ఓ ప్రయాణం - 2

by 9:09 PM 1 comments

ప్రయాణం లో మొదటి భాగం,

http://aakaasavaani.blogspot.in/2014/06/blog-post.html


ఓ ప్రయాణం -2 


వంశీ ఉదయాన్నే ఆఫీసు కి  వెళ్ళే సరికి  చాలా మంది ఇంకా ఆఫీసు కే రాలేదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ ఏరియా లకి వెళ్ళిపోయారు. ఎవరో కొందరు  ఉన్నారు.  తనకి ఇచ్చిన రూం కి వెళ్లి కూర్చున్నాడు. ఎసి శబ్దం మెల్లగా వినిపిస్తుంది. సీట్లో వెనక్కి వాలి ఆలోచనల్లోకి జారుకున్నాడు.


వంశీ ఊరికి వచ్చాక చాలా మంది మొహాన్నే నవ్వారు. కొందరు మాత్రం మొహమాటానికి తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అన్నింటికీ తన నవ్వే సమాధానం ఐంది. మధు బాధగా ఉన్నా, వంశీ ఆలోచన సరైనదే అన్న భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. రోజు పరిగెట్టడం లేదు. ఒక ప్రశాంతత. ఉదయాన్నే నాన్నతో కలిసి పొలం వెళ్ళడం, ఏవైనా చిన్న చిన్న పనులుంటే చూసుకోవడం. ఆఫీసు కి తయారై నాన్న ని నర్సరీ దగ్గర వదిలి వెళ్ళిపోయేవాడు .


