ఉన్న కొద్దిపొలం లో అత్యాశ కి పోకుండా వ్యవసాయం చేసుకుంటూ.. వళ్ళు అలసిపోయేలా పని చేస్తూ కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, మనసుకి నచ్చిన స్నేహితులు, పచ్చి గాలి , పచ్చని ప్రకృతి, కన్న వాళ్ళని చూసుకుంటూ జీవితాన్ని గడిపెయ్యలని ఆశ.... 

వ్యవసాయం అంటే వ్యయం తో కూడిన పని. దూరం నుంచి చూడ్డానికి పచ్చని ప్రకృతి,చల్ల గాలి, మనం పిలిస్తే పలికే ఎద్దులు, మర్రి చెట్టు, నీళ్ళ కుంట, చద్దన్నం, రెండో ఆట సినిమా ఇవన్నీ కనిపించచ్చు....ఓ సరి దిగాక ఏడుపు రాక మానదు...బాగా అలవాటు ఐన వల్లే హమ్మో అని వదిలేస్తున్నారు..బోలెడు కారణాలు..చాల మందికి పొలం ఉన్న చేసే వాళ్ళు లేకపోవడం, కూలి వాళ్ళు దొరక్కపోవడం, దొరికినా కూలి ఎక్కువగా ఉండటం, నాణ్యమైన విత్తనాలు దొరక్కపోవడం,పురుగు మందులు, సత్తువ ఇవన్ని కలిసి తడిసి మోపెడు అవుతాయి...ఇది కాక ఆ ఎండలో పడి పని చేస్తూ ఉంటె ఆ బాధ వర్ణనాతీతం, కాని ఆ పనిని ఇష్ట పడాలి... రైతు కి చాల సహనం, ఓపిక ఉండాలి.... మద్యలో వచ్చే వానలు, ప్రకృతి వైపరిత్యాలకి చేతికి ఏం దొరక్కుండా పోవచ్చు (ఇన్సూరెన్స్ ఉంటె బాగుండు)....అంత అయి పంట కోతకి వచ్చే వేళకి అదునులో కూలి వాళ్ళు దొరకరు, కూలి వాళ్ళు కావాలనుకునే వాళ్ళు డబ్బులుంటే ఎక్కువ కూలి ఇచ్చి కూలి పెంచేస్తారు....కల్లాల్లోకి ధాన్యం వచ్చాక దళారులు రంగం లోకి దిగుతారు( అప్పుడు ప్రభుత్వం రైతులకి ఓ అవగాహన కలిపించాలి..పెరుగుతున్న బంగారం ధరని టీవీ లో వేస్తున్నట్టు ఆ పంటల ధరలని చాటింపు వేయించడం లేదా ప్రభుత్వం నుంచి ఓ ప్రతినిధి ద్వారా ప్రతి ఊరికి తెలియచేయడం చెయ్యాలి..తలుచుకుంటే చాలా దారులు ఉన్నాయి)... వాళ్ళంతా ఒకే మాట అనుకొని కొనుగోలు మొదలు పెడతారు... అప్పుడే బాకీల వాళ్ళు, బ్యాంకులు వాళ్ళు వచ్చేస్తారు.. రేపు ఎంత రేటు వస్తుందో తెలీని స్థితి..ఎప్పుడు వాన పడుద్దో తెలీదు...దాచుకోడానికి గిడ్డంగులు ఉండవు....ఇక తప్పదు అమ్ముకోవాల్సిందే....ఇలాటి పరిస్థితుల్లో ఎం చేయాలి? సొంత పొలం అయితే కౌలు కి ఇవ్వడం, లేదా అందులో సవకలు, సుబాబుల్, జామాయిల్ వంటి కలపకి పనికొచ్చే చెట్లు వెయ్యడం. లేదా పరిస్థితి కి తగ్గట్టు గా పంటలు వెయ్యడం... పొలం లేకపోతే ప్రభుత్వ ఉపాధి పధకం లో కూలికి వెళ్ళడం జంట కి 400 వస్తాయి.... బ్రతుకంతా ఇలానే కొంత ఆదాయం తో, నష్టాలతో బ్రతికితే వాళ్ళ పిల్లలు పెద్ద చదువులు చదవద్దా? వ్యవసాయాన్ని బరువుగా భావించి వదిలేసినా వాళ్ళు చాల మంది...వారసులు లేక వదిలేసినా వాళ్ళు కూడా ఉన్నారు, మరి చదువుకున్న పిల్లవాడు, సుకుమారుడు వచ్చి వ్యవసాయం ఎందుకు చేస్తాడు? ఎం చేద్దాం????
భారతీయులు ప్రాంతాల వారిగా, మతాలపరంగా , కులాల పరం గా , హోదాల తేడా తో, భాష ల తేడాతో, సంస్కృతుల నెపం తో ఎన్ని రకాలుగా ముక్కలు చెయ్యాలో అన్ని రకాలుగా ముక్కలు చెయ్యబడ్డారు..ఇప్పుడు కొత్తగా మనోభావాలు మొదలయ్యాయి...ఎం మిగిలిందని.... 
అసలీ భారతీయులు ఎవరు? పదకొండు మంది ఉన్న మన క్రికెట్ టీం..... మన దేశం నుంచి వలస వెళ్లి పని చేసే ఉద్యోగులు, మన దేశం తరపున ఆడే ఆటగాళ్ళు.... మన రాజకీయనాయకులు..ఇక్కడ ఉన్న ప్రజలు కాదు..వాళ్ళలో ఆ భావం లేదు....

అంతెందుకు మన తెలుగు వాళ్ళు ఎంత మంది? అందులో తెలంగాణా, సీమ, ఆంధ్ర.....
ఆంధ్ర లో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర .... 
ఎన్నో మతాల వాళ్ళు....మత మార్పిడులు చేసే వాళ్ళు.... హిందువులు, ముస్లిం లు, క్రిస్టియన్ లు.....
హిందువుల్లో ఎన్నో కులాలు....ప్రతి కులం లో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు....
ఇపుడు రాజకీయపార్టీల పరం గా కూడా విడిపోతున్నారు....
ఆడ మగ ..... మనుషులం అన్న స్పృహ పోతుందేమో .... 
ఇంత పెద్ద భూగోళం లో మన ఆంధ్రులం ఇన్ని ముక్కలుగా విడిపోతే....మన దేశాన్ని సమైక్యంగా ఉంచడం ఎంత కష్టం...మనం భారతీయులం అన్న భావాన్ని మనలో నింపుకోవడం ఎలా? 

జన గణ మన అధినాయక జయహే!
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్చల జలధితరంగ!
తవ శుభనామే జాగే!
తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయ గాథా!
జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా!
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!

వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరమ్ ||వందే||
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరమ్ || వందే ||
కోటికోటి కంఠ కలకల నినాదకరాలే
కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరామ్ || వందే ||
తిమి విద్యా తిమి ధర్మ తుమి హృది తుమి మర్మ 
త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం
నమామి కమలామ్ అమలామ్ అతులాం
సుజలాం సుఫలాం మాతరమ్ || వందే ||
శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ సుశ్యామల సస్య చలచ్చేలాంచల 
జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా! || జయ ||
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా! || జయ||

సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా
హమ్ బుల్ బులే హై ఇస్‌కే, యే గుల్ సితా హమారా||
పరబత్ వో సబ్ సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మాన్ కా
వో సంతరీ హమారా ! వో పాస్‌బా హమారా||
గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ హజారో నదియా
గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే రష్‌కే జినా హమారా||
మజ్ – హబ్ నహీ సిఖాతా ఆపస్‌మె బైర్ రఖ్‌నా
హిందీ హై హమ్ వతన్ హై హిందుస్తాన్ హమారా||

ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము.
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందు.
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
ఓడలా ఝండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ వీర భావ భారతము.
తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా
సౌర్య హారముల్ రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవి ప్రభువులల్లంగ
రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక
దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా
జగములనూగించు మగతనంబెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర
వెలిగినదీ దివ్య విశ్వంబుపుత్ర
దీవించె నీ దివ్య దేశంబు పుత్ర
పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట
పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకూ
కానలా కస్తూరి కాచరా మనకు.
అవమానమేలరా ? అనుమానమేలరా ?
భారతేయుడనంచు భక్తితో పాడ!

