పొగ మంచు

by 2:18 PM 1 comments
"ఎవరు కొనమన్నారు? అవసరమా ఇప్పుడు? ఒక్కమాటైనా చెప్పరా నాకసలు?ఉన్నవి తీర్చుకోకుండా... ", "ఏమని చెప్పాల్రా?"
"లేకపోతే ఏంటి మా?"
"ఇదిగో నాన్నకిస్తున్నా "
"ఏరా?"
"కాదు నాన్నా"
"చూడరా, అవసరం ఉంది.కొడుకువని ఓ మాట చెప్పాను. నువంత ఇబ్బంది పడి డబ్బులు పంపాల్సిన అవసరం  లేదు. ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిది." ఆయన అహం దెబ్బ తినింది. 
"నాన్నా, డబ్బు గురించి కాదు, అక్కడ కాకుండా ఇంకెక్కడైనా కొనచ్చు కదా."
సమాధానం లేదు... 
"సరేరా ఉంటా" అమ్మ గొంతు... 

మళ్ళీ రింగ్ చేశా.... ఎత్తలేదు... 

మనసంతా చిందరవందరగా ఉంది. ఏంటిది? ఎక్కడ తప్పు జరిగింది? నా ఉద్దేశ్యం మంచిదేగా.. ఎందుకు అర్ధం చేసుకోవడంలేదు. విసుగు, కోపం. ఫోన్ తీసి నేలకేసి కొట్టాలనిపించింది. ఎవరి మీద కోపం? అమ్మా నాన్న ల మీదా? కదిలిస్తే గొడవ పడదామని ఉంది. అసలు నా తప్పు లేనప్పుడు, నేను ఎందుకు ఫోన్ చేయాలి? అవసరం లేదు. 

 ఒక రెండు నిముషాలకి నాలో విజ్ఞత మేలుకొంది. ఎందుకు రావాలి నాకు కోపం?నేనేం కష్టపడ్డానని, నాకింత అసహనం? అమ్మానానే కదా? వాళ్ళు పడ్డ కష్టానికి, ఎదుర్కొన్న సమస్యలకి, వయసుకి కోపం వస్తుంది. ఓ మాట అంటారు, పడాలి. మళ్ళీ డయల్  చెసా.. అమ్మ ఫోన్ ఎత్తింది... 

"మా..,నా  ఉద్దేశ్యం అది కాదు "... 
"అవసరంలో ఉన్నామని నిన్ను అడిగాం రా, నీకు వీలైతేనే చూడు. లేకపోయినా పర్లేదు. మేం ఎలాగోలా సర్డుకుంటాం."
"నాన్నున్నాడా?"
"ఆయనకీ మాటాడ్డం ఇష్టం లేదురా,సరే ఉంటా" ఫోన్ డిస్కనెక్ట్ అయింది.. మనసంతా బాధ. గుండె గోడలని లోపల ఎవరో పట్టుకొని రక్కుతున్నట్టుంది.  

వీర్రాజు, చిన్నమ్మ ల  కొడుకు  శంకరం. ఒకడే కొడుకు. చదువుకొని పట్నం లో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం లో అనుబంధం ఎక్కువ. వీర్రాజు, చిన్నమ్మ లు ఊర్లోనే ఓ చోటు కొన్నారు. కొంటున్నామని శంకరానికి ఓ మాట చెప్పారు. కొనాలా వద్దా అని అడగలేదు. ఉన్న డబ్బే కాకుండా, కొంత బయట తెచ్చి ఆ చోటు కి కట్టారు. శంకరానికి మనసులో ఎక్కడైనా టౌన్ లో కొంటె బాగుంటుంది కదా అని ఆలోచన. ఉత్తరోత్తరా ధర పెరుగుతుంది కదా! పల్లెటూర్లో ఏముంటుంది అనిపించింది. సరే అమ్మానాన్నల ఆలోచన కాదనలేకపోయాడు. ఇప్పుడు బ్యాంకు లో ఎప్పుడో తీసుకున్న లోన్ తాలుకు బాకీ కట్టమని బ్యాంకు వాళ్ళు నెత్తిన కూర్చున్నారు. వీర్రాజు కి ఎం చేయాలో పాలు పోలేదు. తన దగ్గర ఉన్నది,తెల్సిన వాళ్ళ దగ్గర తీసుకొని ఆ చోటు కి కట్టాడు. ఇప్పుడు తన దగ్గర లేవు. బ్యాంకు వాళ్ళు ఇంటికి వస్తే పరువు పోతుంది. ఎప్పుడు కొడుకుని నోరు తెరిచి అడగని వాడు, డబ్బు ఏమైనా ఉందేమో చూడమని అడిగాడు. శంకరం దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ తనకి చెప్పకుండా ఇలాటి నిర్ణయం తీసుకున్నారే  అన్న ఉక్రోషం. ఆపుకోలేక అనేసాడు. ఈ మాటలు వీర్రాజు ని బాధపెట్టాయి. నిజమే కదా, ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటె బాగుంటుంది అనిపించింది వీర్రాజు కి. వాడితో మాట్లాడాలంటేనే ఏదోలా ఉంది. మనసు రాలేదు. నా కొడుకు అందరి లాంటి వాడు కాదు అన్న నమ్మకానికి బీటలు వారాయి. కష్టం లో ఉన్నప్పుడు చిన్న మాట కూడా కఠినం గా ఉంటుంది. ఏదైతే అది అవుతుందని వదిలేసాడు. బాధ మిగిలిపోయింది, దిగులు పెరిగిపోయింది. 

