ప్రసవ వేదన

by 6:58 PM 6 comments
ఇప్పటికి మూడు నెలలు దాటింది మా వాడు పుట్టి. 7 వ నెల నిండటానికి ఇంకో రెండు రోజులు ఉందనగా ఎ హడావిడి లేకుండా గమ్మున పుట్టేసాడు. 
మాకు తెలియంది ఏంటంటే, నొప్పులు ఎలా వస్తాయో తెలీకపోవడం. అవి కూడా మాములు నొప్పులని గమ్మున ఉండటం. ఎంత జాగ్రత్త పడ్డా కూడా నొప్పులు ఆపడానికి ఆస్కారం లేకుండా పుట్టేసాడు. సంతోషం ఏంటంటే మామూలు కాన్పు . 
డాక్టర్ అడిగింది, మీరేమైనా ప్లాన్ చేసుకున్నారా హాస్పిటల్ అని. అప్పటికి ఎ రకంగాను సిద్ధంగా లేని నేను "లేదు, మీ ఇష్టం" అనేసాను. దాని కన్నా ముందు మా డాక్టర్ బాగా భయపెట్టేసింది.  ఇంకా చెప్పాలంటే లీస్ట్ కేస్ లో ఎలా ఉంటుందో చెప్పారావిడ.  రాత్రి 10 గంటల ప్రాంతంలో డెలివరీ ఐంది. నాతోడు మా అత్త గారు, మా ఆంటీ ఉన్నారంతే. మా డాక్టరే ఏదో హాస్పిటల్ రెఫెర్ చేసారు. డెలివరీ రూం లోకి తీసుకెళ్ళక ముందు మా ఆవిడ ని బాగా ప్రిపేర్ చేశాను. నార్మల్ డెలివరీ కి ప్రయత్నించమని చెప్పాను. లోపలకి వెళ్ళినప్పటి నుంచి అంత గోల లో కూడా నా గుండె శబ్దం నాకే వినిపిస్తుంది. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, ఆ ఏడుపులో ఏ ఏడుపు మా వాడిదో తెలియడం లేదు. కొంచెం హడావిడి తరువాత డాక్టర్ వచ్చారు. బాబు అని చెప్పారు. ఏడుపు విన్పించింది. చిన్నగా ఉన్న వాడిని బయటకి తీసుకొచ్చారు బరువు చూడ్డానికి. అదే చూడ్డం. నాకు సంతోషం గా అరవాలనిపించలేదు గుండె నిండా ఉన్న బరువు ఆ అరుపుకి ఆస్కారం ఇవ్వలేదు.. 
ఈ లోగ అమ్బులన్స్ వచ్చింది. ఒక డాక్టర్,ఒక కంపౌన్దర్ వచ్చారు. బాబు ని ఓ టవల్ లో చుట్టి తీసుకు వెళ్తున్నారు. నేను వాడితో వాన్ లో ఎక్కాను. అదే దగ్గరగా చూడటం. చిన్న తల, అంత తలలోను పెద్ద కళ్ళు. బుజ్జి మూతి. వాడి ఏడుపు గురకలా ఉంది. నాకు గొంతు పూడుకుపోయింది. ఆ వాన్ లో ఉన్న ఆక్సిజన్ ట్యూబ్ ని వాడి ముక్కు దగ్గర పెట్టి హడివిడిగా తీసుకెళ్ళి ఇంక్యుబేటర్ రూం లో తీసుకెళ్ళారు. ఈ లోగ 10000 రూ అడ్వాన్సు కింద కట్టమన్నారు. డబ్బు కట్టి, మళ్ళీ మా ఆవిడ దగ్గరకి వచ్చి తనకి సర్ది చెప్పి, మా ఫ్రెండ్ ఒకమ్మాయిని తీసుకొచ్చి తనకి తోడు  ఉంచి మళ్ళీ బాబు దగ్గరకి వెళ్లాను. హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర వెయిటింగ్ చైర్ లో చాల మంది పడుకొని నిద్రపోతున్నారు. పడుకోడానికి చోటు లేదు. సెక్యూరిటీ పక్కన ఓ చైర్ వేసుకొని కూర్చున్నా. చుట్టూ చీకటి ఒంటరిని చేసింది. మనసు నిండా ఏవేవో ఆలోచనలు. అసలు ఇది నిజమేనా, భ్రమా ? నాకు నిజంగా బాబు పుట్టడా? ఈ మాట అనుకున్నపుడు సంతోషం. వీడెల ఉన్నాడో, ఎలా ఉంటాడో అనుకున్నప్పుడు బాధ,నీరసం. కాలం గడవటం లేదు. కష్టంగా తెల్లారింది. బాబు పుట్టాడని రాత్రి 11 కి అమ్మకి చెప్తే, ఏదో బస్ పట్టుకొని పొద్దున్న కల్లా వచ్చేసింది. ఉదయాన్నే 10 గంటలకే మా ఆవిడని డిశ్చార్జ్ చేసారు. 

