కొలనుకోట రహస్యం

by 4:04 PM 2 comments
హైదరాబాదు లో ఐటి కంపెనీ లో పని చేస్తున్నవంశీ కి పాత మితృడి పెళ్లి కోసం బొబ్బిలి వెళ్ళాల్సి వచ్చింది.
పెళ్లి లో క్లాస్మేట్స్ చాలా మంది కనిపించారు మృదుల కూడా. మృదుల మంచి స్నేహితురాలు, అమెరికా లో ఉంటుంది. ఇక్కడకి వచ్చి సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. బొబ్బిలి దగ్గర లో గంగాడ అనే ఊరి అవతల ఏదో గేటెడ్ కమ్యూనిటీ ఉంది చూద్దాం పద అంది. అలాగే పెళ్లి అయ్యాక మధ్యాన్నం బయల్దేరారు కార్ లో.  బొబ్బిలి దాటి పల్లెటూర్ల మధ్య నుంచి ప్రయాణం సాగింది. గంగాడ దాటాక మట్టి రోడ్డు.
“ఎలా వెళ్ళాలో తెలుసా” అని అడిగాడు.
“అదే చూస్తున్నా ”  అంటూ google మాప్స్ లోకి చూస్తుంది మృదుల. “ఈ రోడ్డునే పద” అంది.
తన ప్రమేయం లేకుండా తీసుకున్న ఆ మలుపు తన జీవితాన్ని మలుపు తిప్పబోతుందని తెలీదు వంశీ కి.
అప్పటికే సూర్యుడు సెలవు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దూరంగా ఓ ఊరు కనిపించింది.
“అదేంటి మళ్ళీ ఏదో ఊరు వచ్చింది? అసలు సరిగ్గా చూసావా?” విసుగ్గా అన్నాడు వంశీ.
“ఇక్కడే అన్నారు,కానీ ఈ ఊరేంటో ” అంటూ ఆగిపోయింది.
చిన్నగా ఊరు దగ్గర కాసాగింది. దగ్గరయ్యే కొద్దీ కొన్ని విషయాలు వంశీ నీ విస్తుపోయేలాచేసాయి. సాయంకాలం అయేసరికి గూటికి చేరే పిట్టల సవ్వడి ఎక్కడ వినపడలేదు, ఎక్కడో అరిచే గుడ్లగూబ శబ్దాలు తప్ప.
ఊరు దగ్గర కి వచ్చేసింది. అన్ని చిన్న ఇల్లు,ఎప్పటివో రాజుల కాలం నాటి కట్టడాల్లా ఉన్నాయి. ఊరి మధ్యలో ఒక ఒంటి స్తంభం లాంటి మేడ. ప్రతి అంతస్తు పైకప్పు చుట్టూ గంటలు కట్టి,చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి.
ఎక్కడో దూరంగా పాడుబడిపోయిన గుడి గాలిగోపురం కళాకాంతులు కోల్పోయి ఉంది.
ఇంతలో గంటల శబ్ధం వినపడి రోడ్డు వైపు చూసాడు వంశీ. రోడ్డు నిండా ఎద్దుల బళ్ళు వస్తూ కనిపించాయి. ఆ ఎద్దుల్లో జంతువులలో ఉండే స్వచ్చత ఏ కోశానా కనపడ్డం లేదు, ఒక రకమైన క్రూరత్వం తొణికిసలాడుతుంది. ఆ బండ్లను ఎవరూ నడపడం లేదు.అన్నీ బండ్లకీ కలిపి ఒకడే ఉన్నాడు, వాడు కూడా దున్నపోతు లా ఉన్నాడు.వాడి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఎద్దులు కారు మీదకి వస్తుంటే అదిలించి “ఏం కావాలి” అన్నటు కళ్ళు ఎగరేసాడు. కారు పక్కన ఆపి దిగి ,
“గేటెడ్  కమ్యూనిటీ” అని నసిగాడు వంశీ దాని పేరు కూడా మర్చిపోయి. “ఆ” అన్ని గట్టిగా హూంకరించాడు. ఈ సారి ఆ మాట కూడా బయటకి రాలేదు. “వెనక్కెళ్ళిపో, లేకపోతే చచ్చిపోతావ్” అని బెదిరించి వెనక్కి చూస్తూ వెళ్ళిపోయాడు .