ఓ రెండు రోజుల తరువాత వాడు వస్తున్నా అని ఫోన్ చేసాడు. ఎప్పుడు వెళ్లి నేనే తీసుకు వచ్చే వాడిని, కాని మనసు రాలేదు. వాడిని తీసుకురమ్మని బుజ్జోడికి చెప్పాను. చీకటి పడే వేళ కి వచ్చాడు. పసి వాడిలా కనపడే నా కొడుకు పరాయి వాడిలా కనిపించాడు. వాడి నవ్వు వెనక ఏదో స్వార్ధం దాగుందని అనిపించింది. మనఃస్పూర్తిగా మాట్లాడలేకపోయా. చిన్నమ్మ మాత్రం మాట్లాడుతూనే ఉంది. దానికి లోపల బాధ ఉన్న బిడ్డని చూసిన ఆనందం. 
పొద్దున్నే వాడు ఏదో మాట్లాడాలని చూస్తున్నాడు కానీ నేనే ముభావంగా ఉన్నా. ఎంత మాట్లాడలనిపించినా, నా మనసు వెనక్కే లాగుతుంది. ఈ మధ్యన ఏదో సుస్తీ చేసి వాళ్ళంతా ఒకటే నెప్పులు. పడుకొని ఉంటె వాడొచ్చి కాళ్ళు నొక్కాడు. వద్దన్నా వినలేదు. వాడెప్పుడూ చేసే పనే ఇపుడు ఇష్టంగా లేదు. 

నాన్న ముభావంగా ఉండటం అర్ధం అవుతూనే ఉంది.అమ్మ మాత్రం మాట్లాడుతూ ఉంది. అటు నాకు నాన్నకి సర్దిచెప్పడానికి చూస్తుంది.  తప్పు నాదే. నాకు నేనే స్వార్ధపరుడిలా అగుపిస్తున్నా. అక్కడ  ఉన్నప్పటి కోపం కరిగిపోయింది. అమ్మా నాన్నల్ని చూసాక, నేను కాకపోతే ఇంకెవరు తీరుస్తారు. ఇదే కదా బాధ్యత తీసుకోవడం అంటే. అలా తీసుకోనపుడు నేను ఉంటె ఎంత లేకపోతే ఎంత. ఎలా అయినా అమ్మా నాన్నలని మాములుగా చేయాలి. శనగ వేసాం ఈ యేడు. ఎలా మొలిచిందో చూడ్డానికి నాన్నతో పాటు వెళ్ళా. నేనే బండి నడుపుతూ ఉన్నా, నా వెనక నాన్న. "నాన్న, బ్యాంకు వాళ్లతో మాట్లాడావా?". సమాధానం లేదు. "ఈ రోజు వెళ్లి మాట్లాడి వద్దాం". ఎం మాట్లాడలేదు. పొలం వెళ్లి వచ్చాం. ఆ మధ్యలో పొడి పొడి గా నలుగు మాట్లాడాడు నాన్న. అమ్మ కూర్చోబెట్టి సర్దిచెప్పింది నాన్నకి. పిల్లోడు అన్న మాటలు పట్టించుకోవద్దు అని. నాన్న ని తీసుకొని బ్యాంకు కి వెళ్లాను. ఆఫీసర్ తో మాట్లాడి ఎంత కట్టాలో కట్టి వచ్చా. ఏదైనా బ్యాంకు విషయాలు ఉంటె, నాకే ఫోన్ చేయమని వచ్చా . నాన్న తేలికపడ్డాడు. మరుసటి రోజు పొగ చేను దున్నటం. కలుపు పోవడానికి. నేను కూడా వస్తా అని చెప్పా. ఎద్దులు తోలుకొని, రెండు అడ్డ లు వేసుకొని వెళ్లాం. దాదాపు 7 ఎకరాలు, రెండు రోజులు పట్టింది. నాన్న మామూలు ఐపోయాడు. ఎప్పటిలా మాట్లాడుతున్నాడు.తన బాల్యం, ఆయన పడ్డ కష్టం, ఆడిన ఆటలు చెప్తున్నాడు. అవన్నీ నాకు తెల్సినవే.కానీ మా నాన్న చెప్తున్నట్టు లేదు, నా కొడుకు చెప్తున్నట్టుంది. మనసు పొరల్లో నిండిన పొగ మంచు విడిపోయింది. అలవాటు తప్పి చేతులుపోటు పుడుతున్నా నాన్నతో కలిసి పని చేయడం సంతోషమనిపించింది . నాన్న కూడా బాధ పడ్డాడు, నా చేత పని చేయిస్తున్నందుకు. ఆ నొప్పులు, కష్టం ఆయన ప్రశాంతత ముందు ఓడిపోయాయి. నాకు సంతృప్తి ని మిగిలిచాయి.  

 చిన్నమ్మ కొడుకుని చూసుకొని సంబరపడిపోయింది. నా మనసులో కూడా గర్వం. తొందరపడి వాడిని అపార్ధం చేసుకున్నానేమో అనిపించింది. కాని ఈ సంఘటన మమ్మల్ని ఇంకా దగ్గర చేసింది. శంకరం సంతోషంగా ఊరికి వెళ్ళిపోయాడు. 




1 comment: