మళ్ళి ఓ హీరో పుట్టాడు...

షాడో....

కాళికాలయం లో వసంతుడు, బలదేవుడు....
ఆనంద జ్యోతి లో శ్రీధరుడు..
మచ్చలగుర్రం లో చంద్రుడు...
చతుర్నేత్రుడు లో మాధవుడు...
స్వర్ణ ఖడ్గం లో ప్రతాపుడు...
వెన్నెల మడుగు లో విజయుడు...

ఇప్పుడు  శివుడు....


మధు బాబు కథానాయకుడంటే ధీరో, నిర్లక్ష్యం నిండిన చూపులు, పెదాల మీద చెరగని  చిరునవ్వు. ఆపద లో ఉన్నవాళ్ళని  ఆదుకోడానికి  ప్రత్యక్షమౌతాడు, ప్రమదాలని లెక్క చెయ్యడు...


నాకు బాగా నచ్చేది ఆయన కథ చెప్పే విధానం.అందులో వాడే పేర్లు. అవి చదువుతూ ఉంటె అవి మన ఊహల్లో మెదులుతాయి. మనమే వాటికీ ఓ రూపాన్ని అపాదిస్తాము...


పై పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం షాడో తరువాత కాళికాలయం. మొత్తం మూడు భాగాలు... 


కాళికాలయం...కంకాళ లోయ..కళ్యాణ తిలకం....


ముందు ఈ రోజు నవ్య లో  ప్రారంభం ఐన 'శివుడు' గురించి చెప్తాను....


శివుడు అనే పదమూడేళ్ళ బాలుడు  ఓ అనాధ. వాడు సారంగుడు అనే ఓ  మండలాధీసుడి దగ్గర పెరుగుతూ ఉంటాడు...తనతో పాటు ఇంకో పది మంది అనాధల్ని(తల్లి తండ్రులు ఉండి ఆర్ధిక స్తోమత లేని వాళ్ళు  ) పెంచుతుంటాడు సారంగుడు..వాళ్ళకి విధ్యబుద్ధుల్ని నేర్పించి తన సంస్థానంలోనే వారి వారి ప్రావీణ్యాన్ని బట్టి కొలువు ఇస్తాడు...


ఓ రోజు కోట గోడల్ని ఆనుకోని ఉన్న మైదానం లో మిగతా పిల్లల్ని ల తో కలిసి ఆడుకుంటూ ఉన్న శివుడిని అమ్మ, నాన్న లేని వాడని తోటి వాళ్ళు హేళన చేస్తారు... కోపం తో ఒకడి మెడ పట్టుకొని బిగిస్తాడు (మధు బాబు గారిలా చెప్పడం రాదండి)...ఈ లోగ కాపలా ఉన్న భటులు రావడం..అక్కడ నుంచి పారిపోయి(పారిపోవడం అంటే చిరుత వేగం తో ), దగ్గరలో ఓ పండ్ల తోటలోకి వెళ్ళి మిగల మగ్గిన రెండు పండ్లని కోసి, గమనించిన ఆసామి నుంచి తప్పించుకొని పారిపోతాడు...కోట లోకి వెళ్దాం అనుకుంటుండగా దగ్గర లో ఉన్న ఓ పొదల నుంచి ఓ ఆడగొంతు  ఆర్తనాదం.... ఏదైతే అది అవుతుంది  అని వెనక్కి వెళ్ళి చూస్తే నది వడ్డున ఉన్న ఓ పడుచు నదిలో కొట్టుకు పోతున్న తన పసివాడి ని చూసి అరుస్తూ ఉంది..వెనకా ముందు చూడకుండా దూకేసాడు శివుడు..దూరం గా ఉన్న ప్రకీర్తి పర్వత సానువుల్లోంచి దూకుతున్న సువర్ణ నది ప్రవాహం ఉధృతం గా ఉంది(పేర్లు భలే ఉన్నాయి కదా? )...మొత్తానికి పిల్లవాడిని కాపాడతాడు శివుడు అలానే ఆ తోట కాపలా వాళ్ళకి పట్టుబడతాడు...


అక్కడ నుంచి సభలో కొలువుతీరి దోపిడీ ముఠా కి  శిక్షి విధిస్తున్న సారంగుడి ముందు ప్రవేస పెట్టబడ్డాడు ... శివుడు చేసిన మంచి పనిని మనసులోనే మెచ్చుకుంటూ గజశాలని ఊడ్చే శిక్షని విధించాడు....


ఇంకా కొంచెం ఉంది...నచ్చితే నవ్య కొని చదవండి....


షూస్ కొనాలి అంటే 2000 నుంచి ౩౦౦౦ దాక పెట్టి బ్రాండెడ్ షూస్ కొంటాను....అవి మహా అయితే సంవత్సరం... 
ఏదైనా హోటల్ కి వెళితే మొహమాటం లేకుండా ఖర్చు...ఒక మల్టీప్లెక్స్ కి వెళితే అక్కడ కూడా ఇంతే...

ఇంటర్ ముందు జీవితం వేరు...ఇంటర్ లో మా నాన్న నాకు ౩౦౦ పెట్టి వెల్కమ్ చెప్పులు కొనిచ్చాడు..అవే అప్పటిదాకా  నా జీవితం లో విలువైన చెప్పులు..నలుపు రంగు, గట్టి సోల్, పాదం అంతా అందులో ఇమిడి పోయి..ఎంత బాగుండేవో..అప్పటికే అందరు వాడుతూ ఉంటె ఎప్పుడు కొంటాన అని ఎదురుచూసి, కొన్న రోజున ఆ ఆనందమే వేరు...
ఇంకా చిన్నప్పుడు...అంటే మా ఊర్లో మండల ప్రజాపరిషత్ పాటశాల లో చదువుకునేప్పుడు, డబ్బులంటే పెద్దమొత్తం అర్ధరూపాయి...ఐదు పైసలకి ఒక కొబ్బరి గోలి వచ్చేది...పావలాకి ఐదు వచ్చేవి. ఆ ఐదు తీసుకొని చేతిలో పెట్టుకొని ఆ చేతిలోంచి ఈ చేతిలో కి మారుస్తూ ఆ చెయ్యే నాక్కుంటూ అబ్బో అదో ఆనందం...అందరి దగ్గర అయిపోయాక నా చేతిలోవి తీసి నా దగ్గర ఇంకా ఉన్నాయిగా అని గెంతిన రోజులు...

మా నాగూర్ మామ కొనిపెట్టిన 2.50 రూపాయల పెన్ను పోతే రాత్రంతా ఏడ్చిన రోజు...

ఇరవై పైసల కి శేషయ్య కొట్లో తాటాకు టపాసులు కొని కాల్చిన రోజులు... మా నాన్నతో పాటు ఒంగోలు వెళ్తే దప్పిక అవుతుంది అంటే మా నాన్న రూపాయి ఇచ్చాడు..నేను వెళ్లి సోడా తాగి వచ్చాను..షోడ 50 పైసలు...వచ్చి అది మిగిలింది మా నాన్న కి ఇచ్చేసా..ఎం తాగావురా అని అడిగాడు...సోడా అని చెప్పా..పద అని తీసుకెళ్ళి రూపాయి పావలా పెట్టి సుగంధ సోడా తాగిచ్చాడు...అదో అద్భుతం...

