చిన్న చిన్న మాటలే చిలికి చిలికి గాలి వాన అయి
మనఃస్పర్ధలు వచ్చి గొడవ పడుతుంటారు భార్యాభర్తలు...
అవును నిజమేనోయ్, అరే నువ్వు చెప్పింది విన్నాక
ఇదే బాగుంది, ఈ చీర/షర్ట్ చూసినప్పుడు కన్నా నువ్వు వేసుకున్నాక బాగుంది కదా ఇలా
అనుకోవడం వినడం అరుదు....
భార్య అడుగుతుంది, “ఏవండీ(అండీ లు ఉన్నాయా అని
అడక్కండి, అనుకుందాం కాసేపు) పొద్దున్నే గుడికి తీసుకెళ్ళరా?”, భర్త రాత్రంతా టీవీ
చూస్తూ మేలుకొని “నాకు కుదరదు, ఇంకేపుడైనా వెళ్దాం” అంటాడు. భార్య బయటకి
ఏమనకపోయినా రోజు వారీ ఇంటి పనులల్లో మార్పు వస్తుంది. అది కూరలో ఉప్పు కావచ్చు, తన
చేతిలోంచి జారిపోయే కిందపడే పళ్ళేల శబ్ధం కావచ్చు.
ఇంకో సారి పండక్కి బట్టలు కొనడానికి పండగ వారం
ఉందనగా ,షాపింగ్ కి వెళ్దాం అని మొదలు పెడతారు. అబ్బాయిలు తెమలరు కదా. ఆఫీస్ నుంచి
ఆలస్యంగా వచ్చి, ఆలస్యం అవడానికి ఎన్ని కారణాలు చెప్పొచ్చో అన్ని కారణాలు చెప్తారు.
ఎప్పుడు ఆఫీస్ కి రాని బాస్ ఆ రోజే వస్తాడు, కొత్త ప్రాజెక్ట్ వస్తుంది,బైక్ పంచర్
హబ్బో అప్పుడు వినాలి బహానాలు అన్నీ. పండగ వచ్చేస్తుంది. అప్పుడు హడావిడిగా వెళ్ళి
ఏదో చీర కొనుక్కొని వస్తే అది బావున్నా కూడా నచ్చదు. ఇంకా చూసి ఉంటే ఇంత కన్నా
మంచి చీర దొరికి ఉండేదేమో అని ప్రాణం లాగుతూ ఉంటుంది. ఎదురుగా కాళ్ళు సోఫా లో
బార్లా చాపుకొని ఊపుకుంటూ వాళ్ళ ఆఫీస్ లో ఫలానా అమ్మాయి కట్టుకొచ్చిన చీర కి ఆ
అమ్మాయి వల్ల ఎంత అందం వచ్చిందో వర్ణిస్తూ ఉన్న భర్తని చూస్తే , అప్పుడు ఆ భార్య
మనసులో మాటలు బయటకి వినపడితే ఇక ఎ అబ్బాయి ఇంకో సారి అలా చేయడేమో. అలా అడక్క ముందే
“అరే పండగ వస్తుంది కదా, పద చీర కొనుక్కుందాం” అని అనమనండి. ఐదు వేలు ఖర్చు పెట్టె
ఆడ వాళ్ళు మూడు వేలకే చీర కొంటారు. ముప్పై సార్లు మా ఆయన అడిగి మరీ కొనిచ్చాడు అని
చెప్పుకుంటారు. అప్పుడు టీ లు , టిఫిన్ లు అబ్బాయిలు కూర్చున్న దగ్గరకే వస్తాయి
విత్ స్మైల్. కానీ అనరు కదా. అబ్బాయిని బతిమాలుకోవాలి, ఓ పది సార్లు గుర్తు
చేయాలి. ఎప్పుడైనా కొనిచ్చేదే, ముందే అడిగి మరీ కొనిద్దాం. పోయేదేముంది డ్యూడ్
వంటలు రుచిగా ఉంటాయి,ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
“అస్సలు ఈ రోజు ఓ అమ్మాయి చేరింది ఆఫీస్ లో,
అబ్బబ్బా ఏముంది అనుకున్నావ్.అసలు ఎలా ఇలా మైంటైన్ చేస్తారంటావ్?” అని ఓ పది
సార్లు ఇంట్లో తిరుగుతూ గుర్తు తెచ్చుకొని ఆగి మరీ “అబ్బబ్బబ్బా” అని అంటూ ఉంటే ఓ
భార్య బాధ వర్ణనాతీతం. దాని కన్నా “ఓ కొత్త అమ్మాయి చీర కట్టుకొచ్చింది, ఆ అమ్మాయి
హైట్ కి ఆ చీర సరిపోలేదబ్బా, నీకైతే బావుండేది. అది కూడా లైట్ కనకాంబరం మీద వైట్
బోర్డర్.ఈ సారి వెతుకుదాం నీకు.” అని అంటే, చీర ఎప్పుడు కొంటారు అని అడగడం పక్కన
ఉంచి వాళ్ళ మొహం చూడండి. అది అబద్ధం అని తెల్సినా కూడా ఓ నవ్వు దోబూచులాడుతూ
ఉంటుంది. మనం అనం కదా. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం చెప్పాలి. బయట కళ్ళప్పగించి
చూసేంత అందం ఉన్న లేదా అందంగా కన్పించేలా ఉన్న ఏ అమ్మాయీ 90 శాతం ఇంట్లో అలా ఉండకపోవచ్చు.
ఒక పిచ్చి నైటీ వేసుకొని,జుట్టు ముడేసుకొని,తల గీక్కుంటూ,అప్పుడపుడు ముక్కు
గెలుక్కుంటూ ఇంట్లో తిరుగుతూ ఉంటే మాములుగానే ఇంత కన్నా దారుణంగా ఉండే అమ్మాయిలు
కూడా మేకప్ వేసుకొని వచ్చి అబ్బాయిల
కళ్ళకి హప్సరస ల్లా కనిపిస్తారు. “ఆ మాకు ఎక్కడ కుదురుద్ది, సింగారించుకొని
కూర్చుంటే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు.” అంటారు చాల మంది అమ్మాయిలు. నిజమే కానీ,
ఓ వారం ప్రయత్నించి చూడండి, తరువాత “ఏంటి నైటీ వేసుకున్నావ్, మొన్న ఆ చీర బావుంది
కదా” అని అడక్కపోతే.
జీతం మొత్తం ఏం చేస్తున్నాడు? అని లోపల ఉన్నా
కూడా అడక్కుండా ఎప్పుడో ఓ సారి భళ్ళున బయటపడి “అసలు ఇంట్లో ఏమౌతుందో మీకు తెల్సా?
ఎన్ని ఖర్చులున్నాయో, ఏమేం కావాలో. నకదంతా తెలీదు. నాకు ఓ పది వేలు కావాలి” అని ఓ
భార్య అంటే. ఖర్చుల పురాణం విప్పకుండా “అవును నిజమే, నా పనుల్లో పడి నేను
మరచిపోతున్నా, నువ్వు ఎంత పడుతున్నావో తెలీదు. ఓ మాట ముందు చెప్పు నేను మనీ ఇస్తాను
లేదా ఈ కార్డు నువ్వు వాడుకో ” అని చూడండి(దాని కన్నా ముందు ఇంట్లో అవసరాలు
తెల్సుకొని చూసుకోవాలి). ఎంత మార్పు ఉంటుందో. అలా కాకుండా గొడవ పడితే ఒక రోజుని
లేదా ఒక వారపు సంతోషాన్ని ఈ చిన్న గొడవ పెద్దదై తినేస్తుంది.
వాళ్ళ అమ్మానాన్న(అత్తా మామ అనరేమో) వస్తే, మన అమ్మా
నాన్న తో ఉండే తీరు కి వాళ్ళ అమ్మ నాన్నతో ఉండే తీరుకి ఉన్న తేడా తగ్గిస్తే
ప్రేమలు పెరుగుతాయి.నా స్నేహితుడి భార్య
ప్రతి దసరా కి వాళ్ళ అత్త మామకి ఆడపడుచుకి బట్టలు పెడుతుంది. డబ్బులు
వీడివే,ప్రయత్నం ఆమెది. అమ్మాయికి బట్టలంటే అబ్బాయి ఆలోచిస్తాడు కానీ అమ్మ వాళ్ళకి
అదీ ఏడాదికి అంటే ఇక మీ ఇష్టం.
కొందరు అంటారు , అమ్మాయి తన జీతాన్ని “నా జీతం”
అని ,అబ్బాయి జీతాన్ని “మన జీతం ” అని అంటుందని. పై వాటిలో బాగున్న వాటిని ఏరుకొని
చేసి చూస్తూ “మన” అన్న మాట పదే పదే వినిపిస్తుంది, అనిపిస్తుంది.
ఇప్పటికి ఇంతే మళ్ళీ కలుద్దాం.
గమనిక: ఎవరి మనోభావాలు దెబ్బ తిన్నా నేను బాద్యుడిని కాను, సరదాగా రాసింది మాత్రమే.
very nice
ReplyDeleteThank you Madhu babu garu..happy to see your comment..
Deleteబాగా చెప్పారు. బావుంది. :-)
ReplyDeleteThank you Sisira garu
Delete