భయం

by 12:08 AM 1 comments
ఊరి చివరన పొలాల పక్కన వున్న పశువుల కొట్టం లో సెనగ కట్టలన్నీ వేసున్నాయి. మొన్ననే మిషను కేసి అన్ని గోతాలకెత్తి కొట్టం లో వేశారు..నాన్నకి ట్రాక్టర్ పని ఉండటంతో, పని మీద మా ఊరికి వెళ్ళిన నేను కాపలా ఉంటా అని చెప్పాను... భోజనం చేసి చార్జింగ్ పెట్టిన టార్చి లైటు తీసుకొని 11 ఆ ప్రాంతంలో బయలుదేరాను.దాదాపుగా అందరు ఇళ్ళకు వెళ్ళిపోయారు. మంగయ్య కొట్టు కాడ జయమ్మ పొద్దున దోసలకి పిండి రుబ్బి అప్పుడే లైటు అర్పెస్తు,"ఎవరదీ" అన్నది..."నేను జయమ్మమ్మ పచ్చలోళ్ళ వెంకటనరసిమ్మ కొడుకుని" "ఏడకి ఈయాల", "కొట్టంకాడ సెనగలుంటే వెళ్తన్నాను, నాన్న పనుండి వెళ్ళాడు " "నీకెందుకయ్యా అలవాటు లేని పని" అంటూ ఉంటె నవ్వుకుంటూ నడక మొదలెట్టాను.కొట్టం ఊరికి బాగా దూరం..తూరుపీధి మీదగా వెళ్ళాలి...ఊరి మొగదాల్న ఉండే బడి పక్కన కట్టిన రచ్చబండ మీద ఎవరో కూర్చుని వున్నారు. అది దాటి కొంచెం దూరం వెళ్తే మా కొట్టం.. ఆ కూర్చున్న ఆకారం ఊరికే కూర్చో లేదు...చిన్నగా రోదన. గుండె వేగం పెరిగి నడక వేగం తగ్గింది...

 నా అదృష్టానికి బడి ముందు రోడ్డు మరి సన్నగా అవుతుంది. చచ్చినట్టు ఆ అరుగు పక్కగా నడవాల్సిందే. ఎహే, మనూళ్ళో, మన బడి కాడ అని సర్ది చెప్పుకుంటూ పిల్లిలా నడవసాగాను...ఆ అరుగు దగ్గరకు పోయే లోపే నిర్ధారణ అయింది అక్కడ కూర్చున్న ఆకారం ఓ ఆడ ఆకారం.దెయ్యమేమో? ఈ ఆలోచన దూరేసరికి మెదడు మొద్దుబారి పోయింది..వెనక్కి వెళ్ళిపోలేనంత దగ్గరకు వచ్చాను...ఆ ముసుగు ఆకారం నిజంగానే ఏడుస్తుంది.నేను ఏడవ తరగతి దాకా చదివిన బడి భయంకరంగా కనిపిస్తుంది..దాటి వెల్లిపోదాం అనుకునే లోగ, ఆ ఆకారం లేచి గట్టిగా అరిచింది... ఓరి దీనెమ్మ చంపేసింది అనుకోని ఎగిరి వెనక్కి దూకాను... ఏ మాత్రం జంకినా ప్రాణాలు గాల్లోకే.. అప్పుడు తట్టింది దూదేకలోళ్ళ పిచ్చి బీబీ (బీబీ బాగానే ఉండేది ఎందుకో పిచ్చి పట్టింది). "ఎం బీబా" అని గెట్టిగా కేకేసి, సర్దుకుని,భయంలోంచి వచ్చిన నవ్వుతో భయాన్ని కప్పేస్తూ, చుట్టూ ఎవరైనా చూశారేమో గమనిస్తూ హడావిడిగా కొట్టానికి చేరుకున్నాను.ఆ దడ మాత్రం తగ్గలా.. 