మా అమ్మ కి చెప్పకుండా మా చెల్లి శేషయ్య కొట్లో అర్ధరూపాయి బిస్కెట్ అప్పుగా తెచ్చుకుంటే, అది తెల్సి మా అమ్మ ఇంట్లో చల్ల గుంజకి కట్టేసి వాతలు తేలేలా తన్నిన తన్నులు...

ఎక్కడైనా రోడ్డు మీద ఓ రూపాయి దొరికితే అబ్బురం గా తీసుకెళ్ళి అమ్మకిచ్చిన రోజులు... ఒక్కో సారి  కలలో, ఒక రూపాయి దొరికేది తవ్వుతూ ఉంటె రూపాయిలు దొరుకుతూనే ఉండేవి..అబ్బో కలలోనే ఆనందం...

బడి ఊరి నుంచి సింగరాయకొండ కి మారాక, ఎనిమిదవ తరగతిలో దీపావళి కి  మా నాన్న 50 రూపాయిలు ఇచ్చి టపాసులు కొనుక్కోమని ఇస్తే...ఓ పది మంది ని వెంటపెట్టుకెళ్ళి అవి అన్ని అవగొట్టి ఓ రెండు కవర్ల నిండా టపాసులు తెచ్చి మా నాన్న కి చూపిస్తే మిగతా డబ్బులేవిరా అని మా నాన్న అడిగినప్పుడు గుండె జారి కారిపోతుంటే మా అమ్మ ఉతుకిన ఉతుకుడు...

సింగరాయకొండ బడికి వెళ్ళేప్పుడు పోను రాను కలిపి బస్ కి రూపాయి చార్జి...అంతే ఇచ్చేది అమ్మ. బాక్స్ లో అన్నం... బడి లో వంటిగంట కొట్టగానే, బయట అన్నమ్మ అమ్మే కేకులు, జీళ్ళు, గొట్టాల పాకెట్లు చూసి అబ్బ ఒక్క రూపాయి ఉంటె ఎంత బాగుండేది అని ఆశ పడ్డ రోజులు...

ఊర్లో విసిఆర్ లో సినిమా వేస్తుంటే టికెట్ అర్ధరుపాయో,రూపాయో అది లేక ఇంట్లో అడగలేక ఇద్దరం కూర్చుని చెప్పుకున్న  కబుర్లు, నోటి కొచ్చిన కథలు...

తొమ్మిదవ తరగతి లో అమ్మ తో బాటు ఒంగోలు హాస్పిటల్ కి పొద్దున్న  వెళ్లి సింగరాయకొండ వచ్చేసరికి ఆకలి కి అల్లాడిపోయి నీరసం గా ఉంటె అమ్మ చూడలేక డబ్బులిస్తే 14 రూపాయలు పెట్టి శబరినాథ్ హోటల్లో మొదటి సారి తిన్న ఫుల్ మీల్స్....

చందమామ ఐదు రూపాయలు కదా..కొనలేం...దాంతో చందమామ ని ప్రతి నెల తెచ్చే స్నేహితుడిని ఎంచుకున్నాను....

ఐదు లోనో ఆరులోనో తెలీదు అమ్మ తో పాటు యరజర్ల మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఊరు పోతే, కమల పెద్దమ్మ 15 రూపాయలు ఇచ్చింది..దాంతో ఎం కొనుక్కోవాలి అని అమ్మని అడిగితే నీ ఇష్టం అంది....చెక్కతో చేసిన తిరుపతి వెంకన్న బొమ్మ కొనుక్కున్నాను..అది ఇప్పటికి ఉంది..ఆ మాట చెప్పుకొని మా అమ్మ ఇంకా మురిసిపోతూ ఉంటుంది...

ఒంగోల్లో ఇంటర్ చదివేప్పుడు బస్ చార్జి ఎక్కువని లారీ లో 5 రూపయిలిచ్చి వెళ్ళిన సందర్భాలు....

అప్పట్లో ప్రతిది విలువైనదే....ఎంత భద్రం గా దాచుకునే వాళ్ళమో....


 2004 లో రాజశేఖర్ రెడ్డి గెలవాలని  తపించిన వాళ్ళలో నేనొకడిని...గెలిచాక ఎదో మా ఇంట్లో పండగలా సంతోష పడ్డాము...ఇప్పటికి మా ఇంట్లో ఆయన అంటే అభిమానం, వాళ్ళకి అందాల్సింది వాళ్ళకి అందింది కాబట్టి..అది చంద్రబాబు చేయలేకపోయాడు కాబట్టి... కానీ చంద్రబాబు చేసింది పల్లెటూరి దాక చేరలేదు.IT అభివృద్ది, రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పని చేయడం, విదేశి పెట్టుబడులు. అంత లాభం కాకపోయినా, ప్రజలకి మేలు జరిగింది. ప్రత్యక్షం గా అందలేదు, అందుకే ఎందరికో చంద్ర బాబు పరిపాలన చేదుగా ఉంటుంది. రైతులు కష్టల్ల్లో ఉన్నప్పుడు ఉదాసీనం గా వ్యవహరించడం ముఖ్యమైన తప్పిదం.

అంతా అయ్యాక ఆనందం ఆవిరయ్యింది. పథకాల పేరిట నిధుల మళ్లింపు , నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల  సంతర్పణ,నిత్యావసర వస్తువుల  ధరల పెంపు, రాష్ట్ర విభజన నినాదాన్ని  ఒక పార్టీ పతనానికి వాడుకోవడం, ప్రభుత్వ సంస్థలు నష్టాల్లోకి వెళ్ళడం. అలా అని అన్ని  చార్జీలు పెరిగాయి. అయినా నష్టాల్లోనే ఉన్నాయి... విపరీతం గా పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపు. రియల్ బూమ్ పేరుతో   సామాన్యుడికి అందకుండా పోయిన స్థలాల ధరలు...సిమెంట్, ఇనుము, ఇసుక అన్ని రేట్లు పెరిగాయి.సామాన్యుడి ఆశ బంగారం, వెండి ఆకాశాన్ని తాకాయి.. విభజన సెగల్ని సాకుగా చూపి ఎన్నో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, IT పార్క్ లు పక్క రాష్ట్రాలకి తరలి పోయాయి..వాటి ని మన రాష్ట్రానికి తీసుకురావడం మానె అందులో కూడా స్కాం  చేసారు కొందరు మేధావులు...

ఇక దేశమంతా తీసుకుంటే కాంగ్రెస్ పాలనలో జరిగినన్ని స్కాం లు ఎక్కడ జరిగి ఉండవేమో..మీ కోసం ఈ లింక్..

http://en.wikipedia.org/wiki/List_of_scandals_in_India 

కాదేది దోచుకోడానికి అనర్హం అన్నట్టు ప్రతిదాన్లో మంత్రులు, అధికారులు తలా ఒక చెయ్యి వేసి పాల్గొన్నారు...

