విభజన

by 10:08 AM 0 comments
విభజన దిశగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సహజంగానే సీమాంధ్ర ప్రజలనుంచి తీవ్రమైన వ్యతిరేకత వినిపించింది. ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నా అసలేం పట్టనట్టు ఉన్న కేంద్రం, రాజకీయనాయకుల ను చూసి తమ గోడు ను ఎవరికీ చెప్పుకోవాలో తెలీక సతమతమైపోయారు. అయినా సరే విభజన జరగదు అని ఘంటాపథం గా చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు అదేదో కొత్త విషయం అన్నట్టు, అసలిప్పుడే విన్నట్టు అవాక్కయ్యారు, తమ శక్తి వంచన లేకుండా ఈ విషయాన్నీ తీవ్రంగా ఖండించారు. మేం అలిగాం, ఆశ్చర్యపోయాం, బాధపడ్డాం, ఇది రాజ్యాంగ విరుద్ధం అని మైకులు విరగ్గోట్టేసారు. అదేమైనా కొత్త విషయమా? ప్రతి కాంగ్రెస్ నాయకుడికి తెలిసిన విషయం.

కాంగ్రెస్ ముందుగా విభజనకి అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా, ముందుగా ప్రాంతీయ పార్టీల  అభిప్రాయం అడిగారు. వారి వారి రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అందరు "మీ ఇష్టం " అనేసారు. అలా అనని వాళ్ళ మీద తెరాస పార్టీ ని ఉసిగొలిపి ద్రోహులుగా చిత్రీకంచారు. ఇక్కడ ఎక్కడా, తెరాస పార్టీ కాంగ్రెస్ ని నిందించలేదు, TDP ని తప్ప. యధావిదిగానే అందరు సరే అన్నారు, మేం నిర్ణయం తీసుకుంటున్నాం అని కాంగ్రెస్ అనగానే మెజారిటీ ప్రజలైన సీమంద్రుల నుంచి వ్యతిరేకత మొదలైంది. పార్టీలు చెప్పింది విని నిర్ణయం తీసుకుంటారా?మాకేం కావాలో వినరా? మేం ఒప్పుకోం అంటూ అందరు రోడ్డు మీదకి వచ్చారు. కనీసం ఏంటి అని అడిగిన పాపాన ప్రభుత్వం కానీ, మే తరపున మేం మాట్లాడతాం అన్న రాజకీయనాయకుడు కానీ లేకుండా పోయాడు.

ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న అభద్రత కి సమాధానం ఎవరు చెప్తారు? సరే విభజించారు, కొత్త రాజధానికి ఏం చేస్తారు అని అడిగిన చంద్రబాబు మీద కాంగ్రెస్ వాళ్ళే నీకసలు మనసు లేదా? ప్రజల మనోభావాలను గౌరవించకపోయావు సరే, ఇటివంటప్పుడు ఇలా మాట్లాడతావా? అంటూ విరుచుకు పడ్డారు. ఇచ్చింది కాంగ్రెస్ అన్న మాట వాళ్ళకు అవసరం లేదు. ఇపుడేం చేస్తారు? ఇంకా ప్రజలకి నిజాలు తెలియకుండా ఎన్ని రోజులు మభ్యపెడుతూ ఉంటారు?

ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా TDP దారుణంగా విఫలం ఐంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఏంటి ఇవ్వాలా? అని అడిగిన కాంగ్రెస్ ని వదిలేసి తెలుగుదేశం లెటర్ ఇస్తేనే విభజన జరుగుతుంది అని అటు టి కాంగ్రెస్, తెరాస TDP మీద మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. ఎటు తేల్చుకోలేక, బలంగా నిలబడలేక విభజనకి అనుకూలంగా లెటర్ ఇచ్చింది. అక్కడే సగం చచ్చిపోయింది.

ఇక YSRCP పార్టీ కి సిద్ధాంతం అంటూ లేకుండా ప్రయాణం మొదలు పెట్టి, ఎన్నోఅవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సందర్భానికి తగ్గట్టు నిర్ణయాలు మార్చుకుంటూ వచ్చింది. ఆ పార్టీ కూడా TDP నే తప్పు పట్టింది. విభజనకి ముందు లెటర్ ఇవ్వలేదని, తరువాత TDP లెటర్ ఇవ్వడం వలనే విభజన జరిగిందని విరుచుకుపడింది. ఒక్కసారైనా కాంగ్రెస్ ని కానీ తెరాస ని కానీ పల్లెత్తు మాట అనే సాహసం చేయలేకపోయింది.ఇదంతా చూస్తుంటే TDP పతనానికి అందరు కల్సి తీసుకున్న నిర్ణయం లా కనిపిస్తుంది. దాన్ని అడ్డుకోవడం లో తెలుగుదేశం దారుణంగా విఫలమై, తమ ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంది.

