ఓ కథ - ముగింపు

by 8:01 PM 0 comments
" ఏది కావాలో తెల్సినపుడు, ఏది వదిలేయాలో తెల్సి వస్తుంది"

మొదటి రెండు భాగాల కోసం.... 
1http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_6126.html
2. http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_30.html

రాత్రి బస్సు ఎక్కగానే అమ్మ ఫోన్ చేసింది, ఉదయం 5 ఆ ప్రాంతం లో దిగుతారని. పడుకునే సరికి ఆలస్యమైంది. ఓ గంట నిద్ర పోయి ఉంటా, ఇక నిద్ర పట్టలేదు. పది నిముషాలకి ఓ సారి మెలుకువ వస్తుంది. అమ్మ వచ్చినట్టు, నేను లేచి వెళ్తున్నట్టు... ఇలా. 3 నుంచి 5 అవడానికి పది గంటలు పట్టింది.  ఇక నిద్రపట్టక బస్టాండ్ కి వెళ్లాను. ఓ అరగంట తరువాత వచ్చింది బస్సు. అమ్మ, నాన్న  డోర్ దగ్గరే నిలుచుని ఉన్నారు. అమ్మ అక్కడ నుంచే చేయి ఊపుతూ. దిగగానే చెంపలు నిమిరి నీళ్ళు నిండిన కళ్ళతో చూసుకుంది. తెలీకుండానే నా కళ్ళలో నీళ్ళు. సామాన్లు దింపుతున్నా నాన్న మమ్మల్ని చూస్తూ ఉన్నారు. నాకు నాన్నకి సాయం చేయాలనీ ఉంది, కాని అమ్మని చూస్తు అలానే నిలుచుని ఉన్నా. "ఆటో పిలవరా" నాన్న. అప్పటికే చుట్టూ చేరిన ఆటో వాళ్లలోంచి ఒకరిని పిలిచి ఇంటికి వచ్చేసాము.నాన్న ఆటో లో వస్తే అమ్మనాతో బైక్ మీద. నా భుజం మీద చేయి వేసిన అమ్మ స్పర్శ లో ఏదో తెలియని భరోసా. 

అమ్మ, మధు తినడానికి తెచ్చినవి సర్దుకుంటూ ఉంటే నాన్న, నేను కలిసి షటిల్ ఆడటానికి వెళ్లాం. నాన్న ఊర్లో విషయాలు, మారుతున్న పద్ధతులు, మనుషుల ఆలోచనలు చెప్తున్నాడు. మార్పు సహజం , కానీ ఆ మార్పు మనుషుల మధ్య సంబంధాలని విచ్చినం చేస్తూ ఉంది. ఒకప్పుడు వ్యవసాయ కోసం తవ్వుకున్న కుంటల్లో ఉన్న నీళ్ళను తెచ్చుకుని తాగే వాళ్ళం . అవి చాల బాగుండేవి. నీళ్ళు అంటే అవే అనే అనిపించేది. "ముత్యాల గుంట లో నీళ్ళు వాడుతున్నారా నాన్నా?", "ఇపుడెవర్రా? అందులో వెంకటస్వామి పడి చచ్చిపోయాడు." ఆశ్చర్యం, ఓ రకంగా మాకు చుట్టాలు కూడా అవుతారు. "దేనికి?" "ఏముంది రా, వయసొచ్చిన కొడుక్కి ఆస్తి పంచకపోవడం ఆయన తప్పయితే, సంపాదించుకున్నది ఉన్నా కూడా ఆస్తి పంచలేదని వయసైపోయిన తండ్రిని చూడని కొడుకు. ఎవర్నీ తప్పు పట్టలేం". ఓ నిట్టూర్పు. ఎం జరుగుతుంది. 


