ఓ కథ

by 3:53 AM 0 comments
"నీకేమ్మా? కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారుగా. నాలుగు చేతుల సంపాదన" అని పొరుగింటి ఆమె అంటుంటే, మనసులో కలుక్కు మంది ప్రభావతమ్మ కి. నిజమే సంపాదనకేం లోటు లేదు. మంచి ఇల్లు, ఓ పదెకరాల పొలం. మంచి ఉద్యోగాల్లో ఉన్న పిల్లలు,అన్నిట్లో తోడూ ఉండే భర్త. ఏం కావాలి ఇక? కానీ సంతోషమే లేదు. ఒక్కొటిగా గుర్తుకు రావడం మొదలు పెట్టాయి అన్నీ.

తనను బావ కి ఇచ్చి పెళ్లి చేసారు. పెద్ద కలిగిన కుటుంబాలు కాకపోయినా, తానంటే బావ కి ఇష్టం.ఇద్దరు పిల్లలు(వంశీ, ఇందు) పుట్టారు. ఉన్న పొలం లోనే పనులు చేసుకుంటూ రోజులు గడచిపోతున్నప్పుడు, వేరు పోవాల్సివచ్చింది. ఏమి తోడూ రాలేదు. ఆయన, నేను, పిల్లలూ. ఓ పాత పెంకుటిల్లు, అందులో మాతో పాటు ఇంకా రెండు కుటుంబాలు.
పందికొక్కులు తొవ్విన బోరియలతో నిండిన ఇల్లు. చేతికి వచ్చిన  పోలంతోనే మళ్ళీ జీవితం మొదలైంది. నిరాశపడ్డా పిల్లల్ని చూసుకుంటే కడుపు  నిండేది. ఇద్దరం కలసి కష్టపడ్డాం. ముందు ఇల్లు కొనుక్కున్నాం. ఓ ఏడాది కొంచెం డబ్బులు చూశాం. దానితో పొలం కొన్నాం. పిల్లలు ఎదుగుతున్నారు. మా ఇద్దరి మనసులో ఒకటే ఆలోచన "పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి". రేయింబవళ్ళు పని. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. పిల్లలు కూడా బాగా చదువుకునే వాళ్ళు. కొన్ని ఒడి దుడుకులు ఎదురైనా ఓ స్థాయికి వచ్చాం. ముందు ఇందుకి పెళ్లి చేసాం. మా తాహతుకు తగ్గ సంబంధం.

ఇక అబ్బాయి కి చదువు ఐపోయి, ఉద్యోగం వచ్చింది. వాడికి మంచి పిల్లని చూడాలని మా ఉద్దేశ్యం. మంచి సంబంధం దొరికింది. అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది. ఓ మంచి ముహూర్తాన, ఘనంగా పెళ్లి జరిగింది.

నాకు వంశీ అంటే చాల ఇష్టం. ఒక్క రోజు వాడితో మాట్లాడకపోయినా ఎదో వెలితిగా ఉంటుంది. పెళ్ళికి ముందు రోజు ఫోన్ లో మాట్లాడే వాడు. కానీ పెళ్ళయ్యాక వాడి దగ్గర నుంచి ఫోన్ రావడం తగ్గిపోయింది. ఇప్పుడు పొలం పనులు లేవు. ఇంట్లో కూర్చోవడమే. మా వారేమో వ్యాపారం చూసుకునే వారు. ఎంత సేపు టీవీ చూడటం, నిద్ర పోవడం, వంట చేయడం ఇదే జీవితం ఐపోయింది. ఎదో ఖాళీ ఏర్పడింది. ఓ నిర్లిప్తత, స్తబ్దత. చూస్తుండగానే, మా ఊరిలో నా లాటి వాళ్ళు పెరగిపోయారు. అన్నీ డుప్లెక్స్ ఇళ్ళు.అందులో బిక్కు బిక్కు మంటూ ఇద్దరు ముసలివాళ్ళు. పల్లెటూరు మూగబోయింది. పెద్ద పండగ కూడా చిన్నబోయింది. పిల్లలే కనపడ్డం మానేసారు. స్మశానం లా అనిపిస్తుంది.

నాకు ఉన్న చిన్న ఆశ వంశీ ఫోన్. వాడి కల్మషం లేని మాటలు, మనసులో ఎంత బాధ ఉన్న ఇలా తీసేస్తాయి. నవ్విస్తాడు. కబుర్లు చెప్తాడు. వాడితో మాట్లాడిన ఆ పది నిముషాల్లోనే నా రోజు చూసుకునే దాన్ని. కానీ వాడీ మధ్య కాల్ చేయడం తగ్గించాడు. నా మనసులో దిగులు పెరుకుపోసాగింది. మా వారు సర్ది చెప్పేవారు. వంశీ కూడా ఫోన్ చేసి "సారీ అమ్మా, పనుల ఒత్తిడి. ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజి లో ఉంది. ప్రెజర్." ఎన్ని చెప్పినా వాడి మాటల్లో మెరుపు పోయింది. ఏదో దిగులు. అయ్యో నా బిడ్డ ఏమైందో వాడికి అని నా మనసులో బాధ. ఓ రోజు మా వారిని అడిగా, వాడి దగ్గరకి వెళ్దాం అని.... సరే అన్నారు. రేపే మా ప్రయాణం..... సంతోషం గా ఉంది.....

తరువాయి భాగం తరువాత .....

0 comments:

Post a Comment