హాస్పిటల్ లో చూస్తే 600 గ్రాములు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ తరపు వాళ్ళు నిశ్చంతగా ఉన్నారు. వాళ్ళని చూసాక ధైర్యం చిక్కింది. వారం లో ఇంటికెల్తారని కొందరు లేదు 2 నెలలైనా పట్టచ్చని కొందరు. కాలం  మీద భారం వేసా. మీ బాబు బాగున్నాడు శ్వాస తీసుకుంటున్నాడు. పర్లేదు రికవర్ అవుతాడని ఓ రోజు. లేదు ఆప్నియా ఉంది శ్వాస తీసుకోడం మర్చిపోతున్నాడని ఇంకో రోజు చెప్పి ఒకరోజు సీ పాప్ , ఒక రోజు వెంటిలేషన్ పెట్టారు. దానితో పాటు పసికిర్ల కి ఓ లైట్,ప్రతి రోజు ఓ బాగ్ నిండా మందులు. ఇలా ఓ వారం సాగింది. నాకు ఆ డాక్టర్స్ ఎ రకంగాను భరోసా ఇవ్వలేకపోయారు. ప్రతి రోజు ఏదో ఒక టెస్ట్ పేరు చెప్పి టెస్ట్ చేయించండం, రోజు తిరిగే సరికి డబ్బులు కట్టడం. నాకు ఆశ చచ్చిపోయింది. మా వాడు బరువు తగ్గుతున్నాడు. వంటి నిండా సూదులు. అడిగితే పిల్లలకి నొప్పి తెలీదు అంటున్నారు. ఏమో నా జీవితంలో అంత నొప్పి ఎప్పుడు భరించలేదు. 

నా స్నేహితుడు నాగరాజ్ సూచన మేరకు, రెయిన్బో హాస్పిటల్ లో 2nd opinion తీసుకుందామని రిపోర్ట్స్ అడిగితే ఒక రోజు జాగు చేసారు. గట్టిగా అడిగి తీసుకొని రెయిన్బో కి వెళ్లాను. అక్కడ చీఫ్ డాక్టర్ Dr .ఫ్రీతమ్ గారు చూసి అంతా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది కానీ ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు అని చెప్పారు. పై ప్రాణం పైనే పోవడం అంటే ఏంటో తెల్సింది. వెంటనే నాగేంద్రగారికి (రెయిన్బో మార్కెటింగ్ హెడ్,నాగరాజ్ పరిచయం చేసారు) అమ్బులన్సు పంపమని చెప్పి హాస్పిటల్ కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మార్చడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఏమైనా అయితే? 
అక్కడ ఇంక్యుబులటర్ రూం లో ఒక్క నర్స్ మాత్రమే ఉంది. మా వాడు ఉన్నట్టుండి గాలి తీసుకోవడం ఆపేస్తున్నాడు . మళ్లీ ఇంకో న్యూస్, ప్లేట్లేట్ కౌంట్ 30000 కి చేరింది, వెంటనే రక్తం తెచ్చుకోండి అని. పిచ్చి కోపం. ఎవరిమీద చూపించాలి. లేదు నేను హాస్పిటల్ మారుస్తున్నా అని చెప్పా. గంట వరకు ఒక్కడు కూడా రాలేదు.   నా కోపం పెరిగిపోతుంది. ఎప్పటికో ఒక డాక్టర్ వచ్చాడు. వెనకనే రెయిన్బో అమ్బులన్సు వచ్చింది అది కూడా అన్ని సౌకర్యాలతో. అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు.తీసుకెళ్ళేపుడు ఎం జరిగినా మేం బాధ్యులం కాదు అన్న నా సంతకం తో సహా. 
మా అమ్మ, నా భార్య ఇద్దరు అమ్బులన్సు లో నేనేమో ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని ముగించి బైక్ మీద. 
నాకు ఆ హాస్పిటల్ లో 1.5 లక్షలు ఖర్చు ఐంది వారానికి గాను. 

రెయిన్బో లో ఆఫీసు తరపున ఇచ్చిన హెల్త్ ఇన్సురన్స్ కవర్ ఐంది. వెళ్ళగానే బాబు ని ఇంటెన్సివ్ కేర్ లోకి నేను ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వెళ్లాం. లోపల కి వెళ్ళాక కొంచెం ధైర్యం చిక్కింది. అక్కడ అనుభవం ఉన్న నర్స్ లు ఉన్నారు. ఎప్పుడు అందుబాటులో ఉండే డాక్టర్స్. అక్కడకి వెళ్ళినప్పటి నుంచి ఆక్సిజన్ మాములుగానే తీసుకున్నాడు. సి పాప్ మెషిన్ కాని, వెంటిలేషన్ కాని అవసరం లేకుండా పోయింది. కాకుంటే పాత హాస్పిటల్ లో మా పక్కన ఉన్న బాబు కి ఉన్న infection , మా వాడికి వచ్చింది. infection ఉన్న పిల్లలని వేరుగా పెట్టాలి అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా పోయింది వాళ్ళకి. ఉదయానికల్లా బ్లడ్ ప్లేట్లేట్ కౌంట్ 50000 దాటింది. వాడు మాములుగా అయ్యాడు. 
వాడికి మొదటి సారి బట్టలు కొన్నాం ఇద్దరం. మొదటి సారి ఎత్తుకున్నాను. లోపల గూడు కట్టుకున్న బాధ,భయం ఆ స్పర్శ కి కరిగిపోయాయి. నేను నిద్ర లేకుండా పరిగెత్తగలనని, అలసట ని దాటి పని చేయగలనని తెల్సింది. Thanks to రమా ఆంటీ,నాగరాజ్ and నాగేంద్ర గారు. 


