మా అమ్మమ్మ వాళ్ళ ఊరు

by 7:24 PM 0 comments

అమ్మమ్మ వాళ్ళ ఊరంటే నాకు గుర్తొచ్చేది ఏటి(పాలేరు) దగ్గర చేను, అక్కడ తాటి కర్ర, తేగలు, రోడ్డు పక్కనే ఉన్న మాగాణి, అక్కడ కూర్చుని లెక్కబెట్టిన బస్సులు, లారీలు. పక్కనే ఉన్న అమ్మ వారి గుడి. దూరంగా పొదల్లో కనిపించి భయపెట్టే వీరభద్రుడి గుడి. ఇంకా రైల్వే ట్రాక్ పక్కన పొలాన కూర్చుని లెక్కబెట్టిన గూడ్స్ రైలు పెట్టెలు, రైల్లో వెళ్ళే వాళ్ళకి చెప్పిన టాటాలు. ఊరికి అవతల దూరంగా ఉండే పెద్ద బడి, ఊర్లో ఉన్న అంగన్వాడి.. ఊరి నిండా ఉన్న గుడులు. ఇవన్నీ ఒక ఎత్తైతే, తాతయ్య దగ్గర పడుకొని విన్న కథలు, పొద్దున్నే ఆయన వడిలో దుప్పటి చుట్టుకొని కూర్చున్న రోజులు. అమ్మమ్మ వండే మెత్తాళ్ళ కూర, రొయ్యల పొడుం,ఎర్రగా కాచి తోడు వేసిన గడ్డ పెరుగు. పెద్ద మావయ్య డ్రామాలు వేసినప్పుడు కింద నేను వేసిన డాన్సులు. శీను మావయ్యతో ఏటి పక్కన చెట్ల కింద కూర్చొని తిన్న తాటి ముంజలు, తేగలు, బురి గింజలు, మావయ్యతో సైకిల్ మీద ముందు కూర్చుని స్పేడ్ గా ఫాస్ట్ గా అని అరిచిన రోజులు..... దాచుకోడానికి గుండె నిండా జ్ఞాపకాలు.

నేను పుట్టింది అక్కడే. నన్ను చంకన వేసుకొని తిప్పని వాళ్ళు లేరు అంట. ముందుగా అమ్మ కన్నా పిన్నే నన్ను పెంచింది.నన్ను సాయంత్రం వేళకి తయారు చేసి తల నిండా పూలు పెట్టి, దిష్టి చుక్క తో సహా గుడి దగ్గరకి తీసుకు వెళ్తే అందరు ఎత్తుకునేవాళ్ళు అంట. "బాగా బరువుగా ఉండే వాడివి రా, చేతులు మార్చుకుంటూ తిప్పల్సి వచ్చేది" అనేది పిన్ని.  ఓ రోజు అంకమ్మ గుడి దగ్గరకి వెళ్తుంటే ఎవరో లాటరీ అని చెప్తే 75 పైసలు కడితే నా పేరు మీద ఓ పెద్ద ఆంజనేయ స్వామి పటం వచ్చిందంట. దాన్ని ఇప్పటికీ ఇంట్లో  పెట్టారు. వెళ్ళినప్పుడు ఆయనకి కనపడకుండా రాను. ఏమో నాది అని గట్టి నమ్మకం. ఆ ఇంటికి,  మా ఇంటికి మొదటి బిడ్డ ని కావడంతో అందరు ముద్దుగానే చూసుకున్నారు. పిన్ని, పెద్ద మావయ్య, చిన్న మావయ్య, అమ్మమ్మ, తాతయ్య ఇలా అందరూ. అమ్మమ్మ అయితే "తిరిపిగాడు" (తిరుపతి స్వామి అంట, ఇలా అయితే అందరు నన్ను స్వామీ స్వామీ అని పిలుస్తారంట)అని పిలుచుకునేది. అందరూ అలానే పిలిచేవాళ్ళు.