ఎలాగైనా నిలబడాలి. దేనికోసమైతే ఉద్యోగాన్ని వదిలి వచ్చాడో దాన్ని సాధించాలి. ముందు ఉద్యోగం లో స్థిరపడాలి. తన కింద పని చేసే వాళ్ళందరిని పిలిచి మాట్లాడడం మొదలు పెట్టాడు. చాల మందిలో పని చేయాలన్న ఆసక్తి లేదు. వచ్చి వెళ్తున్నారు అనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఈ జిల్లా నుంచే ఆశించిన ఫలితాలు రావడం లేదు. అందరి మాటల్లో తెల్సింది ఏవిటంటే రైతులు కూడా ఆసక్తి గా లేరని. పని ఏమిటంటే,రిలయన్సు వాళ్ళు రైతుల నుంచి కాయగూరలు కొంటారు. దాని కోసం లోన్,విత్తనాలు,ఎరువులు ఇస్తారు.వాళ్ళకి కావాల్సిన రీతిలో పండించాలి .పండించిన పంటలో నాణ్యత లేకపోతే తీసుకోరు. ఇది ప్రజల్లోకి వెళ్ళలేదు. కారణాలు, చాల మంది కౌలు రైతులు కావడం, కౌలు చాల ఎక్కువగా ఉండటం. వ్యవసాయం చేయాలన్న ఆసక్తి లేకపోవడం (ఆదాయం లేక). ప్రకృతి వైపరిత్యాలు, రియల్ ఎస్టేట్ ప్రభావంతో పొలాలు అమ్ముకోవడం, వ్యవసాయం చేసే వాళ్ళ నుంచి ఆ అనుభవాన్ని అందుకోవడానికి తరువాతి తరం సిద్ధంగా లేకపోవడం.  ఇలాటి చాలా కారణాలు.
 ఎక్కడ మొదలు పెట్టాలో అర్ధం కాలేదు వంశీ కి. వ్యవసాయం నామమాత్రంగానే జరుగుతుందని గ్రహించాడు. 10-20 ఏళ్ళలో ఎంత మార్పు అనిపించింది.
ముందు రైతులతో మాట్లాడాలి అనుకున్నాడు. కొన్ని ఊర్లు ఎంచుకొని వెళ్ళడం మొదలు పెట్టాడు. కొందరితో మాట్లాడాక తెల్సింది ఏంటంటే, ఇలా వచ్చి మాట్లాడుతుంటే "సూక్ష్మ రుణాలు" ఇచ్చే వాళ్ళు అనుకుంటున్నారు. కొందరేమో ఎంత లోన్ ఇస్తారు అంటున్నారు. రైతుల్లో సానుకూలత కనపడలేదు. ముందుగా తన స్నేహితుడిఆచారి వాళ్ళ ఊరిని ఎంచుకున్నాడు. అక్కడ దాదాపుగా వెయ్యి గడపలు ఉన్నాయి. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళే. అందరు మధ్య తరగతి వాళ్ళు. అందరికి నాలుగు లేదు ఐదు ఎకరాల కన్నా మించి లేదు పొలం.అందరువాణిజ్య పంటల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. పొగాకు, మిర్చి,శెనగలు లాటివి. ఆచారి సాయంతో ఇరవై మంది రైతులని పిలిచి మాట్లాడాడు. కూరగాయల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదని, దిగుబడి బాగా ఉంటె ఆదాయం గొప్పగా లేకున్నా నష్టం రాదనీ, అందరు సాంప్రదాయ వ్యసాయాన్ని పాటించాలని సూచించాడు. కొందరు ముభావంగా తల ఊపారు. వాళ్ళకి కూడా పెట్టుబడి లేకపోవడం, అప్పుల్లో ఉండటం లాటివి ఆ పనిని ఒప్పుకునేలా చేసాయి. మొత్తం ఎనభై ఎకరాలు. దాని కోసం అయ్యే పెట్టుబడి ని అంచనా వేసి మేనేజిమెంట్ కి వివరాలు పంపాడు. మానేజిమెంట్ నుంచి వచ్చిన సమాధానం చూసి ఆశ్చర్యపోయాడు వంశీ. ఆ జిల్లా నుంచి ఆశించిన ఫలితం రావడం లేదనీ, అక్కడ నుంచి తీసివెయ్యాలని అనుకుంటున్నామని, చివరి ప్రయత్నంగా చూస్తామని సమాధానమిచ్చారు. ఆశ్చర్యపడటం తన వంతైంది. మునిగిపోయే ఓడ లో ఉన్నానని అర్ధమైంది. ప్రయత్నలోపం ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.
నాన్నతో మాట్లాడి సాంప్రదాయ వ్యవసాయం గురించి వివరాలు తెల్సుకున్నాడు. ఆ ఊర్లో వాళ్ళ నాన్నకి తెల్సిన వాళ్ళు కూడా ఉండటం కూడా తన పని ముందుకు సాగడానికి దోహదపడింది. అక్కడ ఉన్న నీటి వసతిని అంటే బోర్లు,చెరువులు,కుంటలను పరీక్షించాడు.రైతులతో రోజు మాట్లాడడం, తనే జవాబుదారిగా ఉండటం, ఏదైనా సమస్య ఉంటె తనతో మాట్లాడమనడం, పెట్టుబడి అంటూ  ఇవ్వకుండా అవసరానికి విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం  లాంటి పనులు రైతుల్లో నమ్మకాన్ని పెంచాయి. ఉన్న కొద్ది పెట్టుబడి లో ఈ పనిలో గెలవాలని తపన పడుతున్నాడు వంశీ.
ఆఫీసు లో  వీకెండ్ ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉండేది, ఇపుడు శని, ఆది వారాలు కూడా అక్కడే గడుపుతునాడు.
ఓ రోజు ఇంటికి వచ్చే సరికి బాగా చీకటి పడింది. ఇంట్లో అందరు ఎదురు చూస్తున్నారు. తిన్నాక కూడా అదే ఆలోచన, ఇంకా ఎలా బాగా చేయోచో ఫోన్ లో సమాలోచనలు. కాసేపటికి అలికిడి కావడం తో తల తిప్పి చూసాడు వంశీ. తననే చూస్తు నిలబడి ఉంది మధు. తన కళ్ళలో వేయి ప్రశ్నలు. మధు ని కళ్ళతో పిలిచాడు వంశీ. ఆరుబయట నులక మంచం, కొబ్బరాకుల గలగలలు, దూరాన శివాలయం లో భజన పాటలు.దగ్గర గా కూర్చుంది మధు. "కోపంగా ఉందా" అడిగాడు వంశీ. తన కళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాయి," నువ్వు దూరంగా జరుగుతున్నట్టుంది" అంది.మధు భుజం చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకున్నాడు. "మనది కాని ప్రపంచానికి, నిన్ను అతిధి గా తీసుకు వచ్చి వదిలేసా కదా" మధు భుజం చుట్టూ ఉన్న చేయి తన ఇష్టాన్ని తెలుపుతూ ఉంది.  మధు కళ్ళు వర్షిస్తున్నాయి."నన్నిలా వదిలేసి వెళ్ళకు వంశీ" అంది మధు, "మరి నాతో పాటు వస్తావా?". మధు మొహం మీద చిరునవ్వు "నిజంగానా,తీసుకు వెళతావా?", "ఊ" అన్నాడు వంశీ. తన చేతుల్లో ఒదిగిపోయింది మధు.
మరుసటి రోజు తెల్లవారేసరికి వంటిట్లో పద్మావతమ్మ గారెలు చేస్తూ ఉంది. ఆ వాసన కి ఆకలి ఆవురావురుమంది వంశీ కి. "మా ఆకలి", "మొహం కడుక్కొని రారా" అంది పద్మావతమ్మ. "నాన్న ఏడి ?" "పొలం దాక పోయి వస్తా అన్నాడు". తొందరగా మొహం కడుక్కొని, నాన్న కోసం చూస్తున్నాడు వంశీ. "వస్తాడులేరా,నువ్వు తిను" , "రానీమ్మా ". మాటల్లోనే వచ్చాడు శ్రీనివాసరావు. అలా వంటింట్లోనే కూర్చుని గారెలు తింటూ ఉంటె "ఇంత తాపీగా తినగలమా" అనిపించింది వంశీ కి.
పొలం పనులు చక చకా సాగుతున్నాయి. ఎరువులు వేయడం,దున్నడం,విత్తడం జరిగిపోయాయి.వంగ మొక్కలు,బెండ,టమాటో,కాబేజీ,దోస కాయలు వేసారు. మధ్య మధ్యలో బంతి నార్లు.  పని మీద ఇష్టం ఉంది. తన చేతుల్లో దిద్దుకుంటున్న పని, మంచి గాలి. ఒళ్ళు అలసిపోయి ఇంటికి చేరి, తిని పడుకుంటే మంచి నిద్ర. మొక్కలు వచ్చేసాయి. పురుగు మందు కొట్టడం, కలుపు తీయడం. ఇదంతా కూలి వాళ్లతో సంబంధం లేకుండా అక్కడ ఉన్న 20 కుటుంబాలే చేసుకుంటున్నాయి. ఓ సందడి వాతావరణం. ముద్ద బంతి పూలు పండగ వాతావరణాన్ని తీసుకు వచ్చాయి. మధు అది చూసి మురిసిపోయింది.
మొదటి పంట వచ్చింది, కానీ అనుకున్నంత నాణ్యత లేదు. అందరు దిగాలు పడిపోయారు. వంశీ కి ఓ ఆలోచన వచ్చింది. కూరగాయలు తీసుకువెళ్ళడానికి లారీ ఉదయాన్నే వస్తుంది. ఈ లోగ కోసి వాటిలో మంచి వాటిని ఏరి బస్తాల్లోకి ఎక్కించారు. మిగతా వాటిని దగ్గర ఉన్న టౌన్ లో మార్కెట్ కి పంపాలని నిర్ణయించారు. మొదటి పంట నష్టాన్ని మిగల్చలేదు. కాని ప్రజల్లో ఓ అవగాహన  వచ్చింది. వాణిజ్య పంటలతో నష్టపోయి విసిగిపోయిన ప్రజలు ఇటు వైపు మొగ్గు చూపసాగారు.
వంశీ ఆఫీసు లో ఉండగా ఓ మెయిల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే "ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన కొన్ని రోజుల్లో కూరగాయలు కొనడంఆపేస్తాము. బహుశా 3 నెలల తరువాత" అని. ఆఫీసు లో ఉన్న వాళ్ళలో చాలామంది ఇంత ఆలస్యంగానా  అన్నట్టు చూసారు. కొందరు వంశీ వైపు చూస్తున్నారు. వంశీ కి ఏం తోచలేదు. మేనేజర్ కి ఫోన్ చేసాడు. "సర్ ఇలా మెయిల్ వచ్చింది. అందరు ఇపుడిపుడే ఇటు వైపు ఆలోచిస్తున్నారు. ఈ లోగా ఇలాటి నిర్ణయం ఏంటి?". "చాల రోజుల నుంచి అక్కడ ప్రొడక్టివిటీ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు" అని సమాధానం అవతల నుంచి."నాకో అవకాశం ఇవ్వలేరా", " నేను మాట్లాడి చెప్తాను" ఫోన్ డిస్కనెక్ట్ ఐంది. ఇంతలో మొబైల్ రింగ్ ఐంది."వంశీ సార్, మా పక్క ఊరి వాళ్ళు కూడా కలుస్తా అంటన్నారు. మిమల్ని అడిగి చెప్తా అన్నాను" అని ఫోన్. "నేను కనుక్కొని చెప్తాలే అని ఫోన్ పెట్టసాడు వంశీ. మనసంతా గజిబిజిగా ఉంది. ఆఫీసు నుంచి తొందరగానే ఇంటికి వెళ్ళాడు. 