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !
పాడిపంటలుపొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !
ఈసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయ్
జల్డుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్ !
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్ 
దేశి సరుకులు నమ్మవెలె నోయ్ 
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !
వెనుక చూసిన కార్యమేమోయ్
మంచిగతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుక పడితే వెనుకేనోయ్ !
పూను స్పర్దను విద్యలందే
వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !
దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పకోకోయ్
పూని యేదైనాను, వొక మేల్ 
కూర్చి జనులకు చూపవోయ్ !
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసె నోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్ల లోయి !
సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !
చెట్ట పట్టాల్ పట్టుకుని 
దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి !
మతం వేరైతేను యేమోయి
మనసు వొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగీ
లోకమున రాణించు నోయి !
దేశ మనియెడి దొడ్డ వృక్షం 
ప్రేమలను పూలెత్తవలె నోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలె నోయి !
ఆకులందున అణగి మణగీ
కవిత పలకవలె నోయ్
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్త వలెనోయి !





చిల్లర మనుషులు...
వీళ్ళే ఇప్పుడు గొప్ప వాళ్ళు...అసలెవరబ్బ వీళ్ళు?
మీరు ఏదైనా గుడి దగ్గర క్యు లో నిలబడి, ఒకడు ఉంటె అల నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ కి నమస్తే పెట్టి ఒక వెకిలి నవ్వునవ్వి ప్లీస్ ప్లీస్ అంటూ అడుక్కొని చేతిలో ఎంతో కొంత పెట్టి మన కన్నా ముందు పని చేయించుకొని వచ్చి కళ్ళు పైన పెట్టుకొని ఎదో ఘన కార్యం సాధించినట్టు వెళ్తాడు చూడండి??? ఎలా ఉంటుంది మనకి.....
మనము, ఇంకోడితో గొడవ పడి పోలీస్ స్టేషన్ కెళ్తే తప్పు మనది లేకపోయినా అవతలి వాడు అక్కడి వాళ్ళ కాళ్ళో గడ్డాలో పట్టుకొని అడుక్కొని ఎలాగోలా బయటకి వచ్చి మన ముందు కలర్ ఎగరేస్తే.....
మనం పరిగెత్తి బస్సు ఎక్కుతుంటే గేట్లో నిలబడి వేళ్ళాడుతూ వెకిలిగా మాట్లాడుతూ అందరిని ఇబ్బంది పెట్టె ఒక తుంటరిని చూస్తే ఏమనిపిస్తుంది....
పది మంది లో ఒక ఆడపిల్ల ని ఒకడు ఏడిపిస్తుంటే రేయ్ అని ఆపబోతే పో పో పని చూసుకో అని వాడంటే ఎం చేయాలి?
మనతో పాటు ఆఫీస్ లో ఉంటూ పని చేయకుండా బాస్ ని ఆకట్టుకొని మనముందే ఎదుగుతూ ఉంటె ఎం చేయాలి?
మనమంతా సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడి ఆగి ఉంటె జీబ్రా లైన్ దాటి చేతులు ఇలా ఎగరేసి వెనకవైపు చూసి ఎదో చేసినట్టు బడాయి పోయే తురుం ఖాన్ లని ఎం చేయాలి?
హాస్పిటల్ దగ్గర OP రాయించుకొని వరసలో నిలుచుని ఉంటె ఎవరో ఒకరు హడావిడి గ వచ్చి ఇప్పుడే మాట్లాడి వస్తాం అని మనకన్నా ముందు లోపలకి పోయి ౩౦ నిమిషాలకి బయటకి వస్తే?
ఇలాటి సందర్భాలు బోలెడు...ప్రతి ఒక్కరు కోపం అణుచుకుంటారు  లేదా కళ్ళతో సైగ చేసుకుంటారు లేదా మనకెందుకు లేబ్బా అని తప్పుకుంటాం...
ఎంతమందిమి ఇలాటి సందర్భాల్లో స్పందిస్తారు? పది మంది లో జరుగుతున్న తప్పు ని తప్పు అని నిలదీయలేని వాడికి ప్రపంచం ఇలా ఐంది ఏంటి అని బాధపడే హక్కులేదు....రేపు ఆ తప్పు నీ ఇంట్లో జరగచ్చు..అప్పుడు మౌనమే నీ సమాధానం, ఎంత అరిచినా దాన్ని ఆపలేరు...
అందరు ఇలా లేరు...చాల మందే ఉన్నారు... సంఘం అంటే ఒకప్పుడు భయం ఉండేది..అమ్మో ఈ తప్పు చేస్తే ఎమన్నా అంటారేమో...ఈ తప్పు చేస్తే మా నాన్న పరువు ఏమౌతుందో అన్న భయం. తప్పు అనేది ఒక్కపుడు సంఘం ఆమోదించేది కాదు.....కాని ఇప్పుడు అలాటిది లేదు...ఎం చేసి అయినా సంపాదించు అని చెప్పే అమ్మ నాన్నలు....మంచి చెడు నేర్పించని గురువులు (ఆ అవకాశం ఇవ్వడం లేదు, అదేదో కొత్త రూల్ అంట కొడితే మూడేళ్ళ జైలు శిక్ష  )
ఇనింటి మద్యలో కొన్ని వెతుక్కోవడం అర్ధం లేని ఆలోచనా?
 ఇందులో నా అపోహలు, లేదా స్వంత ఆలోచనలు ఉండచ్చు...అవి నావి మాత్రమే, ఎవరిని సమాధానపరచడానికి  మాత్రం కాదు ....


నాకు పుస్తకాలు ఎలా అలవాటయ్యాయో గుర్తు లేదు కాని, మా తాతయ్య దగ్గరకి వెళ్ళినప్పుడు ఆయన చెక్కపెట్టెలో దాచిన పుస్తకాలు  చిన్న novels తీసి చదవడం మాత్రం గుర్తుంది. ఇవే కాకుండా 'ఈనాడు' తో వచ్చే ఆదివారం పుస్తకం. అందులో వచ్చే phantam కథలు. ఇంకా చెప్పుకోవాల్సింది అందరికి తెల్సిన 'చందమామ'. అందులో బొమ్మలు. అందులో రాజులూ, రాణి,మాంత్రికుడు,పర్వత సాణువులు, చీమలు దూరని కారడవులు..అబ్బో చాలానే ఉండేవి.ఇప్పటికి కూడా అవంటే చాలా ఇష్టం.నేను 8th లో ఉండగా నాకు బెల్లం రవి పరిచయం అయ్యాడు. వాడికి కూడా ఇవే ఇష్టం. వాళ్ళ ఇంటికి ప్రతి నెల చందమామ వచ్చేది. ఇందుకోసమే వాడితో నాకు స్నేహం కుదిరింది. కొత్తగా వచ్చేవి కాకుండా పాతవి కూడా తెప్పించుకుని చదివే వాడిని. నా దగ్గర మా తాతయ్య దగ్గర తెచ్చిన detective novels ఉండేవి. అందులో హీరో 'షాడో', షాడో స్నేహితుడు 'గంగారాం'. భారత దేశాన్ని వణికించిన ఒక గజ దొంగ, ప్రభుత్వ secret service లో చేరి ఏమేం సాహసాలు చేసాడు అనేది దీని ఇతివృత్తం. 10th కి వచ్చిందాకా క్లాసు జరుగుతున్నా సరే  పుస్తకాల మధ్యలో పెట్టుకొని మరి చదివేవాళ్ళం. 10th అయాక ఆ అవకాశం రాలేదు. ఈ పుస్తకాలు చదివి నేను పాడైపోతనేమో అని మా అమ్మ నాన్నల భయం. అందుకే ఈ విషయంలో నన్ను తిడుతూ ఉండేవాళ్ళు 'ఎప్పుడు చూడు ఈ పిచ్చి కథలు ' అని.ఎందుకో నాకవంటే నిజంగా పిచ్చే.ఇంటర్ అయ్యాక హైదరాబాద్ వచ్చేశా. హాస్టల్ లో ఉండగా 'స్వాతి' లో ఏదో సీరియల్ వస్తూఉంది. దాని పేరు 'కాళికాలయం' (మీకు వీలైతే ఈ పుస్తకం చదవండి.). కొన్ని ఎపిసోడ్స్ చదివాక మరి పిచ్చి పెరిగి,ఆ పుస్తకం కొన్నాను.ఇది రాసింది 'మధు బాబు'. ఈయనే 'షాడో' series రాసింది. ఈయన ఏలూరు దగ్గర ఉన్న హనుమాన్ జంక్షన్ లో headmaster . మనం సినిమాల్లో హీరో లని హీరొయిన్ లని ఎలా అభిమానిస్తామో అలా అభిమానం పెరిగిపోయింది.ఓ సారి కలిస్తే బాగుండు అని.


