మొక్కు

by 12:14 AM 1 comments
ఉఫ్, అమ్మా. రొప్పొస్తంది. ఆడ దాకా పోతానో లేదో. పెతి సారీ ఇట్నే అనుకుంటా, మొత్తానికి పోతా. ఈసారెందుకో వల్ల కావడం లా అంటూ పైకి చూసాడు తిరపస్సోమి. దూరాన గాలిగోపురానికి ఉన్న నామాలు నవ్వుతూ కనిపించాయి. తెల్సిన మనుషులు పలకరించినట్టుంది. మళ్ళీ ఓపిక తెచ్చుకొని అడుగు వేస్తూ ఉన్నాడు. ఉహు,  వల్ల కాడంలా. వయసైపోయింది కదా. ఉరామారిగ్గా 60 ఉండవూ, ఎల్లవ వచ్చినపుడు పుట్టానని అంటుండేది మా ముసల్ది. ఏడుకొండల వాడా వెంకరమణ గోవిందా గోవింద అప్రయత్నం గా నోట్లోంచి వచ్చేసింది. ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా   గోవిందా .
మజ్జాన్నం వచ్చా అలిపిరి కాడ్నుంచి ఇంకా ఈడ్నే ఉన్నా. కాసేపు కూసుంటే కానీ కదల్లేను అనుకుంటూ ఓ రాయి కి జరిగిలపడ్డాడు. పోతా ఉన్నారు పైకి జనాలందరూ. ముసిలోళ్ళు, కుర్ర పిలకాయలు, పసి బిడ్డలు. ఒక్కోర్ది ఒక్కో మొక్కు. కొత్తగా పెళ్లైనట్టుంది, పెళ్లి బట్టల్లో పోతన్నారు ఓ జంట. ఇంకో మొగుడు పెళ్ళాలు, బిడ్డని మెడ మీద కూసోబెట్టుకొని గోవింద నామాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకో కుర్ర పిల్లలు ముగ్గురు ఒకరు పసుపు, ఇంకొరు కుంకుమ, సివర పిల్ల కర్పూరం బెట్టి ఎలిగిస్తా ఉంది. అందరు వెళ్ళేది ఆయన కాడికే. నేనెప్పుడు వచ్చా మొదటి సారి?
ఎప్పుడ్నుంచో జుట్టు పెంచిన మా నాయన ఓ పాలి మొక్కు తీర్చుకోడానికి తిరపతి పోదామని గొడ్లని ఈరాసోమి కి అప్పజెప్పి మర్నాడు ఇంట్లో పూజ చేసి, మేళం పెట్టుకోని ఊరంతా తిరుగుతావుంటే అందరు వారు పోసి, దండం పెట్టి డబ్బులేసారు. అదేదో బలే ఉన్నింది అప్పుడు. ఆడ్నుంచి టేసన్ కాడికి వచ్చి రైలు రాక సానా సేపు ఎదురుచూశాం. మా అమ్మ చేసిన పులిహోర తింటా కూసున్నం.  రైలు వస్తాంటే ఎదో పెద్ద సంబడం. అదే ఫస్టు సారి రైలెక్కడం. అందరు గుంపులు గుంపులుగా తోసుకుంటా ఎక్కేరు. యాడ్నో కాస్త సోటు దొరికితే పిల్లోడ్ని అని కూసోబెట్టారు నన్ను. అదేదో ముసిల్దానిలా సిన్నగా పోతా ఉంది. యాడ బడితే ఆడ ఆగుతా. అయినా బాగున్నింది. దూరంగా కొండలు ఎవరో పడుకోని ఉన్నట్టు. అదే తిరపతని దింపినారు. గుడి యాడుందో ఎతుకుతా ఉంటె, సాన దూరం అని జెప్పినాడు మా నాయన. ఆడ నుంచి నడవాలంట. నేను మా నాయన, అమ్మ, మా సిన్నయ్య వచ్చాము. ఆడో పెద్ద గోపురం, ఇంకేంది గుడొచ్చేసింది అనుకున్నా. కాదంట అదే మొగదాల అన్నారు . పోతా ఉన్నాం. అడివి ఉన్నట్టుంది. అట్టా నడుసుకుంటా గుంపులు గుంపులుగా జనాలు. గోవింద నామాలతో హోరెత్తిపోయింది.గుండు చేయించుకున్నాం అందరం .  మొత్తానికి నల్లోడి దర్సనం ఐన్ది. అదో గొప్పఅనుభూతి . దేవుడంటే దేవుడే. నల్లటి మొహాన తెల్లటి నామాలు, చిన్నగా నవ్వుతు ఉండే మొహం. 

ఎప్పున్నా ఎవురన్న తిరపతి పోతంటే ఆళ్ళ కూడా పంపే ఓళ్ళు నన్ను . పెళ్లై నా కూతురు పుట్టినాక, మొక్కుకున్నా వస్తానని .  ఆడ్నించి పట్టుకుంది నాకీయావ. పెతేడు రావాల, ఆయన్ని సూడాల అని.  అప్పట్నుంచి పెతేడు నడిచే వత్తన్నా. కూతురుకి పెళ్లై  పొయిన్ది. మా ఆడది జబ్బు చేసి సచ్చిపోయింది . ఒక్కడనే, గొడ్డు కాయడం. ఉన్న కాత్తె పొలం సూసుకోడం . నాకు తొందరగానే ముసిల్తనం వచ్చేసినట్టుంది . నడవలేకపోతున్నా. 
"గోవిందా ఆ ఆ  గోవిందా " ఎవరో నన్ను లేపారు.. మళ్ళీ నడుస్తూ ఉన్నా... చీకటి పడుతుంది.జనాలు పల్చబడతన్నారు . నాకు ఎగసోస గా ఉంది. మొండికేసి నడుస్తానే ఉన్నా. మొక్కు తీర్చుకుంటానా ? ఏదో దిగులు. కాసేపటికి గుండెలో మంట, దడ. ఆగుదామని కూర్చున్నా . ఊపిరి అందడం లా. గొంతు పట్టేసినట్టుంది.ఎక్కిళ్ళు వచ్చాయి. దూరంగా నామాలు నవ్వుతూ ఉన్నాయి. మొక్కు తీరలేదు, అదే గమనం లో ఉంది. నల్లవాడి నవ్వు పిలుస్తూ ఉంది.  

ముందు వెళ్తున్న పెద్దాయన హఠత్తుగా కూలబడ్డాడు. దగ్గరకెళ్ళి కదిపి చూస్తే,తల వల్చేసాడు. ఖంగారు పుట్టింది. లేదు, అప్పటికే ప్రాణం పోయింది. ఎం చేయాలో తోచలేదు. అందరూ  గుమిగూడారు. పైన చాయ్ అమ్ముతున్న ఓ కుర్రాడిని  అడిగితే పోలీసులు ఉంటారు కొంచెం ముందుకు వెళితే చెప్పమన్నాడు . ప్రాణం ఉసూరుమంది . ముందుకు వెళ్లి పోలీసులకి చెప్పాను . వాళ్ళు నిట్టూర్చి కదిలారు. 


1 comment:

  1. బాగా రాశావు నరేషా...

    చివర్లో చిన్న కన్ఫ్యూజన్...

    ReplyDelete