నా పాత మధురాలు

by 12:52 AM 1 comments

ఎవరినైనా నీకు ఏం చేయడం ఇష్ఠం అంటే వానలో బజ్జీలు తినడం, వానలో తడవడం ఇలా చెప్తారు కదా. మీరు చెప్పండి మీకేం ఇష్టమో. అనుకుంటూ ఉండండి మనసులో ఈ లోగా నా ఇష్టాలు చెప్తా. చెప్పనా? తెలీదు పట్నం లో పెరిగిన వాళ్ళ కి ఏ ప్రపంచం తెలుసో. నాకు మాత్రం పల్లెటూరే ప్రపంచం. అక్కడ ప్రతి దానికి ప్రాణం ఉన్నట్టు తోస్తుంది. ప్రతిదీ నాతో ఊసులడుతున్నట్టుంటుంది. మా ఇల్లు, ఇంటి ముంది ఉన్న చెక్క బండి, దానికి కట్టేసిన బర్రె దూడ, మా చింత చెట్లు, నా పాత సైకిలు, మా పెరట్లో మందారం పూలు ఇలా చెప్తూ ఉంటే ఎన్ని పేజీలు రాసిన చాలవు. మా ఇల్లు చాలా పెద్దది. వెనుక ఆకు కూరలు ముందు పూల మొక్కలు నాటడానికి చోటు. వెనుకేమో బెండ లు, పొట్ల కాయలు, గోంగూర, పెద్ద చిక్కుడు, సొర కాయ ఇంకా కొన్ని ఆకు కూరలు వేసేది అమ్మ. అదే బుజ్జి (నా చెల్లి ) ఆడుకునే చోటు. ఇంటి ముందు తాటి ఆకుల పందిరి. ఎండాకాలం వస్తే చాలా చల్లగా ఉండేది. ఇంకా చాలా పూల మొక్కలు. ఎవరికి దొరికినవి వాళ్ళు తెచ్చి నాటేసే వాళ్ళం. నేనైతే నాచు పూలు ఇంకా ఏవో ఆకుల చెట్లు ఉండేవి అవి స్కూల్ లో ఉంటే తెచ్చే వాడిని. అమ్మ ఏమో బంతి, చామంతి పూలు తెచ్చి నాటేదీ. నాన్న వంతు గా రెండు కొబ్బరి చెట్లు నాటాడు. సాయంత్రం అయే సరికి అన్నం తింటూ ఆరు బయట కూర్చునే వాళ్ళం. చీకట్లు మూసిరే వేళకి ఆకాశమంతా మినుకు మంటు చుక్కలు వాలిపోయేవి. నులక మంచాల మీద పడుకొని పైకి చూస్తూ చాలా కథలు చెప్పుకునే వాళ్ళం. చాలా చుక్కలు కనిపించేవి, ఎన్ని అంటే అలా చేత్తో తుడిచి ఒడిలో పోసుకోవాలనిపించేన్ని. అపుడపుడు తెగ తిరిగే చుక్కలు కనిపించేవి, ఒకటి కనిపించగానే ఇంకో దానికోసం వెతికే వాళ్ళం. తప్పకుండా దానికి ఎదురుగా వెళ్లే చుక్క ఉండేది. అలా వెతకడం లో ఏదో ఆనందం ఉండేది.


