కొలనుకోట రహస్యం 2 వ భాగం

by 10:47 PM 0 comments
వంశీ భయం తో బిగుసుకుపోయాడు.
వంశీ అంటూ అరుస్తుంది మృదుల. వంశీ రెప్ప వేసి తెరిచే లోగా ఆ ముసలివాడు గుట్ట మీద కనపడలేదు. తల పట్టుకుని నొక్కుకుంటున్నాడు. "జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |జయ కపీశ తిహు లోక ఉజాగర" అంటూ వంశీ ఫోన్ మోగింది. ఒక్క క్షణం లో అంతా సర్దుకుంది. ఇక్కడ ఉండటం అంత మంచిది కాదని అర్ధం ఐంది వంశీ కి. వెంటనే గేర్ మార్చి కార్ ని పరిగెత్తించాడు. ఓ అర గంట తరువాత దూరంగా లైట్లు కనపడ్డాయ్. హైవే వచ్చేసింది. ఎలాగోలా బయటపడి ఎప్పటికో ఇల్లు చేరారు.
స్నేహితులంతా తమ కోసం ఎదురుచూస్తున్నారు. ఏమైందంటూ చుట్టూ మూగి ప్రశ్నల వర్షం కురింపించారు. మృదుల మాత్రం వంశీ ని అనుమానంగా చూస్తూ లోపలి వెళ్ళింది.
వంశీ కి మాత్రం దడ తగ్గలేదు. వచ్చి గమ్మున కూర్చున్నాడు. అందరూ అడుగుతున్నా ఏం సమాధానం చెప్పలేదు.
రాత్రంతా నిద్ర లేదు,ఒకటే జ్వరం.ఎవరితోనూ మాట్లాడనూ లేదు. అంతా కల లా ఉంది. ఉదయాన్నే మృదుల చెప్పకుండా నే వైజాగ్ వెళ్ళిపోయింది.అందరూ కల్సి హైదరాబాద్ బయల్దేరారు.వంశీ కార్ లో వెనక ఒక మూల కూర్చుని మౌనంగా ఉన్నాడు. ఎవరూ ఏంటని అడగలేదు. చీకటి పడుతుందనగా, వంశీకి జ్వరం పెరిగింది. నిద్రలో పలవరించసాగాడు. అప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వంశీ తో పాటు పెళ్ళికి వచ్చిన వంశీ రూమ్మేట్ సుబ్బు తనని తీసుకెళ్ళి ఫ్లాట్ లో పడుకోబెట్టి తినడానికి ఏమైనా తెద్దామని బయటకి వెళ్ళాడు.
మగత నిద్రలో ఉన్న వంశీకి ఎవరిదో ఏడుపు వినిపించింది.మలేసియన్ టౌన్షిప్ లో పదకొండో అంతస్తు లో ఉండే తనకి ఎవరు ఏడుస్తున్నారో అర్ధం కాలేదు. చుట్టు పక్కల ఫ్లాట్స్ కూడా ఖాళీగా ఉన్నాయ్. భయం గుండెను పరిగెత్తించ సాగింది.కళ్ళు తెరవడానికి ధైర్యం చాల్లేదు. దూరంగా వినిపించే హారన్ సౌండ్స్ లో కూడా ఆ ఏడుపు భయంకరంగా ఉంది.కళ్ళు తెరిచే ధైర్యం లేదు, అలా అని కళ్ళు మూసుకొని ఉండలేడు.మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే గుండె ఆగిన పని ఐంది. మంచం పక్కనే కాళ్ళ దగ్గర కూర్చుని తననే చూస్తూ ఉన్న ముసలాడు. కానీ ఏడుపు మాత్రం వాడిది కాదు. బిక్క చచ్చిపోయాడు వంశీ. ఇంతలో కిర్రుమంటూ వచ్చిన తలుపు శబ్దం ఆ ఏడుపు ని ఆపేసింది, ముసలాడు కూడా కనపడకుండా పోయాడు. సుబ్బు వచ్చి లైట్ వేసాడు. వంశీ పరిస్థితి చూసి భయపడిపోయాడు. "ఏంటి మామా ఇది?" అని లేపి "ఇక్కడొద్దు పద క్రిష్ణ గాడి ఫ్లాట్ కి పోదాం" అంటూ లాక్కుపోయాడు.  క్రిష్ణ ఫ్లాట్ కి వెళ్ళాక కూర్చోబెట్టి ఏమైందని అడిగారు. జరిగిందంతా వివరంగా చెప్పాడు వంశీ. సుబ్బు నవ్వాడు "మామా, దీనికే ఇలా అయితే ఎలా? అక్కడితో ఐపోయింది కదా. వదిలేయ్". "లేదురా నాకా ముసలోడు మళ్ళీ కన్పించాడు మన ఫ్లాట్ లో" అన్న మాట విని ఉలిక్కిపడ్డాడు సుబ్బు. సుబ్బు స్వతహాగా భయస్తుడు. అంతో ఇంతో వంశీ నే ధైర్యవంతుడు వీళ్ళలో.
అందరూ కూర్చుని ఉన్నారు. వంశీ మాత్రం "నాకు తల పగిలిపోతుంది రా నేను పడుకుంటాను" అని ఒక బెడ్ రూమ్ కి వెళ్లి పోయాడు. పడుకున్నాడే కాని, చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నారు . అందులో వైద్యనాదుడు, కొలనుకోట,నాశనం ఇంకా ఏవో పిచ్చి అరుపులు వినిపించాయి. ఇక ఏం చేయలేక ఒక నిద్ర మాత్ర వేసుకొని పడుకున్నాడు. ఎప్పటికో మెలకువ వచ్చింది. క్రిష్ణ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. సుబ్బు మాత్రం ఆఫీస్ కి సెలవు పెట్టి ఉన్నాడు. "మామా, చూడరా కళ్ళు ఎలా గుంటలు పడ్డాయో. అసలది దెయ్యమో, ఆత్మో. వీటిని సినిమాల్లో చూడ్డం తప్ప బయట పెద్దగా పరిచయం లేదు. నువ్వేమో రెండు రోజులకే ఇలా ఐపోయావ్. ఎవర్ని అడగాలి రా? లేకపోతే ఎవర్నైనా బూత వైద్యుడిని పిలుద్దామా? ఇలా కాదు కానీ ముందు ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం పద" అంటూ ఫ్రెష్ అయి దగ్గరలో ఉన్న గుడికి తీసుకు వెళ్ళాడు. పూజ చేయించుకొని బయటకి వచ్చి కూర్చున్నారు. ఇప్పటికీ సుబ్బు కి నమ్మకం కలగలేదు అని తెలుస్తూనే ఉంది అలా అని తనని నమ్మించడానికి వంశీ ఎలాంటి ప్రయత్నము చేయడం లేదు. ఇంతలో ఒక పెద్దాయన దర్శనం చేసుకొని వచ్చి వీళ్ళ పక్కనే కూర్చున్నాడు, చూడ్డానికి పల్లెటూరి కి చెందినవాడిలా కనిపించాడు."గుడికి వచ్చినా కూడా ప్రశాంతత లేకుండా పోయిందయ్యా. ఈ గోల ఏంటో" అని తనలో తానూ అనుకున్నట్టు గా వంశీ వైపు చూసి "ఏమైంది బాబు అలా ఉన్నావు?" అని అడిగాడు. వంశీ నుంచి సమాధానం రాకపోయేసరికి సుబ్బు వైపు తిరిగాడు. చెప్పడం ఇష్టం లేకపోయినా, ఏదైనా సలహా వస్తుందేమో అని "మా వాడికి దెయ్యాలు కనిపిస్తున్నాయండి. చీకటిపడితే ఒకటే అరుపులు, ఏడుపులు. అందుకే ఇలా ఐపోయాడు." అని చెప్పాడు. " అవునా, అంతేనయ్యా వాటి కోరికలు తీరిందాక, తీర్చిందాక అవి వదలవు. మా మేనత్త వాళ్ళ ఆయన అక్క కి కూడా ఇలానే అయితే, ఆంత్రం వేసి ఎం కావాలని అడిగి ఆ కోరికేందో తెల్సుకొని తీర్చిందాక వదలలేదు ఆయన్ని." అన్న మాట విని తలెత్తి చూసాడు వంశీ. "నిజంగానే ఉంటాయా దెయ్యాలు" అని అడిగాడు. "అదే కదా చెప్తుంది. వాటి కోరిక తీర్చిందాక, నీ పరిస్థితి ఇంతే. గుడికెళ్ళి తాయత్తులు కట్టించుకున్నా కొన్ని రోజులు మాత్రమే పని చేస్తాయి" అని తన ధోరణి లో తాను చెప్పుకుపోతున్నాడు. ఇంకా అక్కడ ఉండలేక ఫ్లాట్ కి వచ్చేసారు.