మా ఇంటి ముందు రెండు పెద్ద కొబ్బరి చెట్లు, ఓ పెద్ద నీళ్ళ తొట్టి ఉండేది. ఇంటి ముందు బర్రెలు కట్టేసే వాళ్ళు. ఆ కొబ్బరి చెట్ల మీద కాకులు తెచ్చి పడేసిన బాదాం కాయలు ఏరుకొని పగలకొట్టుకొని తినడం ఓ జ్ఞాపకం. రాజ్యం కొట్టు, వీరయ్య కొట్టు, హుస్సేన్ కోట్లో తిన్న చిరు తిళ్ళు. ఆ రాజ్యం ఇంకా ఉంది "ఏందయ్యా బాగా పెద్దయ్యావుగా, మమ్మల్ని గుర్తు పెట్టుకున్నావా " అంటూ ఉంటుంది. ఆమె మా అమ్మమ్మ స్నేహితురాలు. ఆ ఊర్లో చాలా గుడులు ఉన్నాయి. శివాలయం, చేన్నకేశవుడి గుడి ఇవి ఊర్లో ముఖ్యమైనవి. ఊరవతల అయితే ముత్యాల గుంట దగ్గర ఉండే గంగమ్మ గుడి, పక్కనే కొత్తగా కట్టిన పోలేరమ్మ గుడి, మగాట్లో ఉండే అంకమ్మ గుడి, దూరంగా ఉండే వీరభద్రుడి గుడి.




చెన్నకేశ స్వామి గుడిలో ధ్వజస్తంభం చిరు గంటల శబ్దం గమ్మత్తుగా ఉండేది. సెంటర్లో ఉండే రచ్చబండ మధ్యలో పెద్ద రావి చెట్టు గల గలలు, ఆ చెట్టు మీద వాలే పిట్టల శబ్దాలతో సందడి గా ఉండేది. చెన్నకేశవుడి గుడిలో ఉండే వాహనాలు పెట్టే గది పాడుబడి ఉండేది. అందులో ఏముందో అని తెగ ఆలోచించే వాడిని. ఇక ముత్యాలగుంట నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ గంగమ్మ గుడి కి వెళ్ళడం ఓ ఆనందం. అక్కడకి వెళ్ళాక మాత్రం గంగమ్మ ని చూడ్డానికి భయం. ఎప్పుడూ తలుపులు మూసి ఉండేవి. ఎవరైనా ఎత్తుకుంటే, పాకులాడుతూ చూస్తే ఇంత పెద్ద వెండి కళ్ళతో నాలుగు చేతులతో నన్నే చూస్తూ ఉన్నట్టుండేది. ఏదో భయం "ఆ ఆ చూసేసా" అని దూకేసే వాడిని. ఇక మాగాట్లో ఉండే అంకమ్మ గుడి దగ్గర నీళ్ళ కొలను లో ఉండే తామర పూలు చూస్తే, అలా చూస్తూ ఉండే వాళ్ళం. పిల్లిపెసర కాయలు తింటూ ఆడుకునే వాళ్ళం. పెద్దోళ్ళు ఓ కథ చెప్పే వాళ్లు "పోద్దుబోయాక, పోలేరమ్మ తల్లి బంగారు చేట, చీపురు తీసుకొని, నెట్టి మీద నిప్పుల కుండతో గ్రామ రక్షణ కి బయల్దేరుతుంది" అని. అందుకే గుడి కి  దూర దూరంగా తిరిగేవాడిని. మగాట్లో కూర్చుని మేం ఆడుకునే ఆట, రోడ్డు మీద వచ్చే పోయే బళ్ళని లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అటు వెళ్ళేవి నీవి, ఇటు వచ్చేవి నావి అని "చూడు నా లారీ ఎంత బావుందో... రేయ్ నీకు కుక్కమూతి లారీ వస్తుంది" అని గోల గోల.

మా తాతయ్య, మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు. తెల్లటి రంగు, ఎప్పుడు తెల్లటి బట్టలు, పై పంచ, చేతిలో పొన్ను కర్ర. నా హీరో. అమ్మమ్మ లక్ష్మమ్మ. పెద్ద బొట్టు, ముక్కు పుడక, చెవులకి పెద్ద కమ్మలు, దేవుడంటే భక్తి, అమాయకత్వం. ఇంటికి వచ్చిన ఎవర్ని భోజనం పెట్టకుండా పంపని తత్త్వం. లచ్చుమ్మ మహాతల్లి రా అనిపించుకునేది. మా ఇంట్లో ఎప్పుడూ రెండు జతల ఎద్దులు ఉండేవి. వాటికోసం రంగు రంగుల చిక్కాలు, గంటలు, నల్ల తాళ్ళు, చెర్నాకోల లు ఉండేవి.

