ఊహా ప్రపంచం

by 11:58 PM 2 comments
నాకు ఊహ తెలేసేనాటికి నాకు తెల్సిన కథ "పేదరాశి పెద్దమ్మ కథ".... చందమామ ని చూపించి అదుగోరా దానిమీద నీడ కనిపిస్తుందా? అక్కడ ఓ చెట్టు కింద కూర్చుని ఓ ముసలామె రాట్నం వడుకుతూ ఉంది..కనిపించిందా? అంటే ఆరుబయట మంచాల మీద పడుకొని చల్లగా కురుస్తున్న పండు వెన్నెల్లో ఆ ముసలామెతో ఆ నల్లని మచ్చలని పోల్చుకోడానికి ప్రయత్నించే వాళ్ళం...  నా ఊహ చంద్రమండలాన్ని తాకేది..

పున్నమి రాత్రి సినిమా చూసి ఒక్కడినే బయటకు వస్తే, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద దూరంగా పరిగెత్తుతున్న డ్రాకులా కనిపించి నన్ను రోడ్డు మీద పరుగులెట్టించింది.

బలానికిచ్చిన టానిక్ ని తాగకపోతే మా ఇంటి ఎదురుగా ఉండే చింత చెట్ల లోంచి ఎవడో చూస్తుంటాడు, వచ్చి ఎత్తుకుపోతాడు అని చెప్పే మా నాయనమ్మ... నాకా క్షణం ఆ చెట్ల గుబురులలో ఎవడో కూర్చుని ఉండేవాడు..చచ్చినట్టు తాగేవాడిని ... ఈ గోలా భరించలేక ఓ రాత్రి లేచి మొత్తం టానిక్, దానితో తాగించే తేనే కూడా తాగేసి గమ్మున పడుకున్నా....

మా తాతయ్య దగ్గర తెచ్చుకున్న పుస్తకాల్లో ప్రతి పాత్ర నా ఆలోచనల్లో రూపు దిద్దుకునేది... యశుపాలుడు, శిశుపాలుడు జారిపడ్డ లోయ... పడ్డం పడ్డం ఓ రాక్షసుడి తల మీద పడతారు... వాళ్ళకి దూరం గా ఎత్తుగా కనిపిస్తున్న కొండలు ...జరుతున్న జలపాతాలు... బయటి ప్రపంచం తెలీకుండా అక్కడ బ్రతుకుతున్న వివిధ జాతుల ప్రజలు.... నా తలలో చేరి గోల గోల చేసే వాళ్ళు....

ఇక చందమామ అలవాటు అయ్యాక.... చెప్పనవసరం లేదు...  ప్రతి ఆలోచనకో రూపం... రంగు రంగుల్లో బొమ్మలు ...  మెరిసిపోయే నగలు, వజ్రాలు,మణులు మాణిక్యాలు... ప్రతిది ఒక అద్భుతమే...  నా మెదడులో ఓ ప్రపంచం ఉండేది... ఇలా అలవాటయ్యాక నేనే కథలు చెప్పడం మొదలు పెట్టా పిల్లలకి....

ఇహ మధు బాబు గారి పుస్తకాలు అలవాటయ్యాక, ఆయన వర్ణించే తీరుకి ప్రతిది కళ్ళ ముందు కదిలేది....

ఊహ హద్దులు దాటితే నిజం దాన్ని చేరుకోలేకపోవచ్చు... ఏదైనా చేరుకోవాలంటే, ఒక హద్దు ఉండాలి కదా ..అదే ఊహ...

కొన్ని కథలు చదివాక అవి మన మనసుని తాకి అవి సినిమాలుగా వస్తే నచ్చకుండా ఉన్న సినిమాలు చాల.. మన ఊహ అంత అందంగా ఉండవు మరి....

