచి వాటిని ఏరి బస్తాల్లోకి ఎక్కించారు. మిగతా వాటిని దగ్గర ఉన్న టౌన్ లో మార్కెట్ కి పంపాలని నిర్ణయించారు. మొదటి పంట నష్టాన్ని మిగల్చలేదు. కాని ప్రజల్లో ఓ అవగాహన  వచ్చింది. వాణిజ్య పంటలతో నష్టపోయి విసిగిపోయిన ప్రజలు ఇటు వైపు మొగ్గు చూపసాగారు.
వంశీ ఆఫీసు లో ఉండగా ఓ మెయిల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే "ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన కొన్ని రోజుల్లో కూరగాయలు కొనడంఆపేస్తాము. బహుశా 3 నెలల తరువాత" అని. ఆఫీసు లో ఉన్న వాళ్ళలో చాలామంది ఇంత ఆలస్యంగానా  అన్నట్టు చూసారు. కొందరు వంశీ వైపు చూస్తున్నారు. వంశీ కి ఏం తోచలేదు. మేనేజర్ కి ఫోన్ చేసాడు. "సర్ ఇలా మెయిల్ వచ్చింది. అందరు ఇపుడిపుడే ఇటు వైపు ఆలోచిస్తున్నారు. ఈ లోగా ఇలాటి నిర్ణయం ఏంటి?". "చాల రోజుల నుంచి అక్కడ ప్రొడక్టివిటీ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు" అని సమాధానం అవతల నుంచి."నాకో అవకాశం ఇవ్వలేరా", " నేను మాట్లాడి చెప్తాను" ఫోన్ డిస్కనెక్ట్ ఐంది. ఇంతలో మొబైల్ రింగ్ ఐంది."వంశీ సార్, మా పక్క ఊరి వాళ్ళు కూడా కలుస్తా అంటన్నారు. మిమల్ని అడిగి చెప్తా అన్నాను" అని ఫోన్. "నేను కనుక్కొని చెప్తాలే అని ఫోన్ పెట్టసాడు వంశీ. మనసంతా గజిబిజిగా ఉంది. ఆఫీసు నుంచి తొందరగానే ఇంటికి వెళ్ళాడు. 

అన్నం తినబుద్ధి కాలేదు వంశీ కి. పద్మావతమ్మ గమనిస్తూనే ఉంది."ఎరా  అలా ఉన్నావు? వంట్లో బావుంది కదా?". కొడుకు ఎండలో కష్టపడుతున్నాడని బాధ ఆమెకి. "ఎం లేదమ్మా" అని పడుకోడానికి వెళ్ళాడు వంశీ. నిద్ర పట్టడం లేదు. "నన్ను నమ్మిన రైతుల పరిస్థితి ఏంటి? నేను అనుకున్న దాన్ని సాధించగలనా?" ఇవే ఆలోచనలు కుదురుగా ఉండనియ్యడం లేదు. అలా  ఎప్పటికో నిద్ర పట్టింది. రాత్రంతా ఏవో కలలు, పాతాళానికి జారిపోతున్నట్టు, అందిన ప్రతి దాన్ని పట్టుకుంటున్నా అన్ని  చేజారి పోతున్నట్టు. ఎక్కడో ఆకాశంలో అమ్మానాన్న,మధు పిలుస్తున్నట్టు, ఊపిరి అందడం లేదు వంశీ కి.ఉలిక్కి పడి లేచాడు. వళ్ళంతా చెమటలు. "ఏమైంది వంశీ?" అంది మధు. "ఏదో పీడకల" అని కూర్చుండి పోయాడు. వంశీ భుజం మీద చేయి వేసి అంది మధు " నీ కష్టం ఊరికే పోదు,తప్పకుండా గెలుస్తావు". నవ్వు బలవంతంగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ బయటకి వెళ్ళిపోయాడు. 

