కొలనుకోట రహస్యం 3 వ భాగం

by 2:50 PM 0 comments

వంశీ చనిపోక ముందు 3 వారాల పాటు ఆ ముసలివాడి ఆత్మ వంశీ ని వేడుకుంటూ హింసించింది. ఆఫీస్ లో తన ప్రవర్తన వలన జాబ్ లోంచి తీసేశారు. మానసిక వైద్యుల చుట్టూ, తాంత్రికుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వంశీ ఏదైతే అది అవుతుందని ఇంతకు ముందు ఆ ఊరు చూసిన చోటికి బయల్దేరడానికి నిశ్చయించుకుని వచ్చేసాడు. ఇది తెలిసిన సుబ్బు వాళ్ళ చిన్నమ్మమ్మ కి ఫోన్ చేసాడు. వంశీ ని పెంచింది ఆవిడే. జరిగిందంతా విన్న తరువాత, ఆవిడ చెప్పిన మాటలు ఇవి. వాళ్ళ నాన్న కూడా ఇలానే చనిపోయాడని, ఇది తెల్సిన వాళ్ళమ్మ చనిపోయింది. వీళ్ళ కుటుంబం ఎన్నో సంవత్సరాల క్రింద ఎక్కడ నుంచో వచ్చి అక్కడ స్థిరపడి పోయారు.
వంశీ కనపడకుండా పోయిన వారం రోజుల తరువాత విషయం తెల్సి సుబ్బు కి ఫోన్ చేసింది మృదుల ."సుబ్బు, నీకో మాట చెప్పాలి. అసలు వంశీ కనపడకుండా పోవడానికి కారణం నేనే?" అని ఆగిపోయింది. "ఏమంటున్నావ్ నువ్వు?". "వంశీ ని గేటెడ్ కమ్యూనిటీ అని తీసుకు వెళ్ళా కదా, అక్కడ అలాంటిదేమీ లేదు." అవతల నుంచి నిశ్శబ్దం. "ఒక వారం పాటు ఒక ఆత్మ నన్ను హింసించింది. వంశీ ని అక్కడ తీసుకురాకపోతే, మా ఆయన్ని చంపేస్తానని భయపెట్టింది. ఒక ఆక్సిడెంట్ కూడా అయింది. అదృష్టం ఏంటంటే ఆయన చిన్న దెబ్బలతో బయటపడ్డాడు.", "స్వార్ధం చూసుకున్నావా మృదుల?". "అది కాదు సుబ్బు". "మాట్లాడద్దు నువ్వు. ఒక్క మాట చెప్పి ఉంటే, ఏదోలా ప్రయత్నం చేసి ఉండే వాళ్ళం. తల్లి తండ్రి లేనోడు వాడు. మనమే కుటుంబం అనుకున్నాడు. అలాటిది మన వల్లే......" సారీ చెప్పే లోగానే ఫోన్ కట్ ఐంది.
బొబ్బిలి స్టేషన్ లో కేసు పెట్టారు సుబ్బు వాళ్ళు. హైదరాబాద్ లో మిస్ అయితే ఇక్కడ కేసు ఏంటని పట్టించుకోలేదు వాళ్ళు.
వంశీ ఏమైపోయాడో ఎవరికీ తెలీదు.
అది 1947 వ సంవత్సరం జూలై నెల. కొలనుకోట గ్రామం లోని కొందరు పెద్ద కుటుంబంలోని వారు బొబ్బిలి కోటలో ఆంగ్లేయులతో సమావేశం అయ్యారు.
ఆ ఆంగ్లేయుల అనువాదకుడు వాళ్ళకి వివరించసాగాడు. "మీ గ్రామంలో ఉన్న వైధ్యనాదుని ఆలయంలో ఉన్న ఆ పుస్తకం మాకు కావాలి. మీ వాళ్ళని నాయనా భయానా అడిగి చూసాం. కానీ వారు ఇవ్వడానికి సుముఖంగా లేరు. మీరు మాకు తెల్సు కాబట్టి ముందుగా ఒక మాట చెప్పాలని పిలిపించాం. ఆ పుస్తకాన్ని బలవంతంగా అయినా మేము తీసుకు వెళ్తాం. కాదని ఎదిరిస్తే ప్రాణం తీయడానికి వెనుకాడం. అది మీ దగ్గర ఉండడం కన్నా మా దగ్గర ఉండడం మంచిది. మీరు మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే ఆ ఊరు వదిలి వెళ్ళండి. ఈ విషయం మీ ఊరి వాళ్ళకి చెప్పి వెళ్ళినా సరే చెప్పకుండా వెళ్ళినా సరే, మీ ఇష్టం. ఇక మీరు వెళ్ళచ్చు." అని ముగించారు.

అలా ప్రాణాలకి భయపడి విషయాన్ని దాచి ఒక కుటుంబం ఆ ఊరిని వదిలి  వెళ్ళింది. అసలు విషయం తెలీక ఆ ఊరంతా ఒక రాత్రి ఆంగ్లేయుల నరమేధానికి బలైంది. ఆ రాత్రే బ్రిటీషు వాళ్ళు స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. దేశమంతా సంబరాల్లో ఉంటే ఆ ఊరు లో మాత్రం ఒక్కరు  కూడా బ్రతకలేదు. చంపిన అందరిని ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక లోతైన నేలబావిలో వేసి కాల్చేశారు. ఆ గుడిని,ఊరిని కూడా ధ్వంసం చేసారు. ఆ ఊరి గురించి జనం ఆలోచించడానికి చాల రోజులు పట్టింది.
అప్పటికి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయిందా ఊరు.
అలా నమ్మకద్రోహానికి గురి అయ్యామన్న బాధలో ఆ చనిపోయిన వారంతా ఆత్మలై అక్కడే ఉండిపోయారు.ఆ ఊరి నుంచి వెళ్ళిన కుటుంబలో ప్రతి ఒక్కరిని ఇలానే ఆ ఊరికి తీసుకు వచ్చి చంపేశారు. అందులో మిగిలిన చివరి వాడు వంశీ.

ఆ పుస్తకం మాత్రం లండన్ మ్యుజియం లో బధ్రపరచబడివున్నది.


                                                                             (సమాప్తం)

0 comments:

Post a Comment