నేను నా డైరీ

by 5:55 PM 0 comments
ఒకానొక కాలం లో, కనపడ్డ ప్రతి నోట్ బుక్ మీద నా డైరీ అని రాసి అందులో ఏది తోస్తే అది రాసే టైం లో.... ట్రియ్యుం ట్రియ్యుం ట్రియ్యుం ట్రియ్యుం  ఫ్లాష్ బ్యాక్ లోకి... అది 2001 సంవత్సరం.... హైదరాబాద్ లో అప్పుడే రూమ్ లో చేరిన కొత్తల్లో.. అంతకు ముందు 6 నెలల పాటు హాస్టల్ లో ఉండి, అప్పుడే రూమ్ లో చేరాం. 

నేను రాజు గాడు, సతీష్ అన్నఉండే వాళ్ళం. అప్పటికే నా డైరీ రాయడం మొదలై ఆరు నెలలు దాటింది. నా డైరీ అనబడే నోట్ బుక్ ని ఎక్కడా దాచి పెట్టను. అలా పుస్తకాల మధ్యలోనే పడి ఉంటుంది. 

 ఓ శుభముహార్తాన రాజు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. తరువాతి రోజు ఉదయం నేను బాత్ రూమ్ కి వెళ్లి వచ్చేసరికి, వాళ్ళ నాన్న నా స్టడీ చైర్ లో కూర్చుని ఉన్నారు. వాళ్ళ అమ్మ కింద కూర్చుని ఉన్నారు. రాజు గాడేమో వాళ్ళ నాన్న ముందు చేతులు కట్టుకొని నిలుచుని ఉన్నాడు. నా వైపు చంపేసేటట్టు చూస్తునాడు. తేడా గా ఉంది ఏదో. ఓ సారి వాళ్ళ నాన్న చేతిలో చూశా, అక్కడ క్షణం నిలబడలా నా కాళ్ళు. ఆయన చేతిలో నా డైరీ అనబడే నోట్ బుక్.

 అప్పటికే చాలా పేజిలు చదివేసినట్టున్నారు."వామ్మో నరేషుగా, ఇంకా చూస్తావేంది, పరిగెత్తు"...అని ఇన్నర్ వాయిస్. జంప్, వెళ్లి మా ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా. అక్కడే టిఫిన్. ఇది జరిగింది పొద్దున్న 6.30 కి. మా రాజు గాడు 9 దాటాక వచ్చాడు, ఏడుపు మొహం తో.



నేను నెమ్మదిగా అడిగా "ఏమైంది మామా". 
గయ్ మని లేచాడు. "రేయ్, అది డైరీ నా? ఎవడైనా డైరీ అంటే వాడి గురించి రాసుకుంటాడు. నువ్వేంట్రా, నా గురించి, మా అన్నాయ్ గురించి రాశావ్. మా నాన్న అమ్మ ఇద్దరు కల్సి బండ బూతులు తిట్టారు.మళ్ళీ నువ్వేమో మంచోడివా?" అని కాసేపు వాయించేసాడు.




అసలు సారంశం ఏంటయ్యా అంటే.

నా డైరీ లో ఏం రాసాను అంటే.. వినరా భారత వీర కుమారా విషయము చెబుతానూ... తందాన తాన. తరికిట ఝంతరి త.

రాజు గాడు, వాళ్ళన్న ఏమేం సినమాలు చూశారు. అందులో సెకండ్ షో లు ఎన్ని? వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్ళకుండా ఎలా ఉన్నాను? అప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి? 

రాజు గాడు 1800 పెట్టి టేప్ రికార్డర్ కొని ఇంట్లో 700 అని ఎలా చెప్పాడు? లాటి 

వాళ్ళ అన్న రోజు కి ఎన్ని సిగరెట్ పెట్టెలు కాల్చేవాడు...

రాజు గాడికి పక్కింట్లో ఉన్నమ్మాయి ఎలా బీట్ కొట్టేది... వీడు కిటికీ పట్టుకొని వేళ్ళాడుతూ ఆ అమ్మాయికి ఎలా రెస్పాన్స్ ఇచ్చేవాడు....

100 మిగల్చడానికి నేను దిలుసుఖనగర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ కి సైకిల్ మీద ఎలా  వెళ్లాను లాటి అద్భుతమైన విషయాలు పొందు పరిచాను....




అది తెల్సి వాళ్ళ నాన్న వాడిని నానా బూతులు అంట.


నాకు ఏం రాయాలో తెలీక ఏదోటి రాసుకుంటూ పోయా, అది మా వాడి నెత్తి మీదకి వచ్చింది. అప్పటి నుంచి డైరీ అంటే మా రాజు గాడు గాల్లోకి ఎగిరే వాడు....

ఆ తరువాత రాయడం మానలేదు గానీ, దాచడం నేర్చుకున్నా... తలచుకుంటే ఇప్పటికీ పొట్ట పగిలిపోతుంది...

0 comments:

Post a Comment