దాదాపుగా యాభై లక్షల కోట్ల అవినీతి జరిగింది..ప్రతి దాన్లో మంత్రుల హస్తం ఉంది... ఏదైనా ఒక చట్టం చేసి ఆ నల్లదనాన్ని వెనక్కి తీసుకురావడానికి వాళ్ళు చెప్పే సాకులు వినాల్సిందే...

ఇక నిత్యావసరాల ధరలు ఎలా పెరిగింది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది...మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్ని దోచుకోడానికే అన్నట్టుంటుంది...పండించే రైతు నష్టపోతున్నాడు, కొనే వినియోగదారుడికి గిట్టుబాటు కావడం లేదు. మరి బాగుపడుతుంది ఎవరు? ఎం పని చెయ్యకుండా ఉన్న దళారులు... వీళ్ళు ప్రతి రంగం లో ఉన్నారు, దోచుకున్నారు, శాసించారు.. 

బియ్యం,పప్పు,ఉప్పు ఇది అని లేకుండా అన్ని పెరిగాయి..గ్యాస్ మీద నియంత్రణ కూడా పెట్టారు..సామాన్యుడిని ఆదుకోడానికి ఎ విధంగాను ప్రయత్నం జరగలేదు..పెట్రోల్ కంపెనీల మీద నియంత్రణ ఎత్తివేయడం వల్ల వాళ్ళ ఇష్టానుసారం పెంచుతున్నారు...కొత్తగా డీజిల్ మీద ఎంత పెంచాలో అన్నది ఆ కంపనీ లకే వదిలేసారు...

సెజ్ ల పేరు చెప్పు వేల ఎకరాలని అప్పనం గా ఎవడికో కట్టబెట్టడం...ఎవరు బ్రతుకుతున్నారు?

ఇక విద్యుత్ బిల్లుల పెంపు..ఇది ఎవరికీ అర్ధం కాని ఓ పజిల్...2009, 2010 సంవత్సరాలకి గాను విద్యుత్ చార్జీల బకాయిలని ఇప్పుడు వసూలు చేస్తున్నారు..http://www.kseboa.org/news/power-tariff-hiked-in-andhra-pradesh-from-april-1-02042155.html... ఎవరు అడిగారయ్యా పథకాల పంపకాలు...ఇపుడు మా మాడు పగులుతుంది....

ఇక వాట్,  సేల్స్ టాక్స్, సర్వీస్ టాక్స్ ఇలా పన్నుల రూపంలో సామాన్య ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారు...

రిటైల్ రంగం లోకి విదేశి పెట్టుబడులని ప్రత్యక్షంగా అనుమతించడం....

మైనారిటీ ల సక్షేమం పథకాలు.ఆ పథకాల వల్ల లాభ పడ్డ కొందరు, వాళ్ళే మైనారిటీలు గా చెలామణి అవుతున్నారు...అవసరం లో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు.. అంతే కాకుండా  ఇతర కులాల్లో ఆర్ధికంగా వెనుకబడ్డ వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళుగా గుర్తించబడలేదు...దానికి కులమే అడ్డం...

ఇక ఎన్నో అంతర్జాతీయ సమస్యలు...అరుణాచల్ ప్రదేశ్ ని చైనా లో అంతర్భాగం గా చైనా చెప్తూ ఉన్నా, ఇంటర్నెట్ లో అన్ని మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ని డాట్స్ తో గుర్తిస్తున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం.

ఎన్నో తీవ్రవాద దాడులు జరిగినా పోటా లాటి చట్టాలని తిరిగి తీసుకురావడానికి ఏమాత్రం మనసు రావడం లేదు. నిన్న గాక మొన్న మన సైనికుల మీద దాడి చేసి తలలు తీసుకెళ్తే ధాటిగా సమాధానం చెప్పే దమ్ము లేకపోయింది...

ఇదంతా ఎందుకంటే అప్పటి నుంచి జరిగిన నష్టాన్ని ఉటంకించడమే...  భారత ప్రజలకి భవిష్యత్తు మీద భరోసా ఇవ్వడానికి యువరాజు రాబోతున్నాడు...

ఇక ఉంది మన చేతుల్లోనే..మీకు ఎవరు కావాలి? ఎలాటి ప్రభుత్వం కావాలి? ఒక నిర్ణయం తీసుకునేప్పుడు ఎప్పుడు మన అభిప్రాయం అడిగలేదు.. వాళ్ళ ఇష్టానుసారం గా తీసుకున్నారు...మనకున్న అవకాశం ఓటు వెయ్యడం... నేను ఎవ్వరిని బలపరచడం లేదు.. వచ్చే ఒక్కరోజు కులం,మతం,డబ్బు ఇవన్ని పక్కన పెట్టి దేశ భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేద్దాం...అది మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది...





మల్లన్న పండగ...

నేనైతే ఈ పండగ కోసం ఎదురు చూసేవాడిని. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తిండి పండగ, తినేవాళ్ళకి పండగ...

మా ఇంట్లో అడిగితే, కరువు వస్తే ఈ పండగ చేస్తారంట.కరువు తీరిపోవడానికి అన్నమాట.

ప్రతి ఇంట్లో ఎవరి స్తోమత కి తగ్గట్టుగా పిండి వంటలు చేస్తారు... ఇంటికి ఒక మల్లన్న ఉంటాడు... ఒక రాయికి నామాలు పెట్టి పూజ చేస్తారు...దేవుడికి నైవేద్యం పెట్టి, మల్లన్న ని ఒక్కడినే ఇంట్లో కి పంపించి తలుపు వేస్తారు. 

ఇక మాయాబజార్ లో పప్పు సర్ లాగ వియాల వారి విందు అహహ్హ నాకే ముందు అని కుమ్మేయాలి...అక్కడే ఒక చుట్ట ఉంటుంది..దాన్ని ముట్టించి నోట్లో పెట్టుకొని, చెయ్యి కడుక్కోకుండా ఆ నామాలు పెట్టిన బండ ని చేత్తో పట్టుకొని  వచ్చి తలుపు తట్టాలి..బయట నుంచి మూడు సార్లు అడుగుతారు"అయిందా మల్లన్నా?" అని...ఎం మాట్లాడకూడదు..ఊ అనాలి అంతే. అప్పుడు తలుపు తీస్తారు...

ఇక అక్కడ నుంచి నడుస్తూ ఊరి చివరి వరకు వెళ్ళాలి..మధ్యలో చాల మంది నవ్వించడానికి చూస్తారు, నవ్వకూడదు.. కొంతమంది గోచి కూడా లాగేస్తారు...ఐన సరే ఊరి చివరకి వెళ్లి ఆ రాయి అక్కడ పెట్టి చెయ్యి కడుక్కొని రావాలి...

నేను అందరి కన్నా ముందు తినేసి వెళ్లి వచ్చి గోల చెయ్యడానికి రెడీ గ ఉండే వాడిని...పొద్దున్నే వెళ్లి ఎవరి రాయి వాళ్ళు వెతుక్కునే వాళ్ళం...ఓ సారి రెండు ఇళ్ళకి  మల్లన్న గా ఉండే అవకాశం వచ్చింది...కొంచెం కూడా సందు ఇవ్వకుండా కూర్చోబెట్టారు...ఏదో మానవ ప్రయత్నం చేసా...