రోజులు గడుస్తూ ఉన్నాయి .కొన్ని రోజులకి మా లలిత పెళ్లి వచ్చింది.మా లలిత ది హనుమాన్ జంక్షన్. మా లలిత కి పెళ్లి కుదిరింది.ఈ లోగ నేను మధు బాబు గారి చాలా పుస్తకాలతో పాటు కాళికాలయం చాలా సార్లు చదవడం చాల మంది చేత చదివించడం జరిగిపోయింది. లలిత పెళ్లి రోజు రానే వచ్చింది. నాది రాత్రి ఉద్యోగం (night  shift ) కావడం చేత, దుర్గ (పలుసాని నాగ దుర్గ ప్రసాద్ రెడ్డి , నా స్నేహితుడు )నేను కలిసి హైదరాబాద్ నుంచి నా బైక్ మీద జంక్షన్ వెళ్ళడానికి తయారయ్యాం . ఉదయం 6 గం లకు బయల్దేరి 12 గం లకు జంక్షన్ కు చేరుకున్నాం.మాకు అక్కడ ఉన్న ఓ హోటల్ లో రూం ఇచ్చారు.ఫ్రెష్ అయి కింద తిరుగుతూ ఉన్నాం.సాయంత్రం అయింది. మా హోటల్ కింద ఉన్న మందుల షాపు దగ్గర ఒకాయన బండి మీద లుంగి కట్టుకుని కూర్చున్నాడు. దగ్గర చూస్తే ఆయన మధు బాబు.అవును షాడో మధు బాబే. కాలం ఆగిపోయి,చిరు జల్లు  ల తో పూల వాన...నా మొహం వెలిగిపోతుంది. నా పక్కన దుర్గ గాడు నన్నో వెర్రి గొర్రె లా చూస్తున్నాడు.ఏం ఫర్లేదు.ఆయన దగ్గర కు వెళ్ళాను. 'సార్, మీరు మధు బాబు గారు కదా?' అని. ఆయన కొంచెం వింతగా చూస్తూ 'అవును ' అన్నారు. వెంటనే నేను 'నా పేరు లక్ష్మీ నరేషు,నేను హైదరాబాద్ నుంచి వచ్చాను' అని చేయి ఇచ్చాను(shake hand).ఆయన కూడా చేయి ఇచ్చారు. ఇంకేం మాటాడలేదు. నేను మాత్రం చేతులు నలుపుకుంటూ,పళ్ళు ఇకిలిస్తూ  అక్కడే నిలబడ్డాను.ఆయనేం పట్టనట్టు ఉండిపోయారు. దుర్గ ఉండి 'ఇక చాలు పదరా ' అన్నాడు. ఆయన్నల చూస్తూ హోటల్ కి వెళ్ళిపోయాను. ఫైనల్ గ నేను మధు బాబు ని చూశానోచ్. హా నా అభిమాన రచయిత,పుస్తకాలంటే నాలో ఇష్టం పెంచిన రచయిత ని చూసాను.చాలా సంతోషమేసింది, ఎంతంటే 9 వ తరగతి లో ప్రచారానికి వచ్చిన NTR ని చూసినంత. మధు బాబు పుస్తకాలు కాకుండా యండమూరి,యద్దనపూడి,సూర్యదేవర,చలం ఇంకా కొందరి పుస్తకాలు చదివాను.కాని మధు బాబు గారంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన పుస్తకాలని ఇప్పుడు పిల్లల పుస్తకలంటారు కాని , నేను మాత్రం పిల్లాడి లానే చదువుతాను.
భోగి, వినాయక చవితి,అట్ల తద్దె, డబ్బులుంటే దీపావళి (ఎందుకో చెప్తా ), మల్లన్న పండగ (ఇది లోకల్ పండగ ). ముందు చెప్పాల్సింది వినాయక చవితి.అప్పుడే వానాకాలం చల్లగా మొదలౌతుంది.పొలం పనులు తక్కువగా ఉంటాయి. రే వినాయక చవితికి ఎం చేద్దాం రా? మనం పరవటిది (పడమర వీధి ) వాళ్ళకంటే ముందు వెళ్ళాలి రా, లేకపోతే ఏనుగు దంతాలు దొరకవ్. ఇలా కలల్లో ఉండేవాళ్ళం. 

ముందు గ చెప్పాలి కదా , మా ఊర్లో తూర్పు వీధి , పరమట వీధి అని రెండు భాగాలు చేసారు మాటల్లో.ఊరు తూర్పు వీధితో మొదలౌద్ది. మా ఇల్లు మొగదాల్నే ఉంటుంది. మా వీధిలో నేను,అనవయ్య(హనుమయ్య ), శీని గాడు , స్వర్ణ హరి, వాళ్ళ అన్న చెంచయ్య, వెంకటేశ్వర్లు,కిశోరు, చందు గాడు, పెండ్యాల మాధవ, మా మాధవన్నాయి ,అచ్చానగారి మధు, అచ్చానగారి సురేష్, పెండ్యాల సీనన్నాయి, మస్తాను గాడు..ఇంకా చాల మంది ఉన్నారులే..మేమేందారం కల్సి పత్రీ కి వెళ్ళే వాళ్ళం. పత్రీ తెల్సు కదా. తెలీదనకండి.నేను hurt అవుతా. వినాయకచవితి దగ్గరపడే కొద్ది మా preparations మొదలౌతాయి. ఆ రోజు రానే వస్తుంది.ముందు రోజు రాత్రే ఒక గోతాము, కొడవలి,వీలైతే ఒక టార్చ్ లైటు దాచుకుని పడుకునే వాడిని.పడుకున్న మాటే కాని నిద్ర పట్టేది కాదు.అప్పుడే తెల్లారి నట్టు , అందరు నాకన్నా ముందు గ లేచి వెళ్ళిపోయినట్టు అనిపించేది.ఎక్కడ చిన్న శబ్దం అయిన మా వాళ్ళే పిలుస్తున్నారనుకునేవాడిని. ౩ గంటలకి వచ్చి లేపేవాళ్ళు. ఇక లేచి "మా నేను వెళ్తున్న" అని చెప్పి పరిగెత్తే వాడిని. నాన్నేమో రే జాగ్రత్త చెప్పేవాడు.

 ముందు నర్రోడు గుంటకి వెళ్ళాలి.మా ఊరి తార్రోడ్డు అంటా వెళ్తే నర్రోడు గుంట వస్తుంది.ఆ దారిలో నక్కలు , అడవి పందులు అరుస్తూ ఉండేవి.కొంచెం భయం గా ఉన్న పెద్దోళ్ళు ఉన్నారన్నధైర్యం ఉండేది. అక్కడ హాల్ట్ వేసే వాళ్ళం.అక్కడ మామిడి తోపు ఉంది.ముందు మంట వేసి ఒకటి ,రెండు కనిచేసేవాళ్ళం.పుల్లలెట్టి పళ్ళు తోమేసి, ఇక పత్రీ కోయటం మొదలు. ఇక్కడ ఒక కండిషన్ ఉంది.పత్రీ సంచి కింద పెడితే అది ఇక పనికి రాదు.కాబట్టి కింద పెట్టకూడదు.ఒక్కోసారి పడ్డాకూడా, ఎవరు చూడలేదని వెళ్ళిపోయినా సందర్భాలు బోలెడు. నర్రోడు గుంట నుంచి ఎడమకి తిరిగి,ముందు మామిడాకులు..కక్కుర్తి పడి ఎక్కువ కొస్తే సంచి నిండి పోద్ది కదా.అందుకే కొంచెం.వెదురాకులు,దర్బలు. అక్కడ మెయిన్ ఈవెంట్ (ముఖ్య ఘట్టం ) ఉంటుంది అదే "ఏనుగు దంతం ".నేను వీరప్పాన్ని అస్సలు కాదు. ఇక్కడ ఏనుగు దంతం అంటే అల్లోవీర మొక్క లో ఉండే అలాటి ఆకారం.దానికోసం కొట్టుకు చచ్చే వాళ్ళం.ఇప్పుడు మనం రెండు మామిడి తోపులు దాటి వచ్చాం.అది మా ఊరి పొలిమేర.అక్కడ కుడికి తిరిగితే మర్రి ఆకులు,నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ,జామ ఆకులూ ఉండేవి. అక్కడేమో సాయిబు కాపలా కాసే జామ తోట ఉంది. రెండు జట్ల గ విడి పోయేవాళ్ళం . ఆ చివర, ఈ చివర కోస్తూ సాయిబు ని పరిగెత్తించే వాళ్ళం. తోట వెనుక ఓ నేల బావి ఉంది.దాని మీద ఒక జామ చెట్టు ఉంది.అక్కడకి మాత్రం వెళ్ళకుండా జాగ్రత్త పడే వాళ్ళం. అక్కడ నుంచి భూమిలో ఉండే ఉల్లి లాటి మొక్కలు కోసుకునే వాళ్ళం.అక్కడ నుంచి అత్తి చెట్ల దగ్గరకి వెళ్లి అక్కడ ఇంకా కొన్ని కోసుకొని,పత్రీ సంచుల్ని అక్కడ తగిలించి కబడ్డీ ఆడేవాళ్ళం. ముందు రాగి ఆకులు చాల కోసుకోవాలి , కుడుములు చేయాలి కదా.10 గం ల కల్లా ఇంటికి వెళ్ళాలి. ఆటలు ముగించి ఇంటికి బయల్దేరేవాళ్ళం. 

మద్యలో అడిగినవాళ్ళకి పంచుకుంటూ ఇంటికి చేరి పత్రీ అమ్మకిచేస్తే, నాన్న మామిడాకులు గుచ్చి గుమ్మానికి కట్టమనేవాడు.ఆ పని అయాక ఇంట్లోంచి పొంగలి వాసనా అలా వస్తూ ఊ ఊ ఊ .తొందరగా తలారా స్నానం(కుంకుడు రసం తో ) చేసి దేవుడి కి పూజ చేయాలి.నాకేమో ఓ బొజ్జ గణపయ్య రాదు. ఓ సారి తన్నులు కూడా తిన్నాను అమ్మ చేతిలో. ఇక అప్పటి నుంచి పుస్తకం కొన్నా.అందులో ఏమో చాల మంత్రాలూ ఉంటాయే,నాకేమో ఆకలేస్తుంది ఇలాక్కాదని తొందరగా పూజ ముగించి ,దేవుడి కి ఆరగింపు కోసమని అన్ని అక్కడ పెట్టి తలుపు వేసి బయటకి వెళ్ళేవాళ్ళం.మరి దేవుడు తినాలిగా. తలుపు కొట్టి లోపలి కి వెళ్ళాలి.ఎ పండగకి ఐనా అంతే. నాకు ఇక్కడ వరకు చాఆఆఆఆల ఇష్టం. 

ఇప్పుడేమో అందరు స్టేటస్ symbol గ వేలు వేలు పోసి విగ్రహాలు తెస్తున్నారు.అక్కడ పండగ వాతావరణం కనిపించదు పై పై మెరుగులు తప్ప.ఏమో నాకు తెల్సి అదే పండుగ.ఆకలితో ఎదురు చూసి తిన్న ఆ పొంగలి రుచి దేనికి రాదు.మా ఇంట్లో ఉన్న చెక్క వినాయకుడు ఇంకా ఉన్నాడు. కాకుంటే పసుపు ఎరుపు రంగుల్లోకి మారిపోయి. ఈ సారి మల్లన్న పండగ గురించి చెప్తా. కాని ఇది మీకు నచ్చితేనే.

బాల దాసులు..అంటే బాల కార్మికులు, పిల్ల పనోళ్ళు అని కాదండోయ్ తోడు పెళ్లి కొడుకులు అని అంటారు మా దగ్గర.... చుట్టాల్లో ఎవరిదన్నా పెళ్లి ఉందంటే చాలు రమా! అబ్బాయిని పంపించు బాల దాసుడికి అని అమ్మ కి చెప్తే , పలానా వాళ్ళ పెళ్ళికి నువ్వు బాలదాసుడివి అంటే అబ్బాడియబ్బ పండగ ఫో... ఎందుకనా ? ముందు లాభాలు: కొత్త బట్టలు, పెళ్లి కొడుకంత గౌరవం, వీడియో లలో పడచ్చు, నిలువు నామం పెట్టించుకోవచ్చు... నష్టాలు: కుంకుడు కాయలతో తల స్నానం, చేయించేది అమ్మ కాదు కాబట్టి , నా తల మీద వాళ్ళ కసి తీర్చుకుంటారు. పెళ్లి కొడుక్కి గొడుగు పట్టేప్పుడు తలా ఓ పక్క గుడ్డ పట్టుకోవాలి. భోజనం ఉండదు... ఇక పెళ్లి రేపు అనంగా, కొత్త బట్టలు పెట్టుకొని తయార్...పొద్దున్నే పెళ్లి మేళం మోగగానే పరిగేత్తకూడదు..వాళ్ళు మన ఇంటికి హడావిడిగా రావాలి..ఏందీ అమ్మాయ్ పిల్లోడిని ఇంకా పంప లేదు అనడం ఆలస్యం, లగో .... ఇప్పుడు నలుగు పెట్టడం...పెళ్లి కొడుకు మద్యలో ఇటు ఇద్ద్దరు, అటు ఇద్దరు...ముత్తైదువలు వచ్చి నలుగు పెడతారు.మద్యలో వీడియో లకి పోజులు .లేవండి లేవండి స్నానాలకి... ఇక తలకలు పోయడం మొదలు..ఎంత తెల్సిన వాళ్ళ ఇల్లు ఐనా స్నానం చేసేంత కాదు కదా...స్నానం చేయించేది చుట్టాలే కాని అన్ని విప్ప మంటారు..సిగ్గు కదా...అబ్బో బయల్దేరాడండి పెద్ద మొగాడు..విప్పు అని బలవంతం చేస్తారు...పరిస్థితులకి తల వంచి చడ్డి ీద కూర్చుని కళ్ళు మూసుకుంటే ఇక మొదలు తోముడు...పరా పరా రుద్ది కళ్ళు మూసుకోమని పది సార్లు చెప్తారు..అయ్యిందా అని మనం పది సార్లు కళ్ళు తెరుస్తాం.. ..స్నానం అయ్యే సరికి కళ్ళు చింత నిప్పుల్లా అయ్యి జుట్టు పిచిక గూడు అవుతుంది....ఇక కొత్త బట్టలు వేసుకునే తరుణం...అలా కళ్ళు మండుతున్నా సరే కొత్త బట్టలేసుకొని నిలువు నామం పెట్టించుకోవాలి..... ఇప్పటి నుంచి మొదలు..ఊర్లో నాలుగు దిక్కులకి వెళ్లి పూజ చేసి వస్తారు..అప్పుడు పెళ్లి కొడుక్కి గొడుగు పట్టాలి..ఎలాగోలా తప్పించుకుందాం అంటే ఎవడో ఒకడు కనిపెట్టే ఉంటాడు లేకపోతే వాడు పట్టుకోవాల్సి వస్తుంది ..పూజ అయ్యాక వడపప్పు పెడతారు..అంతే కాకుండా మనకో హింట్ కూడా రేయ్ బాగా తినండి ఇప్పుడల్లా మీకు తిండి లేదని....హేహే మాకు తెలీద..సందు దొరికితే బుగ్గల్నిండా కూరుకొని కూర్చుంటాం.... ఓ సారి మా అన్నాయ్ పెళ్ళికి నన్ను బాల దాసుడు గ పంపలేదని నేను అలిగా కూడా.... కి కి అదొక తుత్తి....

