దెయ్యం

by 12:48 AM 0 comments

దెయ్యం...తెలుగోడికి తెలుగు తెలీకపోయినా పర్లేదు కాని దెయ్యం తెలియక పోతే మాత్రం వాడు తెలుగోడే కాదు...ఇప్పుడు వీటి గురించి జనాలు పెద్దగా ఆలోచించడం లేదు అనుకుంట...అంటే ఫారన్ నుంచి ఘోస్ట్ లు, జాంబి లు వచ్చి ఇక్కడ ఆక్రమించేశాయి....ఇక్కడ దెయ్యలకి ఒక ఫార్మటు ఉంటుంది, అంటే డ్రెస్ కోడ్. తెల్ల చీర, విర బోసుకున్న జుట్టు (బాగా పొడుగ్గా ఉంటుంది లే), వెనక పొగ, దూరం గ నక్కల ఊళలు, బాక్గ్రౌండ్ లో మంచి పాట.... అందరికి ఇదే దయ్యం కనిపిస్త ఉంటాది...కొందరికి అయితే చచ్చిపోయిన వాళ్ళ చుట్టాలో, స్నేహితులో వచ్చి పలకరించి పోతా ఉంటారు.... దీని మీద సాన సినిమాలు వచ్చి ఉండాయి.దీని మీద ఆటలు కూడా ఆడతా ఉంటారు.అదే ఒక బోర్డు మీద కాయిన్ పెట్టి ఇద్దరు దాని మీద చెయ్యి పెట్టి ఎవుర్ని ఐన తలచుకుంటే వాళ్ళ ఆత్మ వచ్చేస్తుంది....ఇక్కడ ఆత్మ వేరు దెయ్యం వేరు...ఆత్మలు ఆఫ్ లైన్ లో దెయ్యాలు ఆన్ లైన్ లోను ఉంటాయి.. ..అంతే కాకుండా చాల మంది చూసి కూడా ఉన్నారు..బహుశా మీలో కూడా ఉండి ఉండచ్చు... నేను బాగా చిన్నప్పుడు కరంటు వైరు పట్టుకొని ఆసుపత్రి లో చేరితే బలం కోసం టానిక్ ఇచ్చాడు శివరామ రెడ్డి డాట్రు...అది తాగించడానికి మా నాయనమ్మ మా ఇంటి ఎదురుగ గుబురుగా పెరిగిన చింత చెట్ల ని చూపించి తాగకపోతే దానిమీద నుంచి దయ్యం వచ్చి పట్టుకుపోద్ది అని చెప్పేది, ఆ గోల పడ లేక ఓ రోజు రాత్రి సీసా మొత్తం తాగేసా, రుచి బాగుండటం తో అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళ టానిక్ లు కూడా స్వాహ (కథ పక్క దారి పడుతుంది). ఆ తరువాత రవణప్ప గారి కలర్ టీవీ లో చూసిన దెయ్యం సినిమా(భానుచందర్ ఉంటాడు, ఒక గుహలో నిధి, దయ్యం ఉన్న పెట్ట ఉంటుంది, ఎవడో దాన్ని ఓపెన్ చేస్తాడు, అది అందరిని చంపుతూ ఉంటుంది) తో మొదలు... కొన్ని రోజులు భయపెట్టింది... ఇక ఆ తరువాత చాల సినిమాలు వచ్చాయి..కొన్ని చేతులు అడ్డం పెట్టుకొని చూడ్డం, ఆ తరువాత మానెయ్యడం జరిగింది..ఇపుడైతే భయం తగ్గింది అనే కంటే అటు వైపు ఆలోచించడం తగ్గింది... 


