అభిమానం/కులాభిమానం

by 7:12 PM 0 comments


తెలుగు దేశం పార్టీ ని కానీ, చంద్ర బాబు గారి ని కానీ ఏమైనా అన్నా , వాళ్ల సిద్ధాంతాలకి విరుద్ధంగా మాట్లాడినా ఆ పార్టీ విధేయులు, అభిమానులు , కులాభిమానులు,స్వలాభం కోసం చూసే వాళ్ళు ఊరుకోరు.
పార్టీ లో ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు అడుగంటిపోయిన రోజులివి. వాళ్ళు కూడా ఇక తప్పక ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి ఉంటున్నరేమో తెలీదు. చంద్రబాబు గారంటే అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఆయన ఆలోచన పద్ధతి,కష్టపడే తత్వం, అభివృద్ధి పరచిన తీరు చూసి నచ్చి ఉండచ్చు.

ఇక వై ఎస్సార్ పార్టీ కి కూడా ఇదేమి మినహాయింపు కాదు. ఇందులోనూ అభిమానులు,కులాభిమానులు,స్వలాభం కోసం అర్రులు చాచే వాళ్ళు ఉన్నారు. ఇందులో నిజంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి పార్టీ లో మనుగడ సాగిస్తున్న వాళ్ళు ఉండి ఉండవచ్చు.

ఇక జనసేన. ఇందులో రాజకీయంగా కన్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సంఖ్య ఎక్కువ. వాళ్ళు ఆయన కులానికి సంబంధించిన వారై ఉండచ్చు. వాళ్ళకి ఆయనొక ఆశ లా కనిపించి ఉండచ్చు.
ఈ అన్ని పార్టీ లలో సాధారణంగా కనిపించేది, వినిపించేది కులం. మన కులం వాడు కాబట్టి మనం సపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ఆయా పార్టీలకి సంబధించిన మీడియా ఏదైతే చెప్తుందో అదే మాట్లాడతారు. అందులో నిజానిజాలకి సంబంధం లేదు. ఇందులో ఉండేది మూర్ఖత్వం. అకారణంగా మనకెటువంటి హాని చేయకపోయినా ఎదుటి వాడి మీద అసహ్యాన్ని,ద్వేషాన్ని పెంచుకోవడం.
ఆశ్చర్యంగా ఆయా పార్టీల గెలుపు ఓటములు మనకి ఏ విధంగా సహాయం చెయ్యవు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళు ఏ రకంగానూ లాభపడరు. మన చుట్టూ కులం గోడలు కట్టి ఎదుటి వాడిలో ఉండే మంచిని కనిపించకుండా ద్వేషాన్ని నింపే ఈ పార్టీ లు ఏ రకంగానూ మన రాష్ట్రానికి సాయం చేయలేవు సరికదా ఇంకా నాశనం చేస్తాయి.

ఒక పక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశం మీద ప్రజలందరినీ ఒకే తాటి మీదకి తీసుకు రావడం మానేసి మీది తప్పు మీరు అలాంటివాళ్ళు అంటూ మీడియా లో విషం జల్లుతున్న పార్టీలను వాటి భ్రమ లో పడి అసలు విషయాన్ని విస్మరిస్తున్న తెలుగు ప్రజలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం కుల ప్రాతిపదిక మీదన విడదీయబడ్దాం. రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు మీ కులం మా కులం అంటూ మనకి మనమే గొప్పలు పోతు సాటి తెలుగు వాడిని ద్వేషిస్తే ఇప్పటి దాక ప్రాంతాల వారిగా విడిపడిన మనం ఇక కులాల వారిగా విడిపోతాం. కుల ప్రాతిపదికన రాష్ట్రం ఇస్తాం అంటూ భవిష్యత్తులో ప్రచారం చేసినా ఆశ్చర్యం ఉండదు. కుల ప్రాతిపదికన అధికారం ఇవ్వడం కాదు అర్హత ఉన్నవాడికి అధికారం ఇవ్వాలి, అపుడే దేశం ఐన రాష్ట్రం ఐన బాగుపడేది. ఎవరి అభిమానాలు వాళ్ళవి. కానీ మీరు వాళ్ళ ఎజండా లతో తోటి తెలుగు వాళ్ళ నుంచి విడిపోవద్దు. అభిమానం ఉంటే ఓటు వేసుకుందాం. కానీ మనలో మనం కొట్టుకొని కేంద్రం దృష్టిలో పలచన కావద్దు.
ఆలోచించండి. మేలుకోండి. #జైతెలుగోడా

0 comments:

Post a Comment