మా రాజు గాడి ప్రేమ కథ - పోయేకాలం

by 3:18 PM 0 comments
ఇది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. వచ్చింది, మా గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది, మమ్మల్ని కూడా.....

అవి నేను, రాజు గాడు చదువుకుంటూ, ట్యూషన్ చెప్పుకుంటున్న కాలం... 100 రూపాయలు ఉంటె పండగ చేసుకుంటున్న కాలం... చేతిలో బాట్ బాల్ ఉంటె చాలు టైం అలా గడచిపోతున్న కాలం.... మాకు తెలియకుండానే, మా ప్రమేయం లేకుండానే మేం ఓ పెద్ద ఆపదలో ఇరుక్కుపోబోతున్నామని మాకు తెలీదు... ఆ విధంబెట్టిదన....

నేను మా ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన షెడ్ లో ట్యూషన్ చెప్పేవాడిని. ఓ 10 మంది పిల్లలు వచ్చే వాళ్ళు. రాజుగాడు వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో చెప్పేవాడు. కొత్త సంవత్సరపు సంబరాలు చేసుకుందాం పిల్లలతో అని నిర్ణయించుకున్నాం. పిల్లలంతా సరే అన్నారు. కొందరు పాటలు, కొందరు డాన్స్ ఇలా. మా రాజు గాడు వీర శూర చిరు ఫ్యాన్. ఎంత పెద్ద ఫానో రాయాలంటే ఓ పోస్ట్ సరిపోదు.అది ఇంద్ర సినిమా వచ్చి వీణ స్టెప్ తో చిరంజీవి చెడుగుడు ఆడుకుంటున్న రోజులు. మా వాడు కొత్త సినిమా రావడం ఆలస్యం, ఆ స్టెప్ నేర్చుకోడానికి. ఇక వీణ స్టెప్ ని విరిచి,చించి ఆల్రెడీ కాలేజి లో జూ.చిరు స్టాంప్ పడిపోయి మంచి ఫాం లో ఉన్నాడు. ఏదో మా పిల్లల కోసం డాన్స్ వేయడానికి ఒప్పుకున్నాడు. అదే స్పెషల్ అట్రాక్షన్. 

అది డిసెంబర్ 31. సాయంత్రం నుంచి నేను, రాజు గాడు, పిల్లలు  అలంకరణ పని లో ఉన్నాం. మా ఆంటీ వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. నేను నిచ్చెన ఎక్కి రిబ్బన్స్ అతికిస్తున్నా రాజు గాడు అందిస్తున్నాడు. ఎవరో తెలీదు కానీ ఓ పెద్దావిడ (పెద్దావిడ అంటే, వయసైపోయిన ఆవిడ కదండీ... పెద్దగా ఉన్న ఆవిడ (ఎవరి మనోభావాలు కించపరచడానికి కాదు)) కూడా సాయం చేస్తున్నారు. ఆవిడ కూడా రిబ్బన్స్ అందిస్తున్నారు. మా రాజు గాడు "ఆంటీ ఆ పచ్చ రిబ్బన్ ఇవ్వరా?", ఆవిడ ఓ చూపు చూసి "ఆంటీ నా? నేను కూడా స్టూడెంట్ నే" అంటూ విస విసా వెళ్ళిపోయింది.

అంటే ఆ ఆ అది మేము అలా అనుకోలేదు....అని.... తరువాత తెల్సింది ఏంటంటే ఆమె 10 వ తరగతి అంట,
 పేరు జాంబవతి( పేరు మార్చడమైనది.చాల హైట్, లావు, కారు నలుపు, ఒకింత భయం గొలిపే ఆకారం.) మా ఆంటీ వాళ్ళ చుట్టాలు. కింద ఇంట్లో ఉంటుంది.
సరే సర్దుకొని, సాయంత్రం ప్రోగ్రాం చించేసాం (ఎదో అలా). మా రాజు గాడు అతిధి పాత్రలో వీణ విరగ్గొట్టాడు. ఆ స్టెప్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆవిడ కి అదే ఆ అమ్మాయికి సారీ లు విన్నవిన్చుకున్నాం.
ఇక రోజులు సాఫీగా  సాగిపోతున్న సమయంలో, మా రాజు గాడు వచ్చి  "రేయ్, ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది" అన్నాడు. అమ్మాయి అనగానే చుట్టు పక్కల ఉన్న అందరు ఓ సారి మైండ్ లో తిరిగారు. ఎవరబ్బా? "ఎవర్రా?" వాడు కొంచెం ఇబ్బంది గా " అదేరా, ఆ రోజు ఆంటీ అన్నాం కదా"...:"జాంబవతా?" అని షాక్ లో నేను... "ఊ".... "ఎహే ఊరుకో, అంతా నీ భ్రమ, అదేం ఉండదు.. పట్టించుకోకు" అని సర్ది చెప్పా. మళ్ళీ కొన్ని రోజులకి అదే మాట, ఈ సారి చెయ్యి ఊపిందని.నాక్కొంచెం భయం మొదలైంది. వీడు వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ట్యూషన్ చెప్పి రాత్రి  8 ఆ ప్రాంతంలో వచ్చే వాడు. వచ్చాక ఇద్దరం కలిసి సైకిల్ మీద తినడానికి వెళ్ళే వాళ్ళం.
ఓ రోజు, ఇద్దరం రూమ్ లో ఉంటె రాత్రి 8 కి, మా చిన్నా గాడు (అప్పట్లో సన్నగా, అద్దాలు పెట్టుకొని ఉండేవాడు)వచ్చాడు. "రే,రాజుగా నిన్ను కింద ఆంటీ పిలుస్తుంది"  ఇద్దరం ఎగిరి పడ్డాం... రాజు గాడు సీరియస్ గా "ఎవర్ని రా?".. "నిన్నే".."జోక్ చేయకు?" "నిజం రా, నేను మెట్లు ఎక్కుతుంటే, ఏ బాబు అని పిలిచింది, నేను భయంగా వెళ్లాను. పైన రూమ్ లో రాజు ని పిలువు , అందిరా"... "ఎహే పోరా" అని వీడు తడబడే అడుగులతో కిందకి వెళ్ళాడు. నా సైకిల్ వాళ్ళ గుమ్మం పక్కనే పార్క్ చేసి ఉంటుంది. నేను కంప్యూటర్ లో ఏజ్ ఆఫ్మ్ ఎంపైర్ గేమ్   ఆడుతున్నా, చిన్న గాడు చూస్తూ ఉన్నాడు. ఇంతలో రాజుగాడు విసురుగా పైకి వచ్చాడు. వాడి చేతిలో ఓ పేపర్. "ఏంటి మామ, ఏమైంది?"..."రేయ్..()*#@()@#()... నాకు లెటర్ ఇచ్చిందిరా"...ఆ మాట వినగానే నేను, చిన్నాగాడు...
"నీ యబ్బ, ఆపండ్రా... ఏమనుకుంటుంది... ఆంటీ కి చెప్తా.." అని ఆవేశం తో ఊగిపోతున్నాడు... మేం కింద పడి ఇంకా నవ్వుతునే ఉన్నాం. ఇంకా నవ్వితే, వాడు ఏడుస్తాడని... వాడిని కూర్చోబెట్టి,"అర్జునా, సారీ రాజుగా ఆమె ఎదో చుట్టపు చూపుగా వచ్చింది, కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే, వాళ్ళ ఊరికి వెళ్ళి పోతుంది"..అని గీత ను బోధించాం. అప్పుడు అర్ధం కాలేదు మేము ఎంత పెద్ద తప్పు చేసామో,అది మా వాడికి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేసిందో.ఇంతకీ ఏం జరిగిందో చెప్పా లేదు కదూ, వీడు కిందకి వెళ్ళే సరికి ఆమె మెట్ల మీద వీడి కోసం కాపు కాసి ఉంది. వీడు మెల్లిగా సైకిల్ దగ్గరకు అడుగులేసాడు... దగ్గరకు రాగానే ఆ ఆకారం కదిలింది.వీడు వెనక్కి తగ్గాడు. "ఇలా రా!" "ఏంటి?" "చెయ్యి చాపు" "దేనికి?" "చాపు చెప్తా" వీడు చెయ్యి చాపడం, ఆమె చేతిలో ఓ కాగితం పెట్టి, సిగ్గుతో ఇంట్లోకి దూసుకెళ్ళడం క్షణ కాలం లో జరిగిపోయాయి. భూమి క్షణ కాలం కంపించి ఆగిపోయింది, వీడి గుండె లాగా.