 ఓ సారి పదో తరగతి లో ఉన్నప్పుడు స్కూల్ లో బస్సు వెళ్ళిపోయింది. ఇక అందరం కలిసి ట్రాక్టర్ ఎక్కి బయల్దేరాం ఊరికి. మా ఊరు వెళ్ళాలి అంటే మద్యలో ఇంకో ఊరు వస్తుంది. ఆ ఊరు దాటాక ఓ పెద్ద చెరువు, ఆ చెరువు కట్ట చివర మలుపులో ఓ పక్కకి ఒరిగి నాలుగు అడుగులు పొడుగున్న ఉన్న రెండవ నెంబరు మెయిలు రాయి. ఇక ట్రాక్టర్ లో వెళ్తూ ఉంటె మాతో మా ఊరి దూదేకుల సాయిబు కూడా వచ్చాడు. ఆ మైలు రాయి దగ్గరకి వచ్చేసరికి మమ్మల్ని ఓ ప్రశ్న వేసాడు" మీకు ఈ రాయి గురించి తెల్సా" అప్పుడు రాత్రి పది అయింది. మేమంతా స్లో మోషన్ లో తిరిగాం, ఆయన పిచ్చి బచ్చాల్లారా అన్నట్టు చూసి "ఇది ఒక దెయ్యం " అన్నాడు. ఎక్కడో ఓ నక్క ఊళ వేసింది. మేమంతా అ రాయిని అలా చూస్తూ ఉన్నాం, అది మా వైపు తల ఊపుతూ చూస్తు ఉంది. ఇంకొంచెం లోపాలకి జరిగి "ఎం జరిగింది " అన్నాం. "ఓ సారి నేను మా చుట్టాల ఊరికి వెళ్లి సింగరాయకొండ వచ్చేసరికి ఆలస్యం ఐంది, ఆఖరి బస్సు వెళ్ళిపోయింది. అక్కడే ఒక సైకిల్ తీసుకొని బయల్దేరాను. బాగా చీకటి, అమావాస్య అనుకుంట (మాకు చలి బుట్టటం మొదలైంది). కన్ను పొడిస్తే కానరాని చీకటి, ఆకాశం నిండా నక్సత్రాలు, చల్ల గాలి, అక్కడక్కడా కావలి వాళ్ళు వేసుకున్న మంటలు మినుకుమంటున్నాయ్. దూరం నక్కల ఊళలు. అలవాటైన ప్రాణం కదా, చిన్నగా వెళ్తూ ఉన్నాను. ఆ చెరువు కట్ట దిగి రాగానే ఆ రాయి కనిపించింది.


 మాములుగానే తొక్కుతున్న, ఇంకొంచెం ముందుకు రాగానే మళ్ళి రాయి ఉంది. అదేంటబ్బ వెనక్కి పోయింది కదా అనుకుంటూ వెనక్కి తిరిగా..చిన్నగా ఆ రాయి పైకి లేచింది (అందరం దగ్గరకి జరిగాం )..... అది మైలు రాయి కాదు...పొగ మంచు లా ఉంది, గాల్లో తేలుతూ మెల్లగా నా వైపు రాసాగింది...నా కళ్ళల్లో వణుకు మొదలైంది, అప్పటి దాకా ఆడుతూ పడుతూ సైకిల్ తొక్కిన నేను తడబడటం మొదలు పెట్టాను, అది నాకు దగ్గరగా వచ్చింది, చూడబోతే ఆడ పిల్ల ఆకారం లో ఉంది. నా కాళ్ళలో సత్తువ తెచ్చుకొని సైకిల్ తొక్కడం మొదలు పెట్టాను...అది కూడా గాల్లో తేలుతూ నన్ను వెంబడించడం మొదలు పెట్టింది..నేను వేగం పెంచాను, అది నన్ను తరుముతూ ఉంది. ఇది గో ఈ చప్టా( చెరువు మలుపు దాటినా కాసేపటికి రెండు నీళ్ళ చప్తలు వస్తాయి) దగ్గర కి వచ్చేసరికి నాలో ఓపిక, ధైర్యం తగ్గిపోయాయి. ఇక దేవుడి ని తలచుకుంటూ తొక్కుతున్నాను, దూరం రామానాయుడి గారి పొలం కాదా నీళ్ళ ఇంజను శబ్దం వినిపించింది, నా మొర దేవుడు ఆలకించాడు. అక్కడ ఎవరో పొలానికి నీళ్ళు పెడుతున్నారు. నాక్కొంచెం ధైర్యం చిక్కింది. అది దానికి తెల్సిందో ఏమో దాని వేగం పెంచింది. ప్రాణం మీద ఆశ వదులుకొని సైకిల్ వదిలేసి పరిగెత్తడం మొదలు పెట్టా...అది అరుస్తూ వెంట పడింది. నా అదృష్టం నీళ్ళ ఇంజను దగ్గర ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. పరిగెత్తి పడిపోయా, నోట్లో మాట రాడం లా. గుండెల్లో మంట. భయం గా దాని వైపే చూస్తున్నా..అది అరిచి నా సైకిల్ మీద పడి తొక్కి కసిగా వెనక్కి వెళ్ళిపోయింది" అంటూ మా వైపు చూసాడు...అప్పటికే పుస్తకాల సంచుల్ని ఘాట్టిగా పట్టుకొని "ఎవడ్ర ఈ £%¬*&" ట్రాక్టర్ లో కి ఎక్కిచింది " అనుకునాము... ఆ రోజు నుంచి మొన్న రోడ్ వేసేప్పుడు ఆ మైలు రాయి తీసేసిన్దాక ఆ రాయి మమ్మల్ని తెల్లగా భయపెడుతూనే ఉంది....ఇంకా ఇలాటి అనుభవాలు చెప్పాలంటే బోలెడు..మీకు లేవా?

0 comments:

Post a Comment