 చుట్టూ వెదురు కంపతో చేసిన తడికెలు.మధ్యలో పెద్ద వేప చెట్టు, గాలికి జుట్టు విరబోసుకున్నట్టు ఊగుతూ ఉంది.తూర్పున వేసున్న వరి గడ్డి వామి,ఓ పక్క గడ్డి పీకేయడం వల్ల మోకాళ్ళ మీద కూర్చున్న నల్లటి రాక్షసుడిలా వుంది. కొట్టంలో వేసి కట్టలన్నిటి మీద పరజా పట్ట కప్పి ఉంది. ఒద్దు మొర్రో అంటే వినకుండా ఒక ఆవుని కొనింది మా అమ్మ. అది చూడ్డానికి ఇంతే వుంటుంది కాని, అదంటే మా ఊర్లో బర్రెలన్నిటికి హడలంట.దానికి, పెద్ద బర్రె కి నీళ్ళు పెట్టి, మేతేసి వేపచెట్టు కింద నులక మంచం మీద పక్కేసుకొని కూర్చున్నా. పక్కనే లచ్చుపతియ్య గారి చేలో జామాయిలు కొట్టేసినట్టున్నారు,మూలన వున్న తుమ్మ చెట్టు భయంకరంగా ఉంది..అదంటే చిన్నప్పుడు కూడా భయమే.చెంబు కెళ్తే దాని దగ్గరకు మాత్రం వెళ్ళే వాళ్ళం కాదు... దానవతల కుమ్మర గుంట (ఇందులో పడి ఒకామ, చిన్న బాబు చనిపోయారు) గట్టున నాటిన సీమ సింత చెట్లు కొండ మీద రాక్షసుల్లాగా అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. లచ్చుపతియ గారి చేనుకి ఈ పక్క మేకలోళ్ళ రమేషోళ్ళ చేలో వేసిన చవకల్లోంచి "స్స్స్" చిన్న ఈల లాంటి గాలి శబ్దం.. పొద్దున్న పూట మాములుగా వున్న ప్రతిది చీకటయ్యే వేళకి భయపెడుతున్నాయి.ఇలాక్కాదని ఫోన్ తీసి పాటలు పెట్టాను.. "అరే ఏమైందీ" అంటూ ఇళయరాజా పాట గుండలవిసేలా ప్రతిధ్వనించింది. అనవసరంగా పడుకున్న వాటిని లేపిన ఫీలింగ్. చల్లటి గాలి, ఆకాశం నిండా చుక్కలు, కింద నులక మంచం..ఎహే భయడ్డం ఏందీ పడుకోక అనుకోని మేను వాల్చాను... దూరంగా బీబీ ఏడుస్తున్న చప్పుడు సోనీ హెడ్ ఫోన్స్ లో గిటార్ సౌండ్ లాగ నిదానంగా నా చెవులకి చేరుతుంది. దుప్పటి నిండుగా కప్పుకొని పడుకున్నా. ఆ గాలికి చిన్నగా నిద్ర పట్టింది.. నిద్రలో కూడా ఎదో పిచ్చి కల.

తడిక తీసిన శబ్దం. దుప్పట్లోంచి తల తిప్పి చూడాలన్నా ఒళ్ళు సహకరించడంలా... ఏదీ స్వాధీనంలో లేదు. చిన్నగా మంచం దగ్గరకి వస్తున్న అడుగుల శబ్దం..ఆంజనేయ దండకం గుర్తురావడంలా..మురళి పంపిన కథల్లో దెయ్యాలన్నీ చుట్టూ చేరిన ఫీలింగ్...ఆ టైములో ధైర్యం అనే పదం కూడా గుర్తు రావడంలా.. ఎం చేయాలి? ఆ అడుగుల చప్పుడు మంచం దగ్గరికి వచ్చి ఆగిపోయింది, నా జీవితం ఐపోయింది.. వచ్చి ఎవ్వరో మంచం మీద కూర్చున్నారు...

1 comment:

  1. "అరే ఏమైందీ" అంటూ ఇళయరాజా పాట గుండలవిసేలా ప్రతిధ్వనించింది
    :))))))))))))

    ReplyDelete