ప్రకృతి ని దగ్గరగా చూడటం కూడా మన ఊహా శక్తి ని పెంచుతుంది అనిపిస్తుంది.... నాకు చిన్నప్పుడు బోలెడు అనుమానాలు వచ్చేవి.. అందులో ముఖ్యమైనది ...భూమిని తవ్వుకుంటూ పోతే ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు మనం ఎలా బయటకి వస్తాం? ఊడిపడిపోతామా? లేకా పైకి ఎక్కినట్టు వస్తామా? అసలు విమానం ఎలా ఎగురుద్ది? రేడియో లో మాటలు ఎలా వినిపిస్తాయి? ఇంకా ఛిన్నగా ఉన్నప్పుడు భూమి గుండ్రటి బాల్ ని సగానికి కొస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది... మనమంతా దాని మీద ఉంటాం... పైన ఆకాశం కప్పి ఉంటుంది ... సూర్యుడు చంద్రుడు వచ్చి వెళ్తుంటారు అని...

కాని ఈ తరానికి ఆ అవకాశం లేదేమో అనిపిస్తుంది... వాళ్ళ ఊహని కూడా కట్టడి చేస్తున్నారేమో... వాళ్ళకి ఎం ప్రపంచం తెలుస్తుంది? పాలు గేద పొదుగులోంచి వస్తాయని తెలియని చాల మంది పిల్లలు ఉన్నారు, అల వస్తున్నాయని తెలిస్తే తాగరు కూడా.....

ప్రకృతి పరిచయం తగ్గిపోతుంది... చిన్నపటి నుంచే టీవీ కి అంకితమవ్వడం (అమ్మ పిల్లలు టీవీ ముందు పడేస్తే గొడవ చెయ్యరు అనుకుంటే అక్కడే కూర్చోబెడుతుంది..ఇలా చాలా ఇల్లు ఉన్నాయి) వలన వాడికి చోటా భీమ లో అడవులు లేదా పోకిమన్ లాటి ఆలోచనలే తాకగలరు కాని ఊహ ప్రపంచాన్ని నిర్మించుకోలేరు.....

ఇది నిజమో కాదు తెలీదు...కాని కొందరిని చూసాకా అనిపించింది... కొందరిని చూశాను అంటే ఇప్పుడు 6-7 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళని , నన్ను అడిగారు "ఎందుకు నువ్వు నాన్నా అంటావు? daddy అని ఎందుకు అనవు అని..."  ...

కూచిపూడి లేదా ఏదైనా శాస్త్రీయ నృత్యం నేర్పిస్తే ఆలస్యమౌతుందని వేస్త్రెన్ పేరు చెప్పి సినిమా పాటలు నేర్పిస్తున్నవాళ్ళు లేకపోలేదు (ఇది అసందర్భం)...

ఇప్పటి వాళ్ళలో ఊహ శక్తీ మాత్రం తగ్గిపోతుందని అనిపించింది.... ఊహలోకం అనేది పసితనం లో మొదలై బాల్యం చివరికి ఒక స్థాయికి చేరుకొని ఆగిపోతుంది







....

2 comments:

  1. నిజమే! బాగుంది మీరు టపాకి మీరు ఎంచుకున్న టాపిక్. మీకు తెలుసో లేదో మా కాలంలో పొకట్ సైజ్ లో రాజకుమారుడు, రాజకుమారి, మాంత్రికుడు టైప్ కథల పుస్తకాలు ఎంతో చాక్కని కవర్ పేజెస్ తో వచ్చేయి. చిన్నప్పుడు అవి బాగా చదివేదాన్ని. :)

    ReplyDelete
  2. థాంక్స్ జలతారు వెన్నెల గారు.... ఇప్పటి పిల్లలకి ప్రకృతి తో గడిపేంత సమయం ఉండటమే లేదన్నది నా బాధ... ఇక వాళ్ళకి ఊహ ఎక్కడ ఉంటుంది....

    అంటే ఇప్పటి వాళ్ళు పుట్టిన సంవత్సరానికే, ఇన్ని ఏళ్ల పాటు మనం కష్టపడి నేర్చుకున్నవి నేర్చుకుంటున్నారు... వాళ్ళకి ఇదే ప్రపంచం కాబోలు? కాని ఊహా శక్తీ తగ్గిపోతుందేమో అనిపించింది...

    ReplyDelete