దాదాపు గా ఇరవై ఏళ్ల నుంచి ఆ పండగ చెయ్యలేదు...చిన్నప్పుడు మా అమ్మ ని అడిగా "మా మల్లన్న పండగ  ఎప్పుడు, అన్ని పండగలు వస్తున్నయి..మల్లన్న పండగ రాదా" అని...తిట్టింది..ఆ ఎప్పుకప్పుడు రాకపోదా అని ఎదురు చూసా..వయసొచ్చింది.పండగ మాత్రం రాలా..హ్మ్మ్ 
మాకు ఉహ తెల్సే నాటికి మా ఊరికి HNRBS బస్ సర్వీస్ నడుస్తూ ఉంది. దాన్ని సింగరాయకొండ లో ఉండే ఎర్జాని వాళ్ళ నాన్న నడిపేవాడు..అందులో ఎర్జాని వాళ్ళ అన్నదమ్ములు డ్రైవర్ గా ఉండే వాళ్ళు..మా ఊరి నుంచి సింగరాయకొండ మీదుగా పలుకూరు కి నడిచేది... 

మేము మా ఇంటి ముందున్న ప్రభుత్వ బడి లో చదువు సాగిస్తూ ఉన్నాం...కాని కొందరు బస్సెక్కి కాన్వెంటు కి పోతుంటే అదో సరదా,మేం కూడా బస్సెక్కి బడికి పోవాలని...

మా నాన్నకి  కూడా నా ఆలోచనే వచ్చి మా పిలకాయ్ కాన్మేంట్ లో సదివితే సించేచ్చాడని హనుమాన్ విద్యాలయ ( కాన్వెంట్ అయినా పేరు బాగుంది కదా) లో చేర్పించారు.అప్పుడు నేను ౩ వ తరగతి. ఇక బస్సు ఎక్కే యోగం పట్టింది...

బస్సు మేము వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు  కిట కిట లాడుతూ  ఉండేది. సీటు దొరకడం గగనమే...పిల్లలం అంతా ఇంజిన్ దగ్గర చేరే వాళ్ళం...అద్దం ముందు కూర్చుని ప్రయాణం ఓ గొప్ప అనుభూతి..చీకటి పడితే లైట్ల వెలుగులో తిరిగే పాములు, వాన పడేప్పుడు పైన్నుంచి కురిసే జల్లు...నిజంగా అద్భుతం..అక్కడ  కాని సీటు దొరికితే అంతే ఏదో పొడిచేసినట్టు అందరి వంక చూసేవాళ్ళం...

ఆ బస్సు లో ఓ ముసలాయన డ్రైవర్ గా వచ్చేవాడు..పెద్దగా మాట్లాడేవాడు కాదు...ఓ సారి బస్ ఎక్కిన్చేప్పుడు మా నాన్న వచ్చి ఎక్కించాడు, బస్ అంతా నిండు గా ఉండటం తో డ్రైవర్ వైపు నుంచి ఎక్కించాడు. లోపల కుదరక అక్కడే కూర్చున్నా..ఆయన ఏమనలేదు. ఇక అక్కడ కూర్చోడం అంటే అదేదో మనకోసం సింహాసనం వేసినట్టే...అలా చిన్నగా అలవాటయ్యింది.ఆయన బస్ తాత అయ్యాడు.రోజు అక్కడే నా సీటు.ఆయనతో యవ్వారం..బస్ రాత్రి వచ్చి మా ఊర్లోనే ఆగిపోయ్యేది.. మా ఇల్లు ఊరి మొగదాల్నే కాబట్టి బస్సు  మా ఇంటి ముందే ఆగేది. బస్ తాత మా ఇంటి కి వచ్చి మంచి నీళ్ళు తాగే వాడు..చేతిలో ఏదైనా తినడానికి ఉంటె నాకు, చెల్లికి ఇద్దరికీ చేరి సగం పెట్టె వాడు...ఉదయాన్నే బస్సు బయల్దేరి ఊర్లోకి పోయి వచ్చేది.. నేను బుజ్జి ఆయనతో పాటు ఊర్లో తిరిగి వచ్చే వాళ్ళం.. ఉదయాన్నే బస్ తాత తో పాటు ఊర్లో తిరిగి రావడం ఓ అలవాటు ఐంది... అప్పుడప్పుడు పలావు అన్నం కూడా తెచ్చేవాడు..భలే ఉండేది...
ప్రతి పండక్కి ఆ బస్సుని అలంకరించేవాళ్ళు...రంగు కాగితాలు, రంగులు,బుడకలు, తళుకు కాగితాలు, కొబ్బరి మట్టలు..అబ్బో అదో సంబరం...మాకైతే నిద్ర పట్టేదే కాదు.. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని...   బస్ అంతా అతికించడం అయ్యాక, బస్ తాత మాక్కూడా కొన్ని రంగు కాగితాలు ఇచ్చేవాడు....అవన్నీ మా ఇంటి పందిరికి వేలాడేవి...

ఒక సంవత్సరం అయ్యాక బస్ ఎక్కి తిరగలేక నేను,  నన్ను చూడకుండా ఉండలేక మా ఇంట్లో వాళ్ళు  తీసుకొచ్చి మా ఇంటి ముందున్న బడిలో వేసారు....బస్ తో బంధం తగ్గిపోయింది...బస్ తాతని తప్పకుండ పలకరించే వాడిని..కాని ఆయన రావడం తగ్గిపోయింది..ఎప్పుడైనా వచ్చేవాడు...కొన్ని రోజులకి పూర్తి గా రావడం మానేసాడు...నేను నా పనుల్లో పడిపోయాను...

మా ఊర్లో ఏడవ తరగతి వరకే ఉంది..అయిపోయాక మళ్ళి సింగరాయకొండకి..ఈ సారి శ్రీ శారద రెసిడెన్షియల్ లో చేరాను...స్కూల్ అయిపోయాక ఓ రోజు బస్ స్టాండ్ లో ఓ ముసలాయన..బాగా ముసలయన..పాత బట్టలేసుకొని ఉన్నాడు..తరిచి చూస్తే బస్ తాత.పరిగెత్తుకుంటూ వెళ్ళాను..బస్ తాత నేను గుర్తుపట్టావా అని అడిగా..గుర్తు పట్టలేదు..ఏడుపొచ్చింది.. ఎం మాట్లాడలేదు..అలానే ఇంటకొచ్చి మా అమ్మ కి చెప్పా..మా బస్ తాత ని చూసాను అని... కానీ నన్ను గుర్తు పట్టలేదు అని...వయసయిపోయింది కదరా అంది...

కాని మనసు ఒప్పుకోలేదు ఇప్పటికీ....

ఉన్న కొద్దిపొలం లో అత్యాశ కి పోకుండా వ్యవసాయం చేసుకుంటూ.. వళ్ళు అలసిపోయేలా పని చేస్తూ కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, మనసుకి నచ్చిన స్నేహితులు, పచ్చి గాలి , పచ్చని ప్రకృతి, కన్న వాళ్ళని చూసుకుంటూ జీవితాన్ని గడిపెయ్యలని ఆశ.... 