సుబ్బు ని కూర్చుబెట్టి వివరంగా చెప్పసాగాడు వంశీ."ఆ ఊర్లో నేను ఈ ముసలోడితో పాటు చూసిన వాళ్ళంతా ఆ ఊరి వాళ్ళే అయి ఉంటారు. అక్కడేదో జరుగుతుంది. నన్ను అక్కడ చూసినప్పటి నుంచీ ఆ ముసలోడు నా వెనకనే పడ్డాడు. వాడికి నా సాయం కావాలేమో అనిపిస్తుంది. నాకర్ధం కానీ విషయం ఏంటంటే నన్నే ఎందుకు అని?" అని ఆగిపోయాడు. సుబ్బు కి ఈ మధ్యకాలం లో రిలీజ్ ఐన అన్ని హారర్ తెలుగు సినిమాలు తలలో తిరుగుతున్నాయ్. ఇంతలో విష్ణు ఫోన్ మోగింది.
సుబ్బు ఫోన్ ఎత్తి "ఆ చెప్పరా, అవునా? ఎప్పుడు రేపా? సరే. రేయ్ విషయమంతా చెప్పావా. సరే మామా పొద్దున్నే ఫ్లాట్ కి వస్తాం" అంటూ ముగించాడు. "విష్ణు గాడు రా, వాడికి తాత వరసయ్యే ఒకాయన వస్తున్నాడంట రేపు. ఆయనకి ఈ విషయాల గురించి కొంచెం ఐడియా ఉందంట. రేపు పొద్దున్నే రమ్మన్నాడు కొంచెం స్నానం అది చేసి". వంశీ వింటున్నాడే కానీ చీకటి పడుతుందంటేనే భయం వేస్తుంది. ఆ ఏడుపులు వినడానికి భయంకరంగా ఉన్నాయి.
అక్కడ ఉండలేక ఒక సినిమా చూసి , బయట తిరిగి తిని చీకటిపడుతుందనగా ఫ్లాట్ కి వచ్చారు. వస్తూనే స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చుకున్నాడు వంశీ. రావడంతోనే స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని పడుకుండి పోయాడు. పొద్దున్నే లేచేసరికి సుబ్బు ఆంజనేయ స్వామి ఫోటో పక్కన పెట్టుకొని ఫ్లోర్ మీద పడుకొని ఉన్నాడు. గదంతా చిందరవందరగా ఉంది. తలంతా బరువుగా ఉంది.
"రేయ్ సుబ్బుగా, రేయ్" అని గట్టిగా అరిచాడు. అదిరిపడి లేచాడు సుబ్బు. వాడి ముఖం చూసి ఆగిపోయాడు వంశీ. "నీ యబ్బ, ఇంకో టాబ్లెట్ తెస్తే నీ సొమ్మేం పోయిందిరా. రాత్రి ఆ ముసలోడు నా ప్రాణం తీసాడు రా నిన్ను లేపమని. కనపడడు. ఒకటే గోల. వస్తువులన్నీ ఎగిరిపడ్డాయ్. నా దరిద్రానికి కరెంటు లేదు. నా వల్ల కాదు ఇంకా. ముందు విష్ణు గాడి ఫ్లాట్ కి పోదాం పద" అని రెండు జతల బట్టలు బాగ్ లో వేసుకొని లాక్కెళ్ళాడు.  
వీళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అయ్యే సరికి 75 ఉంటాయేమో ఒక పెద్దాయనని తీసుకువచ్చాడు విష్ణు. ఆరడుగుల పొడుగు, బక్క పలచగా ఉన్న ఆకారం. చాలా మాములుగా ఉన్నాడాయన. కాఫీ టిఫిన్ లు కానిచ్చి విషయం అందరూ కూర్చుని విషయం మళ్ళీ ఒక్క సరి చెప్పారాయనకి. అంతా విన్న తరువాత, ఆయన తన బాగ్ లోంచి ఒక పుస్తకం తీసి చెప్పడం మొదలు పెట్టాడు. " నీ విషయం విన్న తరువాత నాకు తెల్సిన కొన్ని విషయాలను కలిపి లైబ్రరీ లో ఉన్న పుస్తకాల ద్వారా నాకు ఒక ఒక కొత్త విషయం తెల్సింది. నువ్వు చెప్పిన ప్రదేశం దగ్గర లో స్వాతంత్ర్యం రాక ముందు "కొలనుకోట" అని ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి ముఖ్యమైన ఆకర్షణ ఆ ఊరి వైధ్యనాదుని గుడి. అది ఎప్పుడు ఎవరు కట్టించారో తెలీదు కానీ చాలా పాతది.
ఆ గుడి ఆలయ అర్చకుని దగ్గర వంశ పారంపర్యంగా వస్తున్న ఒక గ్రంధం ఉండేది. అందులో ఏమి ఉందొ ఎవరికీ తెలీదు కానీ, అక్కడకి ఏ జబ్బుతో వచ్చే వాళ్ళనైనా ఇట్టే నయం చేసి పంపే వాళ్ళు. ఆ గుడికి అందరు రాజులూ, జమిందారు లు తమకు తోచిన కానుకలు సమర్పించుకున్నారు. స్వాతంత్ర్యం రాకముందు వరకూ ఆ గుడి వైభోగం చెప్పనలవి కాదు." అని ఆపాడు. అసలు ఈ దెయ్యాలకీ ఈ కథ కీ సంబంధం ఏంటో తెలీక విసుగ్గా చూసాడు వంశీ. ఇదేమీ పట్టించుకోకుండా కొనసాగించాడు ఆ పెద్దాయన. " ఏమైందో తెలీదు కానీ స్వాతంత్ర్యం తరువాత గుడి కూలిపోయింది. పుస్తకం మాయమైపోయింది. ఆ తరువాత ఆ ఊరు ఏమైందో అందులో జనాలు ఏమయ్యారో ఎవరికీ తెలీదు. నీకు వినిపించిన కొలనుకోట , వైద్యనాదుడు అనే మాటల వెనక వినిపించిన కథ ఇది. ఒక లైబ్రేరియన్ గా పని చేసిన నాకు తెలిసిన విషయాలు ఇవి. ఇక ఆత్మల గురించి అయితే ఒక మాట చెప్తాను. దాని కన్నా ముందు నీకు ఊరితో ఏమైనా సంబంధం ఉన్నదా?" అంటూ వంశీ వైపు చూసాడు. "నాకేం తెలీదు, ఆ ఊరి పేరు వినడం కూడా ఇదే మొదటి సారి. నాకు వెనకా ముందు కూడా ఎవరూ లేరు" అని ఆగాడు.
హ్మ్ అంటూ నిట్టూర్చాడు ఆ పెద్దాయన.
"మరి ఇందులోంచి బయటపడే దారేది" అంటూ అడిగాడు సుబ్బు.
"నాకు తెల్సిన ఒక పూజారి ఉన్నాడు. ఆయన్ని ప్రయత్నించి చూడండి. మీ సమస్యకి కొంత వరకు పరిష్కారం దొరకచ్చు" అంటూ ఆ వివరాలు ఇచ్చి ఆయన పని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు.
హైదరాబాద్ లో ఉండే ఆ పూజారి దగ్గరకి వెళ్లి ఆయన పూజ చేసి ఇచ్చిన తాడు కట్టించుకొని ఫ్లాట్ కి వచ్చారు.ఎందుకైనా మంచిదని నిద్ర మాత్రలు వేసుకున్నారు ఇద్దరూ. ఆ రాత్రి సాఫీగా సాగింది.
వంశీ టీం లీడ్ కి ఫోన్ చేసి నైట్ షిఫ్ట్ చేస్తామని అడిగారు. రాత్రైతే జనాలు ఉంటారు సందడిగా ఉంటుంది కదా అని. ఆఫీస్ పని రాత్రి 3 ఇంటి దాక ఉంటుంది.
