రావయ్య పంతులు

by 1:37 PM 0 comments
మా ఇంటి ముందు గుడిసెల బడిలో చదివేటప్పుడు, నాలుగో ఐదో గుర్తు లేదు కానీ. బడి ఐపోయాక(4 కే అయిపోద్ది గా ) ఊరికే ఉంచడం ఎందుకు రావయ్యపంతులు కాడికి పంపు పిల్లలని అని ఎవరో చెప్పారు మా నాన్నకి.

ఓ రోజు నన్ను,బుజ్జి ని తాయారు చేయించి పంతులు గారింటికి తీసుకెళ్ళాడు.పంతులుగారిల్లు బాగా పాతది. బయటనే కుడిపక్క చుట్టూ గోడ కట్టిన ఖాళీ స్థలం. కూరగాయల మడులు, వంట చేసుకోవడానికి కావాల్సిన కర్రలు అన్నీ అక్కడే ఉంచేవాళ్ళు. అందులో ఓ చెక్క కుర్చీ. మా తో పాటు అనవయ్య, శీనిగాడు ఇంకోరెవరో చేరారు. ఆయన మనవరాలు విజయలక్ష్మి తో కలిపి ఆరుగురం అయ్యాం. విజయలక్ష్మి మా క్లాసే.

రావయ్యపంతులు గారికి బాగా వయసైపోయింది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళంతా బాగా పైకి వచ్చారని చెప్పేవాడు మా నాన్న. నడుం వంగిపోయి,వంటి మీద చొక్కా లేకుండా, బక్క పలచని శరీరంతో, ఇంతలావు అద్దాలు పెట్టుకొని ఉండేవారు. కోపం బాగా ఎక్కువ. ఆ ఇంట్లో ఆయన, వాళ్ళ ఆవిడ, వాళ్ళ మనవరాలు ఉండేవాళ్ళు.వాళ్ళ పిల్లలంతా ఎక్కడో స్థిరపడ్డారు.

మేము సాయంత్రం పూట వెళ్ళే వాళ్ళం, అంటే 6.30 ఆ ప్రాంతంలో. మాతో పాటు కింద వేసుకు కూర్చోడానికి గోతం పట్ట, కరెంటు పోతే ఓ లాంతరు. ముందు కిరసనాయిలు బుడ్లు తీసుకెళ్ళే వాళ్ళం. ఓ రోజు మా నాన్న లాంతరు కొనిచ్చాడు. అదో ఆనందం. దానికి చిమ్ని, దాన్ని తుడవడం. వత్తులు వెయ్యడం. చిమ్ని పగిలితే మా వీపులు అమ్మకి అప్పగించడం. అబ్భ ఆ అనుభూతే వేరు.

అక్కడకి వెళ్తే బడిలో చెప్పిందే చదువుకోవాలి. హోంవర్క్ ఉంటె చేసుకోవాలి. ఇక అంతా లోకాభిరామాయణమే. మాకు భారతం, రామాయణం లాటి కథలు, పంచతంత్రం కథలు, ఇంకా పొడుపు కథలు చెప్పేవారు.ఆయన సాయంత్రం పూట తపస్సు (మేం పెట్టిన పేరు) చేసుకునేవారు. కుర్చీలో కూర్చుని,చేతిలో తులసి మాల తిప్పుతూ కళ్ళు మూసుకొని ఉండేవాళ్ళు.మేం అప్పుడు గమ్మున ఉండే వాళ్ళం.

చదివేప్పుడు దగ్గర ఉంటె గట్టిగా మొట్టేవాడు. బాగా నొప్పి పుట్టేది.అప్పుడప్పుడు కొట్టే వాడు కూడా. మహా కోపిష్టి అని చెప్పా కదా, తెగ తిట్టేవాడు. ఆయనకి ముక్కుపొడి(నశిం ) పీల్చే అలవాటు ఉండేది. నాకేమో చిరాగ్గా ఉండేది.
తుమ్మితే మీద పడేది. దూరంగా కూర్చునే వాడిని. ఆయన అలా వచ్చి "ఏం చేస్తున్నారు" అని వెళ్ళేవాడు. ఆయన వెళ్ళగానే మళ్ళీ కబుర్లు. కరెంటు ఎప్పుడు పోద్దా అని చూసేవాళ్ళం, దీపాలు ముట్టించడానికి.