వ్యవసాయం అంటే వ్యయం తో కూడిన పని. దూరం నుంచి చూడ్డానికి పచ్చని ప్రకృతి,చల్ల గాలి, మనం పిలిస్తే పలికే ఎద్దులు, మర్రి చెట్టు, నీళ్ళ కుంట, చద్దన్నం, రెండో ఆట సినిమా ఇవన్నీ కనిపించచ్చు....ఓ సరి దిగాక ఏడుపు రాక మానదు...బాగా అలవాటు ఐన వల్లే హమ్మో అని వదిలేస్తున్నారు..బోలెడు కారణాలు..చాల మందికి పొలం ఉన్న చేసే వాళ్ళు లేకపోవడం, కూలి వాళ్ళు దొరక్కపోవడం, దొరికినా కూలి ఎక్కువగా ఉండటం, నాణ్యమైన విత్తనాలు దొరక్కపోవడం,పురుగు మందులు, సత్తువ ఇవన్ని కలిసి తడిసి మోపెడు అవుతాయి...ఇది కాక ఆ ఎండలో పడి పని చేస్తూ ఉంటె ఆ బాధ వర్ణనాతీతం, కాని ఆ పనిని ఇష్ట పడాలి... రైతు కి చాల సహనం, ఓపిక ఉండాలి.... మద్యలో వచ్చే వానలు, ప్రకృతి వైపరిత్యాలకి చేతికి ఏం దొరక్కుండా పోవచ్చు (ఇన్సూరెన్స్ ఉంటె బాగుండు)....అంత అయి పంట కోతకి వచ్చే వేళకి అదునులో కూలి వాళ్ళు దొరకరు, కూలి వాళ్ళు కావాలనుకునే వాళ్ళు డబ్బులుంటే ఎక్కువ కూలి ఇచ్చి కూలి పెంచేస్తారు....కల్లాల్లోకి ధాన్యం వచ్చాక దళారులు రంగం లోకి దిగుతారు( అప్పుడు ప్రభుత్వం రైతులకి ఓ అవగాహన కలిపించాలి..పెరుగుతున్న బంగారం ధరని టీవీ లో వేస్తున్నట్టు ఆ పంటల ధరలని చాటింపు వేయించడం లేదా ప్రభుత్వం నుంచి ఓ ప్రతినిధి ద్వారా ప్రతి ఊరికి తెలియచేయడం చెయ్యాలి..తలుచుకుంటే చాలా దారులు ఉన్నాయి)... వాళ్ళంతా ఒకే మాట అనుకొని కొనుగోలు మొదలు పెడతారు... అప్పుడే బాకీల వాళ్ళు, బ్యాంకులు వాళ్ళు వచ్చేస్తారు.. రేపు ఎంత రేటు వస్తుందో తెలీని స్థితి..ఎప్పుడు వాన పడుద్దో తెలీదు...దాచుకోడానికి గిడ్డంగులు ఉండవు....ఇక తప్పదు అమ్ముకోవాల్సిందే....ఇలాటి పరిస్థితుల్లో ఎం చేయాలి? సొంత పొలం అయితే కౌలు కి ఇవ్వడం, లేదా అందులో సవకలు, సుబాబుల్, జామాయిల్ వంటి కలపకి పనికొచ్చే చెట్లు వెయ్యడం. లేదా పరిస్థితి కి తగ్గట్టు గా పంటలు వెయ్యడం... పొలం లేకపోతే ప్రభుత్వ ఉపాధి పధకం లో కూలికి వెళ్ళడం జంట కి 400 వస్తాయి.... బ్రతుకంతా ఇలానే కొంత ఆదాయం తో, నష్టాలతో బ్రతికితే వాళ్ళ పిల్లలు పెద్ద చదువులు చదవద్దా? వ్యవసాయాన్ని బరువుగా భావించి వదిలేసినా వాళ్ళు చాల మంది...వారసులు లేక వదిలేసినా వాళ్ళు కూడా ఉన్నారు, మరి చదువుకున్న పిల్లవాడు, సుకుమారుడు వచ్చి వ్యవసాయం ఎందుకు చేస్తాడు? ఎం చేద్దాం????
భారతీయులు ప్రాంతాల వారిగా, మతాలపరంగా , కులాల పరం గా , హోదాల తేడా తో, భాష ల తేడాతో, సంస్కృతుల నెపం తో ఎన్ని రకాలుగా ముక్కలు చెయ్యాలో అన్ని రకాలుగా ముక్కలు చెయ్యబడ్డారు..ఇప్పుడు కొత్తగా మనోభావాలు మొదలయ్యాయి...ఎం మిగిలిందని.... 
అసలీ భారతీయులు ఎవరు? పదకొండు మంది ఉన్న మన క్రికెట్ టీం..... మన దేశం నుంచి వలస వెళ్లి పని చేసే ఉద్యోగులు, మన దేశం తరపున ఆడే ఆటగాళ్ళు.... మన రాజకీయనాయకులు..ఇక్కడ ఉన్న ప్రజలు కాదు..వాళ్ళలో ఆ భావం లేదు....

అంతెందుకు మన తెలుగు వాళ్ళు ఎంత మంది? అందులో తెలంగాణా, సీమ, ఆంధ్ర.....
ఆంధ్ర లో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర .... 
ఎన్నో మతాల వాళ్ళు....మత మార్పిడులు చేసే వాళ్ళు.... హిందువులు, ముస్లిం లు, క్రిస్టియన్ లు.....
హిందువుల్లో ఎన్నో కులాలు....ప్రతి కులం లో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు....
ఇపుడు రాజకీయపార్టీల పరం గా కూడా విడిపోతున్నారు....
ఆడ మగ ..... మనుషులం అన్న స్పృహ పోతుందేమో .... 
ఇంత పెద్ద భూగోళం లో మన ఆంధ్రులం ఇన్ని ముక్కలుగా విడిపోతే....మన దేశాన్ని సమైక్యంగా ఉంచడం ఎంత కష్టం...మనం భారతీయులం అన్న భావాన్ని మనలో నింపుకోవడం ఎలా? 

జన గణ మన అధినాయక జయహే!
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్చల జలధితరంగ!
తవ శుభనామే జాగే!
తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయ గాథా!
జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా!
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!

వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరమ్ ||వందే||
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరమ్ || వందే ||
కోటికోటి కంఠ కలకల నినాదకరాలే
కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరామ్ || వందే ||
తిమి విద్యా తిమి ధర్మ తుమి హృది తుమి మర్మ 
త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం
నమామి కమలామ్ అమలామ్ అతులాం
సుజలాం సుఫలాం మాతరమ్ || వందే ||
శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ సుశ్యామల సస్య చలచ్చేలాంచల 
జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా! || జయ ||
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా! || జయ||

సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా
హమ్ బుల్ బులే హై ఇస్‌కే, యే గుల్ సితా హమారా||
పరబత్ వో సబ్ సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మాన్ కా
వో సంతరీ హమారా ! వో పాస్‌బా హమారా||
గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ హజారో నదియా
గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే రష్‌కే జినా హమారా||
మజ్ – హబ్ నహీ సిఖాతా ఆపస్‌మె బైర్ రఖ్‌నా
హిందీ హై హమ్ వతన్ హై హిందుస్తాన్ హమారా||

ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము.
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందు.
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
ఓడలా ఝండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ వీర భావ భారతము.
తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా
సౌర్య హారముల్ రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవి ప్రభువులల్లంగ
రాగ దుగ్ధముల్ భక్తరత్నముల్ పిదక
దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా
జగములనూగించు మగతనంబెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర
వెలిగినదీ దివ్య విశ్వంబుపుత్ర
దీవించె నీ దివ్య దేశంబు పుత్ర
పొలములా రత్నాలు మొలిచెరా ఇచట
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట
పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకూ
కానలా కస్తూరి కాచరా మనకు.
అవమానమేలరా ? అనుమానమేలరా ?
భారతేయుడనంచు భక్తితో పాడ!

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !
పాడిపంటలుపొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !
ఈసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయ్
జల్డుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్ !
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్ 
దేశి సరుకులు నమ్మవెలె నోయ్ 
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !
వెనుక చూసిన కార్యమేమోయ్
మంచిగతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుక పడితే వెనుకేనోయ్ !
పూను స్పర్దను విద్యలందే
వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !
దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పకోకోయ్
పూని యేదైనాను, వొక మేల్ 
కూర్చి జనులకు చూపవోయ్ !
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసె నోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్ల లోయి !
సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !
చెట్ట పట్టాల్ పట్టుకుని 
దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి !
మతం వేరైతేను యేమోయి
మనసు వొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగీ
లోకమున రాణించు నోయి !
దేశ మనియెడి దొడ్డ వృక్షం 
ప్రేమలను పూలెత్తవలె నోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలె నోయి !
ఆకులందున అణగి మణగీ
కవిత పలకవలె నోయ్
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్త వలెనోయి !





చిల్లర మనుషులు...
వీళ్ళే ఇప్పుడు గొప్ప వాళ్ళు...అసలెవరబ్బ వీళ్ళు?
మీరు ఏదైనా గుడి దగ్గర క్యు లో నిలబడి, ఒకడు ఉంటె అల నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ కి నమస్తే పెట్టి ఒక వెకిలి నవ్వునవ్వి ప్లీస్ ప్లీస్ అంటూ అడుక్కొని చేతిలో ఎంతో కొంత పెట్టి మన కన్నా ముందు పని చేయించుకొని వచ్చి కళ్ళు పైన పెట్టుకొని ఎదో ఘన కార్యం సాధించినట్టు వెళ్తాడు చూడండి??? ఎలా ఉంటుంది మనకి.....
మనము, ఇంకోడితో గొడవ పడి పోలీస్ స్టేషన్ కెళ్తే తప్పు మనది లేకపోయినా అవతలి వాడు అక్కడి వాళ్ళ కాళ్ళో గడ్డాలో పట్టుకొని అడుక్కొని ఎలాగోలా బయటకి వచ్చి మన ముందు కలర్ ఎగరేస్తే.....
మనం పరిగెత్తి బస్సు ఎక్కుతుంటే గేట్లో నిలబడి వేళ్ళాడుతూ వెకిలిగా మాట్లాడుతూ అందరిని ఇబ్బంది పెట్టె ఒక తుంటరిని చూస్తే ఏమనిపిస్తుంది....
పది మంది లో ఒక ఆడపిల్ల ని ఒకడు ఏడిపిస్తుంటే రేయ్ అని ఆపబోతే పో పో పని చూసుకో అని వాడంటే ఎం చేయాలి?
మనతో పాటు ఆఫీస్ లో ఉంటూ పని చేయకుండా బాస్ ని ఆకట్టుకొని మనముందే ఎదుగుతూ ఉంటె ఎం చేయాలి?
మనమంతా సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడి ఆగి ఉంటె జీబ్రా లైన్ దాటి చేతులు ఇలా ఎగరేసి వెనకవైపు చూసి ఎదో చేసినట్టు బడాయి పోయే తురుం ఖాన్ లని ఎం చేయాలి?
హాస్పిటల్ దగ్గర OP రాయించుకొని వరసలో నిలుచుని ఉంటె ఎవరో ఒకరు హడావిడి గ వచ్చి ఇప్పుడే మాట్లాడి వస్తాం అని మనకన్నా ముందు లోపలకి పోయి ౩౦ నిమిషాలకి బయటకి వస్తే?
ఇలాటి సందర్భాలు బోలెడు...ప్రతి ఒక్కరు కోపం అణుచుకుంటారు  లేదా కళ్ళతో సైగ చేసుకుంటారు లేదా మనకెందుకు లేబ్బా అని తప్పుకుంటాం...
ఎంతమందిమి ఇలాటి సందర్భాల్లో స్పందిస్తారు? పది మంది లో జరుగుతున్న తప్పు ని తప్పు అని నిలదీయలేని వాడికి ప్రపంచం ఇలా ఐంది ఏంటి అని బాధపడే హక్కులేదు....రేపు ఆ తప్పు నీ ఇంట్లో జరగచ్చు..అప్పుడు మౌనమే నీ సమాధానం, ఎంత అరిచినా దాన్ని ఆపలేరు...
అందరు ఇలా లేరు...చాల మందే ఉన్నారు... సంఘం అంటే ఒకప్పుడు భయం ఉండేది..అమ్మో ఈ తప్పు చేస్తే ఎమన్నా అంటారేమో...ఈ తప్పు చేస్తే మా నాన్న పరువు ఏమౌతుందో అన్న భయం. తప్పు అనేది ఒక్కపుడు సంఘం ఆమోదించేది కాదు.....కాని ఇప్పుడు అలాటిది లేదు...ఎం చేసి అయినా సంపాదించు అని చెప్పే అమ్మ నాన్నలు....మంచి చెడు నేర్పించని గురువులు (ఆ అవకాశం ఇవ్వడం లేదు, అదేదో కొత్త రూల్ అంట కొడితే మూడేళ్ళ జైలు శిక్ష  )
ఇనింటి మద్యలో కొన్ని వెతుక్కోవడం అర్ధం లేని ఆలోచనా?
 ఇందులో నా అపోహలు, లేదా స్వంత ఆలోచనలు ఉండచ్చు...అవి నావి మాత్రమే, ఎవరిని సమాధానపరచడానికి  మాత్రం కాదు ....