రాత్రి 1 గంట కి వాష్ రూమ్ కి వెళ్ళిన వంశీ కి వాష్ రూమ్ అద్దం పక్కన ఎవరో నిలబడి ఉన్నారు. పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు. వాళ్ళు మాత్రం కదలడం లేదు.  ఇంతలో ఏడుపు మొదలైంది. అదే ఏడుపు.తిరిగి చూస్తే ముసలాడు. గుండె ఆగినంత పనయింది. "రావా, కొలనుకోటకు రావా" అని ఏడుపులు, అరుపులు. ఎలా వచ్చిపడ్డాడో తెలీదు కేబిన్ కి.
తను అరిచిన అరుపులకి అందరూ పరిగెత్తుకువచ్చారు. ఏమైందని అడిగిన వాళ్ళని సుబ్బు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా, వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చాడు. "ఇస్ ఎవిరి థింగ్ ఆల్రైట్? ఏమైంది సుభాష్?" అని అడిగాడు. "లేదు సర్ వంశీ ఏదో చూసి భయపడ్డాడు" అని మాట మార్చాడు. "ఎంత భయపడితే మాత్రం అంతలా అరవాలా ? చూడు జిప్ కూడా పెట్టుకోకుండా వచ్చాడు. టేక్ కేర్. టీం, గో అండ్ డూ యువర్ వర్క్" అని వెళ్ళిపోయాడు. భయపడడం కన్నా అందరి ముందు అలా చేయడం సిగ్గనిపించింది వంశీ కి.
సరిగ్గా మూడు వారాల తరువాత అర్ధరాత్రి తను ఎక్కడైతే ఆ ముసలివాడిని చూసాడో ఆ ఊరికి దగ్గర లో ముసలి వాడి ఆత్మ వెనుకనే నిశ్సబ్దంగా నడుస్తున్నాడు వంశీ. దూరంగా పాడుబడిన గోపురం. 


ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందో ఏమో, బీప్ బీప్ మని కొట్టుకోసాగింది. పండు వెన్నెల.స్స్స్ మంటూ గాలి. దూరంగా కొలనుకోటలో ఏదో కోలాహలం. అంతా హడావిడిగా ఉంది. కొంత దూరం పోయాక ఆ ముసలివాడి ఆత్మ ఆగిపోయి కిందకి చూసింది. పాతాళానికి దారి చూపిస్తున్నట్టున్న పెద్ద నేల బావి.
"చెప్పు తాతా, ఎక్కడ ఉందా పుస్తకం? ఈ బావి లోనా?" అంటూ తొంగి చూసాడు. అప్పటి దాకా దైన్యంగా ఉన్న ముసలివాడి ముఖం వికృతంగా మారింది. వంశీ దగ్గరకి గాల్లో ఎగురుతూ వచ్చి బావిలోకి తోసేసాడు.అర్ధం అయ్యే లోపే వంశీ తల నేలని తాకింది. టప్ మన్న శబ్దం. మెడ ఎముక విరిగినట్టుంది. కానీ కొస ప్రాణం ఉంది. ఇంతలో ఫోన్ మోగింది.
ఎంతో కష్టం మీద ఫోన్ ఎత్తాడు వంశీ, ఫోన్ లో సుబ్బు"మామా, ఎక్కడున్నావురా? ఇప్పుడే నాకో విషయం తెల్సింది. మీ అమ్మమ్మ చెప్పింది. నువ్వు మాత్రం ఆ ముసలివాడి మాటలు విని అటు వెళ్ళద్దు రా. వాళ్ళు నిన్ను చంపేస్తారు. హలో హలో". ఫోన్ ఆఫ్ ఐంది. బావి పైనుంచి లీలగా మాటలు విన్పించాయి. "చచ్చాడా?" "ఆ చచ్చినట్టే. వీళ్ళ నాన్నకి పట్టిన గతే వీడికీ పట్టింది" అంటూ వికృతంగా అరుచుకుంటూ వెళ్ళిపోయాయి ఆ ఆత్మలన్నీ. అంతా నిశ్శబ్దం. ఆ మాట్లాడుకున్న వాళ్ళంతా ఆ రోజు తనకి కనిపించిన వాళ్ళే. తను ఎందుకు ఇలా చావాల్సి వచ్చింది? తన తండ్రికి ఉన్న సంబంధం ఏంటి? ఇలా ఆలోచిస్తుండగానే వంశీ ప్రాణం పోయింది.

(ఇంకా ఉంది)

0 comments:

Post a Comment