చిత్రలహరి పిచ్చి ఎక్కి, శుక్రవారం కోసం వారమంతా ఎదురు చూసే రోజుల్లో... వాళ్ళ మనవరాలి (విజయలక్ష్మి)ని మాత్రమే చిత్రలహరి చూడటానికి పంపేవాడు. మేమంతా నోటికాడ కూడు లాక్కున్న ఖైదీల్లా కిక్కురుమనకుండా లోలోపలే రగిలిపోయేవాళ్ళం. ఆ కోపంతో శీనిగాడు ఆయన చాల ముక్కుపొడి డబ్బాలు గోడవతల విసిరేశాడు, ఓ వెండి భరిణతో సహా. పంతులుగారు బాగా తలచుకున్నారు ఆ భరిణ ని. ఓ రోజు ఉదయం ఏదో ఐంది. మా బుజ్జి ని కొట్టాడు ఆయన.దీనికి కోపం వచ్చి ఆయన వెళ్ళగానే, ఆయన కళ్ళద్దాలు తీసి గోడవతల విసిరేసింది.నాకు ఒకటే వణుకు. ఆయన వచ్చి మమ్మల్ని ఏమి అడగకుండా వెతికి వెళ్ళిపోయాడు. విజయలక్ష్మి వచ్చి మా తాత అద్దాలు కనిపించాయా అంటే టామ్ అండ్ జెర్రీ లా అడ్డంగా తల ఊపాం. ట్యుషన్ అయిపోయి వెళ్ళబోయే ముందు అందరిని పిలిచి చెప్పాడు"నేను సాయంత్రం తపస్సు/ధ్యానం లో కూర్చుంటా, ఎవరు తీశారో తెల్సిపోద్ది." అని.మా బుజ్జి ఖంగారు పడింది. "రేయ్ అన్నాయ్ ఏం చేద్దాం?". "సాయంత్రం నేను వెతికి పెడతాలే" అని చెప్పా. ఇంటికి వెళ్లాం కానీ, వామ్మో తప్పస్సు లో ఆయనకి మా మొహాలు ఎలా కనిపిస్తాయో అని ఒకటే వణుకు.

అందరికన్నా ముందు వెళ్లి కూర్చున్నాం.కోపంలో బలంగా విసిరేసింది, అదెక్కడ పడిందో. సరే అని గోడ దూకా. అంతా వెతికితే తడికె మొగదాల కనపడింది. ప్రాణం లేచి వచ్చింది. ఏం పగలలేదు, గట్టిదే. అసలేం జరగనట్టు, తెచ్చి ఆ కర్రల మోపులో పెట్టి,విజయలక్ష్మికి  హింట్ ఇచ్చా. వచ్చి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చింది. చిన్నప్పుడు కోపమే కానీ, ఇప్పుడు తలచుకుంటే బాధ గా ఉంటుంది. చాలా కష్టంగా గడిచేది వాళ్ళ ఇంట్లో. ఆయన ట్యూషన్ డబ్బులకోసం ఆ వయసులో అందరి ఇళ్ళకీ వెళ్ళే వారు. నేను 10వ తరగతి లో ఉండగా ఆయన చనిపోయాడు. ఆ ఇల్లు పాడుబడిపోయింది. ఇంటర్ లో ఉండగా బస్సు లో విజయలక్ష్మి కనిపించింది. చూసి నవ్వుకున్నాం.

ఈ మధ్యనే ఆ ఇల్లు పడగొట్టి ఎవరో కొత్త ఇల్లు కట్టుకున్నారు. మేము గుడికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి మీదుగానే వెళ్ళాలి. నా చూపు ఆ ప్రదేశాన్ని తడుముతూ ఉంటుంది. బోసి నోరుతో మా రావయ్యపంతులు గారు అక్కడే కూర్చుని ఉంటారు. నాలో ఏదో మూల, మన విలువ లకు మూలమైన దీపాన్ని వెలిగించింది మాత్రం ఆయనే......







0 comments:

Post a Comment