ఉదయాన్నే పొలం వెళ్తుంటే బుట్టలో కూరలు అమ్ముతున్న ఆమె కనిపించింది." నిజమే కదా, అదే సిటీలో ఇవే కూరగాయలు పాక్ చేసి ఎక్కువ ధర కి అమ్ముతారు. అదే కొనే వాళ్ళ దగ్గరకే తీసుకు వెళ్లి అమ్మితే ఎలా ఉంటుంది?" అని మనసులో అనుకున్నాడు వంశీ. త్వరగా ఆఫీసు కి చేరుకున్నాడు. పైవాళ్ళకి కాల్ చేసాడు, అనాసక్తి గా సమాధానం "చూద్దాం లే" అంటూ. 

ఇంతలో మురళి  నుంచి కాల్. మురళి వంశీ తో పాటు పని చేసేవాడు.  మంచి మిత్రుడు కూడా . "ఏంటి వంశీ, ఎలా ఉన్నావు?", "బావున్నా మురళి, కాని ఫలితాలు ఆశించినట్టు రావడం లేదు" అన్నాడు వంశీ. "పర్లేదు, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు వంశీ" అన్నాడు మురళి. "సర్లే వదిలేయ్, ఏవిటి కబుర్లు, హైక్ ఏమైనా ఇచ్చారా?", "లేదు, ఏదైనా సైడ్ బిజినెస్ చేద్దాం అని ఉంది" అన్నాడు మురళి. 

వంశీ మనసులో ఓ ఆలోచన మెదిలింది. 
వంశీ అన్నాడు "నా దగ్గర ఓ ఆలోచన ఉంది", 
"ఏంటి?", 
"మనం కూరగాయలు నేరుగా రైతుల నుంచే కొనుక్కుంటే ఎలా ఉంటుంది అంటావ్?",
"అంటే"
"రైతు బజార్ కి వెళ్ళకుండా, సూపర్ బజార్, సూపర్ మార్కెట్ లో కొనకుండా, మన ఏరియా లోనే తాజా కూరగాయలు దొరికితే అది చవకగా" అన్నాడు వంశీ. 
"అది ఎలా" 
"మనం ఒక కాలనీ ఎంచుకుందాం. అక్కడ కొన్ని చోట్ల ఖాళీ ప్రదేశాలను అద్దెకు తీసుకుందాం.  రైతుల నుంచి మనం కూరగాయలు కొని, పొలం లో నే గ్రేడ్ చేయించి, రాత్రి కి పంపితే అవి మనం అనుకున్న చోటికి ఉదయానికల్లా చేరుకుంటాయి. అక్కడ నుంచి మళ్ళీ గ్రేడ్ చేయించి మనం అద్దెకు తీసుకున్న చోట పెట్టి అమ్మితే అటు రైతు, ఇటు కొనే వాళ్ళు లాభ పడతారు కదా?" అని ముగించాడు వంశీ. 
"ఆలోచన బాగానే ఉంది. కానీ అసలు అందులో లాభం వస్తుందంటావా?" అన్నాడు మురళి. 
"ముందు ఈ ఆలోచన విజయవంతం అయితే బావుంటుంది. ఉదాహరణకి, అన్ని సార్లు కూరగాయలు ఒకే రకంగా ధర ఉండవు. బెండకాయ ఊర్లో 10 కేజీలు 100 రూపాయలకి అమ్ముతున్నారు. అదే మనం ఒక కేజీ 40 రూపాయలకి కొంటున్నాం. ఈ తేడా ని తగ్గించగలిగితే మనం విజయం సాధించినట్టే. రవాణా ఖర్చు తగ్గించడానికి ప్రతి పట్టణానికి దగ్గరలో ఉన్న పల్లెల్ని సంప్రదించి కొరగాయలు కొనుగోలు చేస్తే బావుంటుంది. ఏమంటావ్?" ఆపాడు వంశీ. 

"సరే, నేను ఆలోచించుకొని చెప్తాను.ఉంటా వంశీ" అని పెట్టేసాడు. 
వంశీ ఆలోచిస్తున్నాడు,తనకి ఉన్న సమయం 3 నెలలు, ఈ లోగా ఏదైనా చేయాలి... 

It is Lack of faith that makes people afraid of meeting challenges, and I believed in myself.