నాకు పుస్తకాలు ఎలా అలవాటయ్యాయో గుర్తు లేదు కాని, మా తాతయ్య దగ్గరకి వెళ్ళినప్పుడు ఆయన చెక్కపెట్టెలో దాచిన పుస్తకాలు  చిన్న novels తీసి చదవడం మాత్రం గుర్తుంది. ఇవే కాకుండా 'ఈనాడు' తో వచ్చే ఆదివారం పుస్తకం. అందులో వచ్చే phantam కథలు. ఇంకా చెప్పుకోవాల్సింది అందరికి తెల్సిన 'చందమామ'. అందులో బొమ్మలు. అందులో రాజులూ, రాణి,మాంత్రికుడు,పర్వత సాణువులు, చీమలు దూరని కారడవులు..అబ్బో చాలానే ఉండేవి.ఇప్పటికి కూడా అవంటే చాలా ఇష్టం.నేను 8th లో ఉండగా నాకు బెల్లం రవి పరిచయం అయ్యాడు. వాడికి కూడా ఇవే ఇష్టం. వాళ్ళ ఇంటికి ప్రతి నెల చందమామ వచ్చేది. ఇందుకోసమే వాడితో నాకు స్నేహం కుదిరింది. కొత్తగా వచ్చేవి కాకుండా పాతవి కూడా తెప్పించుకుని చదివే వాడిని. నా దగ్గర మా తాతయ్య దగ్గర తెచ్చిన detective novels ఉండేవి. అందులో హీరో 'షాడో', షాడో స్నేహితుడు 'గంగారాం'. భారత దేశాన్ని వణికించిన ఒక గజ దొంగ, ప్రభుత్వ secret service లో చేరి ఏమేం సాహసాలు చేసాడు అనేది దీని ఇతివృత్తం. 10th కి వచ్చిందాకా క్లాసు జరుగుతున్నా సరే  పుస్తకాల మధ్యలో పెట్టుకొని మరి చదివేవాళ్ళం. 10th అయాక ఆ అవకాశం రాలేదు. ఈ పుస్తకాలు చదివి నేను పాడైపోతనేమో అని మా అమ్మ నాన్నల భయం. అందుకే ఈ విషయంలో నన్ను తిడుతూ ఉండేవాళ్ళు 'ఎప్పుడు చూడు ఈ పిచ్చి కథలు ' అని.ఎందుకో నాకవంటే నిజంగా పిచ్చే.ఇంటర్ అయ్యాక హైదరాబాద్ వచ్చేశా. హాస్టల్ లో ఉండగా 'స్వాతి' లో ఏదో సీరియల్ వస్తూఉంది. దాని పేరు 'కాళికాలయం' (మీకు వీలైతే ఈ పుస్తకం చదవండి.). కొన్ని ఎపిసోడ్స్ చదివాక మరి పిచ్చి పెరిగి,ఆ పుస్తకం కొన్నాను.ఇది రాసింది 'మధు బాబు'. ఈయనే 'షాడో' series రాసింది. ఈయన ఏలూరు దగ్గర ఉన్న హనుమాన్ జంక్షన్ లో headmaster . మనం సినిమాల్లో హీరో లని హీరొయిన్ లని ఎలా అభిమానిస్తామో అలా అభిమానం పెరిగిపోయింది.ఓ సారి కలిస్తే బాగుండు అని.


రోజులు గడుస్తూ ఉన్నాయి .కొన్ని రోజులకి మా లలిత పెళ్లి వచ్చింది.మా లలిత ది హనుమాన్ జంక్షన్. మా లలిత కి పెళ్లి కుదిరింది.ఈ లోగ నేను మధు బాబు గారి చాలా పుస్తకాలతో పాటు కాళికాలయం చాలా సార్లు చదవడం చాల మంది చేత చదివించడం జరిగిపోయింది. లలిత పెళ్లి రోజు రానే వచ్చింది. నాది రాత్రి ఉద్యోగం (night  shift ) కావడం చేత, దుర్గ (పలుసాని నాగ దుర్గ ప్రసాద్ రెడ్డి , నా స్నేహితుడు )నేను కలిసి హైదరాబాద్ నుంచి నా బైక్ మీద జంక్షన్ వెళ్ళడానికి తయారయ్యాం . ఉదయం 6 గం లకు బయల్దేరి 12 గం లకు జంక్షన్ కు చేరుకున్నాం.మాకు అక్కడ ఉన్న ఓ హోటల్ లో రూం ఇచ్చారు.ఫ్రెష్ అయి కింద తిరుగుతూ ఉన్నాం.సాయంత్రం అయింది. మా హోటల్ కింద ఉన్న మందుల షాపు దగ్గర ఒకాయన బండి మీద లుంగి కట్టుకుని కూర్చున్నాడు. దగ్గర చూస్తే ఆయన మధు బాబు.అవును షాడో మధు బాబే. కాలం ఆగిపోయి,చిరు జల్లు  ల తో పూల వాన...నా మొహం వెలిగిపోతుంది. నా పక్కన దుర్గ గాడు నన్నో వెర్రి గొర్రె లా చూస్తున్నాడు.ఏం ఫర్లేదు.ఆయన దగ్గర కు వెళ్ళాను. 'సార్, మీరు మధు బాబు గారు కదా?' అని. ఆయన కొంచెం వింతగా చూస్తూ 'అవును ' అన్నారు. వెంటనే నేను 'నా పేరు లక్ష్మీ నరేషు,నేను హైదరాబాద్ నుంచి వచ్చాను' అని చేయి ఇచ్చాను(shake hand).ఆయన కూడా చేయి ఇచ్చారు. ఇంకేం మాటాడలేదు. నేను మాత్రం చేతులు నలుపుకుంటూ,పళ్ళు ఇకిలిస్తూ  అక్కడే నిలబడ్డాను.ఆయనేం పట్టనట్టు ఉండిపోయారు. దుర్గ ఉండి 'ఇక చాలు పదరా ' అన్నాడు. ఆయన్నల చూస్తూ హోటల్ కి వెళ్ళిపోయాను. ఫైనల్ గ నేను మధు బాబు ని చూశానోచ్. హా నా అభిమాన రచయిత,పుస్తకాలంటే నాలో ఇష్టం పెంచిన రచయిత ని చూసాను.చాలా సంతోషమేసింది, ఎంతంటే 9 వ తరగతి లో ప్రచారానికి వచ్చిన NTR ని చూసినంత. మధు బాబు పుస్తకాలు కాకుండా యండమూరి,యద్దనపూడి,సూర్యదేవర,చలం ఇంకా కొందరి పుస్తకాలు చదివాను.కాని మధు బాబు గారంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన పుస్తకాలని ఇప్పుడు పిల్లల పుస్తకలంటారు కాని , నేను మాత్రం పిల్లాడి లానే చదువుతాను.
భోగి, వినాయక చవితి,అట్ల తద్దె, డబ్బులుంటే దీపావళి (ఎందుకో చెప్తా ), మల్లన్న పండగ (ఇది లోకల్ పండగ ). ముందు చెప్పాల్సింది వినాయక చవితి.అప్పుడే వానాకాలం చల్లగా మొదలౌతుంది.పొలం పనులు తక్కువగా ఉంటాయి. రే వినాయక చవితికి ఎం చేద్దాం రా? మనం పరవటిది (పడమర వీధి ) వాళ్ళకంటే ముందు వెళ్ళాలి రా, లేకపోతే ఏనుగు దంతాలు దొరకవ్. ఇలా కలల్లో ఉండేవాళ్ళం. 