వాన చినుకులు వానా కాలం...నాకెందుకో ఎండాకాలం కన్నా వానా కాలం అంటేనే ఇష్టం అని చెప్పడం కన్నా ప్రాణం అనుకోవచ్చు ... నిండుగా కమ్ముకున్న నల్లటి మబ్బులు...ఎక్కడో మేమున్నామంటూ అలజడి చేసే ఉరుములు...ఆడపిల్ల పెదాల మీద నవ్వులా మెరిసి వెళ్ళిపోయే మెరుపులు...తేమ తో నిండి తాకి పోయే చల్లటి గాలి...చిన్నగా మొదలై నేలను తాకే వాన చినుకులు...కమ్మటి మట్టి వాసన... వాన ఒక్కోచోట ఒక్కోలా కనిపిస్తుంది... చిన్నప్పుడు మా ఇంట్లో తాటాకుల పందిట్లో కూర్చుని చూస్తుంటే , ఆ చూరు లోంచి కారుతూ నా కాళ్ళు తడుపుతూ...మా ఇంటి ముందున్న పూల మొక్కలని పలకరిస్తూ..కొబ్బరి ఆకుల్లోంచి పడుతూ ఉంటె పిల్లలందరం ఒకే దుప్పట్లో కూర్చుని రేడియో లో పాటలు వింటూ... నాన్న తో కలిసి పొలం వెళ్ళినప్పుడు స్వర్ణ వారి కుంట కాదా ఎద్దులని మేత కి విప్పి మర్రి చెట్టు కింద కూర్చుంటే.... ముత్యాల వానలా కనిపిస్తుంది...చుట్టూ మైదానం...కంటి కనిపించినంత దూరం తెల్లని పూల వాన....హోరు మంటూ గాలి...ఊగిపోతుండే పెద్ద పెద్ద చెట్లు...కాసేపటికే వాన వెలిసి మబ్బుల్లోంచి నవ్వుతు వచ్చే సూరీడు..నెల మీదకి వంగిన అందాల హరివిల్లు....కింద అంత మెత్తటి బురద, కాలు పెడితే జారిపోతూ...చిన్న కాలువలు కట్టి సాగిపోయే వాన నీళ్ళు... ఓ రోజేమో బడికి వెళ్దామని బస్సు కోసం ఎదురు చూస్తుంటే నిన్న కురిసిన వానకి చప్టాలో చిక్కుకుపోయిన బస్సు...ఈ రోజు మీకు బడి లేదు లే అంటే...లేదు మేం వెళ్ళాల్సిందే అంటూ పిల్లలంతా కల్సి సన్నటి చినుకుల్లో నడుచుకుంటూ సింగరాయకొండ వెళ్తుంటే..చాప్ట దగ్గర పక్కన ఉన్న నెల్ల కుంటలో విచ్చుకున్న తెల్లటి తామరలు...మాకు కావాలంటే మాకు కావాలనే అమ్మాయిలు... ఇంటర్ లో చేరాక ఎప్పడు ఇంటి కి దూరం గ ఉండని నేను ఇంటి మీద బెంగ తో కూర్చుని ఉంటె వచ్చి పలకరించే వాన చినుకులు.... ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ లో ఆఫీసు కి బయల్దేరగానే విరుచుకుపడే వాన.... సంతోష పడటం మానేసి లాప్టాప్ ని దాచుకోడానికి పడే తపన , ట్రాఫ్ఫిక్ తిప్పలు, ప్రవాహం ల వచ్చే మురుగు నీళ్ళు....అప్పుడపుడు తిట్టుకునే ఉంటా...కాని వాన కదా, పాపం దాని కోసం నేను చూస్తుంట అని వచ్చి పలకరించి పోతు ఉంటుంది...వాన మార లేదు , నేనే మారాను.... కాని వాన ఎప్పుడు అద్భుతమే....

ఎవరినైనా నీకు ఏం చేయడం ఇష్ఠం అంటే వానలో బజ్జీలు తినడం, వానలో తడవడం ఇలా చెప్తారు కదా. మీరు చెప్పండి మీకేం ఇష్టమో. అనుకుంటూ ఉండండి మనసులో ఈ లోగా నా ఇష్టాలు చెప్తా. చెప్పనా? తెలీదు పట్నం లో పెరిగిన వాళ్ళ కి ఏ ప్రపంచం తెలుసో. నాకు మాత్రం పల్లెటూరే ప్రపంచం. అక్కడ ప్రతి దానికి ప్రాణం ఉన్నట్టు తోస్తుంది. ప్రతిదీ నాతో ఊసులడుతున్నట్టుంటుంది. మా ఇల్లు, ఇంటి ముంది ఉన్న చెక్క బండి, దానికి కట్టేసిన బర్రె దూడ, మా చింత చెట్లు, నా పాత సైకిలు, మా పెరట్లో మందారం పూలు ఇలా చెప్తూ ఉంటే ఎన్ని పేజీలు రాసిన చాలవు. మా ఇల్లు చాలా పెద్దది. వెనుక ఆకు కూరలు ముందు పూల మొక్కలు నాటడానికి చోటు. వెనుకేమో బెండ లు, పొట్ల కాయలు, గోంగూర, పెద్ద చిక్కుడు, సొర కాయ ఇంకా కొన్ని ఆకు కూరలు వేసేది అమ్మ. అదే బుజ్జి (నా చెల్లి ) ఆడుకునే చోటు. ఇంటి ముందు తాటి ఆకుల పందిరి. ఎండాకాలం వస్తే చాలా చల్లగా ఉండేది. ఇంకా చాలా పూల మొక్కలు. ఎవరికి దొరికినవి వాళ్ళు తెచ్చి నాటేసే వాళ్ళం. నేనైతే నాచు పూలు ఇంకా ఏవో ఆకుల చెట్లు ఉండేవి అవి స్కూల్ లో ఉంటే తెచ్చే వాడిని. అమ్మ ఏమో బంతి, చామంతి పూలు తెచ్చి నాటేదీ. నాన్న వంతు గా రెండు కొబ్బరి చెట్లు నాటాడు. సాయంత్రం అయే సరికి అన్నం తింటూ ఆరు బయట కూర్చునే వాళ్ళం. చీకట్లు మూసిరే వేళకి ఆకాశమంతా మినుకు మంటు చుక్కలు వాలిపోయేవి. నులక మంచాల మీద పడుకొని పైకి చూస్తూ చాలా కథలు చెప్పుకునే వాళ్ళం. చాలా చుక్కలు కనిపించేవి, ఎన్ని అంటే అలా చేత్తో తుడిచి ఒడిలో పోసుకోవాలనిపించేన్ని. అపుడపుడు తెగ తిరిగే చుక్కలు కనిపించేవి, ఒకటి కనిపించగానే ఇంకో దానికోసం వెతికే వాళ్ళం. తప్పకుండా దానికి ఎదురుగా వెళ్లే చుక్క ఉండేది. అలా వెతకడం లో ఏదో ఆనందం ఉండేది.


