ఎండాకాలం - చింతకాయలు

by 4:15 PM 0 comments



ఎండాకాలం లో ఎండల కన్నా అపుడోచ్చే సెలవలు, ఆడే ఆటలు, తాటి ముంజలు, చల్లటి సాయంత్రాలు, ముఖ్యంగా మామిడి పళ్ళు, చింత కాయలు... 
చింతకాయల గురించి చెప్పాలి... 
మా ఇంటి ముందు బడి దగ్గర (ఇవి మొన్ననే కొట్టేసారు) ఓ ఐదు చింత చెట్లు. వీటి మీద ఓ సీజన్లో  రకరకాల పక్షులు వచ్చి వాలేవి. అక్కడే గూడు కట్టుకొని,పిల్లలు పెట్టేవి. ఎంత సందడి ఉండేదంటే. వాటితో పోటి పడి నిద్ర లేచినా అవి ఆ పాటికే లేచి తిండి కోసం వెళ్లిపోయేవి. చీకటి వేళకి గుంపులు గుంపులుగా బారులు తీరి ఆ ఎర్రటి ఆకాశంలో ఎగురుతూ ఉంటే  ఎంత అందంగా ఉండేదో.. అవి వరుస భలే మారేవి. 


ఇంకో ఐదు చింత చెట్లు మా కొట్టానికి పోయే దారిలో ఉండేవి.ఆ ఐదు చెట్లలో ఓకే చిన్న చెట్టు. అదొక్కటే ఎక్కగలిగే వాళ్ళం. పక్కనే నేల బావి, పొగాకు బ్యారన్లు. అదే మా ఆటస్థలం. 
ఎండాకాలం మొదలు కాకుండానే చింత చిగురు వచ్చేది. అదో రుచి.ఎక్కువ తింటే గొంతు పట్టేసేది.  మేము చెట్టు ఎక్కితే మేము తినేదానికన్నా ఊళ్ళో వాళ్ళకి కోసివ్వడం ఎక్కువ. ఆ చింత చిగురుని మేకల్లా మేసే వాళ్ళం. కొన్ని రోజులకి ఓపెన్ కాయలు వచ్చేవి, అంటే చిన్న చింతకాయలు. అవి భలే రుచిగా ఉండేవి. అవి ఇంకొచెం పెరిగినా తియ్యగానే ఉండేవి. 
కొన్ని రోజులకి పక్వానికి వచ్చేవి. వీటికి గిరాకీ ఎక్కువ, పచ్చళ్ళు పెట్టుకోవాలి కదా. మధ్యాన్నం దాకా గాడిదల్లా ఎండలో పడి ఆడి ఆకలేస్తే ఇంటికి వెళ్ళకుండా చింతకాయలు కోసి వాటిని రోట్లో వేసి ఉప్పేసి, కారం వేసి తొక్కుతూ ఉంటె నోట్లోంచి లాలాజలం కాలవలు కట్టి కారిపోతుండేది. 
చింతకాయలు ఇంకొంచెం పెరిగాక వాటిలో బల్లేలు (అంటే బాగా పెద్దవి) కొట్టుకొని (కోసే ఛాన్స్ ఎక్కడుంది, పూత దగ్గరనుంచి ఓపెన్ కాయలు ఇలా అందినవన్నీ కోసేసాం కదా), కొట్టడం అంటే అదో ఆర్టు. 
స్పెషలిస్ట్ లు ఉండే వాళ్ళు. రాళ్ళతో కొట్టేవాళ్ళు, కర్రలు విసిరే వాళ్ళు. అప్పుడపుడు అవి నెత్తిన పడి రక్త తర్పణాలు, అవి ఇంట్లో తెలీకుండా మేం మేనేజ్ చేయడాలు. కొట్టాక వాటిని పొగాకు బారన్లకు ఉండే పోయిలమీద కాల్చే వాళ్ళం. అవి బాగా ఉడికి బుస బుస మని పొంగాక అలా కాలే కాలే వాటిని తిండం ఓ రుచి. 
ఇది అయ్యాక దోర కాయలు... దొరకాయలు పైన ఉండే తొక్క అలా పట్టుకోగానే ఊడి  వస్తుంది. అవి అపుడే పులుపు నుంచి తీపికి మారుతాయి. ఇవి చాల బావుంటాయి. 
ఇక ఇప్పుడు క్లైమాక్స్. గుల్ల కాయలు. ఇవి ఉంటాయి యి యి యి యి ... ఇలా పట్టుకోగానే పలపల  లాడిపోతూ, లోపల బాగా మగ్గి,తియ్యగా.. తిని తీరాల్సిందే తప్ప చెప్పనలవి కాదు. 
ఇక కొసరు. లాలిపోప్ లు లేని రోజుల్లో. ఓ పుల్లకి చింతపండు గుచ్చి దాన్ని నోట్లో వేసి నానుస్తూ ఎర్రటి ఎండలో చెమటలు కక్కుతూ దొంగ పోలీసు ఆట అడతంటే ఉంటది నా సామీ రంగా... తిరుగులేదంతే... 

0 comments:

Post a Comment