ఆ రోజు అందరం కలిసి బయటకి వెళ్లాం. అమ్మ,మధు చీరలు కొన్నారు. నాన్నకో చలికోటు. అమ్మ నాకు గాగుల్స్ కొనిచ్చింది . అక్కడ నుంచి రెస్టారెంట్ కి వెళ్లాం. ఏదో తెలియని నిండుతనం, సంతృప్తి. ఇంటి మీదకి వెళ్లి కూర్చున్నాం. అపుడే ఎండాకాలం మొదలౌతుంది. పౌర్ణమి నిన్ననే ఐపోయింది, చంద్రుడు మెల్లగావెన్నెల జల్లుతూ వస్తున్నాడు. పక్కన ఉన్న లేక్ మీద నుంచి చల్లని గాలి.   "ఉద్యోగం ఎలా ఉంది రా?", "బావుంది నాన్నా!". "ఇష్టంగానే చేస్తున్నావా?","ఇష్టం తో సంబంధం లేదు నాన్నా, మా చదువుకి, మేము చేయగల ఉద్యోగం ఇదే. ఇది తప్ప ఏం చేయలేం, వేరే పని చేత కాదు.". "నీలో ఏదో నిరాసక్తి రా. ఇంతకు ముందెన్నడూ చూడలేదు ". మౌనం నా సమాధానం ఐంది. నాన్నే కొనసాగించాడు "ఉద్యోగం చేయడం తప్పు కాదు రా, కాని దారిలో నిన్ను నువ్వు కోల్పో కూడదు. నిజమే, మేము నిన్ను పెంచినపుడు నువ్వు మాతో ఉంటావని, ఉండాలని పెంచలేదు.ఎక్కడ  ఉన్నా బాగుండాలని అనుకున్నాం. కానీ సంపాదన మనుషుల్ని , మనసులని చంపేస్తుంది ఏమో రా. సంపాదన అవసరం కానీ, దానికోసం జీవితంలో నిర్లిప్తిత, నిస్పృహ నిండిపోకూడదు. ఏదోలా బ్రతకడం వేరు, ఆ జీవితాన్ని ఆస్వాదిస్తూ బ్రతకడం వేరు. ఇలానే ఉంటె రేపు నీ పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వగలవేమో కానీ వాళ్ళకోసం సమయం పెట్టలేవు. వాళ్లతో గడపలేవు. నాన్నని చూస్తూ పిల్లలు పెరగాలి కానీ నాన్న చేస్తుంటే తిని పెరగకూడదు . ఇక్కడ ఉండి అమ్మాయి,నువ్వు కల్సి సంపాదిస్తున్నది మీరు కొన్న ఫ్లాట్ కి, మీ ఖర్చులకి సరిపోతుంది. రేపు మీ పిల్లలు వస్తే మీరు ఇంకా సంపాదించాలి. ఇపుడు ఖర్చులు అలానే ఉన్నాయి. ఆ ఒత్తిడి ని తట్టుకొని నిలబడి గెలవాల్రా . ఎందుకు ఆ ఒత్తిడి ని అనుభవిస్తున్నవో, ఓ సారి ఆలోచించు. మేం చేసిందే మీరూ  చేస్తున్నారు. మేము సంపాదిచేప్పుడు ఇబ్బందులు పడ్డాం రా, అది కుటుంబం తరువాతే. నాకు తెల్సు , నీకు చెప్పాల్సిన అవసరం లేదు. " ఒక్క నిముషం ఆపాడు. చంద్రుడు పైకి వచ్చాడు. చల్లని వెన్నెల. లేక్  అవతల లైట్లు, లేక్  మీద మెరుస్తూ ఉన్నాయి. 

నాన్నచెప్పడం మొదలు పెట్టాడు. "మధు గారు తెల్సు కదా? అదే మన రిలయన్సు లో పని చేస్తారు. మొన్న మాటల్లో అన్నారు, మన జిల్లా లో ఆ ఏరియా సేల్స్ మేనేజర్ కావాలంట. ఏం  చేయాలంటే, రైతులతో మాట్లాడి వాళ్ళ చేత కూరగయలు లేదా ఏదో పంట, వీళ్ళ పద్ధతుల్లో పండిస్తే ఆ పంట ని వీళ్ళే కొంటారు. నీతో పాటు ఇంకొందరు ఉంటారు. మన జిల్లలో రైతులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి,  అది అంతా  నువ్వు చూసుకోవాలి. అది ఈ మధ్యనే మొదలు పెట్టారు. అన్నీ కలిపి ఓ ముప్పై వేల దాక రావచ్చు. నీకు ఇష్టం ఉంటె నేను మాట్లాడతాను . వచ్చేస్తావా ?" నాన్న నా కళ్ళలోకి చూడడం  లేదు. నాకు అర్ధం అవుతుంది, ఈ మాట చెప్పడానికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో.   ఆ మాట విన్నప్పుడు నాకు అంతా స్తంభించినట్టుంది. నేను చదివిన చదువు, చేసే ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని తలచుకుంటే  నేనా? అనిపించింది. మరి మధు? ఆలోచనలతో పాటు నా గుండె వేగం పెరిగింది. వెనక చిన్న అలికిడి. మమ్మల్నే చూస్తూ నిలుచుని ఉన్న అమ్మ. దగ్గరకి వచ్చి నా భుజం మీద చేయి వేసింది. ఏదో తెలియని నెమ్మది. చిన్నప్పుడు బాగా జ్వరం వచ్చినప్పుడు అమ్మని చుట్టుకొని పడుకున్నప్పుడు కలిగిన స్వాంతన. అది అమ్మ వల్లే అవుతుంది. "ఏ  నాన్నా? నీకు ఇష్టమేనా ." . "అమ్మానిర్ణయం నాది ఒక్కడిదే కాదు, మధు ని కూడా అడగాలి కదా ? ". "అమ్మా, మధూ ?". మెట్ల పక్కన నిలుచి ఉన్న మధు. "అమ్మాయికి నేను చెప్పాను రా. మీ ఇద్దరూ  మాట్లాడుకోండి. తరువాతే మీ నిర్ణయం చెప్పండి."  నాన్న అన్నాడు "అమ్మా, మా ఉదేశ్యం నీకు అర్ధం ఐంది అనుకుంటున్నాను, సరే పద ఆలస్యం ఐంది , పడుకుందాం. " 

నా ఇంకో జీవితానికి నాంది పడింది. ఇద్దరం మాట్లాడుకొని, నా 3 నెలల ఆన్సైట్ తరువాత ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం.

  

*** ఇది నా ఆలోచన మాత్రమే. నిజం కావడం కష్టం కాదు, నిజం చేసుకోవడం కష్టం *****






0 comments:

Post a Comment