అన్నం తినబుద్ధి కాలేదు వంశీ కి. పద్మావతమ్మ గమనిస్తూనే ఉంది."ఎరా  అలా ఉన్నావు? వంట్లో బావుంది కదా?". కొడుకు ఎండలో కష్టపడుతున్నాడని బాధ ఆమెకి. "ఎం లేదమ్మా" అని పడుకోడానికి వెళ్ళాడు వంశీ. నిద్ర పట్టడం లేదు. "నన్ను నమ్మిన రైతుల పరిస్థితి ఏంటి? నేను అనుకున్న దాన్ని సాధించగలనా?" ఇవే ఆలోచనలు కుదురుగా ఉండనియ్యడం లేదు. అలా  ఎప్పటికో నిద్ర పట్టింది. రాత్రంతా ఏవో కలలు, పాతాళానికి జారిపోతున్నట్టు, అందిన ప్రతి దాన్ని పట్టుకుంటున్నా అన్ని  చేజారి పోతున్నట్టు. ఎక్కడో ఆకాశంలో అమ్మానాన్న,మధు పిలుస్తున్నట్టు, ఊపిరి అందడం లేదు వంశీ కి.ఉలిక్కి పడి లేచాడు. వళ్ళంతా చెమటలు. "ఏమైంది వంశీ?" అంది మధు. "ఏదో పీడకల" అని కూర్చుండి పోయాడు. వంశీ భుజం మీద చేయి వేసి అంది మధు " నీ కష్టం ఊరికే పోదు,తప్పకుండా గెలుస్తావు". నవ్వు బలవంతంగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ బయటకి వెళ్ళిపోయాడు. 

