వాన చినుకులు

by 12:59 AM 2 comments

వాన చినుకులు వానా కాలం...నాకెందుకో ఎండాకాలం కన్నా వానా కాలం అంటేనే ఇష్టం అని చెప్పడం కన్నా ప్రాణం అనుకోవచ్చు ... నిండుగా కమ్ముకున్న నల్లటి మబ్బులు...ఎక్కడో మేమున్నామంటూ అలజడి చేసే ఉరుములు...ఆడపిల్ల పెదాల మీద నవ్వులా మెరిసి వెళ్ళిపోయే మెరుపులు...తేమ తో నిండి తాకి పోయే చల్లటి గాలి...చిన్నగా మొదలై నేలను తాకే వాన చినుకులు...కమ్మటి మట్టి వాసన... వాన ఒక్కోచోట ఒక్కోలా కనిపిస్తుంది... చిన్నప్పుడు మా ఇంట్లో తాటాకుల పందిట్లో కూర్చుని చూస్తుంటే , ఆ చూరు లోంచి కారుతూ నా కాళ్ళు తడుపుతూ...మా ఇంటి ముందున్న పూల మొక్కలని పలకరిస్తూ..కొబ్బరి ఆకుల్లోంచి పడుతూ ఉంటె పిల్లలందరం ఒకే దుప్పట్లో కూర్చుని రేడియో లో పాటలు వింటూ... నాన్న తో కలిసి పొలం వెళ్ళినప్పుడు స్వర్ణ వారి కుంట కాదా ఎద్దులని మేత కి విప్పి మర్రి చెట్టు కింద కూర్చుంటే.... ముత్యాల వానలా కనిపిస్తుంది...చుట్టూ మైదానం...కంటి కనిపించినంత దూరం తెల్లని పూల వాన....హోరు మంటూ గాలి...ఊగిపోతుండే పెద్ద పెద్ద చెట్లు...కాసేపటికే వాన వెలిసి మబ్బుల్లోంచి నవ్వుతు వచ్చే సూరీడు..నెల మీదకి వంగిన అందాల హరివిల్లు....కింద అంత మెత్తటి బురద, కాలు పెడితే జారిపోతూ...చిన్న కాలువలు కట్టి సాగిపోయే వాన నీళ్ళు... ఓ రోజేమో బడికి వెళ్దామని బస్సు కోసం ఎదురు చూస్తుంటే నిన్న కురిసిన వానకి చప్టాలో చిక్కుకుపోయిన బస్సు...ఈ రోజు మీకు బడి లేదు లే అంటే...లేదు మేం వెళ్ళాల్సిందే అంటూ పిల్లలంతా కల్సి సన్నటి చినుకుల్లో నడుచుకుంటూ సింగరాయకొండ వెళ్తుంటే..చాప్ట దగ్గర పక్కన ఉన్న నెల్ల కుంటలో విచ్చుకున్న తెల్లటి తామరలు...మాకు కావాలంటే మాకు కావాలనే అమ్మాయిలు... ఇంటర్ లో చేరాక ఎప్పడు ఇంటి కి దూరం గ ఉండని నేను ఇంటి మీద బెంగ తో కూర్చుని ఉంటె వచ్చి పలకరించే వాన చినుకులు.... ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ లో ఆఫీసు కి బయల్దేరగానే విరుచుకుపడే వాన.... సంతోష పడటం మానేసి లాప్టాప్ ని దాచుకోడానికి పడే తపన , ట్రాఫ్ఫిక్ తిప్పలు, ప్రవాహం ల వచ్చే మురుగు నీళ్ళు....అప్పుడపుడు తిట్టుకునే ఉంటా...కాని వాన కదా, పాపం దాని కోసం నేను చూస్తుంట అని వచ్చి పలకరించి పోతు ఉంటుంది...వాన మార లేదు , నేనే మారాను.... కాని వాన ఎప్పుడు అద్భుతమే....

2 comments:

  1. Wow... Bhalegaa raasaarandee :)
    Naakaithe vaanalo thadusthunna anubhoothe kaligindi!

    ReplyDelete