ఓ కథ - రెండవ భాగం

by 10:17 AM 0 comments
వినోద్ ది మా పక్క ఊరే.నాకన్నా రెండేళ్ళు జూనియర్. మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. వేరే ప్రాజెక్ట్. కాఫీ మెషిన్ దగ్గర కాఫెటేరియా లో కనబడితే కబుర్లు చెప్పుకుంటాం. "ఏంటి భయ్యా, వీళ్ళ గోల. తోముతున్నారు మరీ. ఫ్లాట్ కొన్నావటగా . పార్టీ  ఎప్పుడు?". నేను నవ్వాను."నవ్వితే కుదరదు, పెళ్లి రోజు కూడా ఇలానే తప్పించుకున్నావ్. నిన్ను కాదులే వదినని అడుగుతా" అన్నాడు. "ఓ రోజు చూద్దాం. ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వగానే". "నువ్వు మర్చిపోయినా  నేను మర్చిపోను. ఉంటా భయ్యా, మళ్ళీ మా లీడ్ వెతుక్కుంటా వస్తాడు.బై" అని వెళ్ళిపోయాడు. కొత్త ఇల్లు, నిజమే. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను?  కాఫీ మెషిన్ లో పెట్టిన కప్ నిండింది. కప్ తీసుకొని, నా కేబిన్ వైపు కదిలా. చుట్టూ చూస్తే నాలా చాలా మంది, మెషిన్ కి అతుక్కుపోయి నిర్జీవమైన యంత్రాల్లా పని చేస్తున్నారు. ఓ నవ్వు నవ్వుకొని, నా కేబిన్ లోకి వెళ్లాను. టీం మీటింగ్ ఉంది. ఇక నా పనిలో దిగిపోయా.

సాయత్రం 6 కి బయల్దేరాల్సిన నేను 8.30 కి బయలుదేరా. ఇంటికి వచ్చేసరికి 10 ఐంది. మధు వచ్చేసరికి 12 అవుతుంది. తనది UK షిఫ్ట్. ఇంట్లో అంతా శుభ్రంగా, అన్నీ సర్ది పెట్టి ఉన్నాయి. ఎంత ఓపికా, మనసు నవ్వింది. అలానే కూలబడ్డాను.మగత గా ఉంది.అమ్మ, అమ్మ కి కాల్ చేయాలి. రింగ్ చేసాను, ఎత్తలేదు. నిద్రపోయి ఉంటారేమో. మళ్ళీ చేయలేదు. కాసేపటికి అమ్మ నుంచి ఫోన్ "ఏ నాన్నా లేట్ అయిందా, తిన్నావా. అమ్మాయి ఇంకా రాలేదా?". "మా, నేను బావున్నాను. మధు ఇంకా రాలేదు. షిఫ్ట్ మారింది కదా. లేట్ అవుద్ది. నాన్న ఏం చేస్తున్నాడు? నీకు ఎలా ఉంది?". "మేం బావున్నాం రా. ఏం ఆలోచనలు పెట్టుకోకు.ఊరికి రావడానికి వీలౌతుందా? చూడాలని ఉంది"."నాకూ రావాలనే ఉంది మా. తనకి కూడా లీవ్ దొరకాలి." "సరే రా. వీలు చూసుకొని వచ్చి వెళ్ళండి." "అలాగే అమ్మ". మనసు నిండా ఏవో మాటలు, గొంతు నొక్కేసినట్టుంది. ఫోన్ ఇంకా డిస్కనెక్ట్ కాలేదు."మా","వంశీ, ఆలస్యమైంది రా. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉండనా"."అలాగేనమ్మా". డిస్కనెక్ట్ అయింది. మనసంతా వెలితిగా ఐంది. ఎన్ని కబుర్లు చెప్పే వాడిని అమ్మకి. రోజు ఎదో ఎడ తెగని మాటలు.వంట మొదలు పెట్టి తినిందాకా అలా సాగుతూనే ఉండేవి. నాన్న  ఉడుక్కునే వాడు, "ఏరా? ఏం మాట్లాడుకుంటారు మీరు." అని. "నీకెందుకు అన్నీ" అని మా అమ్మ ఓ విసురు విసిరేది. నాన్న పెదాల మీద చిరునవ్వు.

మా ఇల్లు.పెద్ద పెంకుటిల్లు, ముందో పందిరి, వెనకాల కూరగాయలు పండించుకోడానికి అనువైన స్థలం. ఇంటిముందు చాలా ఖాళీ స్థలం.రక రకాల మొక్కలు. రెండు కొబ్బరి చెట్లు. నీళ్ళ తొట్టి. ఆ తలపే హాయిగా ఉంది. ఎలా జరిగింది నా చిన్నతనం? నేను చెల్లి, అమ్మా నాన్న. మా ఇల్లు. అమ్మ, నాన్న ఎంత గుట్టుగా నెట్టుకొచ్చారు కాపురాన్ని? ఫలానా శ్రీనివాసరావు, ప్రభావతమ్మ అంటే ఎంత మంచి పేరు. మనసు తెలికపడటం మొదలు పెట్టింది.

మా ఊరు, మేము ఆడుకున్న చోటు, మా పొలం, ఎద్దులు, అమ్మ వాళ్ళ ఊరు. నాన్న గుర్తొచ్చాడు. ఎంత బావుంటాడు నాన్న? ఎంత మంచి కబుర్లు చెప్తాడు? తీరిక దొరికితే ఇద్దరం ఎంత బాగా మాట్లాడుకుంటాం. ఆయన ఆడిన ఆటలు, చేసిన అల్లరి, పడ్డ ఇబ్బందులు, ప్రకృతి గురించి... నాన్నలా, నాన్న అలా ఉండటం నాకే దక్కిన అదృష్టం ఏమో. ఆయనకి వచ్చిన ప్రతి పని నాకు నేర్పే వారు. అమ్మ.. నేనే అమ్మ ప్రపంచం. నాకు ఊహ తెల్సినప్పటి నుంచి అమ్మ ఎక్కడకి వెళ్ళినా నేను తోడు వెళ్ళే వాడిని. అలా అమ్మతో నడిచేప్పుడు నాకు నేనే ఓ రక్షకుడిలా ఫీల్ అయ్యవాడిని. నాన్న తిట్టే వాడు, వీడిని వంట గదిలో కూడా నీకు తోడుగా ఉంచుకో, అమ్మాయిలా అవుతాడు అని. నీకు కుళ్ళు అనేది అమ్మ.ఎక్కడ మంచి చొక్కా కనపడ్డా ఇది మా వాడికి ఎంత బావుంటుందో అని మురిసిపోయేది, ఎలా అయినా దాన్ని తెచ్చేది. మంచి అమ్మాయి కనిపిస్తే ఇలాటి పిల్లని తీసుకురావాలి వాడికి అని ఆశపడేది. ఎన్ని చేసినా తిరిగి అడిగేది చిన్న కోరికలే. అమ్మకి నాతో పాటు బైక్ మీద రావడం చాల ఇష్టం, నా కబుర్లు. నా కొడుకు అని చెప్పడం లో ఎంతో ఆనందం.

ప్రపంచాలు ఏలకపోయినా, వాళ్ళ కి ఏ నాడు మాట తీసుకురాలేదు. ఇద్దరం ఉన్నంతలో జాగ్రత్తగానే చదివాం. స్థిరపడ్డాం. ఏరి కోరి మధు ని కోడలు గా తెచ్చుకుంది. మధు కూడా మాలాటి కుటుంబం వచ్చిన అమ్మాయే. తను కూడా ఓ MNC లో జాబు చేస్తుంది. ఉద్యోగం రాగానే పెళ్లి ఏంటి, సెటిల్ కాకుండా అని ఎవరైనా అంటే. సెటిల్ అవడం అంటే వయసైపోయాక ఓ పది లక్షలు చేతిలో పెట్టుకొని  పెళ్లి చేసుకోవడమా? ఎ వయసులో ముచ్చట ఆ వయసులోనే అన్న అమ్మా నాన్నలని చూసి "మా అమ్మ నాన్నలు కదా " అని మురిసిపోయా. నాకు జాబు వచ్చిన రెండేళ్ళకి పెళ్లైంది.పెళ్ళైన ఓ సంవత్సరం తరువాత ఇద్దరం కలసి ఓ ఫ్లాట్ కొన్నాం. చాలా సంతోష పడ్డాను. మా నాన్న లా నేను కూడా ఓ ఇల్లు కొనాలని నా కల. అప్పటి వాళ్ళలా ఇప్పుడు ఇల్లు కొనలేకపోయినా ఓ ఫ్లాట్ కొనగాలిగాను.

జీవితం అంతా సాఫీగానే సాగిపోతున్నా, ఎదో తెలియని వెలితి. మనుషులు ఏరి? ఎదో అబధ్రతా భావం, కొరత. కాలమనే ప్రవాహం లో పడి కొట్టుకుపోతున్నట్టు,  మనసుకి స్పందన కరువైనట్టు... గుండె నిండా దిగులు గూడు కట్టుకొని మొహమ్మీద చిరునవ్వుని అతికించుకు తిరుగుతున్నట్టు.. దేనికోసమీ పరుగు? ఒక నెల పాటు స్థిమితం గా ఉండగలమా? ఎదో హడావిడి? కమ్యూనికేషన్ పెరిగే కొద్ది మనుషులు, మనసుల మధ్య దూరం పెరిగిపోతుంది.

నేను పెరిగిన వాతావరణం నా ఆలోచనలకి కారణమా? స్వచ్చమైన గాలి లేదు, నీరు లేదు,పలకరింపు లేదు.ఇప్పుడు కష్టపడుతున్నాం, కానీ శారీరక కష్టం లేదు. విపరీతమైన పని వత్తిడి. ఆలోచనలు. ఏం కావాలి బ్రతకడానికి? ఎందుకీ పాకులాట? నెలంతా పరిగెత్తి సంపాదించింది నెలాఖరుకి ఖర్చు అవుతుంది. బురద తో నింపిన చీకటి గదిలో బంధించినట్టు ఊపిరి సలపడం లేదు.

నా చిన్నప్పుడు చాల కష్టపడ్డాం అయినా ఇష్టం గా ఉండేది. అమ్మ నాన్న పొలం వెళ్తే నేను గొడ్లకాడ పేడకళ్ళు ఎత్తి, శుభ్రం చేసి, గొడ్లను కడిగి, నీళ్ళు పెట్టి, మేత వేసి ఇంటికి వచ్చే సరికి ఇందు వంట చేసేది. చిన్న పిల్ల గా  ఉన్నపటి నుంచే పని చేసింది ఇందు. అంత అయ్యాక అమ్మ వచ్చి నా పిల్లలూ బంగారం అంటే తెగ మురిసి పోయేవాళ్ళం. మా నాన్న మాకోసం ఎదోటి తెచ్చే వాడు. జామకాయలో, తేగలో, ఈతకాయలు, పండు దోసకాయలు ఏదోటి. అదే మాకు సంతోషం. చీకటి వేళ ఆరు బయట వెన్నెల్లో నులక మంచాల మీద పడుకొని చుక్కలు లెక్కపెట్టిన రోజులు. తలచుకుంటే మనసు తేలిపోతుంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆదమరచి నిద్రపోయేరోజు ఎప్పుడు వస్తుంది?

నిజమే ఈ వయసులో కాకుండా ఇంకెప్పుడు కష్టపడతాం? కానీ ఆ ప్రయత్నం లో  నన్ను నేను కోల్పోకూడదు, కోల్పోతున్న భావన. నాలో ఉండే పసితనం చచ్చిపోతున్నట్టు ఉంది. మాటలే మరచిపోతున్నా.ఉదయం ఆఫీస్ కి  వెళ్ళడం,పని, రావడం, నిద్ర.వారంతం లో ఏదైనా పని ఉంటె చేసుకోవడం. ఒంట్లో ఎదో నిస్సత్తువ. నేనేనా చిన్నప్పుడు అన్ని పనులు చేసింది? శరీరం లో కొన్ని భాగాలు పని చెయ్యడం మరచిపోతున్న భావన....దేనికోసమో ఎదురుచూపు. నేను పెరిగిన వాతావరణం నన్ను రమ్మని పిలుస్తుంది. నిజమే బ్రతకాలంటే ఎలా అయినా బ్రతకచ్చు. కాకపోతే అది ఎలా అని నిర్ణయించుకోవాల్సింది నేనే. నాకు ఊర్లో బ్రతకాలని ఇష్టం. అమ్మా నాన్న తో,నేను,మధు, నా పిల్లలూ, అత్త మావయ్య, పిన్ని బాబాయ్, తమ్ముళ్ళు..... ఇవన్నీ రేపు నా పిల్లలకి ఇవ్వాలి.

ఓ రకంగా నేను అదృష్టవంతుడిని. మా అమ్మానాన్న అంటారు "అంతలా జీవితాన్ని వదిలి పాకులాడాల్సిన పని లేదు, ఉన్న దానిలో సంతోషంగా బ్రతకచ్చు" అని.ఇప్పుడు  చాల మందిని  చూస్తున్నా, పిల్లలని కన్నది సంపాదించడానికే అన్నట్టు, "ఏం చేసావ్ మాకు" అని అడుగుతున్నారు. ఇంకా ఇబ్బంది పడే అంశం ఎంటటే, ఆడపిల్లల్ని కూడా ఇలానే అడుగుతున్నారు.
 ఒకటి నిజం, మా అమ్మానాన్న నాకు ఇచ్చిన భరోసా రేపు నా పిల్లలకి కూడా ఇవ్వాలి....

తలుపు చప్పుడైంది, మధు. టైం చూస్తే 12.30."ఏంటి ఇంకా తినలేదా?", "లేదు మధు, ఏంటి ఇంత లేట్?". "కాబ్, లేట్ ఐంది". "ఫ్రెష్ అయి రా, తిందాం "....

మర్నాడు, అమ్మ ఫోన్ నా దగ్గరకి వస్తున్నా అని. ఏదో సంతోషం, ఇంకా ఎదో దిగులు, కొంత ఎదురుచూపు......




Without emotion, man would be nothing
but a biological computer. Love, joy,
sorrow, fear, apprehension, anger,
satisfaction, and discontent provide
the meaning of human existence.
Arnold M. Ludwig---1980



మొదటి భాగం http://aakaasavaani.blogspot.in/

0 comments:

Post a Comment