ఉదయాన్నే పొలం వెళ్తుంటే బుట్టలో కూరలు అమ్ముతున్న ఆమె కనిపించింది." నిజమే కదా, అదే సిటీలో ఇవే కూరగాయలు పాక్ చేసి ఎక్కువ ధర కి అమ్ముతారు. అదే కొనే వాళ్ళ దగ్గరకే తీసుకు వెళ్లి అమ్మితే ఎలా ఉంటుంది?" అని మనసులో అనుకున్నాడు వంశీ. త్వరగా ఆఫీసు కి చేరుకున్నాడు. పైవాళ్ళకి కాల్ చేసాడు, అనాసక్తి గా సమాధానం "చూద్దాం లే" అంటూ. 

ఇంతలో మురళి  నుంచి కాల్. మురళి వంశీ తో పాటు పని చేసేవాడు.  మంచి మిత్రుడు కూడా . "ఏంటి వంశీ, ఎలా ఉన్నావు?", "బావున్నా మురళి, కాని ఫలితాలు ఆశించినట్టు రావడం లేదు" అన్నాడు వంశీ. "పర్లేదు, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు వంశీ" అన్నాడు మురళి. "సర్లే వదిలేయ్, ఏవిటి కబుర్లు, హైక్ ఏమైనా ఇచ్చారా?", "లేదు, ఏదైనా సైడ్ బిజినెస్ చేద్దాం అని ఉంది" అన్నాడు మురళి. 

వంశీ మనసులో ఓ ఆలోచన మెదిలింది. 
వంశీ అన్నాడు "నా దగ్గర ఓ ఆలోచన ఉంది", 
"ఏంటి?", 
"మనం కూరగాయలు నేరుగా రైతుల నుంచే కొనుక్కుంటే ఎలా ఉంటుంది అంటావ్?",
"అంటే"
"రైతు బజార్ కి వెళ్ళకుండా, సూపర్ బజార్, సూపర్ మార్కెట్ లో కొనకుండా, మన ఏరియా లోనే తాజా కూరగాయలు దొరికితే అది చవకగా" అన్నాడు వంశీ. 
"అది ఎలా" 
"మనం ఒక కాలనీ ఎంచుకుందాం. అక్కడ కొన్ని చోట్ల ఖాళీ ప్రదేశాలను అద్దెకు తీసుకుందాం.  రైతుల నుంచి మనం కూరగాయలు కొని, పొలం లో నే గ్రేడ్ చేయించి, రాత్రి కి పంపితే అవి మనం అనుకున్న చోటికి ఉదయానికల్లా చేరుకుంటాయి. అక్కడ నుంచి మళ్ళీ గ్రేడ్ చేయించి మనం అద్దెకు తీసుకున్న చోట పెట్టి అమ్మితే అటు రైతు, ఇటు కొనే వాళ్ళు లాభ పడతారు కదా?" అని ముగించాడు వంశీ. 
"ఆలోచన బాగానే ఉంది. కానీ అసలు అందులో లాభం వస్తుందంటావా?" అన్నాడు మురళి. 
"ముందు ఈ ఆలోచన విజయవంతం అయితే బావుంటుంది. ఉదాహరణకి, అన్ని సార్లు కూరగాయలు ఒకే రకంగా ధర ఉండవు. బెండకాయ ఊర్లో 10 కేజీలు 100 రూపాయలకి అమ్ముతున్నారు. అదే మనం ఒక కేజీ 40 రూపాయలకి కొంటున్నాం. ఈ తేడా ని తగ్గించగలిగితే మనం విజయం సాధించినట్టే. రవాణా ఖర్చు తగ్గించడానికి ప్రతి పట్టణానికి దగ్గరలో ఉన్న పల్లెల్ని సంప్రదించి కొరగాయలు కొనుగోలు చేస్తే బావుంటుంది. ఏమంటావ్?" ఆపాడు వంశీ. 