చాల మంది అన్నారు , అక్కడ బాగా డబ్బులు ఎక్కువండి అని. నిజమే పసి ప్రాణాన్ని కాపాడటం లో ఉన్న కష్టం తెలిస్తే అది అవును అనిపిస్తుంది. 

ఇక్కడ అందరితో పంచుకోవల్సినవి కొన్ని ఉన్నాయి. 
1.గర్భవతులు అనవసరమైన ఆలోచనలు చేయకుండా పుట్టబోయే పిల్లలు బాగుంటారు అన్న ధృక్పదం తోనే ఉండాలి. ఇంటర్నెట్ లు, స్నేహితులు చాలా చెప్తారు. ఆ విషయాన్నంతా రంగరించి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డాక్టర్ చెప్పినట్టు చేస్తే చాలు. 
2. మంచి తిండి,నిద్ర, మంచి ఆలోచన మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. 
3. 6 వ నెల వచ్చే సరికి  మీ పొట్టలో ఉన్న పిల్లలతో మీరు మాట్లాడచ్చు. పొట్ట మీద చేతులు పెట్టి కబుర్లు చెప్పచ్చు. అప్పుడు కదలికలు తెలియడం మొదలు పెడతాయి. మీరు మీ పిల్లల్ని కదులుతున్నందుకు అభినందించండి(ఇదేదో ఇంగ్లీష్ సినిమా తెలుగు బ్బింగ్ ల ఉంది కానీ నిజం). మీకు ఆ కదలికలు తెలుస్తున్నాయని చెప్పండి. 
4. ప్రతి నెల జాగ్రత్త గ ఉండాలి. మీరు నవ్వుతూ  ఉంటె మీ పిల్లలూ  సంతోషంగా పుడతారు. 
5.ఒళ్ళు వంచి పని చేస్తే ప్రసవం సుఖంగా అవుద్దని పడి పడి పని చేయద్దు. జాగ్రత్తగా ఉండాలి. 
6. 7 వ నెల నుంచి ప్రసవానికి ఆస్కారం ఎక్కువ. ఎ మాత్రం తేడా అనిపించినా వెంటనే  హాస్పిటల్ కి వెళ్ళండి. 

ఇక ప్రిమేచ్చ్యుర్ బేబీ కి ,
మనకి ఎందుకు అవుద్దులే అని కాకుండా వివరాలు తెల్సి పెట్టుకోండి. దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్ వివరాలు తెల్సుకోండి. 
ప్రిమేచ్యుర్ పిల్లలకి ఊపిరి తిత్తులు,కళ్ళు సరిగా పెరిగి ఉండవు. దానికి సంబంధిచిన ఇబ్బందులు రావచ్చు. 
రక్త కణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. 

జాగ్రత్తగా ఉంటె చాలు. 

హైదరాబాద్ లో ఉంటె నేను రెయిన్బో హాస్పిటల్ ని రెఫెర్ చేస్తాను. 

పచ్చల లక్ష్మీనరేష్ (LakshmiNaresh)

6 comments:

  1. విషయం తెల్సు గానీ... వివరం గా చెప్పి కంగారు పెట్టేవ్ నరేశా..
    అభినందనలు

    ReplyDelete
    Replies
    1. alaa jarigipoyindi raj..... kastam vasthe nenu entha varaku nilabadagalano telsindi... devudu kondari roopam lo natone unnadu... yes I am blessed

      Delete
  2. Naresh.....kanneellu ...kashtallu...nidraleni rathrulu....mana pillalanu chusaka ...modatasari ethukkunnapudu...vachey..ananadam...annintini cheripiveyathayi...Mee abbayi gatti vadu .and..he is blessed ..

    ReplyDelete

  3. నువ్వు ఎన్నన్నా చెప్పు గానీ నరేషూ... మీ బుడ్డోడి ధైర్యమే ధైర్యం అసలూ. చిన్నసైజు ఉక్కు అనుకో వాడు. వాడికో బైక్ బుక్ చేసి పెట్టబ్బా అడ్వాన్సుడ్ గా... ;))
    బుడ్డోడి పెంపకంలో మధురిమల్ని, సరిగమల్ని ఆస్వాదించండిక :)

    ReplyDelete
  4. Eppudu oka talli pade prasava vedana kosam vinnam chadivaam kanai modatisari o tandri pade prasava vedana ni chupincharu...

    ReplyDelete
    Replies
    1. It has been two years and thanks for your comment.

      Delete