 ఇక వెన్నెల రోజులు. మా ఇంటి ఎదురుగా ఉన్న బడి లో ఓ నాలుగు జామయిల్ చెట్లు ఉండేవి. అవి నాకు హంస ఆకారం లో కన్పించేవి. అందులోంచి చంద్రుడు వచ్చేసే వాడు. అలా వచ్చి మా కొబ్బరాకుల్లో దాక్కుని వెన్నేలని అందులోంచి జార విడిచే వాడు. కొబ్బారాకుల గలగలల లోంచి వెండి వెన్నెల జాలు వారెది. అలా చూస్తూ నిద్రాపోయే వాళ్ళం. ఆ మొక్కలకి పాదులు తవ్వడం, నీళ్ళు పెట్టడం నాకు బుజ్జికి అప్ప చెప్పే వాళ్ళు. మా అమ్మ చేత మంచి అనిపించుకోవాలని తెగ కష్టపడి చేసే వాళ్ళం. నా చెట్టు బాగా కాసిందోచ్ అనుకుంటూ పడే మురిపేం భలే ఉండేది. కాని బాల్యం నచ్చని వారు ఎవ్వరు ఉండరేమో. అది పల్లెటూరి లో ఐనా పట్నం ఐనా. పల్లెటూరి బాల్యం ప్రకృతి తో ముడి పడి ఉంటె , పట్నపు బాల్యం నాగరికత మరియు ఆధునికత కలగలిపి ఉంటుంది. కాని పట్నం లో బాల్యం telescope లో నక్షత్రాలు చూస్తే , పల్లెటూరి పిల్ల వాడికి వేగు చుక్క తెల వారుతుందని చెప్తుంది. ఇక్కడ ప్రకృతి తో బంధం, అక్కడ కృత్రిమమైన అనుభవం . కాని ఇప్పటి తరం పల్లెటూరి పసితనాన్ని చంపేస్తుంది. ఆటలు లేవు, ఎండా కలం సెలవులు లేవు, ఉన్నా అమ్మమ్మ గారి ఊరికి వెళ్లి ఆడుకునే ఆటలు లేవు. extra కోచింగులు, భవిష్యత్తుని గురించి భయాలు, చినపుడే కళ్ళ జోళ్ళు. ఇవన్ని అందరికి తెల్సినవే. ఇప్పటి అమ్మ నాన్నలు తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఇప్పటి బాల్యాన్ని చంపేస్తున్నారు. బాల్యం అంటే ఇలా కథ లా చెప్పుకునేది కాదేమో.

 మా అమ్మ మెచ్చుకోలు కోసం నేను నా చెల్లి పోటి పడే వాళ్ళం అని చెప్పా కదా. పొద్దున్నే నిద్ర లేవడం తప్పించు కోడం కోసం కూడా పోటి పడే వాళ్ళం. అమ్మ పొద్దునే లేచేది. నాన్న మంచి నీళ్ళ కోసం స్వర్ణ వారి కుంట (ఈ నీళ్ళంటే నాకు చాల ఇష్టం ) కి కావడి వేసుకొని వెళ్తే, అమ్మ మమ్మల్ని లేపుతూనే ఇంటి ముందు ఊడ్చి కళ్ళాపు జల్లి ,ముగ్గు పెట్టేది. ఆ రోజు మాకు ఇష్టమైన పనులు ఏమి ఉన్నాయో గుర్తు చేసేది. అప్పుడు ఎక్కడ లేని ఓపిక తో లేచే వాళ్ళం. నేనేమో పొయ్యీ ముట్టిస్తే ,బుజ్జి నా పక్కన కూర్చునేది. కాసేపు వెచ్చగా కూర్చునే వాళ్ళం.దూరం గా సాయి బాబా గుడిలో పెట్టిన "చందన చర్చిత " మంద్రం గా వినిపిస్తూ ఉంటుంది. నాకు బాగా కోపం వచ్చేది , వీళ్ళకి ఈ పాట తప్ప వేరేది దొరకదా అని . కాని ఆ పాట ఇప్పటికి ఆ జ్ఞాపకాల సువసనల్ని చల్లుతూనే ఉంది. ఆ పాట అయిపోగానే వెంకటేశ్వర స్వామి గుడిలో "కౌసల్య సుప్రజా రామ " అంటూ మాతో పటు ఆ నల్లవాడిని లేపేస్తారు. పొయ్యి బాగా మండటం మొదలు కాగానే చెరో పని అప్ప చెప్పేది అమ్మ.నేనేమో బర్రెల దగ్గర పేడకల్లు తీసి అక్కడ శుభ్రం గా చేసి వాటికీ నీళ్ళు పెట్టి కొట్టం దగ్గర కట్టేసి మేత వేసి రావాలి.నాన్నేమో నీళ్ళు తెచ్చి మేత తేవటానికి వెళ్తాడు. అమ్మ, బుజ్జి వంట చేస్తారు. వంట అయిపోగానే ఆ పొయ్యి మీదనే నీళ్ళు పెట్టేది. దానితోనే మా స్నానాలు. అందరం కూర్చుని రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి,పప్పు, గడ్డ పెరుగు వేసుకొని తిని రెడీ అయ్యి (రేకు పలకలు\ పుస్తకాలు తీసుకుని ) ఇంటి ముందున్న బడి కి వెళ్ళిపోయే వాళ్ళం.


 మా బడిలో మాష్టార్ల(పంతుళ్ళు) పేర్లు చెప్తా వినండి.హెడ్ మాష్టారు సుబ్బరామయ్య పంతులు ,తెలుగు పంతులు కలికివాయి అయ్యవారు,సైన్సుకేమో చీరాల అయ్యవారు, సోషల్ కేమో టంగుటూరు మేష్టారు, ఇంగ్లీష్ కి కెజియా మేడం. వీళ్ళ అసలు పేర్లు మాకెవరికి తెలీవు. వీళ్ళే నాకు 7 th వరకు ఉన్నారు. మేము అంటే నేను బుజ్జి ఇంకా కొందరు పిల్లలు కల్సి రామయ్య పంతులు దగ్గర కి tuition కి వెళ్ళే వాళ్ళం. మా బడి మొదలయేప్పుడు రెండు గంటలు కొడతారు. రెండవ గంట కొట్టేసరికి అందరం ప్రార్ధనకి నిలబడాలి. లేకపోతే మోకాళ్ళ దండ , గోడ కుర్చీ , ఒంటి కాలి మీద నుంచోడం లాటి శిక్ష(punishment) లు ఉండేవి. అందరం కల్సి వందేమాతరం, మా తెలుగు తల్లికి, వీర గంధము తెచ్చి నారము, జనగమణ పాడేసి ఎవరి క్లాసు కి వెళ్ళే వాళ్ళం. మాకు వంటేలు గంట (interval)ఓ గంట సేపు ఉండేది.ఈ లోగ చెమటలు కక్కేట్టు ఆడుకొని మురికి గా వచ్చే వాళ్ళం.మళ్లీ మధ్యాహ్నం బెల్లు కొట్టే వాళ్ళు 12.30 కి. మళ్ళి 2 గంటలకి స్కూల్, 4 కల్లా అయిపోయేది. స్కూల్ అవగానే డ్రిల్లు, ఆటలు, ఎక్కాలు, జై హింద్ చెప్పగానే ఓఓఒ అంటూ ఇంటికి. చూసారా ఇక్కడ హోం వర్క్స్ లేవు, assignments లేవు. అయిన సరే మా టీచర్స్ ని తిట్టుకునే వాళ్ళం. మాకు ఇష్టం టంగుటూరి అయ్యవారు.అయన అస్సలు కొట్టేవారు కాదు.ఆయనకి పిల్లలు లేకపోడమే కారణం కావచ్చు. మా బడి లో ఎవరైనా మాష్టారు రాకపోతే పెద్ద తరగతి లో ఉన్న బాగా చదివే పిల్లల్ని కింది తరగతులకి లీడర్ గా పంపేవాళ్ళు, గొడవ చేయకుండా చూడ్డానికి. అది చాలా బాగుండేది. ఇంటికి రాగానే స్నానం చేసి ఇల్లు ఉడ్చటం, బర్రెకి మేత వేయడం లాటి పనులు చేసి tuition కి వెళ్ళే వాళ్ళం.అక్కడ విజయ లక్ష్మి ఉండేది. తను నా తరగతే, ఇంకా మా పంతులు గారి మనుమరాలు కూడా ( తన గురించి ఎపుడైనా చెప్తాలే ). tuition 7 కి అయ్యాక ఇంటికి వచ్చి ఆరు బయట వెన్నెల్లో వేడి వేడి అన్నం తిని కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయేవాళ్ళం

