నేను నా ఆట బొమ్మలు....

by 12:44 AM 0 comments
నేను నా ఆట బొమ్మలు....

నాకు  బాగా గుర్తుండి నేను వాడిన ఆడిన బొమ్మలు...బాగా చిన్నప్పుడు తిరుపతి తీసుకెళ్తే గుండ్లు కొట్టించి, తప్పి పోయిన మా బాబాయి కొడుకుని వెతుక్కొని ఓ బొమ్మల కొట్టు ముందు ఆపి "రేయ్ నీకే బొమ్మ కావాలో చెప్పరా" అని మా నాన్న  అంటే పెద్దగా ఉన్న ట్రాక్టర్ బొమ్మ చూపించా. ఎంత అంటే 125 చెప్పాడు ఆ కొట్టోడు. పదో పదోహెనో పెట్టి లైట్ వెలిగే కార్లు ఓ నాలుగు నాకు మా చెల్లికి మా బాబాయి కొడుకులకి కొన్నారు. అవి నేల మీద బరికి వదిలితే "బాయ్" మని అరుస్తూ లైట్ వెలుగుతూ తిరుగుతాయ్...అది నా  మొదటి బొమ్మ. ఆ తరువాత మా ఎంకయమ్మ(చిన్న అమ్మమ్మ) కొన్న మౌత్ ఆర్గాన్. అది తెచ్చుకుంటే తెల్సిన వాళ్ళు నొక్కేసి నా ముందే ఊదుకుంటా తిరుగుతూ ఉంటే పోన్లేరా వదిలేయ్ అంది మా అమ్మ. మా నాయనమ్మ యాత్రలకి పోయి నాకొక కుక్క బొమ్మ, అదే నొక్కుతా ఉంటె అరుస్తూ ముందుకి పోతూ ఉంటుంది. ఇంకా ఒక టెలిఫోన్. ఆ చివర ఈ చివర రెండు డబ్బాల్ల ఉండి మద్యలో పెద్ద పచ్చ వైరు, అవతల వాళ్ళు మాట్లాడతా ఉంటె ఇవతలి వాళ్ళు చెవి దగ్గర పెటుకొని ఇనాల.

అది కాక ఓ సారి మా ఊరి గొల్లోళ్ళ అబ్బాయి దగ్గర టక్కరి చేసి కాజేసిన జీపు బొమ్మ. పసుపు, నలుపు లో భలే  ఉండేది. తీసుకొని పెద్ద మెకానిక్ లా అన్ని విప్పా, మళ్ళి ఫిట్ చేయడం రాలా. 

ఓ సారి మా అమ్మ నాన్న కూడా యాత్రలకి పోయి ఓ పెద్ద బాగు, ఒక రబ్బరు బాలు పెద్దది తెచ్చారు. చాల జాగ్రత్త గా వాడుకోవాలన్నమాట. ఆ బాగులో దాదాపు నలుగురు వాడే పుస్తకాలు పడతాయి . ఐన సరే అదే ఏసుకొని పోయేవాడిని. ఓ సరి బడి అయ్యాక మా రమణయ్య సారు కాన్వెంట్ కి వెళ్ళా. పోతా పోతా బాలు కూడా తీసుకెళ్లా. వాళ్ళ పాప ఆడు కుంటుంది అని తీసుకొని దాన్ని ముళ్ళల్లో వేసి దాని గాలి పోగొట్టారు.ఇంటి కాడ మా నాన వీరబధ్రుడి అవతారం ఎత్తి  నన్ను సితగ్గొట్టాడు.

ఇక ఇవి కాక బంకమట్టి తో బొమ్మలు, గోళీలు అందులో సీసం గోళీలు, ఇనప గోళీలు, కుంకుడు కాయ గోళీలు, కోడీక టపాసులు అని  ఉండేవి, బిల్లం గోడి (అందులో చాల బిళ్ళలు కోడి లు ), బొంగరాలు, దానికి మా నాన్న ని అడిగి పేనించుకున్న  తాళ్ళు, ఓకులు (తెలీదా? అదే అగ్గి పెట్ల మీద కవర్లు చించుకొని అదో పెద్ద కలెక్షన్ ), ఎప్ప్డుడో దీపావళి కొన్న తుపాకీ ని దొంగ పోలీసు ఆటలో వాడే వాళ్ళం. ఇది కాక బచ్చాలాట. ఇది కాక బాణలాట.  మా దగ్గర రామ బాణం, వాన బాణం, మంట బాణం, పొగ బాణం ఇత్యాది బాణాలే కాకుండా గాండీవం లాటి విల్లు లు కూడా ఉండేవి. వాటితో మా ఊర్లో లిబియాలో ఉండి వచ్చిన  చిన్న  గాడి తలకి బొక్క పెట్టి, మా ట్రాక్టర్ రెడియటార్ కి బొక్క పెట్టి మళ్ళి మా నాన్న చేతిలో పూజ చేయించుకున్నా. అప్పుడప్పుడు గాలి పటాలు. మాకు క్రికెట్ తెల్సాలకి బాటు అనేది గగనం అందుకే టెంకాయ మట్టలతోటి, మంచం కోళ్ళ తోటి, బాలేమో కాయితాలన్నీ కలిపి పూరి కొస తో చుట్టిన గుండు. తిరణాలకి పోయినప్పుడు చేత్తో తిప్పుత ఉంటాం, మద్యలో తినేది ఉంటాది..దాన్ని తిప్పి తిప్పి మద్యలో దాన్ని తినేసే వాళ్ళం .  ఇంకా బూరలు, గ్లాసు ట్యూబ్ లో రంగు నీళ్ళు నింపి ఉంటాయి కదా అవి. ఇవి కాక రెండు కోడి పుంజులు ఉండే బొమ్మ ఒకటి ఉండేది. దాని మద్యలో ఒక చిన్న గిన్నె ఉంటాది. కింద ఒక ఇనప కొక్కెం ఉంటాది. నొక్కుతూ ఉంటె అవి ఆ గిన్నెలో గింజెలు పొడుస్తా ఉంటాయి. ప్లాస్టిక్ పాము, బల్లి. 

అది కాకుండా..తాటి కాయలతో చేసిన బండి, దాంట్లో కూడా రెండు చక్రాలు, ఆరు చక్రాలు..ఇంకా ఇనప గాను కి అదే మన చెక్క బండి చిన్న ఇరుసు ని తోసుకుంట పోడానికి ఒక కర్ర ముక్క కి చీల కొట్టి..ఇంకా టైరు పుల్ల , కర్ర ని కాళ్ళ మధ్యలో  వేసుకొని బస్సు అట...తాడు  ని కట్టి అందరం అందులో ఎక్కి బస్సు ఆట...

ఇంకేమున్నయబ్బా ? చెప్పండి  ఇంకేమున్నాయో? 

0 comments:

Post a Comment