 లేఖ లో ఏముందో చెప్పలేదు కదా? ఓ రూళ్ళ కాగితం మీద, పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది"I LOVE YOU, నీకు నేనంటే ఇష్టం ఉంటె రేపు ఉదయం ఓ రోజా పువ్వు పట్టుకొని బయట నిలబడు".... మళ్ళీ మొదలు...



వాడు ఆ లెటర్ చించేసాడు. తరువాతి రోజు నుంచి రాజు గాడు జాగ్రత్త పడ్డాడు. రూమ్ దగ్గర వంచిన తల వాళ్ళ మామ వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తే వాడు. ఈ క్రమంలో మధ్య మధ్య లో చేతులు ఊపడం, సైగలు అన్ని అయిపోయాయి. ఎ రోజు కా రోజు, వాడికి భయం పట్టుకోసాగింది. కింద నుంచి మా రూమ్ కి వచ్చే మెట్ల మీద లైట్ ఉండదు. అంతా చీకటి. ఓ రోజు వాడు ట్యూషన్ అయ్యాక రాత్రి 8 తరువాత  పైకి వస్తూ ఉంటె, ఆమె ఆ మెట్ల మీద నిలుచుని ఉంది. రాజుగాడు తడబడి తట్టుకొని నిలబడ్డాడు.

"ఏయ్, అడ్డం లే"... "నా సంగతి ఏం చేసావ్?'.."నువ్వు వచ్చిన పని చూసుకు వెళ్ళు".... అని తప్పించుకు వచ్చేసాడు.. పైకి వచ్చి ఒకటే ఏడుపు.. "మామా, ఈ టైములో రూమ్ కి రావాలంటే భయంగా ఉందిరా"...ఇక ఆ రోజు నుంచి ముందు వెనకా చూసుకొని రావడం మొదలు పెట్టాడు...

ఇంకోసారి, వాడు షెడ్ లో వంటరిగా దొరికాడు. "ఏంటి, ఏం చెప్పకుండా అలా తప్పించుకు తిరిగితే ఎలా?" "నీకేమైనా పిచ్చా ? ఆంటీ కి చెప్తాను"... అని రూమ్ కి వచ్చి కోపంతో ఊగిపోయాడు "ఇక నా వల్ల కాదురా, చెప్పేస్తా ఆంటీ కి" "మామా కంట్రోల్"....

ట్యూషన్ కి కింది పిల్లలు కూడా వచ్చే వాళ్ళు. ఓ రోజు వాళ్ళు "ఆ నరేషన్నా, జాంబి అక్క ఏంటి, నీ గురించి తెగ పొగుడుతుంది".....ఆఆయ్ 
 "నన్నా?" "నిన్నే, నీ చేతిలో కొట్టించుకోవడం, మా అదృష్టం అంట".... నాకేదో తేడా కొట్టింది.పెద్దగా పట్టించుకోలేదు.. టాపిక్ మార్చా....


హోలీ ఆ రోజు.ఆ రోజే నాకు తల బొప్పి కట్టబోతుందని తెలీదు....

తరువాయి భాగం

http://aakaasavaani.blogspot.in/2013/10/blog-post_6137.html

0 comments:

Post a Comment