హళిబేడు, బేలూరు Halebeedu/belur

by 4:20 PM 0 comments

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా హళిబేడు, బేలూరు చూడాలని... ఇన్నాళ్ళకి ఆ అవకాశం వచ్చింది. బెంగళూరు చుట్టూరా మంచి రోడ్లు.. పచ్చని అందమైన పల్లెటూర్లు.. ప్రయాణం చాలా బావుంటుంది. చిన్న వాన పడుతూ కొంచెం దూరానికి ఆగిపోతూ, చల్ల గాలి తడుతూ... ఎక్కడ పట్టినా కొబ్బరి తోటలు అనే కన్నా కొబ్బరి అడవి అంటే బావుంటుంది, అల్లుకొని ఉన్నాయి అంతా. ముందు శ్రావణబెళగొళ అనే  ఊరి మధ్యలో కొండ మీద ఉంది బాహుబలి(గోమఠేశ్వరుడు) విగ్రహం. చాలా పెద్దది. అంత ఖచ్చితంగా ఎలా చెక్కారో అర్ధం కాదు. 12 ఏళ్ల కోసారి ఉత్సవాలు జరుగుతాయట. 
అక్కడ నుంచి హాసన్ అనే ఊరి మీదుగా హళేబీడు, అది హోయసాల రాజుల ప్రభావానికి ఓ గుర్తు. అసలలా చెక్క గలిగే వాళ్ళు ఇప్పుడున్నారో లేదో, మనమెందుకీ కళని బ్రతికించుకోలేక పోయాం అనిపిస్తుంది.ప్రతి రాయి అందంగా ఉంది. కానీ వాటి మీద కూడా ప్రేమ పైత్యాన్ని ఒలకబోసిన(I love you  లాంటి రాతలతో) వెధవల్ని చూస్తే మనమే మన సంపదని జాగ్రత్త చూసుకోలేకపోతున్నాం అనిపిస్తుంది. 

చాలా వరకు విరగ్గొట్టిన విగ్రహాలే, అవే అంత అందంగా ఉన్నాయే , బావుండి ఉంటే ఇంకెంత బావుండేవో అనిపిస్తుంది. దాదాపు రామాయణ భారత భాగవతాలు చెక్కారు. హళేబీడు శివుడికి అంకితం ఇస్తే, బేలూరు విష్ణువుకి ఇచ్చారు. రెండు గుడులు చూడ్డానికి కళ్ళు సరిపోవు. కానీ పోషణ లేదు. ఇక్కడే కాదు మైసూర్ దగ్గరలో శ్రీరంగ పట్టణం లో కూడా అదే పరిస్థితి. ఆ గుడికట్టడానికి ఎంత ఆలోచించి ఉండాలి, ఆ చోటుకి ఎంత స్థల పురాణం ఉంది ఉండాలి. ఎంత వైభోగం జరిగి ఉండాలి అనిపిస్తుంది. అసలు ఎటువంటి హడావిడి ఉండదు. బేలూరు చెన్నకేశవుడిని చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవు. హళేబీడు శివుడి లోను, ఇక్కడ చెన్నకేశవుడిలోనూ దైవత్వం తొణికిసలాడుతుంది. ఎంత సేపైనా చూడాలనిపిస్తుంది. కొత్తగా కట్టిన గుడులకి, కొత్త దేవుళ్ళకి పడి కొట్టుకునే జనాలని చూస్తే జాలేస్తుంది. 
బేలూర్ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇది మన చరిత్ర అని ఎందుకు మనం తెలుసుకోవడం లేదు ? ప్రపంచానికి ఎందుకు చెప్పడం లేదు అనిపిస్తుంది. భారతదేశం అంటే తాజమహల్ ఒక్కటే కాదు, ఇదిగో ఇలా మరుగున పడిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయని ఎందుకు చెప్పారా అనిపిస్తుంది. 
ఆ విగ్రహాలు చూడాల్సిందే తప్ప వాటి గొప్పతనం చెప్పడానికి నా స్థాయి సరిపోదు. ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఈ మట్టి మీద పుట్టినందుకు గర్వపడుతున్నాను. 


























#halebeedu #belur

0 comments:

Post a Comment