ఇంకా బాగా నచ్చేది పరవట పొలం అదే ఏటి కాడ చేను. ఆ చేను మా తాతయ్య కష్టం. చాలా కష్టపడి ఓ పదెకరాల ముక్క చేసాడు ఆయన. ఆ పొలం చుట్టూ తాటి కర్ర, వెదురు గూములు ఉండేవి. ఎప్పుడు వాటి నిండా కోతులు ఉండేవి, ఒకటి అరా కాదు గుంపులు గుంపులుగా. వాటిని తోలడానికి, భయపెట్టడానికి తాతయ్య దగ్గర వడిసేల ఉండేది. దాన్ని తిప్పుతుంటే అదో ఆశ్చర్యం. నేను కూడా ఓ చెయ్యి వేసే వాడిని, అది తిరిగి తిరిగి నాకే చుట్టుకునేది. ఏటి వడ్డున కూర్చుని చిన్న మావయ్య తో ముంజలు కొట్టించుకు తినడం ఓ మధురానుభూతి. ఇప్పటికి ఎండాకాలం నాకది గుర్తు చేస్తూ ఉంటుంది. తినడం అయ్యాక ఏటి లో స్నానాలు, చేపలు పట్టడం. కాళ్ళకి చెప్పుల్లేక పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టు నీడకి చేరడం.

కొంచెం ఊహ తెల్సాక, మా ఊరికి వచ్చేసాను. ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మా ఊరి నుంచి నడిచే వెళ్ళాలి. దాదాపు పది కిలోమీటర్లు. దాదాపు పదో తరగతి దాకా నడిచే వెళ్ళే వాళ్ళం. అలా వెళ్ళడం ఓ సాహస కార్యక్రమం. పొలాలన్నీ చవకలు, జామాయిల్ వేసి కారడవి లా ఉండేది. అందులో అడవి పందులు గుంపులు గుంపులు గా తిరుగుతుండేవి. ఓ సారి నాన్నతో ఎద్దుల బండి మీద వెళ్తుంటే, నాన్న తాటి చెట్టు మీద కూర్చున్న గ్రద్ద ని చూపించాడు. అదే మొదటి సారి నేను బయట గ్రద్ద ని చూడ్డం. పొలిమేర లో వెళ్తుంటే, ఏదైనా చచ్చిన బర్రేని పడేస్తే రాబందులు గుంపులు గుంపులు గా వచ్చి వాలేవి. ఎద్దుల బండి తాడు చేత్తో పట్టుకొని నేనే తోలుతున్నట్టు ఆనందపడేవాడిని. చెరువు మొదట్లో కి వెళ్లి పిలిస్తే పలికే చెలమయ్య తాత. ఊర్లో ఉండే మా అమ్మ స్నేహితురాళ్ళు, నాకు అత్తలు ఐన సుశీల అత్త, రాజ్యం అత్త,బుజ్జత్త... ఎప్పుడు వెళ్ళినా పలకరించే అనసూయమ్మ అమ్మమ్మ. ఇంకా బోలెడంత మంది చుట్టాలు.

ఆ ఊరికి ఉన్న మరో పెద్ద ఆకర్షణ చెరువు. కొన్ని వందల ఎకరాలు విస్తీర్ణంలో పరుచుకొని ఉంటుంది.ఎక్కువగా  మాగాణి పొలం ఉండడం వలన వరి చేలతో నిండి ఉండేది.

మా పెద్ద మావయ్య బాలయ్య అభిమాని, యధావిధిగా నేను కూడా. చిన్న మావయ్య చిరంజీవి అభిమాని, ఆ అభిమానంతోనే మా పిన్ని కొడుకు చిన్నోడికి చిరంజీవి అని పేరు పెట్టారు. మా మావయ్యల స్నేహితులు రాజుగారి శీను, పంతులు, పుల్లేక.

ఈ ఏడు అమ్మమ్మ చనిపోయింది, రెండవ సారి కాన్సర్ సోకి. ఏమో ఎందుకంటారో అమ్మమ్మ వాళ్ళ ఊరు అని, అమ్మమ్మ లేనప్పుడు ఏముంటుంది.

0 comments:

Post a Comment