"సరే, నేను ఆలోచించుకొని చెప్తాను.ఉంటా వంశీ" అని పెట్టేసాడు. 
వంశీ ఆలోచిస్తున్నాడు,తనకి ఉన్న సమయం 3 నెలలు, ఈ లోగా ఏదైనా చేయాలి... 

It is Lack of faith that makes people afraid of meeting challenges, and I believed in myself.







1 comment:

  1. ప్రయాణం బాగుంది.
    మీ కథ చదివాక... నాకు అనిపించిన కొన్ని విషయాలు....
    కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు... గ్రామాల్లో వ్యవసాయం అధో:పతనానికి కూడా అనేక కారణాలు. నేడు సేద్యం చేయడం అనేది ఒక విధంగా జూదంలా తయారైంది. వానలు, కూలీలు, విత్తనాలు, ఎరువులు, మందులు, కరెంటు, దళారులు, ధరలు... ఇలా ఇదంతా ఓ పద్మవ్యూహంలా ఉంటుంది. ఈ వ్యవసాయ వైకుంఠపాళిలో రైతు ఎక్కడో ఓ చోట ఏదో విధంగా దెబ్బతిని అధ:పాతాళానికి పడిపోతుంటాడు. అలా పడిన వాడు ఇక లేవడం కష్టం. మీ ‘ప్రయాణం’లో ఇటీవలికాలంలో పల్లెటూళ్లలో కునారిల్లుతున్న సేద్యాన్ని, రైతుల దుస్థితిని చక్కగా కళ్లకు కట్టే ప్రయత్నం చేయడం బాగుంది. అన్నట్టు, రైతులదీ-నేలదీ తరతరాల బంధం. నిజానికి నమ్ముకున్న నేల.. తననెప్పటికీ మోసం చేయదనేది రైతుల విశ్వాసం. నిజమే. దురదృష్టం ఏమంటే, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టించినా..., ప్రభుత్వాల చేయూత లేకపోతే, రైతుల శ్రమంతా బూడిదపాలైపోతుంది. కరెక్టుగా పంట చేతికొచ్చే సమయానికి... ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో... సరైన ధర లభించక అప్పుల పాలవడం అనేది ప్రస్తుతం మనం చూస్తున్న కండీషన్. మెల్లగా వ్యవసాయం... దళారులు, ప్రైవేటు సంస్థల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతుందేమో అనిపిస్తోంది. వాళ్లకి లాభం తప్ప మరో ఊసుండదు. రైతులు చచ్చినా, బతికినా వాళ్లకు అనవసరం. ఇలాంటి పరిస్థితుల్లో... మీ కథలో చెప్పినట్టుగా నిబద్ధత, నిజాయితీ, మట్టిపై మమకారం కల్గిన యువకులు కొందరు... రైతుల్ని ఏకం చేసి, చైతన్యం పెంచి, వ్యవసాయానికి ఊపిరిలూదితే... కొంతలో కొంత అద్భుతాలు ఆవిష్కరించవచ్చేమో. ఐతే, నేటి కరప్టెడ్, పొల్యూటెడ్ వ్యవస్థలో... అలాంటి గొప్ప ప్రయాణానికి ఒడిగట్టడం కత్తి మీద సాములాంటిదే. అయినప్పటికీ ప్రయత్నించి చూడడం మాత్రం అభినందించదగ్గ విషయమే. ప్రయాణంలో విజయం వరిస్తుందా? వైఫల్యం ఎదురవుతుందా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

    ReplyDelete