కళమ్మ

by 8:23 PM 3 comments
మేము హైదరాబాద్ నుంచి బెంగుళూరు కి మారిపోతున్నాం.నేను ఇంటర్నెట్  తీసేయించి, గ్యాస్ ట్రాన్స్ఫర్ చేయించే పనుల్లో హడావిడిగా ఉన్నాను. క్షణం తీరిక లేదు. ఇల్లంతా ఖాళీగా ఉంది. సామాన్లన్నీ సర్ది పంపించేసా. చిన్న చిన్న మాటలు కూడా పెద్దగా వినపడుతున్నాయి. ఏంటో ఖాళీ చేస్తున్నాం అంటే అక్కడ క్షణం  ఉండ బుద్ధి కాదు. ఇప్పుడు ఉన్న ఇల్లు కడిగించడానికి పనమ్మాయిని పిలవమని మా ఆవిడకి చెప్పాను.సరే అంటూ "కళమ్మ చచ్చిపొయిందట" అంది. అంత నీరసం లోను నన్ను ఆ మాట ఉలిక్కిపడేలా చేసింది. "చచ్చిపోవడం ఏంటి?" అన్నాను. " అవును, చచ్చిపోయిందట" తన సమాధానం. 
"ఏమైందంట?" అన్నాను. "వాళ్ళాయన చంపేసాడట" అంది.. మనసు వికలమై పోయింది. 
కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాను. 
కళమ్మ మా ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో పని చేస్తూ ఉండేది. వాళ్ళ ఆయన్ని అక్కడ పనికి కుదిర్చింది, అది కూడా పేరుకే. ఆ పని కూడా తనే చేసేది. వాళ్ళకి ఒక 10 వ తరగతి చదివే పిల్లాడు. మాకు బాబు పుట్టాక వాడికి స్నానం చేయించడం కోసం,ఇంటి పని కోసం ఆమెని ఏడాది కింద రమ్మన్నాం. మనిషి నలుపు, కాలికి పట్టాలు, ముక్కు పుడక,మొహాన  రూపాయి బిళ్ళంత బొట్టు, కళ్ళలో నీళ్ళు దాచేసి పని చేసుకుంటూ పోతుండేది. చాలా కష్టపడేది. ఒకటే పరుగు. ఎపుడైనా రాకపోతే, "ఏమైందని" అడిగితే , "రాత్రి వాళ్ళాయన తాగొచ్చి కొట్టాడంట" అని సమాధానం. "తిన్నావా" అని అడిగితే లేదు అని చెప్పడానికి నామోషి పడేది. కనుక్కుని తిండి పెట్టేది మా ఆవిడ
 . 

కష్టం తనది, అయినా సరే మొగుడు ఐన పాపానికి తిండి పెడుతూ మరి కొట్టించుకోవాలా అనిపించేది నాకు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళెవరూ లేరా అడగడానికి. అన్నీ  అయ్యాయంట, పంచాయితీ పెట్టారంట. అప్పుడు బానే ఉంటా అంటాడట, మళ్ళీ మాములే. మరి 10 వ తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు కదా, వాడేం మాట్లాడడా అంటే, వాడికి భయం అంట. అడ్డం వస్తే వాడిని కూడా తంతాడట. ఒక నిట్టూర్పు. 
కొన్ని నెలలు పని చేసాక, ఓ వారం రాలేదు. ఓ రోజు ఉదయాన్నే వచ్చి పని చేసుకు పోతూఉంది. రాగానే బాబుకి స్నానం చేయించేది, వాడితో ఏదోటి మాట్లాడుతూ ఉండేది. మౌనంగా ఉంది. పనయ్యాక "అమ్మా నేను ఇంకా రావడం లేదు , మీకు ఇష్టమైతే వేరే అమ్మాయిని తీసుకువస్తాను" అని చెప్పింది. "ఏమైంది కళమ్మ" అంటే చేతి నిండా వాతలు చూపించింది. కళ్ళలోంచి నీళ్ళు దూకకుండా ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. "ఇక్కడ ఉండద్దు అంటున్నాడమ్మా,పిల్లోడిని కొట్టి ఊరికి తీసుకోపోయాడు, ఇక నాకు పోక తప్పదు" అని అంది. ఆ నెల జీతం,కొన్ని చీరలు తీసుకువచ్చి ఇచ్చింది మా ఆవిడ. తన మొఖం లో సంతోషం. ఇంకొంచెం ఇవ్వాల్సిందే అనిపించింది. 
మరుసటి రోజు కొత్త పనమ్మాయిని తెచ్చి ఇల్లు చూపించి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తరువాత అనుకుంటా, మా ఆవిడా అంది "కళమ్మ  మళ్ళీ వచ్చిందంట, ఇక్కడే పని చేసుకుంటూ ఉందంట. వాళ్ళ ఆయన  మాత్రం రాలేదంట" అని. 
తను ఎలా చనిపోయింది అంటే, మొగుడు వచ్చి మారిపోయాను అని నమ్మించి, ఇంటికి తీసుకు వెళ్లి మందు పెట్టాడంట. కోపం, కసి చెత్త నా@)@)(@) , ఏం పోయే కాలం వాడికి. 
ఇక్కడ బలం,బలహీనత గురించి మాట్లాడను, ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు ఆ బాధ్యత ని అలా నెరవేరుస్తూ ఏదో ఓ రోజు కనపడకుండా వెళ్ళిపోతారు.అప్పటి దాకా తనని గుర్తించని వాళ్ళు,తను మిగిల్చిన శూన్యం లో పడి పోతారు. ఆ లేమి ఏదో ఓ చీకటి రాత్రి తన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. 

ఎవరికైనా ఏదైనా సాయం చేయాలనిపిస్తే ఎటువంటి ఆలోచన లేకుండా చేసేయాలి. మనతో,మనలో ఉన్న చాలా మంది నవ్వుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూఉంటారు. ఆ నవ్వే కళ్ళ వెనకున్న కష్టం మనకి తెలీకపోవచ్చు కానీ, మనం నవ్వుతూ పలకరించవచ్చు.. ఈ పని నువ్వు మాత్రమే బాగా చేయగలవని ఒక చిన్న మాట అనవచ్చు. అంతే... 


Image courtesy: NaheemRustum

3 comments:

  1. హ్మ్మ్... ఇలాంటి వాళ్లకి అలాంటి వెధవలతోనే ముడిపడుతుంది ఎందుకో..

    ReplyDelete
    Replies
    1. ilati valla hakkula kosam poradatamlo tappu ledu Raj, ilaa maggi poyi chala mandi oorike vellipothunnaru.valla vaipu matladdaniki okkariki noru raadu... kadupu mandipoyindi aa mata vini....

      Delete
  2. ప్చ్...! బాధేసింది.
    ఆర్ద్రంగా రాశావు నరేషూ.

    ReplyDelete