ముందు గ చెప్పాలి కదా , మా ఊర్లో తూర్పు వీధి , పరమట వీధి అని రెండు భాగాలు చేసారు మాటల్లో.ఊరు తూర్పు వీధితో మొదలౌద్ది. మా ఇల్లు మొగదాల్నే ఉంటుంది. మా వీధిలో నేను,అనవయ్య(హనుమయ్య ), శీని గాడు , స్వర్ణ హరి, వాళ్ళ అన్న చెంచయ్య, వెంకటేశ్వర్లు,కిశోరు, చందు గాడు, పెండ్యాల మాధవ, మా మాధవన్నాయి ,అచ్చానగారి మధు, అచ్చానగారి సురేష్, పెండ్యాల సీనన్నాయి, మస్తాను గాడు..ఇంకా చాల మంది ఉన్నారులే..మేమేందారం కల్సి పత్రీ కి వెళ్ళే వాళ్ళం. పత్రీ తెల్సు కదా. తెలీదనకండి.నేను hurt అవుతా. వినాయకచవితి దగ్గరపడే కొద్ది మా preparations మొదలౌతాయి. ఆ రోజు రానే వస్తుంది.ముందు రోజు రాత్రే ఒక గోతాము, కొడవలి,వీలైతే ఒక టార్చ్ లైటు దాచుకుని పడుకునే వాడిని.పడుకున్న మాటే కాని నిద్ర పట్టేది కాదు.అప్పుడే తెల్లారి నట్టు , అందరు నాకన్నా ముందు గ లేచి వెళ్ళిపోయినట్టు అనిపించేది.ఎక్కడ చిన్న శబ్దం అయిన మా వాళ్ళే పిలుస్తున్నారనుకునేవాడిని. ౩ గంటలకి వచ్చి లేపేవాళ్ళు. ఇక లేచి "మా నేను వెళ్తున్న" అని చెప్పి పరిగెత్తే వాడిని. నాన్నేమో రే జాగ్రత్త చెప్పేవాడు.

 ముందు నర్రోడు గుంటకి వెళ్ళాలి.మా ఊరి తార్రోడ్డు అంటా వెళ్తే నర్రోడు గుంట వస్తుంది.ఆ దారిలో నక్కలు , అడవి పందులు అరుస్తూ ఉండేవి.కొంచెం భయం గా ఉన్న పెద్దోళ్ళు ఉన్నారన్నధైర్యం ఉండేది. అక్కడ హాల్ట్ వేసే వాళ్ళం.అక్కడ మామిడి తోపు ఉంది.ముందు మంట వేసి ఒకటి ,రెండు కనిచేసేవాళ్ళం.పుల్లలెట్టి పళ్ళు తోమేసి, ఇక పత్రీ కోయటం మొదలు. ఇక్కడ ఒక కండిషన్ ఉంది.పత్రీ సంచి కింద పెడితే అది ఇక పనికి రాదు.కాబట్టి కింద పెట్టకూడదు.ఒక్కోసారి పడ్డాకూడా, ఎవరు చూడలేదని వెళ్ళిపోయినా సందర్భాలు బోలెడు. నర్రోడు గుంట నుంచి ఎడమకి తిరిగి,ముందు మామిడాకులు..కక్కుర్తి పడి ఎక్కువ కొస్తే సంచి నిండి పోద్ది కదా.అందుకే కొంచెం.వెదురాకులు,దర్బలు. అక్కడ మెయిన్ ఈవెంట్ (ముఖ్య ఘట్టం ) ఉంటుంది అదే "ఏనుగు దంతం ".నేను వీరప్పాన్ని అస్సలు కాదు. ఇక్కడ ఏనుగు దంతం అంటే అల్లోవీర మొక్క లో ఉండే అలాటి ఆకారం.దానికోసం కొట్టుకు చచ్చే వాళ్ళం.ఇప్పుడు మనం రెండు మామిడి తోపులు దాటి వచ్చాం.అది మా ఊరి పొలిమేర.అక్కడ కుడికి తిరిగితే మర్రి ఆకులు,నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ,జామ ఆకులూ ఉండేవి. అక్కడేమో సాయిబు కాపలా కాసే జామ తోట ఉంది. రెండు జట్ల గ విడి పోయేవాళ్ళం . ఆ చివర, ఈ చివర కోస్తూ సాయిబు ని పరిగెత్తించే వాళ్ళం. తోట వెనుక ఓ నేల బావి ఉంది.దాని మీద ఒక జామ చెట్టు ఉంది.అక్కడకి మాత్రం వెళ్ళకుండా జాగ్రత్త పడే వాళ్ళం. అక్కడ నుంచి భూమిలో ఉండే ఉల్లి లాటి మొక్కలు కోసుకునే వాళ్ళం.అక్కడ నుంచి అత్తి చెట్ల దగ్గరకి వెళ్లి అక్కడ ఇంకా కొన్ని కోసుకొని,పత్రీ సంచుల్ని అక్కడ తగిలించి కబడ్డీ ఆడేవాళ్ళం. ముందు రాగి ఆకులు చాల కోసుకోవాలి , కుడుములు చేయాలి కదా.10 గం ల కల్లా ఇంటికి వెళ్ళాలి. ఆటలు ముగించి ఇంటికి బయల్దేరేవాళ్ళం. 

మద్యలో అడిగినవాళ్ళకి పంచుకుంటూ ఇంటికి చేరి పత్రీ అమ్మకిచేస్తే, నాన్న మామిడాకులు గుచ్చి గుమ్మానికి కట్టమనేవాడు.ఆ పని అయాక ఇంట్లోంచి పొంగలి వాసనా అలా వస్తూ ఊ ఊ ఊ .తొందరగా తలారా స్నానం(కుంకుడు రసం తో ) చేసి దేవుడి కి పూజ చేయాలి.నాకేమో ఓ బొజ్జ గణపయ్య రాదు. ఓ సారి తన్నులు కూడా తిన్నాను అమ్మ చేతిలో. ఇక అప్పటి నుంచి పుస్తకం కొన్నా.అందులో ఏమో చాల మంత్రాలూ ఉంటాయే,నాకేమో ఆకలేస్తుంది ఇలాక్కాదని తొందరగా పూజ ముగించి ,దేవుడి కి ఆరగింపు కోసమని అన్ని అక్కడ పెట్టి తలుపు వేసి బయటకి వెళ్ళేవాళ్ళం.మరి దేవుడు తినాలిగా. తలుపు కొట్టి లోపలి కి వెళ్ళాలి.ఎ పండగకి ఐనా అంతే. నాకు ఇక్కడ వరకు చాఆఆఆఆల ఇష్టం. 

ఇప్పుడేమో అందరు స్టేటస్ symbol గ వేలు వేలు పోసి విగ్రహాలు తెస్తున్నారు.అక్కడ పండగ వాతావరణం కనిపించదు పై పై మెరుగులు తప్ప.ఏమో నాకు తెల్సి అదే పండుగ.ఆకలితో ఎదురు చూసి తిన్న ఆ పొంగలి రుచి దేనికి రాదు.మా ఇంట్లో ఉన్న చెక్క వినాయకుడు ఇంకా ఉన్నాడు. కాకుంటే పసుపు ఎరుపు రంగుల్లోకి మారిపోయి. ఈ సారి మల్లన్న పండగ గురించి చెప్తా. కాని ఇది మీకు నచ్చితేనే.