ఇంకొక దెయ్యం.....నేను బెంగుళూరు లో ఉజ్జోగం చేస్తూ ఉండగా ఇందిరా నగర్ దగ్గర లక్ష్మి పురం లో ఓ ఫ్లాట్ లో ఉండేవాళ్ళం. నేను, బక్క వేమన విక్రాంత్ అలియాస్ రాజ, శశి, ఫైర్ స్టార్ బాబు...ఇందులో నేను రెగ్యులర్ వంట వాడిని, బాబు కూరగాయలు కోసి ఇవ్వడం, పచారి సామాన్లు తేవడం. రాజ, శశి వారాంతపు వంట వాళ్ళు అంటే బిర్యాని, బగార రైస్, పచ్చిపులుసు, గుడ్డు కూర, కోడి కూర ఇలాటి స్పెసల్ తో సితగ్గొట్టేవాళ్ళు...ఇలా తిని ఒళ్ళు పెంచుతున్న తరుణం లో ఓ రోజు కరెంటు పోయి పూడిసింది...కారిడార్ లో తలుపులు బార్లా తెరిచి గాలికి కూర్చుని ఆ చీకట్లో నోరు ఊరుకోక దెయ్యాల్లా తిరుగుతున్నాం అన్నా...రాజ గొంతు సవరించుకున్నాడు...నీకు కస్తూరి సత్యన్నారాయణ తెలీద..strange అనగానే ఫైర్ స్టార్ బాబు కిందకి దూకబోయాడు...ఓరి బాబో నువ్వాగేహే అని ఏంటి కథ అన్నాను... ఇక రాజ మొదలెట్టాడు...నేను ఇంజనీరింగ్ సతికి MBA కోసం ఢిల్లీ దగ్గర లో ఓ కాలేజి లో చేరాను.... ఆ కాలేజి సిటీ కి బాగా దూరం గ ఉండేది....అంటే పల్లెటూర్ల దగ్గర గా...అక్కడ బాగ స్ట్రిక్ట్....కాలేజి హాస్టల్ చుట్టూ కంచే వేసి ఉండేది....ఎవర్ని బయటకి వేల్లనిచ్చే వాళ్ళు కాదు...చీకటి అయితే చాలు స్మశానం ల ఉండేది....అది మే ౧౮ వ తారీకు.ఎప్పుడు అర్ధ రాత్రి దాకా సినిమా కబుర్ల తో కళ కళ లది పోయే హాస్టల్ అంతా సాయంత్రం 6 కాగానే తలుపులు మూసేసి అందరు ఆంజనేయ దండకం చదుకోసాగారు... మనదసలె నెల్లూరు ఏందో సంగతి కనుక్కుందామని పక్కనే ముసుగులో ఉన్న ఓ అబ్బియ్య ని కదిలించా..వాడు కెవ్వు మని అరిచి "యో ఏందియా " అన్నాడు. నా మొహం మీద లైట్ వేసుకొని " ఏందీ సంగతి " అన్నాను...యో నీకు దండం పెడతా, గెట్టిగా అరవమాక,"వాడు" వచ్చి మన తలుపు కొడితే సచ్చిపోతాం" అన్నాడు....ఇక నాకు ఆగలా, లేచి బాసిపట్లు వేసుకొని కూర్చుని చెప్పు ఏందా కథ అన్నా? వాడు అప్పటికే తడిచిపోయి ఉన్నాడు, చెప్తావా తలుపు తీయమంటావా అన్నా? సన్నగా వణుకుతున్న గొంతు తో "వాడి " గురించి చెప్పడం మొదలు పెట్టాడు..."మన హాస్టల్ చుట్టూ చాల నేల బావులు ఉన్నాయి. సెకండ్ షో సినిమాకి వెళ్ళీ వాళ్ళు ఆ ఈశాన్యం మూల ఉన్న సందులోంచి దూరి బయటకి వెళ్తారు.. ఆ చీకట్లో జాగ్రత్తగా వెళ్ళకపోతే ఆ నేల బావిలో పడిపోవడం ఖాయం.ఒక రోజు రాత్రి మన నెల్లూరు అబ్బాయి కొంతమంది స్నేహితులతో కలిసి సెకండ్ షో సినిమాకి బయల్దేరాడు. వాడు అప్పుడే చేరాడు ఈ హాస్టల్ లో...ఆ రోజు వాడి పుట్టిన రోజు...ఆ నేల బావులు దాటాలి అంటే దానికో పద్ధతి ఉంది...చేతి నిండా రాళ్ళూ , ఒక కర్ర తీసుకొని నేల ని తడుముకుంటూ రాళ్ళూ వేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్ళాలి...పాపం ఆ కుర్రాడికి అది తెలీదు..అల గుడ్డిగా వెళ్లి ఆ నేల బావి లో పడి చనిపోయాడు... అ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజు ప్రతి తలుపు కొట్టి హృదయ విదారకం గా ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు...." గట్టిగ తలుపు చప్పుడైంది...ఆఆ ఆ ఆ అని భయంకరమైన ఏడుపు ....నాకు చెమటలు పట్టేసి దుప్పట్లో దూరి ప్రభువు ని తలచుకుంటూ" అని మా వైపు చూసాడు... వెంటనే నేను "గాజులోళ్ళ పిల్ల మేం గాజులోళ్ళం కాదా" అని హృదయ విదారకం అరుస్తూ వంట చేసుకోడానికి వెళ్ళిపోయా...ఫైర్ స్టార్ బాబు మాత్రం బిగుసుకొని పోయి ఉన్నాడు...అప్పుడప్పుడు ఇలా రాజ ని కదిలిస్తే అదిరి బెదిరి పోయే కథలు చెప్పవాడు....ఏమంటారు ఇంతకి...