ప్రస్తుతానికి ఇంకా నాటకాలు ఆపని సీమంధ్ర కాంగ్రెస్ నాయకులు(అందరు కాదు చాలా మంది ఉండవల్లి లాటి వాళ్లకి మినహాయింపు ఇవ్వచ్చు నా అభిప్రాయంలో) ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నారు.

ప్రజలకి ఏం చేయాలో తోచడం లేదు. ఇప్పటి దాకా ప్రశాంతం గా సాగిన ఆందోళన ఇక హింసాయుతంగా మారుతుందేమో అనిపిస్తుంది. హింస చేయాలంటే ఎవరిని హింసించాలి? ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి  ఒక్కరూ అందులో భాగస్వాములే. ఎవరి మీద పోరాటం చేయాలి? తాము ఎన్నుకున్న నాయకులు పార్టీలకి కట్టుబడి వారి వారి రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నారు. చేయాల్సింది ఇప్పుడున్న రాజకీయ నాయకుడు అనే వాడిని ఎన్నుకోకపోవడం. ప్రజల చేతిలో ఉన్నది ఓటు, దానితో ఏం చేయాలి? ఎవడిని ఉంచాలో, ఓడించాలో,నిలబెట్టాలో నిర్ణయించుకోగల అధికారం ప్రజల చేతిలో ఉంది. కులం,మతం,డబ్బు,మన, తన ఈ ఒక్కసారికి పక్కన పెట్టండి. సుప్రీం కోర్ట్ ఈ మధ్య తీసుకున్న నిర్ణయం ప్రకారం మనకు ఎన్నికల్లో నిలబడ్డ ఎ ఒక్కరూ నచ్చకపోయినా అందరినీ నిర్మోహమాటంగా తిరస్కరించవచ్చు.

విభజన జరిగింది. దానిలో మార్పు లేదు. దాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. ఈ మాట చాల మందిని బాధ పెట్టొచ్చు.

ఆంధ్రప్రదేశ్ కి ఉన్న బలం పల్లెటూర్లు. ఒక స్నేహితుడు చెప్పినట్టు, ప్రతి ఊరు ఓ స్వయంప్రతిపత్తి కలిగి ఉండేది. వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి. తను అన్న మాటలని ఇక్కడ యధావిధిగా ఉంచుతున్నా"ఇప్పటికయినా తెలివి తెచ్చుకుని పరిశ్రమల కోసం పరిగెట్టడం, రియల్ ఎస్టేట్ మోజు వదిలించుకుంటే మంచిది. స్వయం ప్రతిపత్తిగల గ్రామాల రూపకల్పన వైపు అడుగేస్తే మంచిది. ప్యాకేజిలు మోసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్ని కలుషితం చెయ్యకండి బాబూ.

అన్నపూర్ణ అన్న పేరు తిరిగి సంపాదించుకోవటమే మేలు. ఏనాడో మనం గొయ్యితీసి పాతి పెట్టేసిన రైతుల అవశేషలున్నాయేమో వెతకండి. దొరికితే పల్లకీలకెత్తి సగౌరవంగా మోసుకురండి. గతమెంతో ఘనకీర్తి కలిగిన పల్లెలు మనవి. బాహ్యప్రపంచం మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనుగడ సాగించిన ఇండిపెండెంట్ యూనిట్స్ మన పల్లెలు. వాటిని చంపేసి పట్టణాలకొచ్చి మనం సాధించింది ఏమిటి? ఒక్క పట్టణం లేకుంటే బ్రతుకే అంధకారమయ్యే స్థితి." ఎంతో యదార్ధం.కాటికి కాళ్ళు చాచి ఉన్న పల్లెటూర్లని బతికిద్దాం. వ్యవసాయాన్ని బతికిద్దాం. చెరువులను తవ్వుకుందాం. నీటి నిల్వలు పెంచుకుందాం. మళ్ళీ కళ కళ లాడేలా చెయ్యడం మన చేతిలోనే ఉంది. ఎన్ని అనుకున్నా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఉంటాయి. ఎవరికీ లేనంత సముద్ర తీరం ఉన్న రాష్ట్రం మనది. బకింగ్హాం కెనాల్ ని మళ్ళీ పునరిద్ధరించవచ్చు. ఓడరేవుల అభివృద్ధి, సహజ నిక్షేపాల వెలికితీత, వ్యవసాయం,పర్యాటకం,విద్య అన్ని రంగాల్లో తమకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సిన సమయం. నిజమే మన దగ్గర ఏం లేదు. సాధించుకుందాం, దానిలో ఈ రాజకీయ నాయకులకి మాత్రం చోటు ఉండకూడదు. మాకేం కావాలో నిర్ణయించేది మేమే అని చెప్పడానికి, మన గొంతు వినిపించడానికి మన వాళ్ళంటూ ఉండాలి. వజ్రం తయారు కావాలంటే కోత తప్పదు. ఓ ఆకారం రావడానికి ఎన్నో ముక్కలు పోవాల్సిందే. అప్పుడే అది వజ్రం అవుతుంది.  

0 comments:

Post a Comment