బస్ తాత

by 1:27 AM 0 comments
మాకు ఉహ తెల్సే నాటికి మా ఊరికి HNRBS బస్ సర్వీస్ నడుస్తూ ఉంది. దాన్ని సింగరాయకొండ లో ఉండే ఎర్జాని వాళ్ళ నాన్న నడిపేవాడు..అందులో ఎర్జాని వాళ్ళ అన్నదమ్ములు డ్రైవర్ గా ఉండే వాళ్ళు..మా ఊరి నుంచి సింగరాయకొండ మీదుగా పలుకూరు కి నడిచేది... 

మేము మా ఇంటి ముందున్న ప్రభుత్వ బడి లో చదువు సాగిస్తూ ఉన్నాం...కాని కొందరు బస్సెక్కి కాన్వెంటు కి పోతుంటే అదో సరదా,మేం కూడా బస్సెక్కి బడికి పోవాలని...

మా నాన్నకి  కూడా నా ఆలోచనే వచ్చి మా పిలకాయ్ కాన్మేంట్ లో సదివితే సించేచ్చాడని హనుమాన్ విద్యాలయ ( కాన్వెంట్ అయినా పేరు బాగుంది కదా) లో చేర్పించారు.అప్పుడు నేను ౩ వ తరగతి. ఇక బస్సు ఎక్కే యోగం పట్టింది...

బస్సు మేము వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు  కిట కిట లాడుతూ  ఉండేది. సీటు దొరకడం గగనమే...పిల్లలం అంతా ఇంజిన్ దగ్గర చేరే వాళ్ళం...అద్దం ముందు కూర్చుని ప్రయాణం ఓ గొప్ప అనుభూతి..చీకటి పడితే లైట్ల వెలుగులో తిరిగే పాములు, వాన పడేప్పుడు పైన్నుంచి కురిసే జల్లు...నిజంగా అద్భుతం..అక్కడ  కాని సీటు దొరికితే అంతే ఏదో పొడిచేసినట్టు అందరి వంక చూసేవాళ్ళం...

ఆ బస్సు లో ఓ ముసలాయన డ్రైవర్ గా వచ్చేవాడు..పెద్దగా మాట్లాడేవాడు కాదు...ఓ సారి బస్ ఎక్కిన్చేప్పుడు మా నాన్న వచ్చి ఎక్కించాడు, బస్ అంతా నిండు గా ఉండటం తో డ్రైవర్ వైపు నుంచి ఎక్కించాడు. లోపల కుదరక అక్కడే కూర్చున్నా..ఆయన ఏమనలేదు. ఇక అక్కడ కూర్చోడం అంటే అదేదో మనకోసం సింహాసనం వేసినట్టే...అలా చిన్నగా అలవాటయ్యింది.ఆయన బస్ తాత అయ్యాడు.రోజు అక్కడే నా సీటు.ఆయనతో యవ్వారం..బస్ రాత్రి వచ్చి మా ఊర్లోనే ఆగిపోయ్యేది.. మా ఇల్లు ఊరి మొగదాల్నే కాబట్టి బస్సు  మా ఇంటి ముందే ఆగేది. బస్ తాత మా ఇంటి కి వచ్చి మంచి నీళ్ళు తాగే వాడు..చేతిలో ఏదైనా తినడానికి ఉంటె నాకు, చెల్లికి ఇద్దరికీ చేరి సగం పెట్టె వాడు...ఉదయాన్నే బస్సు బయల్దేరి ఊర్లోకి పోయి వచ్చేది.. నేను బుజ్జి ఆయనతో పాటు ఊర్లో తిరిగి వచ్చే వాళ్ళం.. ఉదయాన్నే బస్ తాత తో పాటు ఊర్లో తిరిగి రావడం ఓ అలవాటు ఐంది... అప్పుడప్పుడు పలావు అన్నం కూడా తెచ్చేవాడు..భలే ఉండేది...
ప్రతి పండక్కి ఆ బస్సుని అలంకరించేవాళ్ళు...రంగు కాగితాలు, రంగులు,బుడకలు, తళుకు కాగితాలు, కొబ్బరి మట్టలు..అబ్బో అదో సంబరం...మాకైతే నిద్ర పట్టేదే కాదు.. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని...   బస్ అంతా అతికించడం అయ్యాక, బస్ తాత మాక్కూడా కొన్ని రంగు కాగితాలు ఇచ్చేవాడు....అవన్నీ మా ఇంటి పందిరికి వేలాడేవి...

ఒక సంవత్సరం అయ్యాక బస్ ఎక్కి తిరగలేక నేను,  నన్ను చూడకుండా ఉండలేక మా ఇంట్లో వాళ్ళు  తీసుకొచ్చి మా ఇంటి ముందున్న బడిలో వేసారు....బస్ తో బంధం తగ్గిపోయింది...బస్ తాతని తప్పకుండ పలకరించే వాడిని..కాని ఆయన రావడం తగ్గిపోయింది..ఎప్పుడైనా వచ్చేవాడు...కొన్ని రోజులకి పూర్తి గా రావడం మానేసాడు...నేను నా పనుల్లో పడిపోయాను...

మా ఊర్లో ఏడవ తరగతి వరకే ఉంది..అయిపోయాక మళ్ళి సింగరాయకొండకి..ఈ సారి శ్రీ శారద రెసిడెన్షియల్ లో చేరాను...స్కూల్ అయిపోయాక ఓ రోజు బస్ స్టాండ్ లో ఓ ముసలాయన..బాగా ముసలయన..పాత బట్టలేసుకొని ఉన్నాడు..తరిచి చూస్తే బస్ తాత.పరిగెత్తుకుంటూ వెళ్ళాను..బస్ తాత నేను గుర్తుపట్టావా అని అడిగా..గుర్తు పట్టలేదు..ఏడుపొచ్చింది.. ఎం మాట్లాడలేదు..అలానే ఇంటకొచ్చి మా అమ్మ కి చెప్పా..మా బస్ తాత ని చూసాను అని... కానీ నన్ను గుర్తు పట్టలేదు అని...వయసయిపోయింది కదరా అంది...

కాని మనసు ఒప్పుకోలేదు ఇప్పటికీ....

0 comments:

Post a Comment