డబ్బు- విలువ

by 2:16 PM 4 comments
షూస్ కొనాలి అంటే 2000 నుంచి ౩౦౦౦ దాక పెట్టి బ్రాండెడ్ షూస్ కొంటాను....అవి మహా అయితే సంవత్సరం... 
ఏదైనా హోటల్ కి వెళితే మొహమాటం లేకుండా ఖర్చు...ఒక మల్టీప్లెక్స్ కి వెళితే అక్కడ కూడా ఇంతే...

ఇంటర్ ముందు జీవితం వేరు...ఇంటర్ లో మా నాన్న నాకు ౩౦౦ పెట్టి వెల్కమ్ చెప్పులు కొనిచ్చాడు..అవే అప్పటిదాకా  నా జీవితం లో విలువైన చెప్పులు..నలుపు రంగు, గట్టి సోల్, పాదం అంతా అందులో ఇమిడి పోయి..ఎంత బాగుండేవో..అప్పటికే అందరు వాడుతూ ఉంటె ఎప్పుడు కొంటాన అని ఎదురుచూసి, కొన్న రోజున ఆ ఆనందమే వేరు...
ఇంకా చిన్నప్పుడు...అంటే మా ఊర్లో మండల ప్రజాపరిషత్ పాటశాల లో చదువుకునేప్పుడు, డబ్బులంటే పెద్దమొత్తం అర్ధరూపాయి...ఐదు పైసలకి ఒక కొబ్బరి గోలి వచ్చేది...పావలాకి ఐదు వచ్చేవి. ఆ ఐదు తీసుకొని చేతిలో పెట్టుకొని ఆ చేతిలోంచి ఈ చేతిలో కి మారుస్తూ ఆ చెయ్యే నాక్కుంటూ అబ్బో అదో ఆనందం...అందరి దగ్గర అయిపోయాక నా చేతిలోవి తీసి నా దగ్గర ఇంకా ఉన్నాయిగా అని గెంతిన రోజులు...

మా నాగూర్ మామ కొనిపెట్టిన 2.50 రూపాయల పెన్ను పోతే రాత్రంతా ఏడ్చిన రోజు...

ఇరవై పైసల కి శేషయ్య కొట్లో తాటాకు టపాసులు కొని కాల్చిన రోజులు... మా నాన్నతో పాటు ఒంగోలు వెళ్తే దప్పిక అవుతుంది అంటే మా నాన్న రూపాయి ఇచ్చాడు..నేను వెళ్లి సోడా తాగి వచ్చాను..షోడ 50 పైసలు...వచ్చి అది మిగిలింది మా నాన్న కి ఇచ్చేసా..ఎం తాగావురా అని అడిగాడు...సోడా అని చెప్పా..పద అని తీసుకెళ్ళి రూపాయి పావలా పెట్టి సుగంధ సోడా తాగిచ్చాడు...అదో అద్భుతం...

మా అమ్మ కి చెప్పకుండా మా చెల్లి శేషయ్య కొట్లో అర్ధరూపాయి బిస్కెట్ అప్పుగా తెచ్చుకుంటే, అది తెల్సి మా అమ్మ ఇంట్లో చల్ల గుంజకి కట్టేసి వాతలు తేలేలా తన్నిన తన్నులు...

ఎక్కడైనా రోడ్డు మీద ఓ రూపాయి దొరికితే అబ్బురం గా తీసుకెళ్ళి అమ్మకిచ్చిన రోజులు... ఒక్కో సారి  కలలో, ఒక రూపాయి దొరికేది తవ్వుతూ ఉంటె రూపాయిలు దొరుకుతూనే ఉండేవి..అబ్బో కలలోనే ఆనందం...

బడి ఊరి నుంచి సింగరాయకొండ కి మారాక, ఎనిమిదవ తరగతిలో దీపావళి కి  మా నాన్న 50 రూపాయిలు ఇచ్చి టపాసులు కొనుక్కోమని ఇస్తే...ఓ పది మంది ని వెంటపెట్టుకెళ్ళి అవి అన్ని అవగొట్టి ఓ రెండు కవర్ల నిండా టపాసులు తెచ్చి మా నాన్న కి చూపిస్తే మిగతా డబ్బులేవిరా అని మా నాన్న అడిగినప్పుడు గుండె జారి కారిపోతుంటే మా అమ్మ ఉతుకిన ఉతుకుడు...

సింగరాయకొండ బడికి వెళ్ళేప్పుడు పోను రాను కలిపి బస్ కి రూపాయి చార్జి...అంతే ఇచ్చేది అమ్మ. బాక్స్ లో అన్నం... బడి లో వంటిగంట కొట్టగానే, బయట అన్నమ్మ అమ్మే కేకులు, జీళ్ళు, గొట్టాల పాకెట్లు చూసి అబ్బ ఒక్క రూపాయి ఉంటె ఎంత బాగుండేది అని ఆశ పడ్డ రోజులు...

ఊర్లో విసిఆర్ లో సినిమా వేస్తుంటే టికెట్ అర్ధరుపాయో,రూపాయో అది లేక ఇంట్లో అడగలేక ఇద్దరం కూర్చుని చెప్పుకున్న  కబుర్లు, నోటి కొచ్చిన కథలు...

తొమ్మిదవ తరగతి లో అమ్మ తో బాటు ఒంగోలు హాస్పిటల్ కి పొద్దున్న  వెళ్లి సింగరాయకొండ వచ్చేసరికి ఆకలి కి అల్లాడిపోయి నీరసం గా ఉంటె అమ్మ చూడలేక డబ్బులిస్తే 14 రూపాయలు పెట్టి శబరినాథ్ హోటల్లో మొదటి సారి తిన్న ఫుల్ మీల్స్....

చందమామ ఐదు రూపాయలు కదా..కొనలేం...దాంతో చందమామ ని ప్రతి నెల తెచ్చే స్నేహితుడిని ఎంచుకున్నాను....

ఐదు లోనో ఆరులోనో తెలీదు అమ్మ తో పాటు యరజర్ల మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఊరు పోతే, కమల పెద్దమ్మ 15 రూపాయలు ఇచ్చింది..దాంతో ఎం కొనుక్కోవాలి అని అమ్మని అడిగితే నీ ఇష్టం అంది....చెక్కతో చేసిన తిరుపతి వెంకన్న బొమ్మ కొనుక్కున్నాను..అది ఇప్పటికి ఉంది..ఆ మాట చెప్పుకొని మా అమ్మ ఇంకా మురిసిపోతూ ఉంటుంది...

ఒంగోల్లో ఇంటర్ చదివేప్పుడు బస్ చార్జి ఎక్కువని లారీ లో 5 రూపయిలిచ్చి వెళ్ళిన సందర్భాలు....

అప్పట్లో ప్రతిది విలువైనదే....ఎంత భద్రం గా దాచుకునే వాళ్ళమో....


4 comments:

  1. లోకం చాలా మారిపోయింది నరేష్. నువ్వు చెప్పిన రోజులన్నీ నాకూ అనుభవమే. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇది అంతులేని టాపిక్

    ReplyDelete
  2. చాలాబాగుంది నరేష్ గారు... నిజమే నేను కూడా అపుడపుడు కూర్చుని ఆశ్చర్యపోతుంటాను. నాన్నగారైతే ఛెప్పనే అక్కర్లేదు పోల్చను కూడా పోల్చుకోలేమురా నేను చూసిన రోజులుని ప్రస్తుతాన్ని అని అంటూంటారు.

    ReplyDelete
  3. abbo abbo emi rasarandi

    Chinna naati rojulu gurthukosthunnayi

    ReplyDelete