ఆ ఎద్దులు రేపిన దుమ్ము తెర వెనక ఏదో కోలాహలం వినిపించింది. “హమ్మయ్య ఎవరో మనుషులు ఉన్నారు” అనుకుంటూ ముందుకు కదిలాడు.  కొంత దూరం వెళ్ళగానే ఓ పది మంది మృగాల్లాంటి మనుషులు పక్కన నిలుచుని ఉండగా ఓ వృద్ధుడు మోకాళ్లమీద నిలబడి ఉన్న నలుగురి వైపు క్రూరంగా చూస్తూ ఉన్నాడు. ఓ మూలన పూర్తిగా జీర్ణమై పోయిన బట్టల్లో ఓ మనిషి వైపు తిరిగిన ఆ వృద్ధుడు “ఏరా, ఇంకా ఆశ చావలేదా? వీళ్ళు వచ్చి ఆ సంపదని గుడికి చేరుస్తారనుకుంటున్నావా? అందరికీ పట్టిన గతే వీళ్ళకీ” అని మాట ముగించే లోగా, ఆ పది మంది గొడ్డళ్ళు,కత్తులతో ఆ నలుగురినీ నరకడం మొదలు పెట్టారు. అక్కడ నుంచి పారిపోవాలని అనిపిస్తున్నా అడుగు కదలడం లేదు వంశీ కి. స్థాణువు లా నిలబడిపోయాడు. ఆ చింకి బట్టల వాడు తనలో తాను కుమిలిపోతున్నాడు. జీర్ణావస్థ లో ఉన్న ఒక పుస్తకం ఆ ఒంటి స్థంభం మేడలోకి చేర్చబడింది.ఇంత జరిగినా ఆ ఊరిలో ఎలాంటి అలికిడి లేదు. తనని గమనించే లోగా అక్కడ నుంచి వచ్చేయాలని వంశీ ప్రయత్నం. ఇంతలో ఆ మూలన ఉన్న మనిషి తనని పట్టి పట్టి చూస్తున్నట్టు అనిపించింది. నిజమే, తన దగ్గరకి వచ్చి చూస్తున్నట్టుంది. ఆ కళ్ళలో దైన్యం, ఆవేదన, అభ్యర్ధన ఉన్నాయి.వళ్ళంతా నీరసం కమ్మి నిలబడిన చోటే పడిపోయేలా ఉంది పరిస్థితి. ఇంకాసేపు ఉంటే వాళ్ళకి పట్టిన గతే తనకీ పడుతుందని కారు దగ్గరకి బయల్దేరాడు. అక్కడ ఉన్న వాళ్ళ వేషధారణ వింతగా ఉండటం తన దృష్టి నుంచి దాటిపోలేదు.
కారు దగ్గరకి వెళ్ళే సరికి మృదుల కనిపించలేదు. పై ప్రాణం పైనే పోయింది. మృదులని పిలవడానికి గొంతు,ధైర్యం రెండు రాలేదు. “ఏంటి,ఆలోచిస్తున్నావ్” అన్న మాటకి ఎగిరిపడి వెనక్కి తిరిగాడు. తన వెనకే మృదుల  ఆయాసపడుతూ నిలబడి ఉంది. “ఏంటీ,ఒక్క మనిషి లేడు ” అన్న మాట మృదుల నోటి వెంట రాకుండానే లాగి కార్లో వేసి స్టార్ట్ చేయబోయాడు. కారు స్టార్ట్ అవడం లేదు. అప్పటికే చీకాట్లు ముసురుతున్నాయి. ఆకాశం లో నక్షత్రాలు మిణుకు మిణుకు మంటూ ప్రత్యక్షమౌతున్నాయి. చుట్టు పక్కల ఏ శబ్దమూ లేదు, గుస గుస లతో నిండిన గాలి సవ్వడి తప్ప. వంశీ కి పిచ్చెక్కి పోతుంది. “వంశీ ఏమైంది?” అంటున్న మృదుల వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు వంశీ. నోట్లోంచి మాటలు రావడం లేదు. కారు స్టార్ట్ ఐంది. వేగంగా రివర్స్ చేసి ఆ గతుకుల్లో పరిగెత్తించ సాగాడు. కారులో ఎగిరిపడుతూ మృదుల గట్టిగా అరవసాగింది “ప్లీజ్ వంశీ చిన్నగా పోనీ భయంగా ఉంది” అంటూ. ఇవేం పట్టించుకునే స్థితిలో లేడు వంశీ. అరగంట ఎటు పోతున్నాడో,ఎలా పోతున్నాడో తెలీకుండా వెళ్ళాక స్థిమిత పడ్డాడు. కారు వేగం తగ్గింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న మృదుల “ఇప్పుడైనా చెబుతావా,ఏమైందో” అంది. మృదులకి ఆ భయంకరమైన విషయం చెప్పడం ఇష్టం లేకపోయింది.
“అసలు కారులో లేకుండా ఎక్కడకి వెళ్ళావ్?” అని అడిగాడు.
“నీతోనే వచ్చా కదా?” అంది.
“నాతో వచ్చావా?” అంటూ ఆశ్చర్యపోవడం వంశీ వంతు ఐంది.
“ఆ, ఏం ఊరది. ఒక్క మనిషి కూడా లేడు?” అంది.
“నీకేం కనపడలేదా?” వంశీ ఇంకా షాక్ లోనే ఉన్నాడు.
“లేదు” అని తన సమాధానం.
సడన్ బ్రేక్ తో కార్ ఆగింది.
“ఏమైంది వంశీ?” అంది మృదుల.
ఎదురుగ్గా ఉన్న గుట్ట మీద కూర్చుని తనవైపే చూస్తున్న మాసిన బట్టల వాడు....
(ఇంకా ఉంది...)

2 comments: