నిమజ్జనం

by 3:54 PM 0 comments

నీళ్ళ మీద పెద్ద శబ్దం రావడంతో లోపల ఉన్న గణపతులందరూ తలెత్తి పైకి చూశారు .. "అబ్బో చాలా పెద్దగా ఉన్నాడు చోటు ఇవ్వండి" అని పక్కకి తప్పుకుంది P&T కాలనీ లో ఓ గల్లీ లో గణపతి... అందరు అలా కదిలే లోపే ఓ సారి ధబెల్ మని పడి మళ్ళీ నీళ్ళ పైకి చేరి చిన్నగా మునగడం మొదలెట్టాడు చైతన్యపురి గణపతి... ఓ మూల నుంచి చిన్న చిన్న గణపయ్యలంతా అలా చూస్తూ ఉన్నారు.. అవి మట్టివి కాకపోవడం వలన కరక్క చేతులు, తొండాలు విరిగిపోయి అలా పడి ఉన్నాయి... 

ఇంతలో పైన ఒకటే గలాటా మొదలైంది.. ఏమిటబ్బా అనుకుంటూ ఉంటె... పక్కనే సగం విరిగిన  సరూర్  నగర్ గణేష్ చెప్పాడు.. "ఏముంది... మనలో ఉన్న ఇనుము కోసం కాట్లాడుకుంటున్నారు. మట్టితో చేసి ఉంటె ఈ పాటికి నీటిలో కలిసి పోయి ఉండే వాళ్ళం కదా " అంటూ నిట్టూర్చాడు... 

బోలో గణేష్ మా రాజ్ కి ...జై ఐ ఐ ఐ ఐ అని అరుపులు ...

చైతన్యపురి గణేష్ అడిగాడు"ఏవిటి ఇంకా బడంగ్ పెట్ పెద్దాయన రాలేదా?" అని. "లడ్డు వేలం అయితే  కానీ కదల్చరంట" అని ఓ మూల నుంచి సమాధానం. "రేయ్ చిన్నగా, దేవుడిని అని కూడా చూడకుండా ఏవిటా పగలకొట్టడం. ఈ మనుషులకి బొత్తిగా మనసు లేకుండా పోయింది. మీరే తాయారు చేస్తారు, మీరే కొంటారు, మీరే పూజ చేస్తారు, మీరే ఈ మురికి నీళ్ళలో పడేస్తారు, మీరే పగలకొడతారు. మళ్ళీ నన్ను దేవుడు అంటారు." అని మొరపెట్టుకుంటున్నాడు. ఇంతలో ఠపీ మని శబ్దం, పైన జై గణేశా అన్న అరుపు... "క్షమించాలి" అని ఓ మూలకి సర్దుకుంటున్న బుజ్జి గణపతి...." చూసుకోవద్దా, ఏంటా తొందర.. బొప్పి కట్టింది" అని నుదురు రుద్దుకుంటూ అది అడిగాడు చై.పు గణపతి.. "మీరేనా, నేను కూడా మీ కాలనీ నే, ఏమనుకోవద్దు..." అని కరగడం మొదలుపెట్టాడు బుజ్జి గణపతి. "కెవ్వు కేక నా సామిరంగా కెవ్వు కేక, చాయ్ చాయ్..ఏస్కో నా గుమ గుమ చాయ్...పగలైన నాకు ఓకే, రాత్రైతే డబల్ ఓకే" అని పాడుకుంటూ ఓ గణపతి మునుగుతూ ఉన్నాడు ... అప్పటికే సగం విరిగి లోపలకి చేరుకున్నాడు చై.పు గణపతి... చుట్టూ వేల గణపతులు... తొండాలు, చేతులు, తలలు విరిగి ముక్కలు ముక్కలు గా పడి ఉన్నారు.. మనసు చివుక్కుమంది...

మట్టితో చేసి, ప్రకృతి లోని మంచి మొక్కలని పత్రి గా పెట్టి పూజ అయ్యాక నీళ్ళలో కలిపితే నీళ్ళలో ఔషధ గుణాలు పెరుగుతాయని పెద్ద వాళ్ళు చెప్తే, మీ ఇష్టానికి ప్రవర్తించి ప్రకృతి ని నాశనం చేస్తున్నారు... మళ్ళీ దేవుడిని నిందిస్తున్నారు... మిమ్మల్ని దేవుడు కాదు మార్చాల్సింది.. మీరే... లేనప్పుడు ప్రకృతి కోపాన్ని చూడాల్సిందే... అంటూ నీటి  అడుక్కి చేరుకున్నాడు చైతన్యపురి గణపతి....

(పక్కనే ఉన్న చెరువులో గణేష్ నిమజ్జనం చూసి వచ్చిన ఊహ... తప్పులుంటే మన్నించాలి)

0 comments:

Post a Comment