 ఇక వెన్నెల రోజులు. మా ఇంటి ఎదురుగా ఉన్న బడి లో ఓ నాలుగు జామయిల్ చెట్లు ఉండేవి. అవి నాకు హంస ఆకారం లో కన్పించేవి. అందులోంచి చంద్రుడు వచ్చేసే వాడు. అలా వచ్చి మా కొబ్బరాకుల్లో దాక్కుని వెన్నేలని అందులోంచి జార విడిచే వాడు. కొబ్బారాకుల గలగలల లోంచి వెండి వెన్నెల జాలు వారెది. అలా చూస్తూ నిద్రాపోయే వాళ్ళం. ఆ మొక్కలకి పాదులు తవ్వడం, నీళ్ళు పెట్టడం నాకు బుజ్జికి అప్ప చెప్పే వాళ్ళు. మా అమ్మ చేత మంచి అనిపించుకోవాలని తెగ కష్టపడి చేసే వాళ్ళం. నా చెట్టు బాగా కాసిందోచ్ అనుకుంటూ పడే మురిపేం భలే ఉండేది. కాని బాల్యం నచ్చని వారు ఎవ్వరు ఉండరేమో. అది పల్లెటూరి లో ఐనా పట్నం ఐనా. పల్లెటూరి బాల్యం ప్రకృతి తో ముడి పడి ఉంటె , పట్నపు బాల్యం నాగరికత మరియు ఆధునికత కలగలిపి ఉంటుంది. కాని పట్నం లో బాల్యం telescope లో నక్షత్రాలు చూస్తే , పల్లెటూరి పిల్ల వాడికి వేగు చుక్క తెల వారుతుందని చెప్తుంది. ఇక్కడ ప్రకృతి తో బంధం, అక్కడ కృత్రిమమైన అనుభవం . కాని ఇప్పటి తరం పల్లెటూరి పసితనాన్ని చంపేస్తుంది. ఆటలు లేవు, ఎండా కలం సెలవులు లేవు, ఉన్నా అమ్మమ్మ గారి ఊరికి వెళ్లి ఆడుకునే ఆటలు లేవు. extra కోచింగులు, భవిష్యత్తుని గురించి భయాలు, చినపుడే కళ్ళ జోళ్ళు. ఇవన్ని అందరికి తెల్సినవే. ఇప్పటి అమ్మ నాన్నలు తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఇప్పటి బాల్యాన్ని చంపేస్తున్నారు. బాల్యం అంటే ఇలా కథ లా చెప్పుకునేది కాదేమో.

 మా అమ్మ మెచ్చుకోలు కోసం నేను నా చెల్లి పోటి పడే వాళ్ళం అని చెప్పా కదా. పొద్దున్నే నిద్ర లేవడం తప్పించు కోడం కోసం కూడా పోటి పడే వాళ్ళం. అమ్మ పొద్దునే లేచేది. నాన్న మంచి నీళ్ళ కోసం స్వర్ణ వారి కుంట (ఈ నీళ్ళంటే నాకు చాల ఇష్టం ) కి కావడి వేసుకొని వెళ్తే, అమ్మ మమ్మల్ని లేపుతూనే ఇంటి ముందు ఊడ్చి కళ్ళాపు జల్లి ,ముగ్గు పెట్టేది. ఆ రోజు మాకు ఇష్టమైన పనులు ఏమి ఉన్నాయో గుర్తు చేసేది. అప్పుడు ఎక్కడ లేని ఓపిక తో లేచే వాళ్ళం. నేనేమో పొయ్యీ ముట్టిస్తే ,బుజ్జి నా పక్కన కూర్చునేది. కాసేపు వెచ్చగా కూర్చునే వాళ్ళం.దూరం గా సాయి బాబా గుడిలో పెట్టిన "చందన చర్చిత " మంద్రం గా వినిపిస్తూ ఉంటుంది. నాకు బాగా కోపం వచ్చేది , వీళ్ళకి ఈ పాట తప్ప వేరేది దొరకదా అని . కాని ఆ పాట ఇప్పటికి ఆ జ్ఞాపకాల సువసనల్ని చల్లుతూనే ఉంది. ఆ పాట అయిపోగానే వెంకటేశ్వర స్వామి గుడిలో "కౌసల్య సుప్రజా రామ " అంటూ మాతో పటు ఆ నల్లవాడిని లేపేస్తారు. పొయ్యి బాగా మండటం మొదలు కాగానే చెరో పని అప్ప చెప్పేది అమ్మ.నేనేమో బర్రెల దగ్గర పేడకల్లు తీసి అక్కడ శుభ్రం గా చేసి వాటికీ నీళ్ళు పెట్టి కొట్టం దగ్గర కట్టేసి మేత వేసి రావాలి.నాన్నేమో నీళ్ళు తెచ్చి మేత తేవటానికి వెళ్తాడు. అమ్మ, బుజ్జి వంట చేస్తారు. వంట అయిపోగానే ఆ పొయ్యి మీదనే నీళ్ళు పెట్టేది. దానితోనే మా స్నానాలు. అందరం కూర్చుని రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి,పప్పు, గడ్డ పెరుగు వేసుకొని తిని రెడీ అయ్యి (రేకు పలకలు\ పుస్తకాలు తీసుకుని ) ఇంటి ముందున్న బడి కి వెళ్ళిపోయే వాళ్ళం.


 మా బడిలో మాష్టార్ల(పంతుళ్ళు) పేర్లు చెప్తా వినండి.హెడ్ మాష్టారు సుబ్బరామయ్య పంతులు ,తెలుగు పంతులు కలికివాయి అయ్యవారు,సైన్సుకేమో చీరాల అయ్యవారు, సోషల్ కేమో టంగుటూరు మేష్టారు, ఇంగ్లీష్ కి కెజియా మేడం. వీళ్ళ అసలు పేర్లు మాకెవరికి తెలీవు. వీళ్ళే నాకు 7 th వరకు ఉన్నారు. మేము అంటే నేను బుజ్జి ఇంకా కొందరు పిల్లలు కల్సి రామయ్య పంతులు దగ్గర కి tuition కి వెళ్ళే వాళ్ళం. మా బడి మొదలయేప్పుడు రెండు గంటలు కొడతారు. రెండవ గంట కొట్టేసరికి అందరం ప్రార్ధనకి నిలబడాలి. లేకపోతే మోకాళ్ళ దండ , గోడ కుర్చీ , ఒంటి కాలి మీద నుంచోడం లాటి శిక్ష(punishment) లు ఉండేవి. అందరం కల్సి వందేమాతరం, మా తెలుగు తల్లికి, వీర గంధము తెచ్చి నారము, జనగమణ పాడేసి ఎవరి క్లాసు కి వెళ్ళే వాళ్ళం. మాకు వంటేలు గంట (interval)ఓ గంట సేపు ఉండేది.ఈ లోగ చెమటలు కక్కేట్టు ఆడుకొని మురికి గా వచ్చే వాళ్ళం.మళ్లీ మధ్యాహ్నం బెల్లు కొట్టే వాళ్ళు 12.30 కి. మళ్ళి 2 గంటలకి స్కూల్, 4 కల్లా అయిపోయేది. స్కూల్ అవగానే డ్రిల్లు, ఆటలు, ఎక్కాలు, జై హింద్ చెప్పగానే ఓఓఒ అంటూ ఇంటికి. చూసారా ఇక్కడ హోం వర్క్స్ లేవు, assignments లేవు. అయిన సరే మా టీచర్స్ ని తిట్టుకునే వాళ్ళం. మాకు ఇష్టం టంగుటూరి అయ్యవారు.అయన అస్సలు కొట్టేవారు కాదు.ఆయనకి పిల్లలు లేకపోడమే కారణం కావచ్చు. మా బడి లో ఎవరైనా మాష్టారు రాకపోతే పెద్ద తరగతి లో ఉన్న బాగా చదివే పిల్లల్ని కింది తరగతులకి లీడర్ గా పంపేవాళ్ళు, గొడవ చేయకుండా చూడ్డానికి. అది చాలా బాగుండేది. ఇంటికి రాగానే స్నానం చేసి ఇల్లు ఉడ్చటం, బర్రెకి మేత వేయడం లాటి పనులు చేసి tuition కి వెళ్ళే వాళ్ళం.అక్కడ విజయ లక్ష్మి ఉండేది. తను నా తరగతే, ఇంకా మా పంతులు గారి మనుమరాలు కూడా ( తన గురించి ఎపుడైనా చెప్తాలే ). tuition 7 కి అయ్యాక ఇంటికి వచ్చి ఆరు బయట వెన్నెల్లో వేడి వేడి అన్నం తిని కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయేవాళ్ళం

1 comment:

  1. Meeru cheppinavannee naaku peddhaga anubhavamloki raakapoyinaa yedo paatha jnaapakaalanu thaluchukunnapudu kalige madhuraanubhoothi kaligindi Naresh gaaru! Mee baalyam nijam gaa chaalaa andam gaa undi :)

    ReplyDelete