రేకు పలక

by 3:45 PM 0 comments
ఇప్పటిలా ప్లే స్కూల్స్ లేనప్పుడు మాకు అంగన్వాడి అని ఉండేది. మా వాళ్ళు పొలం పనులకి వెళ్తూ, మమ్మల్ని అంగన్వాడి కి పంపే వాళ్ళు. అంగన్వాడి లో పాటలు, పద్యాలు చెప్పి తినడానికి పిండి కానీ వడియాలు కానీ పెట్టే వాళ్ళు. వడియాల్లో పసుపువి పెట్టే వాళ్ళు ముందు, బాగుండేవి. అవి మానేసి, పచ్చవి పెట్టడం మొదలుపెట్టారు. అవి అంత బావుండేది కాదు. అవి కూడా మానేసి పిండి పెట్టడం మొదలు పెట్టారు. అవి తెచ్చుకోవడం కోసం, మేము "మానిక" లు తీసుకెళ్ళే వాళ్ళం. పిండి పెట్టడం మొదలు పెట్టే సరికి మేము అక్కడ నుంచి బడి కి ప్రమోట్ అయ్యాం.


ఇప్పటి పిల్లల్లా బండెడు పుస్తకాలు లేవు. ఒక "రేకు పలక" ఉండేది. మట్టి పలకలు వారానికి ఒకటి పగిలి పోతు ఉండేది. మనకున్న స్తోమత కి అంత లేదు. అందుకే ఓ రేకు పలక కొని ఇచ్చే వాళ్ళు. కొన్న ఓ వారం రోజులు బాగానే ఉండేది, పైన రబ్బరు తో చుట్టి, పట్టుకోవడానికి హేండిల్ కూడా ఉండేది. ఒక మంచి రోజు చూసుకొని ఆ రబ్బరు తెంపి, పదునుగా ఉండే రేకు పలకని బయటకు తీసే వాళ్ళం. అది రాజమౌళి సినిమాలో ఆయుధంలాటిది మాకు. 

కొత్త పలక ఎవడైనా కొంటె ఆటలా పోటీలు జరిగేవి. పలకలతో కొట్టుకోవడం. ఎలా కొట్టిన మన పలకే గెలిచేది. అవతలోడి పలక రబ్బరు తెగేది. వాడు కూడా వచ్చి మన కమ్యూనిటీ లో చేరి పోయే వాడు. అలా అన్ని రబ్బరులు తెగి పోయాక, అలా వాటితోనే కొట్టుకునే వాళ్ళం. అలా పలకంతా నొక్కులు పడి పోయేది. ఇంకా అదే పలకతో జామ కాయలు కోసుకునే వాళ్ళం. కోపం వచ్చినప్పుడు అవతల వాడికి బొక్క పెట్టే వాళ్ళం. నానా రచ్చ చేయాగా అది తుప్పట్టి పోయేది. ఒక పక్క పెయింట్ లేచి పోయేది. అలానే రాసి రాసి ఇక ఇంట్లో వాళ్ళు చూడలేక మళ్ళీ ఓ కొత్త పలక కొనే వాళ్ళు. మళ్ళీ మొదలు. కొంత మంది ఉమ్ము వేసి తెగ తుడిచే వాళ్ళు. 

ఆ పలక మీద రాయడానికి నా దగ్గర మాములు నాపరాయి బలపాలే కాకుండా, పిండి బలపాలు, రంగు బలపాలు ఇలా రకరకాలు ఉండేవి. కొంత మనది వాటిని రాయడానికి, ఇంకొందరు తినడానికి, ఇంకా కొంత మంది ఔత్సాహికులు ముక్కులో పెట్టుకోడానికి, మరి కొందరు ఆడుకోడానికి వాడే వాళ్ళు.  ఎన్ని బలపాల ముక్కలు ఉన్నా కొత్త బలపం అందమే వేరు. అది మన చేతిలో క్షణం ఉండదు. వెంటనే ముక్కలు అయ్యేది.

చాలా రోజుల దాక అదే నాకు రఫ్ బుక్. 
పలక మీద మొదటి సారి అ ఆ లు నేర్చుకునేప్పుడు, వాటిని దిద్దరా అంటే దారం లా సన్నగా రాసి ఇచ్చిన అ ఆ లని దిద్ది దిద్ది చేంతాడు అంత లావు చేస్తే కానీ మేము చదివినట్టు అనుకునే వాళ్ళు కాదు అయ్యవార్లు. ఇక చూడండీ ఒకటే దిద్దడం.

మా ఇంట్లో ఇంకా ఎక్కడో ఉన్నాయి మట్టి పలకలు. జ్ఞాపకాలు మాత్రం నాతో ఉండి పోయాయి. పసితనం దానితోనే మొదలైంది.

0 comments:

Post a Comment