మనం అందరం దాదాపు రైతు కుటుంబాల నుంచి వచ్చిన
వాళ్ళమే... చిన్నప్పుడు ఆ పొలాల్లో పడి పని చేసిన వాళ్ళమే.. మనకి అప్పుడు ఏమి
తెలీదు, పని కొంచెం కష్టం అనిపించేది అంతే. ప్రతి సీజన్ లో పచ్చగా ఉండి పొలాలన్నీ
ఏదో ఒక పంట తో ఓ కళ కళ లాడుతూ ఉండేవి. ఇంటి దగ్గర కూరగాయలు కొనడం కూడా తక్కువే.
ఇంటి పెరట్లో అల్లుకున్న దొండ పాదులు,సొర పాదులు,కాకర పాదులు , పొట్ల పాదులు, ఆకు
కూరలు. పొలాన్నున్చి తెచ్చుకునే పచ్చి మిరపకాయలు,టమాటో లు, గోంగూర. మన చేలో పండే
కంది పప్పు , మినప్పప్పు,వేరు సెనగ. ఇవన్నీ మనం చూశాం.కానీ మన ముందు తరాన్నుంచి ఆ
అనుభవాన్ని మాత్రం అందుకోలేక పోయాం.
మనకి నెల జీతం వస్తుంది కాబట్టి కొంచెం రేట్లు
పెరిగినా కొనుక్కో గలుగుతున్నాం. కానీ పల్లెటూర్లలో ఈ వ్యవసాయాన్ని బతికించడానికి మన
ముందు తరం ఇంకా పోరాడుతూ ఉంది. ఎవరికైనా ఒక వయసు వచ్చాక విశ్రాంతి అవసరం. మన తాతల
నుంచి తండ్రులు అందిపుచ్చుకున్నారు. కాని వారి నుంచి అంది పుచ్చుకునే వారు
లేకపోయారు. వయసు 60 వచ్చినా వాళ్ళే పొలం పని చేయాల్సిన పరిస్థితి. ఒక్క ముక్కలో చెప్పాలంటే
వ్యవసాయం చచ్చిపోతుంది. కారణాలు చాలానే ఉన్నాయి.
1.ఆదాయం లేకపోవడం .
2.నష్టం వస్తే ఆదుకునే వాళ్ళు లేకపోవడం(5౦౦౦౦
పెట్టి కొన్న బైక్ ఇన్సురన్సు ఉంది కానీ ప్రజల కడుపు నింపే పంట కి లేదు)
3.ప్రకృతి లో మార్పులు.
4.కూలి ఖర్చులు పెరగడం , కూలి వాళ్ళు
దొరక్కపోవడం.
5.పంట చేతికి వచ్చాక ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన
కొనుగోళ్ళు లేకపోవడం. అప్పుడు తీర్చాల్సిన అప్పులు కోసం ఎంతో కొంత కి అమ్మి వాటికీ
కట్టి ఖాళీగా ఉండటం. మళ్ళీ పంట కోసం అప్పు చేయడం. ఎందుకంటే వాళ్ళకి ఆ పని తప్ప
ఇంకోటి రాదు. వెనక చేయి వేసి ఆసరా ఇచ్చే బిడ్డలు లేరు. ఇంత కష్టం చూసాక ఎ రైతు తన
పిల్లల్ని వ్యవసాయం చేయమని చెప్పడు.
మనలో చాలా మందికి ఇవన్నీ తెలుసు. కాని మన జీవితపు
పరుగులో పడి ఒక నిట్టూర్పు మాత్రం ఇవ్వగలుగుతున్నాం.
మనకి తెల్సు ఎంత మంది రైతులు బలవంతగా బతుకు ముగిస్తున్నారో.
పరువు కోసం బ్రతకలేక ప్రాణాలు తీసుకునే ఒక రైతు విలువ పేపర్లో ఒక మూల ఉండచ్చేమో కానీ ఆ నష్టం ఆ కుటుంబానికి ఎవరు
తీర్చలేరు. వ్యవసాయం చేయడం అంటే పచ్చని పంట పొలాల్లో భుజం మీద కర్ర వేసుకొని ముందు
వెళ్ళే ఎద్దుల వెంట కూని రాగాలు తీస్తూ నడవడం కాదు. ఎర్రటి ఎండలో శరీరం సహకరించించక
పోయినా ఆ రోజు వెయ్యాల్సిన ఎరువు వెయ్యకపోతే మొక్కలు చచ్చిపోతాయని పాకులాడటం. ఇది
పిల్లల కోసం తండ్రి పదే బాధ.
ఇదంతా ఎందుకు అంటే, నాదొక చిన్న ఆలోచన నచ్చితే
ప్రయత్నిచండి.
మనం అందరం బియ్యాన్ని 25KG లు 1800 పెట్టి
కొంటున్నాం. సగటున ముగ్గురు ఉన్న కుటుంబానికి ఏడాదికి 13 నుంచి 15 వరకు బియ్యం బస్తాలు
అవసరం అవుతాయి. కూరగాయలకి,పప్పు ధాన్యాలకి అంతా కలిపి 20,000 దాక ఖర్చు అవుతుంది.
అంటే బియ్యం తో కలిపి మొత్తం 40000 దాకా ఖర్చు
అవుతుంది. మనలా కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఒక కంపెనీ లో 50 మంది కలిసి
దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరి కి వెళ్ళి అక్కడ ఉన్న రైతులకి పెట్టుబడి పెట్టి ఆ పంటని
మనమే కొనుక్కుంటే కొన్ని కుటుంబాలని బ్రతికించిన వాళ్ళం అవుతాం... అప్పుడప్పుడు
వెళ్తుంటే మన పిల్లల కి కూడా ప్రకృతి తో
పరిచయం అవుతుంది. వాళ్ళలో కూడా సాటి మనిషికి గౌరవంగా సాయం చేయచ్చు అన్న ఆలోచన
వస్తుంది. వారంతం లో షాపింగ్ మాల్ కి వెళ్ళడం కన్నా పచ్చని పొలాల్లో తిరగడం
మనసుకి,మనషికి రెంటికి మంచిదే....
ఇది నా ఆలోచన మాత్రమే నచ్చితే పంచుకోండి....
అందరికి షేర్ చేయండి, ఎవరో ఒకరు ఇంకో మంచి ఆలోచన వచ్చినా సంతోషమే ...