దెయ్యం...తెలుగోడికి తెలుగు తెలీకపోయినా పర్లేదు కాని దెయ్యం తెలియక పోతే మాత్రం వాడు తెలుగోడే కాదు...ఇప్పుడు వీటి గురించి జనాలు పెద్దగా ఆలోచించడం లేదు అనుకుంట...అంటే ఫారన్ నుంచి ఘోస్ట్ లు, జాంబి లు వచ్చి ఇక్కడ ఆక్రమించేశాయి....ఇక్కడ దెయ్యలకి ఒక ఫార్మటు ఉంటుంది, అంటే డ్రెస్ కోడ్. తెల్ల చీర, విర బోసుకున్న జుట్టు (బాగా పొడుగ్గా ఉంటుంది లే), వెనక పొగ, దూరం గ నక్కల ఊళలు, బాక్గ్రౌండ్ లో మంచి పాట.... అందరికి ఇదే దయ్యం కనిపిస్త ఉంటాది...కొందరికి అయితే చచ్చిపోయిన వాళ్ళ చుట్టాలో, స్నేహితులో వచ్చి పలకరించి పోతా ఉంటారు.... దీని మీద సాన సినిమాలు వచ్చి ఉండాయి.దీని మీద ఆటలు కూడా ఆడతా ఉంటారు.అదే ఒక బోర్డు మీద కాయిన్ పెట్టి ఇద్దరు దాని మీద చెయ్యి పెట్టి ఎవుర్ని ఐన తలచుకుంటే వాళ్ళ ఆత్మ వచ్చేస్తుంది....ఇక్కడ ఆత్మ వేరు దెయ్యం వేరు...ఆత్మలు ఆఫ్ లైన్ లో దెయ్యాలు ఆన్ లైన్ లోను ఉంటాయి.. ..అంతే కాకుండా చాల మంది చూసి కూడా ఉన్నారు..బహుశా మీలో కూడా ఉండి ఉండచ్చు... నేను బాగా చిన్నప్పుడు కరంటు వైరు పట్టుకొని ఆసుపత్రి లో చేరితే బలం కోసం టానిక్ ఇచ్చాడు శివరామ రెడ్డి డాట్రు...అది తాగించడానికి మా నాయనమ్మ మా ఇంటి ఎదురుగ గుబురుగా పెరిగిన చింత చెట్ల ని చూపించి తాగకపోతే దానిమీద నుంచి దయ్యం వచ్చి పట్టుకుపోద్ది అని చెప్పేది, ఆ గోల పడ లేక ఓ రోజు రాత్రి సీసా మొత్తం తాగేసా, రుచి బాగుండటం తో అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళ టానిక్ లు కూడా స్వాహ (కథ పక్క దారి పడుతుంది). ఆ తరువాత రవణప్ప గారి కలర్ టీవీ లో చూసిన దెయ్యం సినిమా(భానుచందర్ ఉంటాడు, ఒక గుహలో నిధి, దయ్యం ఉన్న పెట్ట ఉంటుంది, ఎవడో దాన్ని ఓపెన్ చేస్తాడు, అది అందరిని చంపుతూ ఉంటుంది) తో మొదలు... కొన్ని రోజులు భయపెట్టింది... ఇక ఆ తరువాత చాల సినిమాలు వచ్చాయి..కొన్ని చేతులు అడ్డం పెట్టుకొని చూడ్డం, ఆ తరువాత మానెయ్యడం జరిగింది..ఇపుడైతే భయం తగ్గింది అనే కంటే అటు వైపు ఆలోచించడం తగ్గింది... 


 ఓ సారి పదో తరగతి లో ఉన్నప్పుడు స్కూల్ లో బస్సు వెళ్ళిపోయింది. ఇక అందరం కలిసి ట్రాక్టర్ ఎక్కి బయల్దేరాం ఊరికి. మా ఊరు వెళ్ళాలి అంటే మద్యలో ఇంకో ఊరు వస్తుంది. ఆ ఊరు దాటాక ఓ పెద్ద చెరువు, ఆ చెరువు కట్ట చివర మలుపులో ఓ పక్కకి ఒరిగి నాలుగు అడుగులు పొడుగున్న ఉన్న రెండవ నెంబరు మెయిలు రాయి. ఇక ట్రాక్టర్ లో వెళ్తూ ఉంటె మాతో మా ఊరి దూదేకుల సాయిబు కూడా వచ్చాడు. ఆ మైలు రాయి దగ్గరకి వచ్చేసరికి మమ్మల్ని ఓ ప్రశ్న వేసాడు" మీకు ఈ రాయి గురించి తెల్సా" అప్పుడు రాత్రి పది అయింది. మేమంతా స్లో మోషన్ లో తిరిగాం, ఆయన పిచ్చి బచ్చాల్లారా అన్నట్టు చూసి "ఇది ఒక దెయ్యం " అన్నాడు. ఎక్కడో ఓ నక్క ఊళ వేసింది. మేమంతా అ రాయిని అలా చూస్తూ ఉన్నాం, అది మా వైపు తల ఊపుతూ చూస్తు ఉంది. ఇంకొంచెం లోపాలకి జరిగి "ఎం జరిగింది " అన్నాం. "ఓ సారి నేను మా చుట్టాల ఊరికి వెళ్లి సింగరాయకొండ వచ్చేసరికి ఆలస్యం ఐంది, ఆఖరి బస్సు వెళ్ళిపోయింది. అక్కడే ఒక సైకిల్ తీసుకొని బయల్దేరాను. బాగా చీకటి, అమావాస్య అనుకుంట (మాకు చలి బుట్టటం మొదలైంది). కన్ను పొడిస్తే కానరాని చీకటి, ఆకాశం నిండా నక్సత్రాలు, చల్ల గాలి, అక్కడక్కడా కావలి వాళ్ళు వేసుకున్న మంటలు మినుకుమంటున్నాయ్. దూరం నక్కల ఊళలు. అలవాటైన ప్రాణం కదా, చిన్నగా వెళ్తూ ఉన్నాను. ఆ చెరువు కట్ట దిగి రాగానే ఆ రాయి కనిపించింది.


 మాములుగానే తొక్కుతున్న, ఇంకొంచెం ముందుకు రాగానే మళ్ళి రాయి ఉంది. అదేంటబ్బ వెనక్కి పోయింది కదా అనుకుంటూ వెనక్కి తిరిగా..చిన్నగా ఆ రాయి పైకి లేచింది (అందరం దగ్గరకి జరిగాం )..... అది మైలు రాయి కాదు...పొగ మంచు లా ఉంది, గాల్లో తేలుతూ మెల్లగా నా వైపు రాసాగింది...నా కళ్ళల్లో వణుకు మొదలైంది, అప్పటి దాకా ఆడుతూ పడుతూ సైకిల్ తొక్కిన నేను తడబడటం మొదలు పెట్టాను, అది నాకు దగ్గరగా వచ్చింది, చూడబోతే ఆడ పిల్ల ఆకారం లో ఉంది. నా కాళ్ళలో సత్తువ తెచ్చుకొని సైకిల్ తొక్కడం మొదలు పెట్టాను...అది కూడా గాల్లో తేలుతూ నన్ను వెంబడించడం మొదలు పెట్టింది..నేను వేగం పెంచాను, అది నన్ను తరుముతూ ఉంది. ఇది గో ఈ చప్టా( చెరువు మలుపు దాటినా కాసేపటికి రెండు నీళ్ళ చప్తలు వస్తాయి) దగ్గర కి వచ్చేసరికి నాలో ఓపిక, ధైర్యం తగ్గిపోయాయి. ఇక దేవుడి ని తలచుకుంటూ తొక్కుతున్నాను, దూరం రామానాయుడి గారి పొలం కాదా నీళ్ళ ఇంజను శబ్దం వినిపించింది, నా మొర దేవుడు ఆలకించాడు. అక్కడ ఎవరో పొలానికి నీళ్ళు పెడుతున్నారు. నాక్కొంచెం ధైర్యం చిక్కింది. అది దానికి తెల్సిందో ఏమో దాని వేగం పెంచింది. ప్రాణం మీద ఆశ వదులుకొని సైకిల్ వదిలేసి పరిగెత్తడం మొదలు పెట్టా...అది అరుస్తూ వెంట పడింది. నా అదృష్టం నీళ్ళ ఇంజను దగ్గర ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. పరిగెత్తి పడిపోయా, నోట్లో మాట రాడం లా. గుండెల్లో మంట. భయం గా దాని వైపే చూస్తున్నా..అది అరిచి నా సైకిల్ మీద పడి తొక్కి కసిగా వెనక్కి వెళ్ళిపోయింది" అంటూ మా వైపు చూసాడు...అప్పటికే పుస్తకాల సంచుల్ని ఘాట్టిగా పట్టుకొని "ఎవడ్ర ఈ £%¬*&" ట్రాక్టర్ లో కి ఎక్కిచింది " అనుకునాము... ఆ రోజు నుంచి మొన్న రోడ్ వేసేప్పుడు ఆ మైలు రాయి తీసేసిన్దాక ఆ రాయి మమ్మల్ని తెల్లగా భయపెడుతూనే ఉంది....ఇంకా ఇలాటి అనుభవాలు చెప్పాలంటే బోలెడు..మీకు లేవా?